English | Telugu

శిల్పాశెట్టికి ఊర‌ట‌.. రాజ్ కుంద్రాకు మ‌ధ్యంత‌ర‌ బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు!

అశ్లీల చిత్రాల నిర్మాణం, మొబైల్ యాప్స్‌లో వాటిని ప‌బ్లిష్ చేస్తున్న కేసులో శిల్పాశెట్టి భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాకు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణ‌యం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అశ్లీల చిత్రాల కేసులో ప్ర‌మేయం ఉంద‌నే అభియోగంపై 2021 జూలై 23న జుహులోని శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా బంగ్లాపై ద‌ర్యాప్తులో భాగంగా దాడి చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అంత‌కంటే ముందు జూలై 19న రాజ్ కుంద్రాను వారు అరెస్ట్ చేశారు. ద‌ర్యాప్తు సంద‌ర్భంగా శిల్పాశెట్టి స్టేట్‌మెంట్‌ను కూడా వారు రికార్డ్ చేశారు.

మొత్తానికి ఆగ‌స్ట్ 18న శిల్పాశెట్టి కుటుంబానికి ఆనందాన్ని క‌లిగించే విష‌యాన్ని బాంబే హైకోర్టు ప్ర‌క‌టించింది. 2020 నాటి ఎఫ్ఐఆర్‌లో రాజ్ కుంద్రా త‌ర‌పు లాయ‌ర్ దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు న్యాయ‌మూర్తి ఎస్‌.కె. షిండే ఏడు రోజుల పాటు కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా బెయిల్ గ్రాంట్ చేశారు. ఆగ‌స్ట్ 25న రాజ్ బెయిల్ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా పోలీసుల‌ను న్యాయ‌మూర్తి ఆదేశించారు. అప్ప‌టివ‌ర‌కు కుంద్రాకు మ‌ధ్యంత‌ర ర‌క్ష‌ణ క‌ల్పించ‌బ‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నెల మొద‌ట్లో రాజ్ బెయిల్ పిటిష‌న్‌ను సెష‌న్స్ కోర్టు తిర‌స్క‌రించింది. దాంతో ఆయ‌న బాంబే హైకోర్టు త‌లుపు త‌ట్టారు.

ఆగష్టు 10న, సెషన్ కోర్టు రాజ్ కుంద్రా జైలు శిక్షను పొడిగించింది. అతని బెయిల్ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. రాజ్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఆగష్టు 10న ముగిసింది. కానీ క్రైమ్ బ్రాంచ్ అత‌ని బెయిల్‌ను వ్య‌తిరేకిస్తూ 19 కార‌ణాల‌తో జాబితా అంద‌జేసిన తర్వాత కోర్టు విచారణను పొడిగించింది. రాజ్ బెయిల్‌పై విడుదలైతే, అతను 'సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు', 'సాక్షులను ప్రభావితం చేయవచ్చు' లేదా అతను బ్రిటిష్ పౌరుడు కనుక దేశం విడిచి పారిపోవచ్చు అనేవి ఆ కార‌ణాల్లో కొన్ని.

రాజ్ కుంద్రాపై సెక్షన్లు 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అసభ్యకరమైన, అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్రకటనలు, ప్రదర్శనలకు సంబంధించినవి) కింద కేసు నమోదు చేయబడింది.