Read more!

English | Telugu

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

నార్త్‌ నుంచి సౌత్‌ వరకు సినిమా రంగంలో విషాద వార్తలు ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరో ఒకరు అనారోగ్యంతోనో, ఆత్మహత్య చేసుకోవడంవల్లో, ప్రమాదం వల్లనో చనిపోతూనే ఉన్నారు. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌, నటుడు మారిముత్తు, రెంజుషా మీనన్‌, నటి సుబ్బలక్ష్మి.. ఇలా ఎంతో మంది ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మరో విషాద వార్త బాలీవుడ్‌లో చోటు చేసుకుంది. 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జూనియర్‌ మహమూద్‌(67) మృతి చెందారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న మహమూద్‌ డిసెంబర్‌ 8 తెల్లవారు జాము 2.15 గంటలకు తుది శ్వాస విడిచారు. మహమూద్‌కి క్యాన్సర్‌ ఉందన్న విషయం 18 రోజుల క్రితమే తెలిసిందట. దీంతో టాటా మెమొరియల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే క్యాన్సర్‌ పోర్త్‌ స్టేజీలో ఉండటంతో బతికే ఛాన్సులు తక్కువని డాక్టర్లు తెలియజేశారు. పోర్త్‌ స్టేజిలో చికిత్స, కీమోథెరపీ చేయటం చాలా నొప్పిగా ఉంటుందని వారు తెలిపారు. ఇంట్లోనే ఉంచి చికిత్స చేస్తామని చెప్పారు. ఇక, అప్పటినుంచి ముంబై, ఖార్‌లోని ఇంట్లోనే మహమూద్‌కు చికిత్స అందుతోంది. మహమూద్‌ చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. 

మొహబ్బత్‌ జిందగీ హై చిత్రంతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన మహమూద్‌ 7 భాషల్లో దాదాపు 265 సినిమాల్లో నటించారు. నటుడిగానే కాదు సింగర్‌గా కూడా మహమూద్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు 6 మరాఠి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జూనియర్‌ మహమూద్‌ అసలు పేరు నయీమ్‌ సయ్యద్‌. బాలీవుడ్‌ దిగ్గజ హాస్య నటుడు మహమూద్‌.. నయీమ్‌ పేరును జూనియర్‌ మహమూద్‌గా మార్చారు. అప్పటినుంచి ఆ పేరుతోనే పిలవబడుతున్నారు. బాలీవుడ్‌లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నయీమ్‌ సయ్యద్‌ మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.