English | Telugu

‘ప‌ఠాన్’ స‌క్సెస్‌ని ‘భోళా’ కంటిన్యూ చేస్తుందా?

ప‌ఠాన్ స‌క్సెస్‌ని భోళా మూవీ కంటిన్యూ చేస్తుంద‌ని అంటున్నారు హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. ఆయ‌న ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు, డైర‌క్ష‌న్ కూడా చేశారు. క‌థ‌లో కెపాసిటీ ఉండ‌బ‌ట్టే డైర‌క్ష‌న్ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింద‌ని అంటున్నారు అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. ఈ నెల 30న విడుద‌ల కానుంది భోళా. దీని గురించి అజ‌య్ మాట్లాడుతూ ``ప‌ఠాన్ సినిమా వెయ్యి కోట్ల‌కు పైగా సాధించి, హిందీలో బాహుబ‌లి 2ను దాట‌డం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మా భోళా సినిమా కూడా అదే రేంజ్‌లో స‌క్సెస్ అవుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. భోళాలో యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగుతుంది. ఎక్క‌డైనా ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో కూడిన యాక్ష‌న్‌కి ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు. క్లాస్‌, మాస్ తేడా లేకుండా అలాంటి దృశ్యాల‌తో క‌నెక్ట్ అవుతారు.

ఫ్యామిలీ ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయిన స‌న్నివేశాల‌కు ఇక తిరుగు ఉండ‌దు. మా భోళా క‌చ్చితంగా అంత పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మకం ఉంది. జైలు నుంచి వ‌చ్చిన తండ్రి, త‌న కూతుర్ని చూడాల‌నుకుంటాడు. అలా వెళ్తున్న క్ర‌మంలో ఓ పోలీస్ హెల్ప్ అడుగుతాడు. పోలీసుల‌కు, మాఫియా గ్యాంగ్‌కి మ‌ధ్య జ‌రిగే గొడ‌వ‌ల్లో ఇత‌ని పాత్ర ఏంట‌నేది ఆస‌క్తిక‌రం. త‌మిళంలో ఓ మేల్ చేసిన కేర‌క్ట‌ర్‌ను హిందీలో ఫీమేల్‌కి డిజైన్ చేశాం. ట‌బు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆమెకు కూడా యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేశాం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితీరుతుంది`` అని అన్నారు.

న‌టుడిగా కొన‌సాగుతారా? ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతారా? అని ప్ర‌శ్నించ‌గా ``సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక నువ్వు న‌టుడివా? ద‌ర్శ‌కుడివా? అని అడ‌గ‌కూడ‌దు. టోట‌ల్ మేకింగ్ ప్రాసెస్‌ని ఇష్ట‌ప‌డే వ్య‌క్తిని నేను. అందుకే రెండిటిలో ఒక‌దాన్ని సెల‌క్ట్ చేసుకోమంటే నేను చేసుకోలేను. రెండిటి కాంబినేష‌న్‌నీ ఇష్ట‌ప‌డ‌తాను. భోళా చూశాక నా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను మ‌రింత మంది ప్ర‌శంసిస్తారు. నా తొలి సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌కు, ఇందులో తీసిన కొన్ని స‌న్నివేశాల‌కు చాలా దగ్గ‌రి పోలిక ఉంది. హిందీకి త‌గ్గ‌ట్టు క‌థ‌లో చాలా మార్పులు చేశాం. ఒరిజిన‌ల్ చూసిన వారు కూడా మా సినిమాను చూస్తే ఫిదా అవుతారు`` అని అన్నారు.