Read more!

English | Telugu

రామ్ సినిమా కోసం డిక్ష‌న్ నేర్చుకుంటున్న క‌పూర్‌

ఈ ఏడాది ఇప్ప‌టికే రాహుల్ - అతియా వివాహ వేడుక‌తో ఒక్క‌ట‌య్యారు. అటు సిద్ధార్థ్ - కియారా పెళ్లి కూడా వైభ‌వంగా జ‌రిగింది. ఇంత‌కీ రామ్ సినిమాకీ, ఈ హీరోల పెళ్లిళ్ల‌కూ సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. రాహుల్‌, సిద్ త‌ర్వాత అంద‌రి క‌ళ్లూ ఇప్పుడు ఓ హీరోని వెతుకుతున్నాయి.అత‌ను మ‌రెవ‌రో కాదు, ఆదిత్య‌రాయ్ క‌పూర్. బాలీవుడ్ యంగ్ హీరోగా అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఆదిత్య‌రాయ్ క‌పూర్‌. మీతోటివారంద‌రికీ పెళ్లిళ్ల‌వుతున్నాయి. మరి మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇటీవ‌ల ఆదిత్య‌ను ప్ర‌శ్నించింది మీడియా. ``వారంద‌రికీ స‌మ‌యం వచ్చింది పెళ్లి జ‌రిగింది. నాకు ఇంకా ఆ స‌మ‌యం రాలేదు. అందుకే నేను స‌మ‌యం తీసుకుంటున్నా`` అని అన్నారు. ఆదిత్య‌రాయ్ క‌పూర్ న‌టించిన గుమ్రా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఆయ‌న స‌ర‌స‌న మృణాల్ ఠాకూర్ న‌టిస్తున్నారు. ఇందులో ఆదిత్య డ‌బుల్ రోల్‌లో క‌నిపిస్తారు. ఈ మూవీని తెలుగులో రెడ్ పేరుతో చేశారు రామ్‌.

ఈ సినిమాలో రామ్ చేసిన డ‌బుల్ రోల్ చేయ‌డం కోసం ఆదిత్య చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఇప్ప‌టిదాకా ఆదిత్య‌ కెరీర్‌లో డ‌బుల్ యాక్ష‌న్ చేయ‌లేదు. అందుకే ఈ సినిమాకు ప‌నిచేస్తున్నంత సేపు మ‌జా వ‌చ్చిందని అన్నారు ఆదిత్య‌. లుక్ నుంచీ, డిక్ష‌న్ వ‌ర‌కూ ప్ర‌తిదీ వైవిధ్యంగా ఉండాల‌ని భావించార‌ట‌. అందుకే ఆయ‌న డిక్ష‌న్ క్లాసులు కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు మృణాల్ ఠాకూర్‌. పోలీస్ డ్ర‌స్‌కే ఓ ప‌వ‌ర్ ఉంటుంద‌ని, దాన్ని బాధ్య‌త‌గా తీసుకోవాల‌ని అన్నారు మృణాల్‌. త‌న ఫ్యామిలీలో చాలా మంది పోలీస్ ఆఫీస‌ర్లు ఉన్నార‌ని, వాళ్ల‌ను చూసి చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని అన్నారు మృణాల్‌. ఈ సినిమాతో వ‌ర్ధ‌న్ కేట్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. భూష‌ణ్ కుమార్ టీసీరీస్ నిర్మిస్తోంది. త‌మిళంలో పెద్ద హిట్ అయిన త‌డ‌మ్‌, తెలుగులో రెడ్‌గా మెప్పించ‌లేక‌పోయింది. మ‌రి బాలీవుడ్ జ‌నాలు కోలీవుడ్‌ని ఫాలో అయి హిట్ చేస్తారా?  లేకుంటే టాలీవుడ్‌ని ఫాలో అయి ఫ్లాప్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిన అంశం.