English | Telugu
15 ఏళ్ల సంసారం తర్వాత కిరణ్ రావ్‌కు ఆమిర్ ఖాన్ విడాకులు!
Updated : Jul 3, 2021
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, డైరెక్టర్ కిరణ్ రావ్ పదిహేను సంవత్సరాల సంసార జీవితానికి స్వస్తిపలికి విడాకులు తీసుకుంటున్నారు. ఓ సంయుక్త ప్రకటనలో వారు ఈ విషయం వెల్లడించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తమ కొడుకు అజాద్ రావ్ ఖాన్‌ను కలిసే పెంచుతామనీ, 'పాని ఫౌండేషన్'లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామనీ వారు తెలిపారు.
"ఈ అందమైన పదిహేనేళ్ల కాలంలో జీవితకాలానికి సరిపడా అనుభవాలను, ఆనందాన్నీ, నవ్వుల్నీ షేర్ చేసుకున్నాం, నమ్మకం, గౌరవం, ప్రేమ మధ్య మా అనుబంధం ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు మా జీవితాల్లో కొత్త చాప్టర్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇంక మేం భార్యాభర్తలం కాము. కానీ తల్లిదండ్రులుగా, పరస్పరం కుటుంబంగా కొనసాగుతాం." అని ఆ స్టేట్‌మెంట్‌లో వారు పేర్కొన్నారు.
తాము భార్యాభర్తలుగా విడిపోతున్నప్పటికీ, కొడుకు అజాద్ రావ్ ఖాన్‌ను కలిసే పెంచుతామని వారు స్పష్టం చేశారు. కొంత కాలం క్రితమే తాము విడిపోవాలని అనుకున్నామనీ, ఇప్పుడు దానికి సమయం వచ్చిందని నిర్ణయించుకున్నామనీ చెప్పారు. సినిమాల్లో తమ భాగస్వామ్యాన్నీ, పాని ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్నీ కొనసాగిస్తామన్నారు. ఈ విడాకులనేవి తమ జీవితాలకు సంబంధించి ముగింపు కాదనీ, ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభంగా దీన్ని చూడాలనీ వారు చెప్పారు.
'లగాన్' సినిమా షూటింగ్ సెట్స్ మీద ఆమిర్, కిరణ్ తొలిసారి కలుసుకున్నారు. ఆ సినిమాలో ఆమిర్ హీరోగా నటించగా, కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005 డిసెంబర్ 28న వారు వివాహం చేసుకున్నారు. అదివరకే ఆమిర్ తొలిభార్య రీనా దత్తాకు విడాకులిచ్చేశాడు. ఆమెతో ఆయనకు జునైద్ ఖాన్ అనే కొడుకు, ఇరా ఖాన్ అనే కూతురు ఉన్నారు.