English | Telugu

స‌ల్మాన్ హీరోగా విష్ణు మూవీ... ప్లానింగ్‌లో క‌ర‌ణ్‌!

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా క‌ర‌ణ్ జోహార్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా స‌మ‌యంలోనే ఈ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. నెక్స్ట్ ఈద్‌కి స‌ల్మాన్ నుంచి ఫ్యాన్స్ కి ట్రీట్ ఈ సినిమానే అని అన్నారు. ఇప్పుడు స‌ల్మాన్ మూవీకి డైర‌క్ట‌ర్ ఇత‌నే అంటూ సౌత్ డైర‌క్ట‌ర్ పేరు వైర‌ల్ అవుతోంది. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పంజా సినిమాను తెర‌కెక్కించిన విష్ణువ‌ర్ధ‌న్ గుర్తున్నారా? ఈ మ‌ధ్య‌నే బాలీవుడ్‌లో షేర్‌షా తెర‌కెక్కించారు. అత‌నే ఇప్పుడు స‌ల్మాన్ సినిమాకు ఫిక్స్ అయ్యార‌ట‌. అత్యంత భారీ వ్య‌యంతో స‌ల్మాన్ ఫ్యాన్స్ కి ఈద్‌కి ప‌క్కా ట్రీట్‌లాగా ఉండేట‌ట్టు తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ``స‌ల్మాన్‌కీ, క‌ర‌ణ్‌కీ మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. షేర్‌షా డైర‌క్ట‌ర్ విష్ణు వ‌ర్ధ‌న్ టేకింగ్ స్టైలిష్‌గా ఉంటుంద‌ని అత‌న్ని ఫైన‌ల్ చేశారు. ఇంకా సంత‌కాలు కావాల్సి ఉంది. అయినా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింద‌ని అనుకోవ‌చ్చు`` అని స‌ల్మాన్ కాంపౌండ్ చెబుతోంది.

స‌ల్మాన్‌, క‌ర‌ణ్‌జోహార్ పాతికేళ్ల క్రితం క‌లిసి ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ ఎప్పుడు క‌ల‌వ‌లేదు. ఇప్పుడు క‌ర‌ణ్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో స‌ల్మాన్ చేస్తున్నార‌నే వార్త బాలీవుడ్‌లో క్రేజీగా వైర‌ల్ అవుతోంది. ఈద్ అంటేనే స‌ల్మాన్ సినిమా రిలీజ్ టైమ్ అన్న‌ట్టుగా మారిపోయింది ప‌రిస్థితి. స‌ల్మాన్ ఈ సారి మ‌రింత వినోదాన్ని పంచ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌రింత మాసీ అవ‌తార్‌లో మెప్పించ‌నున్నారు. స‌ల్మాన్ ఖాన్ న‌టించిన కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ పెద్ద‌గా ఆడ‌లేదు. దాంతో ఆయ‌న ఆశ‌ల‌న్నీ టైగ‌ర్ ఫ్రాంఛైజీ మీదే పెట్టుకున్నారు. ఈ ఏడాది టైగ‌ర్ 3 విడుద‌ల కానుంది. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ తెర‌కెక్కిస్తోంది ఈ సినిమాను.