English | Telugu

రామాయ‌ణం ప‌రంగా కాన్ఫిడెంట్‌గా ఉన్న నితీష్ తివారి!

రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఆదిపురుష్‌. ప్ర‌తి స‌న్నివేశంలోనూ త‌ప్పులు చూపించారు ఆడియ‌న్స్. రాముడి క‌థ తెలియ‌దా? మ‌రీ అలా ఎలా తీశార‌ని దుమ్మెత్తి పోశారు జ‌నాలు. హనుమంతుడి నోటి వెంట ఆ మాట‌లేంటి? రాముడు చూస్తుండ‌గా సీత‌మ్మ‌ను అప‌హ‌క‌రించ‌డం ఏంటి? సీత‌మ్మ మాయా హ‌త్య ఏంటి? హ‌వ్వ అంటూ నోళ్లు నొక్కుకున్నారు. ఆదిపురుష్‌కి అన్నేసి విమ‌ర్శ‌లు వ‌చ్చిన త‌ర్వాత, ఇప్పుడు అంద‌రూ నితీష్ తివారి రామాయణం మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. వ‌రుణ్‌ధావ‌న్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా బ‌వాల్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు నితీష్ తివారి. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఆయ‌న రామాయ‌ణం మీద వ‌ర్క్ స్టార్ట్ చేస్తారు. రామాయ‌ణం ప‌ట్ల త‌న‌కు అపార‌మైన అవ‌గాహ‌న ఉంద‌ని అంటున్నారు నితీష్ తివారి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్రేక్ష‌కుల మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌న‌ని అన్నారు. వాళ్ల ఆశ‌ల మీద నీళ్లు జ‌ల్లే ప్ర‌య‌త్నం అస‌లు చేయ‌నని అన్నారు నితీష్‌.

ఇటీవ‌ల ఓ నార్త్ మీడియాతో మాట్లాడారు నితీష్‌. ``నా సిద్ధాంతం చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను సృష్టించే వ‌స్తువును నేను కూడా వాడుతాను. నేను తీసే రామాయ‌ణాన్ని నేను కూడా చూస్తాను. నేను తీసే రామ‌క‌థ‌తో న‌న్ను నేను నొప్పించుకోలేను. అందుకే నేను రామాయ‌ణాన్ని ప‌ర్ఫెక్ట్ గా తీస్తాను. ఎవ్వ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా నేను రామాయ‌ణాన్ని తీసి మెప్పించ‌గ‌ల‌ను`` అని అన్నారు. ఇంత‌కీ నితీష్ తివారి రామాయ‌ణంలో రాముడిగా ఎవ‌రు న‌టిస్తారు? సీత‌మ్మ‌గా ఎవ‌రు మెప్పిస్తార‌నే క్యూరియాసిటీ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దీని గురించి ద‌ర్శ‌కుడిని క‌దిలిస్తే ``అతి త్వ‌ర‌లోనే అన్నీ చెబుతాం`` ర‌ణ్‌బీర్ క‌పూర్ రాముడిగా, ఆలియా భ‌ట్ సీత‌మ్మ‌గా, య‌ష్ రావ‌ణాసురుడిగా న‌టిస్తార‌నే వార్త‌లు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి.