English | Telugu

ఆమె ఎఫెక్ట్‌కి జ్యోతిక‌ను జ‌నాలు మ‌ర్చిపోతారా?

ఎవ‌డు కొడ్తే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనేది పోకిరి డైలాగ్‌. ఎవ‌రు ట్విట్ట‌ర్‌లోకి వ‌స్తే బాలీవుడ్ జ‌నాలు అల‌ర్ట్ అయి, ఏం రాస్తారోన‌ని ఈగ‌ర్‌గా ఫోక‌స్ చేసి చూస్తారో ఆమే ఫైర్‌బ్రాండ్‌. యస్‌...ఆమె పేరు కంగ‌నా. బుధ‌వారం త‌న లేటెస్ట్ సినిమా చంద్ర‌ముఖి 2 షూటింగ్ పూర్త‌యిన‌ట్టు పోస్ట్ పెట్టారు కంగ‌నా ర‌నౌత్‌. ఆమె న‌టించిన యాక్ష‌న్ మూవీ దాఖ‌డ్ ఆ మ‌ధ్య విడుద‌లై అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అయినా, జ‌నాల‌ను మెప్పించ‌లేక‌పోయింది. అందుకే ఇప్పుడు కంగ‌న ఆశ‌ల‌న్నీ చంద్ర‌ముఖి2 మీద ఉన్నాయి.

గ‌త కొన్ని నెల‌లుగా ఆమె చంద్ర‌ముఖి2 సినిమా మీదే ఫోక‌స్ చేస్తున్నారు. చంద్ర‌ముఖి2 సినిమా షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని కంగ‌న త‌న ఫాలోయ‌ర్ల‌తో పంచుకున్నారు. ``చంద్ర‌ముఖి2లో నా పోర్ష‌న్ పూర్త‌యింది. కానీ ఈ సినిమాలో ప‌నిచేసిన అద్భుత‌మైన మ‌నుషుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌లేక‌పోతున్నాను. అంద‌మైన‌, ఆప్యాయ‌త‌లున్న టీమ్‌తో ఈ సినిమాకు ప‌నిచేశాను. ఈ చిత్రంలో రాఘ‌వ లారెన్స్ గారితో నాకు ఒక్క పిక్చ‌ర్ కూడా లేదు. మేం ఎప్పుడూ మూవీ కాస్ట్యూమ్స్ లోనే ఉండ‌టంతో ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. అందుకే ఈ రోజు షూటింగ్ ప్రారంభం కావ‌డానికి ముందే ఆయ‌న‌తో ఓ పిక్ తీసుకున్నాను. పిక్ గురించి ఆయ‌న‌కు చెప్ప‌గానే ఒప్పుకున్నారు. లారెన్స్ మాస్ట‌ర్ జీవితం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. స‌మాజం ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తి ఆయ‌న‌. బ్యాక్ గ్రౌండ్‌లో డ్యాన్స‌ర్‌గా జీవితాన్ని మొద‌లుపెట్టి, డ్యాన్స‌ర్‌గా ఎదిగి, డ్యాన్స్ మాస్ట‌ర్ అయి, డైర‌క్ట‌ర్‌గా, మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌గా, న‌టుడిగా, నిర్మాత‌గా, స‌మాజ సేవ‌కుడిగా, త‌ల్లిని ఆద‌రించే త‌న‌యుడిగా ఎన్నో ర‌కాల పాత్ర‌లు పోషించారు.

ఇంత మంచి వ్య‌క్తిని క‌లిసినందుకు ఆనందంగా ఉంది. నా పుట్టిన‌రోజుకు ముంద‌స్తుగా నాకు బ‌హుమ‌తులు ఇచ్చారు. వాటికి కూడా ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. మాస్ట‌ర్‌తో ప‌నిచేయ‌డం గురించి చాలా చాలా గ‌ర్వంగా భావిస్తున్నాను`` అని అన్నారు. చంద్ర‌ముఖి2 రిలీజ్ డేట్‌ని ఇంకా అనౌన్స్ చేయ‌లేదు మేక‌ర్స్. అంత‌లోనే జ్యోతిక‌ను కంగ‌న మ‌రిపిస్తారా? అనే మాట‌లు కూడా న‌డుస్తున్నాయి.