Read more!

English | Telugu

షారూక్ తొలి చిత్రం `దీవానా`కి 30 ఏళ్ళు!

హిందీనాట తిరుగులేని క‌థానాయ‌కుడిగా రాణించిన వైనం షారూక్ ఖాన్ సొంతం. అలాంటి షారూక్ కి జూన్ 25 ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే.. 1992లో ఇదే తేదిన ఆయ‌న హీరోగా న‌టించిన మొద‌టి సినిమా `దీవానా` వెండితెర‌పై సంద‌డి చేసింది. వాస్త‌వానికి షారూక్ సంత‌కం చేసిన తొలి చిత్రం `దిల్ ఆష్నా హై` అయిన‌ప్ప‌టికీ, అది వాయిదాల బాట ప‌ట్ట‌డంతో `దీవానా`నే ముందుగా తెర‌పైకి వ‌చ్చింది. అలాగే, `ఉత్త‌మ నూత‌న న‌టుడు`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందించింది.

 రాజ్ క‌న్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `దీవానా`లో షారుక్ తో పాటు రిషి క‌పూర్, దివ్య భార‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అమ్రిష్ పురి, సుష్మా సేథ్, దేవ‌న్ వ‌ర్మ‌, అలోక్ నాథ్, ఆశా స‌చ్ దేవ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన ఈ మెలో డ్రామాకి ర‌ణ్ బీర్ పుష్ప్ క‌థ‌ను అందించ‌గా సాగ‌ర్ స‌ర్హ‌ది స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చారు.

న‌దీమ్ - శ్రావ‌ణ్ బాణీలు అందించిన `దీవానా`కి స‌మీర్ సాహిత్య‌మందించారు. ``సోచేంగే తుమ్హే ప్యార్``, ``తేరి ఉమీద్ తేరా ఇంతిజార్`` (రెండు వెర్ష‌న్స్), ``పాయ‌లియా``, ``తేరి ఇసి అదా పే స‌న‌మ్``, ``కోయి నా కోయి చాహియే``, ``తేరే ద‌ర్ద్ సే దిల్``, ``ఐసీ దివాంగీ``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ``ఫేస్ ఆఫ్ ద ఇయ‌ర్` (దివ్య‌భార‌తి), `బెస్ట్ మేల్ డెబ్యూ` (షారూక్), `బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్` (న‌దీమ్ - శ్రావ‌ణ్), `బెస్ట్ లిరిసిస్ట్` (స‌మీర్), `బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్` (కుమార్ సాను) విభాగాల్లో `ఫిల్మ్ పేర్` అవార్డ్స్ సొంతం చేసుకున్న `దీవానా`ని..  గుడ్డు ధ‌నోవా, రాజు కొఠారి, ల‌లిత్ క‌పూర్ నిర్మించారు. 1992 జూన్ 25న విడుద‌లై 50 వారాల ప్ర‌ద‌ర్శన‌తో గోల్డెన్ జూబ్లీ జ‌రుపుకున్న `దీవానా`.. శనివారంతో 30 వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది.