Read more!

English | Telugu

మ్యూజిక‌ల్ హిట్స్ `ఆవారాప‌న్`, `ఆప్ కా సురూర్`కి 15 ఏళ్ళు!

హిందీనాట ఒకే రోజున రెండు అంత‌కుమించి సినిమాలు విడుద‌లవ‌డం ష‌రా మామూలే. అయితే, విడుద‌లైన‌ రెండు సినిమాలు కూడా మ్యూజిక‌ల్ హిట్స్ గా నిల‌వ‌డం అరుదు. 2007 జూన్ 29న రిలీజైన `ఆవారాపన్`, `ఆప్ కా సురూర్` అలా మ్యూజిక‌ల్ గా మెప్పించడం విశేషం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఇమ్రాన్ హ‌ష్మీ, శ్రియా శ‌ర‌న్ జంట‌గా మోహిత్ సూరి రూపొందించిన చిత్రం `ఆవారాపన్`. ఈ సినిమాని ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేశ్ భ‌ట్ నిర్మించ‌గా.. ప్రీత‌మ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ``మౌలా మౌలా``, ``తేరా మేరా రిస్తా``, ``మ‌హియా``, ``తో ఫిర్ ఆవో`` అంటూ మొద‌ల‌య్యే ఇందులోని పాట‌ల‌న్నీ అప్ప‌ట్లో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రించాయి. మంచి అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట‌ ఆశించిన ఫ‌లితం అందుకోలేక‌పోయింది.

ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిమేశ్ రేష‌మియా క‌థానాయ‌కుడి అవ‌తార‌మెత్తిన `ఆప్ కా సురూర్` విష‌యానికి వ‌స్తే.. పాట‌ల ప‌రంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్ గానూ వ‌ర్క‌వుట్ అయింది. హీరోయిన్ గా హ‌న్సిక‌కి హిందీలో ఇదే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. ``అస్స‌లామ్``, ``తేరా బినా``, ``తేరా మేరా మిల్‌నా``, ``త‌న్హాయియా``, ``ఝూఠ్‌ న‌హీ``, ``యా ఆలీ``, ``తేరా తేరా తేరా సురూర్`` - ఇలా హిమేశ్ రేష‌మియా స్వ‌ర‌క‌ల్ప‌న‌లో, గాత్రంలో రూపొందిన పాట‌ల‌న్నీ అల‌రించాయి. ప్ర‌శాంత్ చ‌డ్ఢా డైరెక్ట్ చేసిన ఈ మూవీని విజ‌య్ త‌నేజా నిర్మించారు.

కాగా, నేటితో ఈ మ్యూజిక‌ల్ హిట్స్ (`ఆవారాపన్`, `ఆప్ కా సురూర్`) 15 వ‌సంతాలు పూర్తిచేసుకున్నాయి.