English | Telugu
మార్షల్ ఆర్ట్స్ మొదలుపెట్టిన రాశీఖన్నా ఫ్రెండ్
Updated : Apr 6, 2023
ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశీఖన్నా తెలుగువారికి సుపరిచితమయ్యారు. అయితే కాస్త డిజిటల్ నాలెడ్జి ఉన్నవారికి మాత్రం ఆమె అంతకు ముందే తెలుసు. బాలీవుడ్ నటి వాణీకపూర్ ఫ్రెండ్‌గా ఆమె నెట్టింట్లో హల్‌చల్ చేసేవారు. వాణీకపూర్ తెలుగులో నానీతో ఆహా కల్యాణంలో నటించారు. నానిని ప్రేమిస్తున్నానని ఆమె అప్పట్లో చేసిన కామెంట్లు ఇంకా తెలుగువారికి గుర్తున్నాయి. అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు వాణీకపూర్. తాజాగా ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
``కిక్‌స్టార్టింగ్ సమ్‌థింగ్ న్యూ`` అంటూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న విషయం గురించి చెప్పారు వాణీ. ఉన్నట్టుండి మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటున్నట్టు అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఆమె ప్రస్తుతం సోషల్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. సర్వగుణ్ సంపన్న అనే సినిమా చేస్తున్నారు వాణీకపూర్. గతేడాది సైన్ చేసిన సినిమా ఇది. సొసైటీలో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, తన నిజాయతీని నిరూపించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. సోనాలి రతన్ దేశ్‌ముఖ్ నిర్మిస్తున్న సినిమా ఇది. గతేడాది ఆగస్టులో ముహూర్తం కూడా చేశారు.
రొమాంటిక్ కామెడీ సినిమా శుద్ దేశీ రొమాన్స్ తో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమయ్యారు వాణీకపూర్. పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ఆ సినిమాలో నటించారు. ఇటీవల పీరియాడిక్ సినిమా షంషేరాలోనూ నటించారు వాణీకపూర్. రణ్‌బీర్‌కపూర్, సంజయ్ దత్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా వాణీకపూర్ ఓ సౌత్ ప్రాజెక్ట్ కి సైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా కోసమే మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారనీ అంటున్నారు.