పాలతాలికలు

 

 

పాల తాలికలు

 

కావాల్సిన పదార్ధాలు:

తడి బియ్యం పిండి - ఒక కప్పు

బెల్లం - ఒక కప్పు

సగ్గుబియ్యం - ఒక కప్పు

పాలు - అర లీటర్

నీళ్ళు -250 ఎంఎల్

యాలకులపొడి - ఒక టీ స్పూన్

నెయ్యి - మూడు టీ స్పూన్స్

జీడిపప్పు - మూడు టీ స్పూన్స్

ఎండుకొబ్బరి పలుకులు - రెండు టీ స్పూన్స్

కిస్మిస్ - రెండు టీ స్పూన్స్

తయారీ విధానం:

* స్టౌ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్సూన్స్ బెల్లం లో కొంచెం నీళ్ళు పోసి బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆపేసి అందులో తడి బియ్యపు పిండి వేసి బాగా కలుపుకోవాలి.

* పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకుని మృదువుగా కలుపుకోవాలి.

* మిగిలిన బెల్లంలో కాసిని నీళ్ళుపోసి ఓ పొంగు రాగానే దించి చల్లార్చుకోవాలి.

* ఇప్పుడు తడి బియ్యం పిండి ముద్దని గోలి సైజు ఉండలు చేసి దాన్ని పొడవుగా కాస్త మందంగా మురుకుల సైజు లో చేసుకోవాలి. కొద్దిగా పిండి పక్కనుంచుకోవాలి.

* ఇప్పుడు పాలు నీళ్ళు కలిపి మరిగించాలి. ఓ పొంగు రాగానే 30 నిమిషాలు నాన బెట్టిన సగ్గుబియ్యం వేసి సగం పైన ఉడకనివ్వాలి.

* సగ్గుబియ్యం సగం పైన ఉడికాక తయారుగా ఉంచుకున్న తాలికలు పాలల్లో వేసి 5 నిమిషాలు గరిటతో కదపకుండా వదిలేయాలి.

* 5 నిమిషాల తరువాత నిదానంగా కలుపుకుని మూత పెట్టి సన్నని సెగ మీద 12-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

* 12 నిమిషాల తరువాత తాలికని స్పూన్ తో కట్ చేసి చూస్తే ఉడికి పాలని పీల్చుకున్నది లేనిది తెలుస్తుంది. లోపలిదాకా ఉడికాక పక్కనున్చుకున్న పిండి లో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకుని తాలికల్లో కలిపి మరో 5-6 నిమిషాలు లో-ఫ్లేం మీద మూత పెట్టి ఉడకనివ్వాలి.

* 5-6 నిమిషాలకి చిక్కబడుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి యాలకులపొడి , చల్లారిన బెల్లం పాకం పోసి నిదానంగా కలుపుకోవాలి.

* ఒక కళాయిలో నెయ్యి వేసి అందులో ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్స్ వేసి ఎర్ర వేపి తాలికల్లో కలిపేసుకోండి. * తాలికలు వేడి మీద కంటే చల్లారాక తింటే చాలా రుచి గా ఉంటుంది.