Kanda Roti Chutney

 

 

 

కంద రోటి పచ్చడి

 

 

 

 

ఎన్ని రకాల కూరలు వున్నా రోటి పచ్చడి కి సాటి రావు. అందుకే కదా ఫంక్షన్స్ లో కూడా బిర్యానీ నుంచి రోటి దాక ఎన్నో వరైటిలు పెట్టినా కూడా ఏ గొంగూర పచ్చడో పెట్ట కుండా వుండరు . నిలవ పచ్చడులు ఎన్ని రకాలు వున్నా ..ఆ రోజు అప్పటికప్పుడు చేసే ఫ్రెష్ రోటి పచ్చడుల రుచి ముందు  ఎందుకు పనికి రావని చెప్పచ్చు . రోటి పచ్చడి అంటున్నాను కదా ..ఇప్పుడు రోలు, రోకలి ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తున్నారా ? అబ్బే అంత కష్టం ఏమి పడక్కరలేద్దండి . గ్రైండర్ లో రుబ్బిన పర్వాలేదు ..కాని రోటి లో చేస్తే ఆ రుచి వేరు అనేవారు లేకపోలేదు ..కొంచం కచ్చా, పచ్చాగా రుబ్బుకునే వీలు వుంటుంది రోలులో అయితే .

సరే కంద పచ్చడి అనగానే మనకి ఒకో ప్రాంతం వాళ్ళు ఒకోలా చేస్తుంటారు . వెల్లుల్లి వేసేవారు కొందరు..కేవలం ఇంగువ తో చేసే వారు కొందరు. కొంతమంది  చింత పండు వాడితే , కొందరు పచ్చి చింతకాయలు లేనిదే కంద పచ్చడి చేయరు . కాబట్టి  మా ఇంట్లో మేము చేసుకునే వరైటి చెబుతాను. మీ రుచుల అలవాటు బట్టి చేసుకోండి .

 

కావలసిన పదార్థాలు

1.కంద                        -  ఒక పావు కిలో

2. పోపు సామాను        -  మూడు చెంచాలు ( మినపప్పు, సెనగ పప్పు,ఆవాలు,మెంతులు )

3  ఎండు మిర్చి            -  8 దాకా

4. ఇంగువ                   -  తగినంత

5. చింత పండు గుజ్జు     -  రెండు చెంచాలు

6. నూనె                       -  నాలుగు చెంచాలు

7. ఉప్పు, పసుపు           -  రుచికి తగినంత

 

తయారి విధానం

1 . ముందుగా కంద చెక్కు తీసి చిన్న , చిన్న ముక్కలుగా తరగాలి. అలా తరిగిన ముక్కలని బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒక 5 నిముషాలు నాన బెట్టాలి. అప్పుడు కంద దురద పెట్టదు .

2 . బాణలిలో నూనె వేసి పోపు సామానులు , ఎండు మిర్చి వేసి వేగాక ,ఇంగువ వేసి ఆపెయ్యాలి .

3 . అదే బాణలి లో మరికొంచం నూనె వేసి కంద ముక్కలు వేయాలి. మూత పెట్టి ఓ 15 నిముషాలు మగ్గించాలి .

4 . అలా మగ్గిన కంద ముక్కలని , మెత్తగా గ్రైండ్ చేసిన పోపుతో కలిపి  చింతపండు గుజ్జు, పసుపు , ఉప్పు వేసి కచ్చా పచ్చా గా రుబ్బుకోవాలి .

tips: ఈ కందపచ్చడి లో కొబ్బరి , లేదా నువ్వుల పొడి  కూడా వేసుకోవచ్చు . ఇష్టం వున్నవారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పచ్చడి మొత్తం రెడీ అయ్యాకా ..ఆవాలు, కరివేపాకు తో పోపు చేసుకున్నా బావుంటుంది .

 

..రమ