Green Peas Mix Curry
గ్రీన్ పీస్ మిక్స్ కర్రీ
ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తొందరగా చేయగలిగే కూరలలో ఈ గ్రీన్ పీస్ మిక్స్ కర్రీ ఒకటి. కావాల్సిన పదార్థాలు కొన్నే, చేయటానికి పట్టే సమయం కూడా తక్కువే. రైస్‌లోకే కాక చపాతీలలోకి కూడా బావుంటుంది.
కావాల్సిన పదార్థాలు:-
గ్రీన్ పీస్ - ఒక కప్పు
ఆలూ - రెండు
క్యారట్స్ - నాలుగు
కసురిమేతి - ఒక చెమ్చా
మిరియాల పొడి - పావు చెమ్చా
కారం - రుచికి తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు చెమ్చాలు
పచ్చి మిర్చి - రెండు
తయారీ విధానం:-
నాన బెట్టిన గ్రీన్ పీస్‌ని, చిన్న ముక్కలుగా కోసిన ఆలు, క్యారట్లని కలిపి కొంచం నీరుపోసి, ఉప్పు వేసి ఉడికించాలి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. కొంచం ముక్క మెత్తబడగానే స్టవ్ ఆపేసి, కూర ముక్కలలోని నీరు వంపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ముందుగా పచ్చి మిర్చి వేసి అవి రంగు మారగానే, కసూరి మేతి, వెంటనే మిరియాలపొడి, కారం కూడా వేసి కదిపి చివరిగా ఉడికించి పెట్టుకున్న కూర ముక్కలని వేసి బాగా కలపాలి.మూత పెట్టకుండా వేయిస్తూ, ఉడికిన ముక్కలు కొంచం ఫ్రై అయ్యేదాకా వుంచి స్టవ్ ఆపాలి. కసూరి మేతి, మిరియాల రుచితో కూర చాలా రుచిగా వుంటుంది.
-రమ