Bottle gourd balls curry
కద్దూ బాల్స్ కర్రీ
కావలసినవి:
సొరకాయ (కద్దూ) - పెద్దది ఒకటి
శనగపిండి - మూడు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
నూనె, ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా సొరకాయను చెక్కుతీసి నిలువునా రెండు ముక్కలుగా కోసి మధ్యలో ఉండే తెల్లని గుజ్జును తీసివెయ్యాలి. ఇప్పుడు సొరకాయను గ్రేటర్ ద్వారా తురిమి దానిలో ఉప్పును వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత సొరకాయ తురుములో ఊరిన నీళ్లను చేత్తో గట్టిగా పిండాలి. ఈ మిశ్రమంలో శనగపిండి, సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కొంచెం కారం వేసి గట్టిగా కలపాలి. ఈ పిండి ముద్దగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళాల్లా తయారు చేసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
గ్రేవీ తయారీకి కావలసినవి:
ఎండుకొబ్బరి - ఒక కప్పు
గసగసాలు - కొద్దిగా
ఉల్లిపాయలు - నాలుగు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
పెరుగు - ఒక కప్పు
టమాటాలు - మూడు
గరంమసాలా - ఒక స్పూను
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే పద్ధతి:
ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి స్టౌ మీద పెట్టి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగిన తర్వాత కొబ్బరి తురుమును వేసి బాగా వేయించాలి. అలాగే కారం, పసుపు, పెరుగు, టమాటా ముక్కలను వేసి కొంచెం నీళ్ళు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే గ్రేవీ తయారవుతుంది. దీనిలో ఉప్పు గరంమసాలా వెయ్యాలి. ఈ గ్రేవీలో సిద్ధం చేసుకున్న సొరకాయ గోళాలు కలపాలి. అంతే.. కద్దూ బాల్స్ కర్రీ రెడీ.