Aloo Curry And Tomato Rasam

 

 

ఆలు కర్రీ, టమాట రసం

 

 

బయట సన్నగా చినుకులు పడుతుంటే వేడి వేడి అన్నంలో ఆలు కూర, టమాట రసం వేసుకు తింటే ఎంత హాయిగా వుంటుందో కదా! టమాట రసానికి ఆలు కర్రీని మించిన కాంబినేషన్ లేదు కాబట్టి ముందు ఆలు కర్రీ ని ఎలా చేయాలో చూద్దాం .

 

ఆలు కర్రీ కి కావలసిన పదార్ధాలు:

ఆలు - 6

ఉల్లిపాయలు - 2

ధనియాల పొడి - అర చెంచా 

పసుపు - చిటికెడు 

పచ్చిమిర్చి - మూడు 

ఎండు మిర్చి - మూడు 

కరివేపాకు - ఒక రెబ్బ 

కొత్తి మీర - రుచి కి తగినంత 

ఉప్పు - రుచికి తగినంత 

నూనె - రెండు చెంచాలు 

ఆవాలు - అర చెంచా

జీల కర్ర - పావు చెంచా 

వెల్లుల్లి రెబ్బలు - మూడు

 

 

తయారీ విధానం:

ముందుగా బంగాళాదుంపలని ఉడికించి, చేతితో చిన్నగా చిదిపి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి పోపు వేయాలి. పోపు వేగాక ఉల్లిపాయలు, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. వేగిన ఉల్లిపాయలలో చిదిపిన బంగాళాదుంపలని కలపాలి. ఆఖరిలో ఉప్పు వేసి కలిపి దింపే ముందు కొత్తిమీర తురుము వేస్తే ఆలు కర్రీ రెడీ.

 

Tip :

ఈ కూరలో మసాలా ఎక్కడా వాడలేదు. అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే ఒక రుచి, వెల్లుల్లి, ధనియాలపొడి మాత్రమె వేస్తే ఒక రుచి వస్తుంది. వెల్లుల్లి, ధనియాల పొడితో ఆలు కర్రీ రుచి సూపర్ గా వుంటుంది. ఒకసారి ట్రై చేయండి.

 

టమాట రసం

 

టమాటలని మెత్తగా గ్రైండ్ చేసి నీళ్ళల్లో కలిపి, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, రసం పొడి (ఒక చెమ్చ) వేసి మరిగించి నేతి తో పోపు వేయాలి. పోపుకి ఒక చెమ్చా నూనె లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ వేయాలి. రసంలో వేసే పొడితో రసం రుచి పెరుగుతుంది. బయట కొనే రసం పొడి కంటే ఇంట్లో మనం చేసుకునే పొడి ఫ్రెష్ గా వుండి రసం రుచిని పెంచుతుంది. ఆ పొడి ఎలా చేయాలో కూడా చెప్పుకుందాం!

 

రసం పొడికి కావలసిన పదార్ధాలు : 

కంది పప్పు - ఒక చిన్న గ్లాసు 

ధనియాలు - సగం గ్లాసు  

జీల కర్ర - పావు గ్లాసు 

మిరియాలు - పావు గ్లాసు 

ఎండు మిర్చి - 5 

 

తయారీ విధానం:

అన్ని దినుసులని బాణలిలో వేసి దోరగా వేయించుకొని, చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గాలి చెరని డబ్బాలో పోసి పెట్టుకుంటే ఒక నెల రోజులు వాడుకోవచ్చు. మిరియాల ఘాటు ఇష్టమయిన వాళ్ళు మిరియాలని కొంచం ఎక్కువ వేసుకోవచ్చు. సో వేడి వేడి అన్నంలో టమాట రసం  వేసుకుని, ఆలు కర్రి తో చక్కగా భోజనం చేసి ఎలా వుందో చెప్పండి.

 

- రమ