టీడీపీకి కడియం రాజీనామా

        టిడిపి సినీయర్ నేత కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడుకి షాకిచ్చారు. తెలంగాణ గురించి పట్టుబట్టి..తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఎలాంటి ఉద్యమం చేపట్టడం లేదని, కేవలం కేసీఆర్ తిట్టడానికే పరిమితమయిందని ఆగ్రహించిన కడియం శ్రీహరి ఈ రోజు టిడిపికి రాజీనామా చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని అనుమానిస్తున్న కడియం శ్రీహరి విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ వీడుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత హైదరాబాద్ లో చంద్రబాబు ను కలిసి అవన్నీ వదంతులు అని తేల్చేశారు. కాని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో ఆయన మండలాలవారీగా సమావేశం అయిన తరువాత టీడీపీకి గుడ్ బాయ్ చెప్పారు. ఈ నేపధ్యంలో కడియం ఎ పార్టీలో చేరుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

చిరంజీవి పై సీఐడీ అస్త్రం!

      కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవికి సీఎం కిరణ్ ఝలక్ ఇచ్చారు. చిరంజీవే లక్ష్యంగా సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంపై దాడిచేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో పలు అక్రమాలు జరిగాయని చాలా కాలం కిందటే ఆరోపణలొచ్చాయి. కొన్ని ప్లాట్లను అనర్హులకు కేటాయించారని, పార్కింగ్ స్థలాలను కూడా ప్లాట్లుగా మార్చేశారని అప్పట్లో అన్నారు.   ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కాలంలోనే ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి అది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఉన్నట్లుండి సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎప్పుడో ఏళ్ల క్రితంనాటి వ్యవహారాల్లో సీఐడీ ఇప్పుడు ఎందుకు హడావుడి చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోనే సొంత ఇల్లు, బ్లడ్‌బ్యాంకు ఉన్నాయి. చిరంజీవి ఇంటివద్ద కొంత భూమిని ఆయన కబ్జా చేసి ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంపై దాడిచేసిన అధికారులు ఆ ఫైలునే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు సమాచారం. సీఎం కిరణ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న చిరంజీవి వర్గాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని పుకార్లు వినిపిస్తున్నాయి.  

న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా

  రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ రాజీనామా సమర్పించిన కొన్ని గంటలలోనే న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ కూడా రాజీనామా చేయడంతో ఈ సారి ప్రజలలే కాకుండా మీడియా కూడా ఆశ్చర్య పోకతప్పలేదు. రేపు ఆదివారం నాడు కాంగ్రెస్ పెద్దలు మరో మారు సమావేశం అయిన తరువాత ఆయన చేత కూడా రాజీనామా చేయించవచ్చునని అందరు భావిస్తున్న సమయంలో హత్తాతుగా ఆయన కూడా తన రాజీనామా పత్రాన్ని ప్రధానికి అందజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.   కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అవినీతిని కడిగి పారేసిన తరువాత, ఇప్పుడు తన పెరట్లోనే అవినీతి మర్రి చెట్టులా శాఖోపశాఖలుగా విస్తరించి తన ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయశాఖా మంత్రికి కూడా ఉద్వాసన పలకాలని నిశ్చయించుకొన్నాకనే ఆయన రాజీనామా చేసారు.   ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తాము అవినీతిని సహించమని డప్పుకొట్టుకొనే అవకాశం పొందడమే కాకుండా ఎన్నాళ్ళుగానో చేప్పట్టాలనుకొంటున్న మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు చేర్పులు కూడా జరుపవచ్చునని ఆలోచన. దీనివల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, పార్టీలో అసంతృప్తి నేతలకు కూడా ఏవో ఒక పదవులు కల్పించగలిగితే ఎన్నికల ముందు పార్టీలో ఐకమత్యం సాదించవచ్చును.   అయితే కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్ళకి లొంగి ఇద్దరు మంత్రులను తప్పించినంత మాత్రాన్నఅదేమి నిష్కళంక పార్టీ అయిపోదని అందరికీ తెలుసు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేయవలసి వచ్చిందంటే దానర్ధం వారిద్దరూ తమ అవినీతిని సమర్ధంగా దాచుకోలేకపోయారని అర్ధం. అంతే తప్ప మిగిలిన మంత్రులందరూ పరిశుద్దాత్మలని చెప్పలేము. దొరికితే దొంగలు లేకుంటే ఎర్రబుగ్గ కార్లలో తిరిగే దొరలు.

రైల్వే మంత్రి బన్సాల్ రాజీనామా

  రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్, తన మేనల్లుడు విజయ్ సింగ్లీ రూ.90లక్షలు లంచం తీసుకొంటూ పట్టుబడటంతో, తప్పని పరిస్థితుల్లో ఈ రోజు తన పదవికి రాజీనామా చేసారు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశం అయిన తరువాత ఆయనను పదవి నుండి తొలగించాలని నిర్ణయం జరగడంతో ఈ రోజు ఆయన తన రాజీనామా పత్రాన్ని ప్రదానికి సమర్పించారు.   ఇక, ఒకవైపు మంత్రుల రాజినామాలకై ప్రతిపక్షాల ఒత్తిడి, మరో వైపు సుప్రీంకోర్టులో చివాట్లు, ఇంకోపక్క తరుముకొస్తున్న ఎన్నికలు అన్ని కలిసి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచి చివరికి  రైల్వే మంత్రి రాజీనామాకు దారితీసింది. ఇక మరో బలమయిన కారణం ఏమిటంటే, సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్న తరువాత, అటు సీబీఐలోను, ఇటు ప్రభుత్వంలోను కూడా కొంచెం చలనం వచ్చిందని చెప్పవచ్చును. ఆ కారణంచేతనే సీబీఐ నేరుగా రైల్వేశాఖా మంత్రి కార్యాలయ అధికారులను ప్రశ్నించడానికి దైర్యంగా తన వద్దకు రప్పించుకోంగలిగింది. బహుశః ఆ కారణంగానే ప్రభుత్వం కూడా సీబీఐకి అడ్డు చెప్పలేకపోయింది.   సీబీఐ ఎప్పుడయితే తన అధికారులను ప్రశ్నించడానికి పిలిపించుకొందో, అప్పుడే బన్సాల్ మంత్రిగారికి కూడా జ్ఞానోదయం అయింది. సీబీఐ తీగలాగడం మొదలు పెట్టింది కనక డొంకంతా కదలక తప్పదని ఆయన ముందుగానే అందులోంచి బయటపడాలని రాజీనామా చేసారు. అయితే ఆ డొంకలో తీగలు ఈ రోజు కాకపోతే రేపయినా ఆయన కాళ్ళకు చుట్టుకోకమానావు. రైల్వే బోర్డులో సభ్యుడిగా నియమానికి రూ.10కోట్లు లంచం ఇవ్వబడుతోందంటే, దానిని బట్టి రైల్వే శాఖలో అవినీతి ఏస్థాయిలో వేళ్ళూనుకొని ఉందో అర్ధం అవుతోంది.  

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు

  కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారయింది. కొత్తగా ఎన్నికయిన 121 కాంగ్రెస్ శాసన సభ్యులలో 102మంది ఆయనకు మద్దతు పలకడంతో ఆయన పేరు ఖరారు అయింది. బెంగళూరులో కంటీరవ స్టేడియంలో సోమవారం ఉదయం 11.15 గంటలకి ఆయనతో బాటు 15మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేస్తారు. సిద్దరామయ్య ఆగస్ట్ 12, 1948వ సం.లో మైసూరులో గల సిద్దరామ హుండీ అనే గ్రామంలో జన్మించారు. 1978లో రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయన మొట్ట మొదటిసారిగా 1983లో బీయల్.డీ. అనే పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జనత పార్టీలో చేరి మళ్ళీ జనతాదళ్(యస్) లో చేరి కొద్ది కాలం దేవగౌడ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేసారు.2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుండి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నారు.

కష్టకాలంలో వైయస్సార్ కాంగ్రెస్

  జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాగయినా బెయిలు మీద బయటకి వస్తాడని చాలా ఆశగా ఎదురుచూసిన అతని కుటుంబం మరియు పార్టీ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారు పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నపటికీ, ప్రస్తుతం పార్టీలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను చూసి వారు చాల కలవరపడుతున్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాల వారిగా నియోజక వర్గ ఇన్-చార్జ్ లను నియమించి సిద్దమవుదామని ఆలోచిస్తే అదే ఆ పార్టీ పాలిట శాపంగా మారింది. నెల్లూరు, వరంగల్ జిల్లాలలో పార్టీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకొని ఏకంగా పెద్ద తలకాయలే పార్టీ వీడేట్లు చేస్తున్నాయి.   జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాకపోవడం వలన పార్టీ పై ఎటువంటి ప్రభావం లేదని, పార్టీలో అసమ్మతిని సమర్ధంగా అదుపు చేయగలమని నిరూపించే ప్రయత్నంలో నిన్నకొండ సురేఖ అనుచరులను పార్టీ నుండి బహిష్కరించారు. త్వరలో కొండా దంపతులు కూడా పార్టీ వీడే అవకాశం ఉంది.   అనకాపల్లిలో దాడి వీరభద్ర రావుని పార్టీలోకి ఆహ్వానించి ఆ పార్టీ కొరివితో తల గోక్కోన్నట్లయింది. ఆయన రాకను నిరసిస్తూ కొణతాల రామకృష్ణ సోదరులు పార్టీకి తాము కావాలో లేక దాడి కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారిచేసారు కూడా. ఇక, పార్టీలోకి కొత్తగా వచ్చిన దాడి కోసం, పార్టీ కొణతాలను వదులుకోవడానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. దానితో, ఆయనను తమ పార్టీ వైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. “ఆయన ఎప్పటికయినా మా కాంగ్రెస్ పార్టీ వాడే” అని కేంద్ర మంత్రి పురందేశ్వరి పలికితే, “ఆయన మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామని” మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు.   ఇక కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా ఇంచుమించి ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ముందు నుండి ఆ పార్టీలో ఉంటూ రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు, ఇటీవల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో నుండి వైకాపాలోకి వచ్చిన నేతలతో పట్లు పడుతున్నారు. వారు అకస్మాత్తుగా వచ్చి తమ నోటి కాడ కూడు లాకొంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో 4-6నెలల వరకు జైలు నుండి బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పార్టీలో తమ మొర వినే నాధుడు లేదని వారందరూ ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.   ఇక, చంద్రబాబు పాదయత్ర సాగుతున్నంత కాలం, పోటీగా సాగుతున్న షర్మిల పాదయాత్ర గురించి మీడియాలో ఎక్కడో అక్కడ నిత్యం ప్రస్తావన ఉండేది. కానీ, చంద్రబాబు పాదయాత్ర పూర్తయిన తరువాత ఆమె పాదయాత్రను పట్టించుకొనే నాధుడే లేడు. ఆమె పాదయాత్రను మీడియా ఎలాగూ పట్టించుకోవడం లేదు, చివరికి వైకాపా శ్రేణులు, నేతలు కూడా మొహం చాటేయడం ఆశ్చర్యకరం. ప్రస్తుతం ఖమ్మంలో సాగుతున్న ఆమె పాదయాత్ర ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో, దాని వల్ల పార్టీకి ఏమయినా ఫలితం ఉంటుందో లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. చివరికి ఆమె పాదయాత్ర గురించి పార్టీలో నేతలు కూడా మీడియాతో మాట్లాడెందుకు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం.   ఒకవైపు జైల్లో జగన్ మోహన్ రెడ్డి, మరో వైపు షర్మిల, విజయమ్మలు పార్టీని ఎలాగయినా కాపాడుకోవాలని ఈ మండు వేసవి ఎండలను సైతం లక్ష్యం చేయకుండా కష్టపడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం చల్లగా తమ ఏసి గదులకే పరిమితమయిపోయి, మీడియాకి ఖండన ప్రకటనలు జారీ చేస్తూ హాయిగా కాలక్షేపం చేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. జగన్ మోహన్ రెడ్డి, మరియు అతని తండ్రి స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డిల పై ప్రజలలో ఉన్న ఆదరణ, సానుభూతి అనే రెండు అంశాలే తమను కష్టపడకుండా గెలిపిస్తాయని వారు భావిస్తునందునే వారు తమ ఏసి గదులకి పరిమితమయిపోయినట్లుంది. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలకు విజయమ్మే సారద్యం వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కొండా దంపతులకు పొగబెడుతున్న వైకాపా

  గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ దంపతుల ప్రాదాన్యత క్రమంగా తగ్గుతుండటంతో వారు కూడా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల వారి ప్రమేయమ లేకుండా నియోజక వర్గ ఇన్-చార్జుల నియామకం జరిగిన తరువాత, వారు తమకిక పార్టీలో స్థానం లేదని గ్రహించి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ వార్తలు మీడియాలో రావడం దానిపై మీడియాలో చర్చలు జరగడంతో ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో పూర్తిగా తెగతెంపులకి సిద్దం అవుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వారి అనుచరులయిన పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనావత్ రాధ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మసూద్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి మోహన్‌రావులను సస్పెండ్‌చేసింది. దీనికి ఆగ్రహించిన కొండా అనుచరుడు మరియు జిల్లా నియోజకవర్గ ఇన్-చార్జ్ శ్రీనివాస రెడ్డి మరి కొందరు పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అంతిమంగా కొండ దంపతుల నిర్ణయాన్ని బట్టి వారందరూ ఏ పార్టీలో చేరలో నిస్చయించుకోవడానికి ఈ రోజు వరంగల్ లో సమావేశం అవుతున్నారు. బహుశః ఈ వారంలోనే కొండ దంపతులతో బాటు వారి అనుచరులు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది.     ఇప్పటికే, పిల్లి సుబాష్ వంటి సీనియర్ నేతలు బయట నుండి కొత్తగా వచ్చిచేరుతున్న ఇతర పార్టీల నేతలతో ఇమడలేక క్రమంగా పార్టీకి దూరమయిపోయారు. ఇంతకాలం సేవలందించి పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసిన కొండ దంపతులు కూడా ఇప్పుడు వారి త్రోవలోనే బయటకి వెళ్ళాక తప్పడంలేదు. గమ్మతయిన విషయం ఏమిటంటే, కొండా సురేఖ దంపతులు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వారి నుండి జవాబు కోరిన కొణతాల రామకృష్ణ కూడా ఇప్పుడు దాడి వీరభద్ర రావు రాకతో అసమ్మతి స్వరాలూ వినిపిస్తున్నారు. వైకాపా అనవసర భేషజాలకు పోయి పార్టీకోసం త్యాగాలు చేసిన సురేఖ, కొణతాల వంటి వారిని పక్కన బెట్టి కొత్తవారికి పీట వేయడంతో సహజంగానే పార్టీలో అసమ్మతి మరింత పెరిగింది. అయినప్పటికీ, పార్టీ తన శ్రేణుల మీద పట్టు కోల్పోలేదని నిరూపించేందుకు క్రమశిక్షణా చర్యలుకు దిగితే అది మరింత మందిని బయటకి పంపే అవకాశం ఉంది.

నటుడు రామ్ చరణ్ ఫోటోలు మార్ఫింగ్ చేశారా!

        బంజారాహిల్స్‌లో రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను కొట్టిన సంగతి తెలిసిందే. సంఘటన పై లోకల్ మీడియాతో మాట్లాడిన చెర్రీ బాబు ఈ ఉదంతంలో తనది ఎలాంటి తప్పూ లేదని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే తనతో దురుసుగా ప్రవర్తించారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఓ ఫోటో గ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేయబోయాడని చెప్పారు. కారులో తనతో సహా తన భార్య ఉపాసన ఉందన్నారు. తనతో గొడవ పెట్టుకున్న వారు ఐటీ ఉద్యోగుల్లా లేరన్నారు. వారు మద్యపానం సేవించి ఉన్నారన్న అనుమానాన్ని చరణ్ వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులు ఒక వార్త సంస్థలో మాట్లాడుతూ తమది ఎటువంటి పొరపాటూ లేదని వాపోయినప్పటికీ, వారు ఆ రోజు కేసు పెట్టకపోవడంతో…. ఇప్పుడు ఇంకేం మాట్లాడటానికి లేకుండాపోయే అవకాశం కనిపిస్తోంది!

ఘనంగా తెలుగువన్ 13వ వార్షికోత్సవ వేడుకలు

       CLICK HERE FOR MORE Teluguone   13 Anniversary Celebrations Photos     తెలుగువన్ డాట్ కామ్ 13 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకి చెందిన అతిరధ మహారధులంతా విచ్చేసి ఆ సంబరాలకి మరింత శోభను కలిగించారు.   రాత్రి 7గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రార౦భమైంది. చి|| ప్రవస్తి, చి|| ప్రవీణ్, చి|| హనీ తమ పాటలతో ఆహుతులను అలరించారు. అలాగే  సూర్య తేజ అండ్ టీం హాస్యభరిత లఘు నాటికలతో ఆహుతులను నవ్వుల్లో ముంచారు. ఇక సభా కార్యక్రమాలు తెలుగువన్.కాం పరిచయంతో మొదలై,  తెలుగువన్.కాం క్రియేటివ్ హెడ్ మల్లిక్ గారి వందన సమర్పణతో ముగిశాయి.           ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారితో పాటు ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డిగారును, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారును, లిటిల్ మ్యూజిషియాన్ అకాడమి వ్యవస్థాపకుడు రామాచారిగారులను సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ. ఎం.నాగేశ్వర రావు గారు ఆత్మీయ అతిధిగా విచ్చేసి ఇంటర్ నెట్ మీడియా అలాగే తెలుగువన్ ప్రస్థానాన్ని అభినందించారు. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారు మాట్లాడుతూ..''సాహిత్యం, కథలు రాస్తానని ఏనాడూ అనుకోలేదు. నా బాధలు, కన్నీళ్లు నాతోనే అంతం కాకూడదన్న ఆలోచనతోనే రాశాను'' అని అన్నారు. దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు మాట్లాడుతూ..తాను ఓ తెలుగు సభలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నానని అన్నారు. ఇతర భాషల వారికి తమ మాతృభాషపై ఉన్న అభిమానం మన బాషపై మనకు ఉండకపోవడం బాధాకరమని అన్నారు. దేశంలో హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగునీ, మనలో చిత్తశుద్ధి లేకపోవటమే మన భాష దుస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ''జ్ఞానపీట్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జీవితానికి, నా జీవితానికి చాలా సారూప్యత ఉంది. ఇద్దరం కష్టాల కన్నీళ్ళను దాటుకొని పైకొచ్చిన వాళ్ళమే. గాడ్ ఫాదర్లు లేకపోయినా కృషి, పట్టుదలతో మేం ఈ స్థాయికి చేరాం. మా జీవితాలు చాలా మంది పేదవాళ్ళకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను..'' అని అన్నారు. తెలుగువన్ ఇంతగా విస్తరించినందుకు అభినందనలు తెలియజేస్తూ, మరింత ముందుకు దూసుకుపోవాలన్నారు.      

కొండా దంపతులకు బీజేపీ గాలం

        వైకాపా విషయంలో అలక వహించిన కొండా మురళి దంపతులకు బీజేపీ గాలం వేస్తోంది! వారిని తమవైపుకు తిప్పుకోవాలని చూస్తోంది! అటు వైఎస్ఆర్.సీపీలో కొనసాగలేక ,ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లలేక , కేసీఆర్ కింద పొదగలేక పోతున్న వారికి అన్ని విధాలా ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ అభయం ఇస్తోంది! ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొండా దంపతులకు ఫోన్ చేసి హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. ఇప్పటికే ఏ పార్టీకీ చెందకుండా ఉండిపోయిన నాగం జనార్ధన్ రెడ్డిని బుట్టలోకి వేసుకున్న బీజేపీ ఇలాంటి సందిగ్ధవస్థలో ఉన్న నేతలను తమవైపు తిప్పుకోవడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సురేఖ, మురళిలపై గాలం వేసింది. మరి వీరి గాలానికి వారు పడతారో లేదో?

నటి పూజాగాంధీ కి షాక్

        ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ రాయచూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు బీఎస్‌ఆర్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమెకు అతి తక్కువగా 1, 815 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ముంగారు మలే చిత్రంతో కన్నడ పరిశ్రమకు పరిచయమై అనతికాలంలోనే హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన పూజాగాంధీ మొదట మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవెగౌడ్‌ స్థాపించిన జేడీ(ఎస్‌) పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కర్నాటక జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆమె బీజేపీ మాజీ మంత్రి బి. శ్రీరాములు నేతృత్వంలోని బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేసి ఘోర పరాజయం పొందారు.

జగన్ బెయిలు పై సుప్రీం కోర్టు తీర్పు నేడే

  జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరు ఈ రోజు కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, మొన్న 6వ తేదీన సుప్రీంకోర్టులో ఆయన బెయిలుపై ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం తన తీర్పును రిజర్వులోఉంచిన సుప్రీంకోర్టు, నేడు ఆయనకు బెయిల్ మంజూరు చేసేది లేనిదీ ఈరోజు  ప్రకటించబోతోంది. ఆయనకు తప్పక బెయిలు దొరుకుతుందని వారు ధృడంగా నమ్ముతున్నారు.   ఒకవేళ ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసినట్లయితే, రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా? అని ఊగిసలాడుతున్నవారు, ఇక ముందు ఆయన కార్యాలయం ముందు బారులు తీరవచ్చును. అదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో జరుపాలనుకొంటున్న కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ ఎన్నికలపై ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ఆలోచన విరమించుకొన్నా ఆశ్చర్య పడనవసరం లేదు.   ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి బెయిలు రాని పక్షంలో ఆ పార్టీ పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది గనుక, ఆయన తన స్థానంలో షర్మిలను నియమించి పార్టీ యొక్క పూర్తి బాధ్యతలు ఆమెకు అప్పగించవచ్చును.

కర్ణాటకలో ప్రతిపక్షం ఎవరికి?

        కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ధ్రువపడినట్లే! దాదాపుగా 120 సీట్లతో ఇక్కడ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే రెండోస్థానంలో నిలిచే పార్టీ ఏది అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత కర్ణాటకలో అధికారం సాధించిన ఉత్సాహంలో కాంగ్రెస్ ఉండగా, రెండోస్థానం కోసం బీజేపీ, జేడీఎస్ లు పోరాడుతున్నాయి. ప్రస్తుత ఆధిక్యాల దృష్ట్యా రెండు పార్టీలూ చెరో 40 సీట్లనూ సాధించే అవకాశం కనిపిస్తున్నాయి. 120 కాంగ్రెస్ ఖాతాలో అనుకున్నా, చెరో 40 సీట్లతో మిగతా రెండు పార్టీలూ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఒకటీ రెండు సీట్లతో బీజేపీ, జేడీఎస్ లలో ఎవరో ఒకరు ఆధిక్యంలో నిలిచే అవకాశాలున్నాయి. ఫలితాల గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) (జనతా దళ్ సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ…తాను కింగ్ ను కాను… కింగ్ మేకర్ ను కాదు అని అన్నారు. తాము ఎటువంటి రేసులో లేమని ఆయన స్పష్టం చేశారు. తమకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించలేదని కుమారస్వామి అన్నారు. ప్రతిపక్షంలో కూర్చుని.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జేడీఎస్ నాలుగు స్థానాల్లో గెలుపొంది, మరో 37 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది.

2014 ఎన్నికల్లో టిడిపి వర్సెస్ వై.ఎస్.ఆర్. పార్టీ?

        ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి వీస్తున్న గాలిని బట్టి 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనేక రకాలుగా అభాసుపాలైన అధికార కాంగెస్ పక్షం రాష్ట్రంలో మూడవ స్థానంలోకి జారిపోయి, మొదటి రెండు స్థానాల్లో "తెలుగుదేశం''పార్టీ, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' పక్షమూ ప్రధాన రాజకీయ పక్షాలుగా అవతరించవచ్చునని ఢిల్లీలోని విశ్వసనీయ రాజకీయ పరిశీలకులనుంచి తెలియవస్తున్న సమాచారం. అయితే ఈ నూతన రాజకీయ సమీకరణను అసంభవం చేసే బాధ్యతను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం తెలంగాణాకు మాత్రమే పరిమితమై తెలుగుజాతిని విషప్రచారం ద్వారా చీల్చడానికి సొంత ఎజెండాతో టి.ఆర్.ఎస్. పార్టీని నెలకొల్పిన ఆంధ్రప్రాంత వలసవాదీ, వేర్పాటువాదీ అయిన కె.సి.ఆర్.పైన రానున్న ఎన్నికలకోసం ఒక బాధ్యత పెట్టింది. "గతంలో డిసెంబర్ 9''న చిదంబరం - తెలంగాణా ఏర్పాటు విషయమై కేంద్రంలో చింతన ప్రారంభమైంది, చర్చలలో ఉందన్న ఆకుకు అందని పోకకు పొందని ఒక ప్రకటన చేశాడు కాబట్టి దానికి కేంద్రం కట్టుబడి ఉంటే, తాను కాంగ్రెస్ లో చేరతానని కెసిఆర్ మాట ఇచ్చాడని, అందుకు ముదరాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్ఠకు విఘాతం కలగకుండా వ్యూహరచన చేయడం 'నీ వంతని' కెసిఆర్ ను అధిష్ఠాన వర్గ ముఖ్యులు కోరారనీ, అందుకు కెసిఆర్ ఒప్పుదల అయ్యాడనీ ఆ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈ ఏర్పాటువల్ల కెసిఆర్ కు వొనగూడే "ప్రతిఫలమేమిట''ని ప్రశ్నించగా ఆ 'ప్రశ్న'లోనే "నిగూఢమైన సమాధానం'' ఉందని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేసే పక్షంలో "ప్రత్యేక తెలంగాణా" రాష్ట్రానికి"నిన్నే "ముఖ్యమంత్రి"ని చేస్తామని అధిష్ఠాన వర్గ ముఖ్యులు హామీ ఇచ్చినట్టు ఈ పరిశీలకులు తెలిపారు. అయితే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. పార్టీ "ఎనిమిది పార్లమెంటు స్థానాల''ను గెలుచుకోడానికి అవకాశం వస్తే ఆ సీట్లు అడ్డం పెట్టుకుని కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా, మరొక పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా "తెలంగాణా పేరిట'' బేరసారాలు ఆడవచ్చుననీ, ఎన్నికలకు ముందస్తుగా కాంగ్రెస్, బిజెపి లాంటి జాతీయ పార్టీలతో సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకునేకన్నా, ఎన్నికల అనంతరం మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తగినట్టుగా సర్దుబాట్లు చేసుకుంటే టి.ఆర్.ఎస్. కీలకపాత్ర వహించగల్గుతుందని కెసిఆర్ వ్యూహమని పరిశీలకుల భావన. అయితే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో మరొక రాజకీయ పక్షం దేనితోనూ పొత్తులు పెట్టుకోకుండా "ఒంటరి''గా మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించిందని కెసిఆర్ ప్రకటించడంతో తెలంగాణలో ఆయని ప్రవర్తనను బట్టి అతణ్ణి, అతని మాటలనూ విశ్వసించడం "ఆత్మహత్యా సదృశ్యమ''న్న ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ముఖ్యులకు లేకపోలేదు!   ఎప్పుడయితే అమలుకురాని షరతుల మీద ఆధారపడి కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపెస్తానని అధిష్ఠాన ముఖ్యులకు హామీ యిచ్చాడన్న వార్త వెల్లడి కావటంతో తెలంగాణా ఉద్యమంలోనూ, ముఖ్యంగా ఉద్యమ నిర్వహణకని ఏర్పడిన "సంయుక్త కార్యాచరణ సంఘం''లోనూ విభేదాలు, చీలికలూ తలెత్తాయి. ఈ పరిణామానికి ఒక చారిత్రిక పునాది ఉంది - తెలంగాణా పేదలను, సాధారణ గ్రామీణ రైతాంగాన్ని, దళిత, బహుజన వర్గాలనూ [వీళ్ళే జనాభాలో అసంఖ్యాకులు] పీల్చి పిప్పిచేస్తూ రెండు అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఫ్యూడల్ భూస్వామ్య శక్తులు - వెలమ, రెడ్డిదొరలు. నిన్నటిదాకా "ఏలిననాటి శని''గా నేడు "ఏలేనాటి శని''గా మారిన ఈ 'అగ్రవర్ణ వైరుధ్యం' తెలంగాణలో ఈ వర్గాల నాయకత్వంలో తలెత్తే ఏ ఉద్యమంలోనైనా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంది, ఉంటుంది! ఈ కారణంతోనే 'ఉద్యమం' పేరిట జరిపే ధర్నాలు, రాస్తారోకోలు, వంటా-వార్పూ, తాత్కాలిక వూరేగింపుల నిర్వహణలోనూ, "సడక్'' బంద్ లు ఏకోన్ముఖంగా కాకుండా రెండు వేర్వేరు "కుంపట్లు''గా సాగుతున్నాయి. అటు కెసిఆర్, ఇటు కోదండరామ రెడ్డి నేను ముఖముఖాలు చూసుకునే పరిస్థితిలో లేరని ప్రజలకూ తెలిసిపోయింది! ఉద్యోగ, విద్యార్థి, వృత్తిసంఘాలన్నిటా రెండేసి "కుంపట్లు'' నడుస్తున్నాయి. చివరికి ఢిల్లీ "సంసద్'' ధర్నాలో పాల్గొన్నప్పుడు కూడా కెసిఆర్ వర్గం తరపున 'మనిషి'ఒకరు లేకపోతే జనం వేరేగా భావిస్తారేమోనన్న 'కపటం'తో పాల్గొనడమేగాని మనఃపూర్వకంగా పాల్గొనలేదు. దానికి కారణం - కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేయడానికి కెసిఆర్ అధిష్ఠానంతో పడివచ్చిన లాలూచీ తప్ప మరొకటి కాదు.   ఈ భాగోతం యిలా ఉండగా అటు చంద్రబాబు "తెలుగుదేశం'' పార్టీ, ఇటు జగన్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' పార్టీ తెలంగాణా సమస్యపట్ల ప్రధానంగా తటస్థవైఖరిని అవలంభిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాపిత పర్యటనలోనేగాక, ప్రధానంగా తెలంగాణా జిల్లాల్లో సహితం వారు నిర్వహించే సభలకు ప్రజలనుంచి వస్తున్న స్పందనను తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమని కూడా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముఖ్యులు హెచ్చరిస్తున్నట్టు ఢిల్లీ పరిశీలకులు సంకేతాలు యిస్తున్నారు! తెలంగాణలో బొత్తిగా "తాడూ-బొంగరం''లేని [ఒకటి రెండు అసెంబ్లీస్థానాలు తప్ప] పార్టీలుగా నమోదైన కమ్యూనిస్టుపార్టీ, బిజెపిలు సహితం టి.ఆర్.ఎస్. 'ఒంటరిపోరు' వ్యూహాలతో, ఎత్తుగడలతో ఏకీభవించడం లేదు సరికదా జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసే ఎత్తుగడలను నిరసించే మార్కిస్టుపార్టీ 'గొంతు'కూడా ఇప్పుడు 'జీర'బోయిందని భావిస్తున్నారట. కాబట్టి అధికార కాంగ్రెస్ ముఖ్యులు కూడా కేంద్రస్థాయినుంచి తెలంగాణా ప్రాంతీయస్థాయి వరకూ చీలిపోయి ఉన్నారు కాబట్టి, "గిరీశం'' పంతులు "అటునుంచి నరుక్కురమ్మన్న''ట్టుగా కెసిఆర్ ను 'దువ్వడం' కోసం టి.ఆర్.ఎస్. ప్రతిపత్తికి కేంద్రనాయకులు ఎసరుపెట్టి కొంతవరకు జయం పొందడానికి నిదర్శనంగా - కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలపడానికి కెసిఆర్ నిర్ణయించడమేనని ఢిల్లీ పరిశీలకులు భావిస్తున్నారు.   దీనికి తగ్గట్టుగానే 'ఒంటరి'గా పోటీ చేయడం ద్వారా అసెంబ్లీలో 100 స్థానాలు, పార్లమెంటులో "పది''స్థానాలు పొందగలమన్న కెసిఆర్ ధీమా వెనక అసలు రహస్యాన్ని కూడా కేంద్రనాయకత్వం ఉపఎన్నికలలో పాత అనుభవం దృష్ట్యా పసికట్టిందట! ఆ బ్రహ్మ 'రహస్యం' - తెలంగాణా ప్రజల్లో అనుమానం రాకుండా తలెత్తుకు తిరగడానికి పన్నిన ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ కు యిచ్చిన హామీ ప్రకారం 2012 ఎన్నికల్లో "ప్రతిఫలాపేక్ష'' (క్విడ్ ప్రోకో) సూత్రం ప్రకారం టి.ఆర్.ఎస్. తరపున బలహీనమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం ద్వారా, తెలంగాణాలో కోల్పోయిన ప్రతిష్ఠను కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఎక్కువ స్థానాల్లో సుకరం చేయడం కెసిఆర్ బాధ్యత అవుతుందని, కాని ఈ ఎత్తుగడద్వారా అటు అధికార కాంగ్రెస్, ఇటు టి.ఆర్.ఎస్. జనంముందు అభాసుపాలు కావటం ఖాయమని ఢిల్లీ పరిశీలకులు భావిస్తున్నారు.   ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో వత్తిళ్ళమధ్య, దుష్ప్రచారం మధ్య "తెలుగుదేశం'' అధ్యక్షుడు అఖిలపక్ష సమావేశంలో "తెలంగాణా ఏర్పాటుకు మేం అడ్డు నిలబడబో''మని లిఖిత పూర్వకంగా హామీ పడివచ్చినా, తర్వాత తెలంగాణాలోనూ, రాష్ట్రంలో ఇతర చోట్ల జరిగిన సభల్లోనూ "ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం కేంద్రం పరిథిలోనిదేగాని, మా పరిదిలోది కాద''ని చంద్రబాబు, ఇతర "దేశం'' నాయకులూ చెబుతూనే వస్తున్నారు. ఇక జగన్ "వై.ఎస్.ఆర్. కాంగ్రెస్'' ఆ వూసోతో నిమిత్తం లేకుండానే ఇటు తెలంగాణాలోనూ, అటు కోస్తాంధ్రలో జరిగిన కొన్ని ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించి పాలకుల్ని పార్టీలనూ ఆశ్చర్యచికితుల్ని చేసింది! ఈ తరుణంలో 2014లో జరిగే ఎన్నికలలో ప్రజలముందుకు రాష్ట్ర విచ్చిత్తి సమస్యపైన ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన రాజకీయపక్షాలు రెండే రెండనీ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పక్షాలుగా జనం మధ్య నిలబడగల స్థితి అటు "తెలుగుదేశం'' పార్టీకి, ఇటు జగన్ పార్టీకి మాత్రమే ఉందనీ, ఆ ఎన్నికలలో మొదటి రెండు స్థానాలలో "తెలుగుదేశం'', జగన్ పార్టీలు మాత్రమే ఉండగలవనీ, మూడవశక్తిగా మాత్రమే అధికార కాంగ్రెస్ మిగిలిపోవలసి వస్తుందనీ ప్రస్తుత పరిణామాలను ఢిల్లీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి తెలంగాణా సమస్యపై ఒక్కమాట కూడా ఉచ్చరించక పోవటానికి ప్రధాన కారణాలలో ఒకటి - ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎం.పి.లలో ఎకవాక్యత లేకపోవటం కాగా, రెండవ కారణం దేశ సమైక్యతకు వేర్పాటువాదం వల్ల ప్రమాదమని భావించడమేనని ఆ పరిశీలకులు అంటున్నారు. జనాభాలో అల్పసంఖ్యాకులైన రెండు అగ్రవర్ణ సామాజికవర్గాలు తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావడానికి 'ఉద్యమం' పేరిట చేస్తున్న ప్రయత్నాలను ప్రాంతంలోని అసంఖ్యాకులైన బడుగు, బలహీనవర్గాల ప్రజలు తిప్పికొట్టే ఆలోచనలో ఉండటం మరొక కొత్త కోణమని కూడా ఢిల్లీ పరిశీలకులు భావించడం విశేషం! వీరికి తోడుగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలన్నింటిని కలిపి "మన రాష్ట్రం'' ప్రకటించాలని గిరిజనప్రాంతాల సంయుక్త కార్యాచరణ సమితి కూడా డిమాండ్ చేస్తుండడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణలోకి తీసుకోవడం వల్ల తెలంగాణా వనరులు కుంచించుకు పోతాయి!

కర్ణాటకలో ముఖ్యమంత్రి రేసులో పోటీ మొదలు

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతోందని స్పష్టమవుతున్న తరుణంలో మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు జోరందుకొన్నాయి. ముఖ్యమంత్రి పదవికి పోటీలోనలుగురు బలమయిన అభ్యర్ధులు-మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖార్గే, కేంద్ర మంత్రి ఎస్.ఎం.కృష్ణ,, మరియు కర్నాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్ అప్పుడే తమ ప్రయత్నాలు ఉదృతం చేసారు. పార్టీలో వీలయినంత ఎక్కువమందిని తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నంలో వ్యక్తిగతంగా, ముఠాలవారిగా సమావేశాలవుతు తమకే మద్దతు ఇవ్వాలని అందరినీ బ్రతిమాలుకొంటున్నారు. అందుకు ప్రతిఫలంగా అధికారంలోకి రాగానే వారికి యధోచిత పదవులు, ఇతర వ్యవహారాలలో సహకారం అందిస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ రోజు సాయంత్రంకల్లా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడుతాయి గనుక, ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికయిన శాసన సభ్యులను సమావేశ పరచి ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారు. గనుక, ముందుగానే నలుగురు ప్రధాన అభ్యర్ధులు బలం కూడగట్టుకొంటున్నారు. ఇక ఈ తంతు ముగియగానే ఇక మంత్రి వర్గంలో పదవుల కోసం కొత్త పోటీ మొదలవుతుంది. దాని తరువాత షరా మామూలుగానే పదవులు దక్కని వారి అలకలు, అసమ్మతి ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ తరువాత నుండి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మార్క్ పరిపాలన మొదలవుతుంది.

యన్టీఆర్ విగ్రహావిష్కరణతో మొదలయిన కొత్త చర్చలు

  గత 17 సం.లుగా స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టించాలని పురందేశ్వరి, తెలుగుదేశం పార్టీతో పట్లుబడుతున్నపుడు, అన్ని రాజకీయ పార్టీ నేతలు వారి గొడవను ముచ్చటగా చూస్తుండిపోయారు. చివరికి ఆమె నిన్న పార్లమెంటు ఆవరణలో యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరింపజేసిన తరువాత గానీ వారికి జ్ఞానోదయం కాలేదు.   సీనియర్ కాంగ్రెస్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు స్పీకర్ మీరా కుమార్ ను కలిసి పార్లమెంట్‌లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరితే, తెరాస నేత హరీష్ రావు మాజీప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు విగ్రహం పెట్టాలని కోరారు. ఇక అదేవిధంగా మరో తెరాస నేత రాష్ట్ర శాసనసభ ఆవరణలో తెరాస సిద్ధంత కర్త స్వర్గీయ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరగా, దళిత వర్గాలకి చెందిన నేతలు జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.   ఈ విగ్రహాల డిమాండ్స్ పక్కన బెడితే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తూ పార్టీని స్థాపించి, రాష్ట్రంలో పార్టీని ఓడించిన స్వర్గీయ యన్టీఆర్ ని, పురందేశ్వరి మాటలు విని కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకోవడం ఏమిటని అనంతపురం లోక్ సభ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారు కొందరు విమర్శిస్తుంటే, మరో పక్క సోనియాగాంధీ ఈ ఆవిష్కరణ సభకు హాజరు కాకుండా తెలుగుజాతిని అవమానించారని తెదేపా నేతలు నిప్పులు కక్కుతున్నారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చిరకాలం సేవలందించిన మాజీప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహరావు చనిపోయినప్పుడు కనీసం కడసారి చూసేందుకు కూడా వెళ్ళని సోనియా గాంధీ, మళ్ళీ ఇప్పుడు తెలుగు గడ్డకి చెందిన స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణకి కూడా మొహం చాటేసి యావత్ తెలుగు ప్రజలను అవమానించారని విమర్శించారు.   చంద్రబాబు తదితరులు కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం తూ...తూ...మంత్రంగా జరిపి చేతులు దులుపుకొందని, ఆ మహానుభావుడి గురించి కనీసం ఎవరికీ ఒక్క ముక్క మాట్లాడే అవకాశం ఈయకుండా కేవలం పదినిమిషాలలో కార్యక్రమం ముగించడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. మొత్తం మీద యన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆలోచన మొదలు పెట్టిననాటి నుండి అది ముగిసిన తరువాత కూడా ఇంకా చర్చలు ఏదో ఒక రూపంలో కొనసాగుతోనే ఉన్నాయి.

భారత దౌత్యం వలనే చైనా దళాలు వెనక్కి మళ్లాయా?

  గత నెల 15వ తేదీన 50మంది చైనా సైనికులు 19కి.మీ. మేర భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఉభయ దేశాల సైనిక దళాల కమాండర్ల మద్య అనేక దఫాలుగా ఫ్లాగ్ మీటింగ్స్ జరిగిన తరువాత ఎట్టకేలకు రెండు రోజుల క్రితం వారు వెనక్కి మళ్ళారు. ఇది భారత దౌత్య విజయమని కొందరు మేధావులు అభివర్ణిస్తే, మరి కొందరు ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో జరుపనున్న తన ఒక్క రోజు జపాన్ పర్యటనను మరో రోజుకి పొడిగించడం ద్వారా చైనాపై ఒత్తిడి తెచ్చినందునే వారు వెనక్కి తగ్గాల్సివచ్చిందని విశ్లేషించారు. జపాన్ సముద్రజలాలలో ఉన్న కొన్ని ద్వీపాల కోసం చైనా ఆ దేశంతో కూడా చాలా రోజులుగా ఖయ్యానికి కాలు దువ్వుతున్నందున, ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనను మరొక రోజు పొడిగించడం ద్వారా, తాము జపాన్ కు మద్దతు తెలుపుతామని సూచించినట్లయింది కనుక, చైనా కాళ్ళ బేరానికి వచ్చి తన సైనికులను వెనక్కి తీసుకొందని సామాన్యులకు అర్ధం కాని ఒక మంచి లాజిక్ పాయింటు వివరించడంతో అల్పసంతోషులయిన భారతీయులు కూడా చాలా సంతోషించారు.   కానీ, ఉత్తర సైనిక కమాండ్ కు చెందిన ఒక సైనికాధికారి చెప్పిన కధ వింటే మాత్రం భారతీయులు ఉసూరుమనక మానరు.   ఐదు రోజుల క్రితం ఉభయ దేశాల సైనిక దళాల కమాండర్ల మద్య జరిగిన ఆఖరు ఫ్లాగ్ మీటింగ్ లో మన దేశ సరిహద్దుల్లో చుమార్ అనే ప్రాంతంలో మన సైనికులు గస్తీ కోసం నిర్మించిన బంకర్లను పూర్తిగా తొలగిస్తేనే తాము వెనక్కి వెళ్తామని స్పష్టం చేయడంతో, తప్పని పరిస్థితిలో చైనా షరతులకు భారత్ తలఒగ్గిన తరువాతనే వారు వెనక్కి మళ్లారని ఆయన తెలిపారు. వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు చైనా సైనికులు భారత భూభాగంలోనే నిలబడి “మీరు మా భూ భాగంలోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్ళిపొండి” అనే ఒక ఎర్ర బ్యానరు చాల సేపు పట్టుకొని మన సైనికులకు ప్రదర్శించిన తరువాతనే వెనక్కి మళ్ళారు. అని తెలిపారు. దీనినేనా మన దౌత్యవిజయంగా అభివర్ణిస్తున్నారు?

హవాల కేసులో మంత్రి శైలజానాథ్

  ఇప్పటికే పలు సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధమిక విద్యా శాఖామంత్రి శైలజానాథ్ పేరు హవాలా కేసులో బయటపడటంతో ఉలిక్కిపడింది. ప్రముఖ పరిశోధనా వెబ్ సైట్ ‘కోబ్రా పోస్ట్’ ఇటీవల డిల్లీలో నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ లో మన మంత్రిగారి పేరు బయటకి వచ్చింది.   కధలోకి వెళ్తే, కోబ్రా పోస్టుకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు డిల్లీలో గల ఇండియన్ బ్యాంక్ మేనజర్ మనోహర్ ని తమని తాము ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రతినిధులుగా పరిచయం చేసుకొని, మంత్రిగారు రూ.25కోట్లు నల్లదనాన్ని సురక్షితమయిన చోట పెట్టుబడి పెట్టలనుకొంటున్నారని, ఆయనకు నమ్మకం కలిగితే, మరిన్ని భారీ మొత్తాలు కూడా పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పడంతో, వారిని నమ్మిన బ్యాంక్ మేనేజర్ తిరుపతిలో తనకు తెలిసిన హరికృష్ణ ప్రసాద్ అనే ఒక ప్రముఖ అర్దోపెడిక్ వైద్యుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని, ఆయన ప్రస్తుతం భారీ వెంచర్ వేసే ఆలోచనలో ఉన్నందున ఇటువంటి భారీ పెట్టుబడికోసం చూస్తున్నారని, మంత్రి గారికి నచ్చితే అందులో పెట్టుబడి పెట్టవచ్చునని చెప్పారు.   అంత భారీ మొత్తం పెడుతున్న తమ డబ్బుకి గ్యారంటీ ఏమిటి? అని రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు రాష్ట్రంలో మంత్రి శైలజానాథ్ ఆయనకు మంచి మిత్రుడని ఆయన ఈ డబ్బుకి పూర్తి గ్యారంటీ ఇస్తారని చెప్పడంతో మంత్రి గారు కూడా రంగప్రవేశం చేసారు. ఆయన బ్యాంక్ మేనేజర్ చెప్పినట్లు హామీ ఇవ్వడమే కాకుండా, మొత్తం సొమ్ము మళ్ళీ వచ్చే ఎన్నికలకి సరిగ్గా నెల రోజుల ముందుగా దేశంలో వారు ఏ ప్రాంతంలో తీసుకోదలిస్తే ఆ ప్రాంతంలో అందేలా ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలో తానూ డిల్లీ వచ్చినప్పుడు పూర్తిగా చర్చించి విషయం మాట్లాడుకోవచ్చునని మంత్రిగారన్నారు.   అయితే, ఈ లోగా కోబ్రా పోస్ట్ తన రహస్య పరిశోధన వివరాలను వెబ్ సైటు లో పెట్టేయడంతో మంత్రిగారు వెంటనే మాట మార్చి, హరికృష్ణ ప్రసాద్ కేవలం తనకు స్నేహితుడని, ఆయన వద్ద డబ్బు పెడితే భయం లేదని మాత్రమే తానూ హామీ ఇచ్చినట్లు తెలిపారు,. తనపై వస్తున్న ఆరోపణలను గాలివార్తలని ఆయన ఖండించారు. తనకు ఎటువంటి హవాలా వ్యవహారాలతో సంబందాలు లేవని ఆయన స్పష్టం చేసారు. మరి కోబ్రా పోస్టు వారెందుకు ఆవిధంగా వ్రాశారో?