సమైక్య రాష్ట్ర సమితి పార్టీ

  తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంద్ర జిల్లాల్లో ఉధ్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు సమైక్యాంద్రకు మద్దతుగా ఓ రాజకీయపార్టీ కూడా ఆవిర్భవించబోతుంది. ఈ మేరకు విజయవాడకు చెందిన హోమియోపతి డాక్టర్‌ ఎస్‌. విశ్వనాధం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ సాదన కోసం ఏర్పాడిన తెలంగాన రాష్ట్ర సమితి లాగానే సమైక్యాంద్ర కోసం సమైక్య రాష్ట్రసమితీ అనే పార్టీని స్ధాపించనున్నారు. ఈ పార్టీకి అధ్యక్షుడిగా విశ్వనాధం, సెక్రటరీగా ఎస్‌. శరత్‌బాబు వ్యవహరిస్తామని పార్టీ వ్యవస్థాపకులు ప్రకటించారు. దీంతో పాటు తమ వెనుక ఏ రాజకీయనాకుల అండలేదని, ఎవరి బినామీగా ఈ పార్టీని స్ధాపించడం లేదని సెప్టెంబర్‌ 12న అధికారికంగా పార్టీ ఏర్పాటును ప్రకటిస్తామని విశ్వనాథం తెలిపారు.

నేటి నుంచి కేదారనాథునికి పూజలు

  ప్రకృతి సృష్టించిన జల విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాద్‌లో ఈ బుధవారం నుంచి పూజలు మొదలు కానున్నాయి. గత 86 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సైన్యం సహాయక చర్యలు నిర్వహించిన ఈ క్షేత్రంలో ఇక పరిస్థితి పూర్తి చక్కబడలేదు.. అయినా ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం కావటంతో నేటి నుంచి పూజలు నిర్వహించటానికి ఆలయ అధికారులతో పాటు కమిటీ సభ్యులు కూడా తీర్మానించారు. 24 మంది పురోహితులతో కూడిన బృంధం ఆలయ కమిటీ సమక్షంలో ఈ రోజు శాస్త్రోక్తంగా పూజలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పూజలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినా. భక్తులను మాత్రం ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదంటున్నారు ఆలయ కమిటి.

కృష్ణా జిల్లా 48 గంట‌ల బంద్‌

  స‌మైక్యాంద్ర కోరుతూ సీమాంద్ర ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప‌లు ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలుపుతున్న ప్రజ‌లు ఇప్పుడు బంద్‌కు పిలుపు నిచ్చారు. 48 గంట‌ల పాటు కృష్ణా జిల్లాలో స‌కలం బంద్ కానున్నాయి. అత్యవ‌స‌ర సేవ‌లు మిన‌హా వ‌ర్తక‌, వాణిజ్య, వ్యాపార‌, ర‌వాణా లాంటి విభాగాల‌న్ని బంద్‌లో పాల్గొన‌నున్నాయి. ఈ రోజు భారీ బైక్ ర్యాలీతో పాటు కెసిఆర్ దిష్టిబొమ్మను ద‌హనం చేసిన స‌మైక్యాంద్ర ఉద్యమ‌కారులు, బుధ‌వారం నుంచి 48 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈబంద్ ఇప్పటికే ప‌లు సంఘాలు స‌హ‌క‌రిస్తుండ‌గా, రాజ‌కీయ పార్టీలు కూడా మ‌ద్దతు తెలుపుతున్నాయి.

నేటితో ముగియ‌నున్న తొలివిడ‌త ఆత్మగౌర‌వయాత్ర

  రాష్ట్ర నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో తెలుగు జాతి ఆత్మగౌర‌వయాత్ర చేప‌ట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు యాత్ర బుధ‌వారంతో తొలివిడ‌త ముగియ‌నుంది. తొలి విడ‌త‌లో భాగంగా గుంటూరు, కృష్ణ జిల్లాల్లో యాత్రను చేప‌ట్టారు బాబు. గుంటూరు జిల్లా పొందుగుల‌లొ చేప‌ట్టిన యాత్ర బుధ‌వారం కృష్ణా జిల్లా తిరువూరులో ముగియ‌నుంది. వెంట‌నే చంద్రబాబు బ‌య‌లు దేరి హైద‌రాబాద్ వ‌స్తారు. నాలుగు రోజుల విశ్రాంతి అనంత‌రం రెండో విడ‌త ఆత్మగౌర‌వ యాత్ర షెడ్యూల్‌ను ప్రక‌టించ‌నున్నారు. అయితే రెండో విడ‌త యాత్రకు వెళ్లే లోపు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. రెండో విడ‌త యాత్రను ప‌శ్చివ‌గోదావ‌రి జిల్లా ఏలూరు నుంచి ప్రారంభిస్తారు. తొలి విడ‌త ఆత్మగౌర‌వ యాత్రకు మంచి స్పంద‌న రావ‌టంతో ఇప్పుడు రెండో విడ‌త‌లో మ‌రింత ఉత్సాహంగా పాల్గొన‌నున్నారు బాబు.

షర్మిల నోటికి ఎవరయినా లోకువే

  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పాద యాత్రలు, బస్సుయాత్రలు చేస్తున్నషర్మిల కనీసం ఇంతవరకు ఆ పార్టీ సభ్యత్వమయినా తీసుకొన్నారో లేదో తెలియదు. ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున పనిచేస్తున్నారు. ఆమె చిరకాలం రాజకీయాలలో ఉండబోదని స్వయంగా ఆమె భర్త అనిల్ కుమార్ ఇటీవలే మీడియాతో అన్నారు. అయినప్పటికీ ఆమె వైకాపా తరపున ప్రజలకు చాలా వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో ఏ హోదా లేకపోయినా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన చప్రాసీ దగ్గర నుండి ప్రధాని మంత్రి దాకా ఎవరినీ విడిచిపెట్టకుండా తీవ్ర విమర్శలు చేస్తూన్నారు. అదేవిధంగా తెదేపా, తెరాస తదితర రాజకీయ పార్టీల నేతలు తన నోటి ముందు బలాదూర్ అన్న రీతిగా తన వయసుకు, పార్టీలో హోదాకు(?) మించి మాట్లాడుతున్నారు.   ఆమె ఇంత వరకు కనీసం ఒక కార్పొరేటర్ వంటి చిన్న పదవిలో కూడా పనిచేసిన అనుభవం లేదు. రాష్ట్రాన్ని,దేశాన్నినడిపించడంలోఉండే కష్ట సుఖాలు ఆమెకు తెలియకపోయినా ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రధాని వరకు అందరూ కూడా ఆమెకు లోకువే. ఈ రోజు ఆమె ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు ఏమి తెలియనట్లు దిష్టి బొమ్మలా కూర్చోన్నారని, ఆయన నిజంగానే రాష్ట్ర సమైక్యత కోరుకుంటున్నట్లయితే వెంటనే రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు.   వైకాపాలో కనీసం కార్యకర్తకూడా కాని ఆమె యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నవ్యక్తిని పట్టుకొని దిష్టిబొమ్మ అనడం, రాజీనామా చేయమనడం చాల అనుచితం. ఆయన ఆ పదవిలో కొనసాగాలో వద్దో చెప్పడానికి కూడా ఆమెకు తగిన అర్హత, రాజకీయానుభవం లేవు. రాజకీయాలంటే కేవలం నోరు పారేసుకోవడం కాదనే సంగతి ఆమె తెలుసుకోవలసి ఉంది. తనకంటే వయసులో, రాజకీయాలలో అన్ని విషయాలలో ఎంతో అనుభవం కలిగిన వారి పట్ల ఆమె మాట్లాడుతున్నతీరు చాలా ఆక్షేపనీయంగా ఉంది.   కనీసం వారి అనుభవంత వయసు కూడా లేని ఆమె చిన్నాపెద్దా చూడకుండా నోటికి వచ్చినట్లు తూలనాడుతూ, దానినే రాజకీయాలనే భ్రమలో ముందుకు సాగుతోంది. సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర మొదలుపెట్టిన ఆమె, కేవలం అందుకు సంబందించిన మాటలు మాట్లాడితే ఎవరయినా హర్షిస్తారు. లేదా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించావచ్చో చెప్పినా ప్రజలు హర్షిస్తారు. లేకుంటే ప్రజలను తమ పార్టీకే ఓటేసి గెలిపించమని నేరుగా కోరినా అర్ధం ఉంది. కానీ, ప్రజలను ఆకట్టుకోవడం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.

వైఎస్ జగన్ అక్రమాస్తులపై సీబీఐ మరో మూడు చార్జ్ షీట్లు

  జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో విచారణ ముగించేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన నాలుగు నెలల గడువు మొన్న 8వ తేదీతో ముగిసింది. అందువల్ల సీబీఐ తన విచారణ పూర్తి చేసి తుది చార్జ్ షీట్ దాఖలు చేస్తుందని అందరూ ఆశిస్తుంటే, సీబీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంగళవారం నాడు మరో మూడు కొత్త చార్జ్ షీట్స్ దాఖలు చేసింది. దీనితో సీబీఐ ఇంత వరకు మొత్తం 8 చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లయింది. త్వరలో మరో రెండు దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.   ఇక సీబీఐ ఈ రోజు పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ మరియు భారతి సిమెంట్స్ పై వేర్వేరుగా దాఖలుచేసిన మూడు చార్జ్ షీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ని ఏ1 నిందితుడిగా పేర్కొంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడు సిమెంట్ కంపెనీలకు కాగ్నానదీ జలాలను విరివిగా వాడుకోవడానికి అనుమతులు, అదేవిధంగా వివద జిల్లాలలో సున్నపురాయి గనులు, వాటిని తవ్వుకోవడానికి అనుమతులు మంజూరు చేసినందుకు ప్రతిగా, ఈ మూడు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కి చెందిన జగతి పబ్లికేషన్స్ మరియు కార్మెల్ ఏసియా కంపెనీలలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టడం లంచంమే అవుతుందని ఆరోపిస్తోంది.   ఇక ఈ రోజు సీబీఐ వేసిన చార్జ్ షీట్లలో భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యకి, మాజీ గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి సీబీఐ ఉచ్చుబిగిస్తుందని మీడియాలో వస్తున్న ఊహాగానాలకు విరుద్దంగా వారిద్దరి పేర్లను చార్జ్ షీట్ల నుండి మినహాయించడం వారిరువురికీ చాలా ఉపశమనం కలిగించింది.   ఇక సీబీఐ తన విచారణ పూర్తి చేసినా చేయకున్నా జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిలుకి దరఖాస్తు చేసుకోవచ్చునని నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టు చెప్పినందున అతను త్వరలో బెయిలుకు దరఖాస్తుకు చేసుకోవచ్చును. మూడు రోజుల క్రితమే కోర్టు ఆయన రిమాండ్ ఈ నెల 20వరకు పొడిగించింది. గనుక ఆ సమయానికి ఆయన తన బెయిలు దరఖాస్తును కోర్టుకి సమర్పించవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అతనికి బెయిలు మంజూరు అవుతుందా లేదా అనేది ప్రశ్న.   ఒకవేళ అతను బెయిలుపొంది బయటకు రాగలగితే, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మారవచ్చును. సమైక్యాంధ్ర నినాదంతో దూసుకుపోతున్న ఆయన పార్టీలోకి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దూకే అవకాశం ఉంది.

తెలంగాణ నిజం...సమైక్యాంధ్ర ఒక కల

      తెలంగాన అనేది ఒక నిజం … సమైక్యాంధ్ర అనేది ఓ కల. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. దాని గురించి ఎలాంటి అనుమానమూ లేదు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన కలలు నిజం కావు అని కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ అన్నారు. తెలంగాణ నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.     పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే వస్తుందని, హైదరాబాద్ విషయంలో కేంద్రం ఓ స్పష్టమయిన అవగాహనతో ఉందని అన్నారు. అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి అన్నది స్పష్టం చేయాలని, త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తుందని, ఈ నెల 15న జరిగే తెలంగాణ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలోని బహిరంగ సభ విషయం ఖరారు చేస్తామని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల సభలో జేసీ దివాకర్ రెడ్డి

      ఒక సమైక్యాంధ్ర ప్రయత్నాలు, మరో వైపు రాయల తెలంగాణ ప్రయత్నాలు ఏదయితే అదయింది ఏదో ఒక ప్రయత్నం నెరవేరితే చాలు అన్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తరువాత జేసీ దివాకర్ రెడ్డి ఎలాగయినా రాయల తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.     సమైక్యాంధ్ర కొరకు ప్రయత్నిస్తున్న మంత్రి సాకె శైలజానాథ్ కు భంగపాటు తప్పదని, రాయల తెలంగాణ కొరకు కలసి రావాలని, ఆయన రాకున్నా కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలను కలుపుకుని రాయల తెలంగాణ కోరతానని జేసీ చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఏపీఎన్జీఓల సభ విజయవంతం అయినప్పుడు జేసీ ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పుడు తాజాగా రాయల తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఏకంగా సీఎల్పీలో కాంగ్రెస్ తెలంగాణ నేతల సమావేశానికి వెళ్లి కోరారు. అయితే వారు దానికి నిరాకరించారు. మా రాష్ట్రానికి మీరు గవర్నర్ గా రావాలని కోరారు. ఈ సంధర్భంగా జేసీ జై ఆంధ్రప్రదేశ్ నినాదాలు ఇవ్వగా తెలంగాణ నేతలు జై తెలంగాణ నినాదాలు ఇచ్చారు.

ఎపీ ఎన్జీవోల సభకి తెలంగాణా నాయకుల సహకారం!

      సెప్టెంబర్, 7, 2013 న హైదరాబాద్ లోని L.B.స్టేడియంలో ఎపీ ఎన్జీవోలు సభ పెట్టుకుంటే దానికి తమంతా ఎంతో సహకరించమని తెలంగాణా నాయకులు అంటున్నారు. వారి సహకారం లేకపోతె ఆ సభ అంత ఘనంగా జరిగి వుండేది కాదని అంటున్నారు. అలా తాము సహకరిస్తే సభ పెట్టుకొని తెలంగాణా వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనీ, నీచమైన భాషని తమ ప్రసంగాలలో ఉపయోగించారనీ అంటున్నారు. తెలంగాణా నాయకులు ఏ విధంగా ఎపీ ఎన్జీవోల సభ జరగడానికి సహకరించారు? దానిని సీమాంధ్ర ఉద్యోగులు ఏ విధంగా దుర్వినియోగపరిచారు?..దీనిపై మా పాఠకుల కోసం ఓ చర్చని లేవదిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొని మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి.

నిర్భయ కేసులో దోషులను నిర్దారించిన కోర్టు

  గత ఏడాది డిశంబర్ 16న డిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసుపై విచారణ జరుపుతున్నడిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్, ముకేష్ సింగ్ మరియు పవన్ గుప్తాలను ఈ రోజు దోషులుగా నిర్దారించింది. వారికి రేపు శిక్షలు ఖరారు అయ్యే అవకాశముంది. కొత్తగా అమలులోకి వచ్చిన నిర్భయ చట్టం ప్రకారం వారికి మరణ శిక్ష లేదా యావత్ జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. నిందితులలోఒకడయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ కొన్ని నెలల క్రితం తీహారు జైలులో ఆత్మహత్య చేసుకొన్నాడు. మరో బాల నేరస్తుడికి బాల నేరస్తుల చట్టం ప్రకారం ఇటీవలే మూడేళ్ళ జైలు శిక్ష విధించబడింది.   ఒకవేళ రేపు కోర్టు వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటిస్తే, ఆ నలుగురు నేరస్తులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా మరింత సమయం పొందవచ్చును. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా వారికి అవే శిక్షలు ఖరారు చేసినట్లయితే, ఆ తరువాత రాష్ట్రపతి దయాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మరికొంత సమయం పొందవచ్చును. బహుశః ఈ ప్రక్రియ అంత ముగిసేసరికి మరో ఏడాది, రెండేళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు.

యుపి అల్లర్లలో 30 మంది బలి

  గత నాలుగు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మతఘర్షనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ అల్లర్లలో 30 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది.  పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రమిస్తుంది. లోకల్‌ పోలీస్‌తో పాటు వేల సంఖ్యలో సైన్నాని కూడా అల్లర్లు అదుపు చేయడానికి వినియోగిస్తున్నారు. అవసరమయితే కాల్పులు జరపడానికి కూడా పోలీస్‌ శాఖకు అధికారాలు ఇచ్చారు. ఈనేపధ్యంలో ప్రభుత్వం పై ప్రతి పక్షాల వివర్శలు కూడా ఎక్కువయ్యాయి. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ, బీఎస్పీ సీఎం అఖిలేష్ రాజీనామా చేయాలని  డిమాండ్ చేశాయి. దీంతో అఖిలేష్‌ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలం అయిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ బిఎల్‌ జోషి కేంద్రానిరి నివేదిక పంపారు. ఈ పరిస్థితుల్లో అల్లర్లను అదుపు చేయటంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలను ఎదుర్కొవటం కూడా అఖిలేష్‌ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

లక్ష మందితో స్వాభిమాన్ సదస్సు

      త్వరలో హైదరాబాద్‌లో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. టీ. ఉద్యోగులతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మందితో తెలంగాణ స్వాభిమాన్ సదస్సు నిర్వహించాలని సమావేళంలో తీర్మానించినట్లు చెప్పారు.   ఈ నెల 12వ తేదీన జరగనున్న జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సదస్సుపై వివరాలు ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని ఆయన పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకునే తెలంగాణ సిద్ధించే వరకు పోరాటం కొనసాగుతుందని, వివిద పద్ధతుల్లో ఉద్యమం ఉంటుందని ఆయన తెలిపారు.  ఏపీఎన్జీఓల సభ అంత గొప్పదేమి కాదని ఆయన అన్నారు.కాంగ్రెస్ పెద్దలకు పది జిల్లాల సంపూర్ణ తెలంగాణనే ప్రజలు కోరుకుంటున్నారని వివరించానని చెప్పారు.

సమైక్యాంద్ర కోసం సియం పాదయాత్ర..?

  ఆత్మగౌరవ యాత్రతో చంద్రబాబు, సమైక్య శంఖారావంతో షర్మిలలు వాళ్ల వాళ్ల పార్టీలకు మైలేజ్‌ పెంచుతుంటే ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా అదే ఆలోచనలో పడ్డాడు. తన కూడా ఏదో ఓ యాత్ర చేపట్టి సీమాంద్రలో పార్టీ పరువు కాపాడాలనుకుంటున్నాడు. ఇప్పటికే పాదయాత్ర  చేయడానికి నిర్ణయించుకున్న కిరణ్‌ ఆ విషయాన్ని పలువురు సీనియర్‌ మంత్రుల ముందు కూడా ప్రస్తావించారట. అయితే దాదాపు అందరు మంత్రులు కిరణ్‌ పాదయాత్ర ఆలొచనకు మద్దతు తెలుపగా కొంతమంది మంత్రులు మాత్రం వ్యతిరేఖించారట. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయంలో ముఖ్యమంత్రి కూడా గాగమే కనుక సియం పాదయాత్ర చేయటం వల్ల పెద్దగా ఒరిగేదేమి లేకపోగా జనాలనుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు కొందరు మంత్రులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సియం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

రెండుగా విడిపోనున్న బీజేపీ

      రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నోట్ కు మంత్రి వర్గం ఆమోదం వేయగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రెండుగా విడిపోనుంది. తెలంగాణ,సీమాంద్ర లకు వేర్వేరుగా శాఖలను ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్దమవుతోంది. సీమాంధ్రకు, తెలంగాణకు ప్రత్యేక కార్యవర్గం, అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులను నియమించనున్నారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినేట్ నోట్ కు మంత్రివర్గ ఆమోదం లభించాక ఇరుప్రాంతాల్లో బీజేపీ రెండు శాఖలను ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు ద్వంద విధానాలు పాటిస్తున్నాయని, కానీ బీజేపీది ఎప్పటికి ఒకే మాట అని ఆయన అన్నారు. పార్టీల ద్వంద విధానాల మూలంగా రెండు ప్రాంతాలలో పరిస్థితులు అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

వైఎస్ఆర్ దొంగల పార్టీ

        వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మూడు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు కుట్రలు చేస్తున్నాయి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ అభివృద్ది చేసే పార్టీ....ఈసారి టిడిపి అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.   కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలంతా తెలుగుదేశం పార్టీతో కలిసి రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు దాడులకు తెగబడుతున్నాయని, ఆ పార్టీలు దాడులు చేసి తమ పార్టీని విమర్శిస్తున్నారని చంద్రబాబు తప్పపట్టారు. నిజానికి చంద్రబాబు సీమాంద్ర ప్రజల ఆందోళనకు మద్దతు పలకడానికి గాను పర్యటన చేస్తున్నారు. కాని ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలా?వద్దా అన్నదానిపై నేరుగా మాట్లాడలేని పరిస్థితి ఉంది.

వేర్పాటువాదులను సమైక్య పరచిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’

  ఏపీ యన్జీవోలు ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ పెద్ద గొప్ప సభేమి కాదని కేసీఆర్ అన్నారు. నిజంగా ఆయన చెప్పినట్లు అది అంత గొప్పసభ కాకపొయుంటే, ఆయన ఈ మాటే అని ఉండేవారే కారు.   ఏపీ యన్జీవోల సభ ప్రభావం వల్లనే ఆయన నిన్నడిల్లీ నుండి తిరిగి రాగానే హుటాహుటిన తెరాస, టీ-జేఏసీ, టీ-ఎన్జీవో నేతలతో సమావేశం అయ్యి, ఈ నెల 22న హైదరాబాదు యన్టీఆర్ స్టేడియంలో టీ-జేఏసీ అధ్వర్యంలో ‘తెలంగాణ స్వాభిమాన్ సదస్సు’ పేరిట లక్షమంది ప్రజలతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి, ఏపీ యన్జీవోల సభకు జవాబు చెప్పాలని నిశ్చయించుకొన్నారు.   రాష్ట్ర విభజన, హైదరాబాదు అంశాలపై ఏపీ యన్జీవోల సభ ఇచ్చిన విస్పష్టమయిన సందేశం డిల్లీ పెద్దల ఆలోచనలను ప్రభావితం చేస్తుందనే భయంతోనే ఈ భారీ సభకు సిద్దం అవుతున్నారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దీనికి మరో కారణం ఏమిటంటే, దాదాపు లక్షమంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు వ్యతిరేఖంగా హైదరాబాదులో సభ దిగ్విజయంగా నిర్వహించడం వలన, దెబ్బతిన్నతెలంగాణా అహం చల్లార్చే ప్రయత్నమేనని చెప్పవచ్చును.   ఇంత కాలంగా ఎడమొఖం పెడమోఖంగా ఉన్న కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ లను, టికెట్ల విషయంలో తమను పక్కన పెట్టినందుకు తెరాస దూరమయిన టీ-ఎన్జీవో, జేఏసీ నేతలు కూడా ఏపీ యన్జీవోల సభ కారణంగానే తమ భేదాభిప్రాయాలను పక్కన బెట్టి, మళ్ళీ చాలా రోజుల తరువాత నిన్నకేశవ్ రావు ఇంటిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.   ఇక ఏపీ యన్జీవోల సభ రాష్ట్ర విభజన కోరుతున్నటీ-నేతలందరినీ మళ్ళీ ఏకత్రాటి పైకి తేగా, నెలరోజులుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు, సమ్మెచేస్తున్నసీమంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు కొత్త ఉత్సాహం కలిగించింది. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకు ఆత్మవిశ్వాసం పెంచింది.   తెలంగాణా, సమైక్యవాదులపై ఇంత ప్రభావం చూపిన ఏపీ యన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను కేసీఆర్ తేలికగా కొట్టిపడేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటనతో రాజకీయ నిరుద్యోగులుగా మారిన కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ లిరువురూ ఏపీ యన్జీవోలకు కృతజ్ఞతలు తెలుపుకోక తప్పదు.  

బాబుకు జూనియర్‌ అభిమానుల షాక్‌

  కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్‌ విగ్రహానిరి పూలమాల వేయడానికి సమయం చాలదంటూ చంద్రబాబు వ్యాఖ్యనించార్న వార్తలతో జూనియర్‌ అభిమానులు ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సోమవారం కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడం మండలం, మెట్టగూడెం చేరుకున్న బాబును ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా అభిమానులు కోరారు. సెక్యూరిటీ, సమస్యలతో పాటు ఇతర కారణాలతో చంద్రబాబు అందుకు నిరాకరించటంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ నేతలు కలగజేసుకొని పరిస్థితిని వివరించటంతో అభిమానులు శాంతించారు. అంతకు ముందు చంద్రబాబు మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలోవినాయక పూజలో పాల్గొన్నారు.

తెలంగాణ వాదుల స్వాభిమాన స‌ద‌స్సు

  ఏపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ ఘ‌న విజ‌యం సాదించ‌టంతో ఇప్పుడు అదే స్ధాయిలో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తుంది తెలంగాణ రాజ‌కీయ జేఎసి. ఈ నెల 22న ఎన్టీఆర్ స్టేడియంలో అవ‌గాహ‌నా స‌ద‌స్సు పేరుతో ఓ స‌భ నిర్వహించ‌నున్నారు. ఈ నెల 12న జ‌ర‌గ‌నున్న జెఎసి విస్తృత స్థాయి స‌మావేశంలో ఈ స‌భ‌కు సంబందించి పూర్తి వివ‌రాలు వెల్లడించానున్నారు. చాలా రోజుల ఢిల్లీ ప‌ర్యట‌న త‌రువాత హైద‌రాబాద్ చేరుకున్న కెసిఆర్ వివిద ప‌క్షాల నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం కెకె స‌మావేశం అయ్యారు కెసిఆర్‌. ఈ స‌మావేశంలో 22న త‌ల‌నెట్టిన స‌భ‌కు సంబందించిన చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌భ‌కు స్వాభిమాన స‌ద‌స్సు పేరు  పెట్టారు. దీంతో పాటు 12న జ‌రిగే విస్తృత స్థాయి స‌మావేశానికి కెసిఆర్ హాజ‌ర‌వుతార‌ని ప్రక‌టించారు.

మోడీతో బీజేపీకి లాభనష్టాలు-ఫిఫ్టీ-ఫిఫ్టీ

  మోడీ తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 2017వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలనుకొంటున్నాననే ఒకే ఒక చిన్నస్టేట్మెంటుతో ఇంత కాలంగా తన ప్రధాని అభ్యర్ధిత్వాన్నిప్రకటించడానికి వెనుకాడుతున్నబీజేపీని వెంటనే తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు.   దీని వల్ల బీజేపీకి లాభము, నష్టము కూడా సరిసమానంగా ఉండవచ్చును. బీజేపీ మోడీ అభ్యర్ధిత్వాన్నిఒకసారి ఖరారు చేయగానే పార్టీలో, బయట ఆయనని వ్యతిరేఖించే శక్తులు అన్నీ ఏకమయ్యే అవకాశముంది. అప్పుడే యుపీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే ప్రయత్నాలను ఖండిస్తూ, రాహుల్ గాంధీకే ఆ అర్హత ఉందని అన్నారు. మోడీని వ్యతిరేఖిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ కు మరింత దగ్గర కావచ్చును. అందువల్ల మోడీ ఆలోటును భర్తీ చేసుకొనేందుకు దక్షిణాదిన తెదేపా, అన్నాడీయంకే వంటి కొత్త స్నేహితులను వెతుకోక తప్పదు.   అదేవిధంగా, రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని తపిస్తున్నకాంగ్రెస్ పార్టీ, మోడీని నిలువరించేందుకు తనకు అందుబాటులో ఉన్నప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఇప్పటికే మోడీని 2002 గోద్రా అల్లర్లతో బలంగా ముడివేసిన కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ లో జరిగిన భూటకపు ఎన్కౌంటర్ల కేసుతో మోడీని దెబ్బతీయాలని చూస్తోంది. పనిలోపనిగా బీజేపీలో మోడీకి వ్యతిరేఖ వర్గాన్ని వెనుక నుండి ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.   ప్రధాని పదవిపై ఆశలేదంటూ మోడీ మాట్లాడిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదేరకమయిన ప్రకటన చేయడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు అన్ని విధాల తగినవాడని, అతని నాయకత్వంలో పనిచేయడానికి తనకేమి అభ్యంతరం లేదని ప్రకటించడం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మార్గం సుగమం చేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయని అర్ధం అవుతోంది.   ఇక బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగానే, ఆయన పారిశ్రామిక, వ్యాపార దృక్పధాన్ని మెచ్చుకొంటున్న దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ ఆయనకు మద్దతు తెలుపుతారు గనుక అది బీజేపీ విజయావకాశాలను చాల మెరుగు పరుస్తుంది. అదేవిధంగా పార్టీ నిర్ణయంతో ఆయన ద్విగుణీకృత ఉత్సాహంతో, మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారు. దేశ ప్రజలపై ముఖ్యంగా ఆయన నాయకత్వాన్ని కోరుకొంటున్న వారిపై ఆ ప్రభావం తప్పకుండా పడి, అది బీజేపీకి మేలు చేకూర్చవచ్చును.