అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణం

  ఇరాక్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తాము రెండేళ్ళ క్రితం కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ పోలీని తలనరికి చంపేశారు. జర్నలిస్టు తల నరకక ముందు ఫొటోని, తల నరికిన తర్వాత ఫొటోని, వీడియో కూడా మీడియాకి విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. ‘అమెరికాకు ఓ సందేశం’ అనే పేరుతో తీవ్రవాదులు ఈ వీడియో పోస్ట్ చేశారు. నారింజ రంగు దుస్తులు ధరించిన ఫోలీని ఓ ఎడారి ప్రాంతంలో మోకాళ్ల మీద నిలబెట్టి, పక్కనే ఓ ఉగ్రవాది తలకు ముసుగు వేసుకుని నల్ల దుస్తుల్లో ఉన్నాడు. సాధారణంగా నారింజరంగు దుస్తులను అమెరికా సైన్యం అదుపులో ఉండే ఖైదీలకు వేస్తారు. అతడి పక్కనే ఉన్న ఉగ్రవాది ఇంగ్లీషులో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు జేబులోంచి కత్తి తీసి, ఫోలీకి మరణశిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు. ఇరాక్లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించడంతో అందుకు ప్రతీకారంగా ఈ శిక్ష వేస్తున్నామన్నారు. ఫోలీ కూడా తన చావుకి అమెరికాయే కారణం అని చెప్పినట్టుగా వీడియోలో వుంది. తర్వాత యూట్యూబ్ ఈ వీడియో తొలగించింది.

షర్మిలని విడుదల చేయండి: కోర్టు

  ఆత్మహత్యాయత్నం నేరం మీద అరెస్టు చేసిన మణిపూర్ పౌర హక్కుల మహిళా నేత ఇరోమ్ షర్మిల చానును విడుదల చేయాలని స్థానిక సెషన్స్‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రంలో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ మణిపూర్ ఐరన్ లేడీగా ఇరోమ్ గత 14 ఏళ్లగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దాంతో ఆమె మీద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ముక్కుద్వారా ద్రవ ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. జుడీషియల్ కస్టడీలో ఉన్న షర్మిలను తక్షణం విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇరోమ్ షర్మిల విషయంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును కోర్టు తప్పుపట్టింది.

కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా లేదు.. తేల్చేసిన స్పీకర్

  లోక్‌సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. అయితే ఆ డిమాండ్‌ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. సభ నియమాలను అధ్యయనం చేసిన తరువాత ఆమె కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ అందింది. లోక్‌సభలో తమ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పీకర్ మహాజన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ అంశంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ అభిప్రాయాన్ని స్పీకర్ తెలుసుకున్నారు. లోక్‌సభలో 282 సీట్లు గెలుచుకున్న బీజేపీ తరువాత 44 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత హోదాకోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే అవసరమైన 10 శాతం సీట్లకు 11 స్థానాల దూరంలో కాంగ్రెస్ ఉన్నందున కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ప్రస్తుత నియమాలను మార్చాల్సి ఉంటుందని, ఇది సభలో జరగాల్సిన వ్యవహారమని ఆమె అన్నారు.

సింగపూర్‌కి చేరుకున్న కేసీఆర్ బ‌ృందం

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయన నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. కేసీఆర్‌తోపాటు మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ముఖ్యంగా ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి కేసీఆర్ సింగపూర్ వెళ్ళారు. 22, 23 తేదీలలో ఈ సమ్మేళనం జరగనుంది. కేసీఆర్ 24వ తేదీన తిరిగి వస్తారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు. ఆరు పదులు దాటిన కేసీఆర్ తన జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్ళారు. గతంలో అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ దేశం దాటి వెళ్ళలేదు. మొన్నటి వరకూ ఆయనకు పాస్ పోర్ట్ లేదని, మూడు రోజుల క్రితమే ఆయనకి పాస్ పోర్ట్ వచ్చింది.

అసెంబ్లీలో యనమల బడ్జెట్ ప్రతిపాదనలు

  రాష్ట్ర విభజన తర్వాత రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమై బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. అనంతరం బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టారు. సభలో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ పత్రాలను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పదేళ్ళ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆయన తెలిపారు.

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..

  పాకిస్థాన్ హద్దులు మీరుతోంది. నోటికొచ్చినట్టు వాగుతోంది. చివరికి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్న మాట పాపిష్ఠి పాకిస్థాన్ నోటి నుంచి వచ్చింది. ఇంతకాలం జమ్ము-కాశ్మీర్‌ని వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు ఎవర్ని చూసుకునో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్న మాటలు మాట్లాడుతోంది. కాశ్మీర్‌లోని వేర్పాటువాదులైన హురియత్ నాయకులతో భారతదేశంలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో భారత్ ఆగ్రహించింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో పాకిస్థాన్‌ ఈ పొగరుబోతు మాటలు మాట్లాడుతోంది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం అస్లాం స్పందిస్తూ, ‘‘కాశ్మీర్ వేర్పాటు వాదులతో మాట్లాడటం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కాదు. చర్చల విరమణకు భారతదేశం దీన్నొక సాకుగా తీసుకుంటోంది. భారతదేశం అనుకుంటున్నట్టుగా కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదు. అదొక వివాదాస్పద భూభాగం. దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. అలాగే కాశ్మీర్ అంశం ఎంతమాత్రం భారత అంతర్గత సమస్య కాదని, అది ముమ్మాటికీ అంతర్జాతీయ సమస్యేనని వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ తేల్చిచెప్పారు.

రవిశాస్త్రి మార్పు మంచిదే...

  భారత క్రికెట్ జట్టు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియామకం మంచిదేనని, దానివల్ల ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. ఈ మార్పు భారత క్రికెట్‌కు మంచిదేనని అన్నారు. అయితే ఇంగ్లండ్‌తో గత మూడు టెస్టుల్లో ఎదురైన పరాభవాల నేపథ్యంలో కెప్టెన్ ధోనిని, కోచ్ ఫ్లెచర్‌ను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లెచర్ భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడడం తగదని అన్నారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్, కోచ్‌లకు తెలిపాను. వారిద్దరూ దీనికి అంగీకరించారు. ప్రతీ విషయాన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఏ విషయంలోనైనా ఆయన నా సహాయం కోరితే సంతోషంగా అంగీకరిస్తాను’ అని పటేల్ అన్నారు.

నిజమే... ఎల్లంగౌడ్ లొంగిపోయాడు...

  నకిలీ నోట్ల చెలామణీ ముఠా నాయకుడు, హైదరాబాద్‌ శివార్లలో ఒక కానిస్టేబుల్‌ని కాల్చిచంపిన ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేయడంలో పోలీసుల ప్రతాపం ఏమీ లేదని, ఎల్లంగౌడ్‌ తానే లొంగిపోయాడని తెలుస్తోంది. ఎల్లంగౌడ్ హైదరాబాద్ శివార్లలో కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన తర్వాత అతగాడిని పట్టుకోవడానికి ఆరు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందాలేవీ ఎల్లంగౌడ్‌ని పట్టుకోవడంతో ప్రగతి సాధించలేదని తెలుస్తోంది. చివరికి ఒఖ రాజకీయ నాయకుడి ద్వారా ఎల్లంగౌడ్ స్వయంగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. మొదట ఎల్లంగౌడ్‌ని తామే అరెస్టు చేశామని ప్రకటించుకున్న పోలీసులు ఆ తర్వాత ఎల్లంగౌడ్‌ లొంగిపోయాడని తెలిపారు.

గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం..

  మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణులు పొగత్రాగితే వారికి పుట్టే పిల్లలతో పాటు, వారి పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా హాని జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలు గర్భంలో ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవళ్ళు, మనవరాళ్ళ జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ఎముకలు, కండరాలు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశ: ఉందని తెలిపారు. మగ పిల్లలు యవ్వన దశలో వారి కండరాలు పెరగాల్సిన దానికంటే మరింత ఎక్కువ పెరిగి దుష్రభావాలు బయటపడతాయని, అదే అమ్మాయిలైతే పెరగాల్సిన ఎత్తుతో పాటు, బరువులో తీవ్రమైన వ్యత్యాసం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

చంద్రబాబు, ఎన్టీఆర్ సూపర్: కేసీఆర్ ప్రశంస

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, హీరో జూనియర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి పొగిడారు. కేసీఆర్ మరొకరిని పొగడ్డమేంటి... పైగా చంద్రబాబుని పొగడ్డమేంటని అనుకుంటున్నారా? ఇది నిజంగానే నిజం. కేసీఆర్ వీరిద్దరినీ పొగిడింది సమగ్ర సర్వే విషయంలో! చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కు చెందినవారైనా సమగ్ర సర్వేలో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు వివరాలు అందజేశారని కేసీఆర్ ప్రశంసించారు. అయితే సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారిని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో నివసిస్తూ.. తాగునీరు, లైట్లు, రోడ్లు తదితర ప్రభుత్వ సౌకర్యాలను వాడుకుంటూ సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించడం సామాజిక నేరమని విమర్శించారు. తెలంగాణలో అతిథులుగా, టూరిస్టులుగా ఉండాలని భావిస్తున్నవారే సర్వేలో పాల్గొనలేదని కేసీఆర్ చురకలు వేశారు. ఈ చురకలు సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని పవన్ కల్యాణ్, విజయశాంతి ఉద్దేశించి వేసినవేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్రం కన్ను: పీటీఐ

  తెలంగాణ ప్రభుత్వంపై నిర్వహించిన సమగ్ర సర్వే మీద కేంద్ర ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించిందని ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ ఓ కథనాన్ని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాల వివరాల జాబితాను కేంద్రం అడిగి తెలుసుకునే అవకాశం ఉందని పీటీఐ తన కథనంలో పేర్కొంది. తెలంగాణ సమగ్ర సర్వే అంశంలో అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోబోతున్నట్టు ఆ కథనంలో పీటీఐ వెల్లడించింది. సీమాంధ్ర ప్రజల్లో సమగ్ర సర్వే అనేక సందేహాలను రేకేత్తిస్తున్న నేపథ్యంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెన్షన్ సృష్టించే అవకాశం లేదని కేంద్ర ఆధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు... ఇదేం సర్వే?

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి విమర్శలు సంధించారు... అవి..   1. మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు. మా కుటుంబ వివరాలు నమోదు చేసుకోలేదు. ఇదేం సర్వే?   2. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టలేదు.   3. ప్రభుత్వ లక్ష్యమేంటో అర్థం కాని సర్వే ఇది.   4. పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించలేదు. హైదరాబాద్‌లో అద్దెకి వుంటున్న వారి వివరాలు కూడా తీసుకోలేదు.   5. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలను ఓల్డ్ సిటీలో అమ్ముతున్నారు. ఈ విషయాన్ని నేను నిరూపించడానికి సిద్ధం.   6. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది?

సమగ్ర సర్వే సూపర్‌హిట్: కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తాయని ఆయన అన్నారు. సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వున్న తెలంగాణ ప్రజలు కూడా వచ్చి సమగ్ర సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజలు తనకు ఇలాగే సహకరిస్తే వారు కోరుకున్న బంగారు తెలంగాణను వారికి అందిస్తానని కేసీఆర్ అన్నారు. జిల్లాలలో 94 శాతం, హైదరాబాద్లో 88 శాతం సర్వే పూర్తయిందని, మొత్తమ్మీద హైదరాబాద్‌లో కోటి 20 లక్షల మంది వున్నట్టు తేలిందని ఆయన చెప్పారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా తన కుటుంబాల పేర్లు నమోదు చేసుకోలేకపోతే, వారికి మరో అవకాశం ఇస్తారని, ఆ వివరాలు రేపు తెలియజేస్తారని చెప్పారు.

విజయవాడ తాత్కాలికం శాశ్వతం కాదు...

  విజయవాడ తాత్కాలిక రాజధాని అని, కొంతకాలం తర్వాత విజయవాడ పూర్తి స్థాయి రాజధాని అవ్వొచ్చు, కాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అక్కడ భూముల ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని చెప్పారు. విజయవాడలో ప్రభుత్వ భూములు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని, మొత్తం 500 ఎకరాలలోపే భూమి అందుబాటులో ఉందన్నారు. కర్నూలుకు 10 కిలోమీటర్ల పరిధిలో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇతర ఏ జిల్లా కేంద్రంలోనూ ఇంత భూమి అందుబాటులో లేదని ఆయన తెలిపారు. కర్నూలును రాజధాని చేయాలని తాను అడగటం లేదన్నారు. రాజధానిపై కసరత్తు పూర్తి అయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని కె.ఇ.చెప్పారు.

పాకిస్థాన్‌తో మాటల్లేవ్...

  ఈనెల 25న భారత్, పాకిస్థాన్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. అయితే కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడం ఈ చర్చలకు విఘాతం కలిగించింది. హురియత్ నేతలతో పాకిస్థాన్ సంప్రదింపులు జరపడం మీద భారత్ సీరియస్ అయింది. దాంతో పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. మీకు ఇండియాతో స్నేహం కావాలా? వేర్పాటువాదులతో అనుబంధం కావాలా అని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌కి ఫోన్ చేసి అడిగినప్పటికీ ఆయన హురియత్ నేత షబ్బీర్ షాతో సమావేశమయ్యారు. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వేర్పాటువాదులతో సమావేశం కావడం రెచ్చగొట్టే చర్యేనని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో జగన్‌ని రఫ్ఫాడేసిన మంత్రులు...

  ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు జగన్‌కు పట్టడం లేదని ఆయన అన్నారు. అలాగే మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి కూడా జగన్‌ని విమర్శల వర్షంలో తడిపేశారు.