సింగపూర్‌కి చేరుకున్న కేసీఆర్ బృందం
posted on Aug 20, 2014 @ 11:21AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయన నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. కేసీఆర్‌తోపాటు మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ముఖ్యంగా ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి కేసీఆర్ సింగపూర్ వెళ్ళారు. 22, 23 తేదీలలో ఈ సమ్మేళనం జరగనుంది. కేసీఆర్ 24వ తేదీన తిరిగి వస్తారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు. ఆరు పదులు దాటిన కేసీఆర్ తన జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్ళారు. గతంలో అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ దేశం దాటి వెళ్ళలేదు. మొన్నటి వరకూ ఆయనకు పాస్ పోర్ట్ లేదని, మూడు రోజుల క్రితమే ఆయనకి పాస్ పోర్ట్ వచ్చింది.