రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు.. హైకోర్టు

  నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇంతకుముందు కోర్టు షరతులతో కూడిన బెయిల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజక వర్గం దాటి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తన విధించిన షరతులను సడలించాలంటూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్‌ ఆదేశాల్లో సడలింపునిచ్చింది. హైదరాబాద్‌తో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని తీర్పునిచ్చింది. కాని బయట ఎక్కడ కేసుకు సంబంధించి అంశాల గురించి మాట్లడకూడదని.. కేసుకు సంబంధించి సాక్ష్యులను ప్రభావితం చేసినట్లయితే షరతులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి సోమవారం సాయంత్రం ఏసీబీ కార్యలయానికి వచ్చి హాజరుకావాలని ఆదేశించింది. దీంతో రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించే సమావేశాల్లో రేవంత్ పాల్గొనే అవకాశం ఉంది.

ప్రకాశ్ రాజ్ మరో శ్రీమంతుడు

  మహేశ్ సినిమా శ్రీమంతుడి సినిమా ప్రభావం బాగానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీమంతుడి సినిమాలో మహేశ్ తన ఊరిని దత్తత తీసుకొని దాని అభివృద్ధికి పాటుపడుతాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తను తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ట్రస్ట్ పేరుతో తమిళనాడు, కర్ణాటకలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తనవంతు సాయం అందించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట్ మండలంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ మాట్లడుతూ కావాల్సినంత సంపాదించా. ఇక సమాజానికి ఏదైనా చేయాలి. సమాజం వల్లే వచ్చింది. తిరిగి సమాజానికే ఇచ్చేయాలి.. అదే నా సిద్ధాంతం అని చెప్పారు. అందుకే నావంతుగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని అన్నారు. పంటల్ని మెరుగైన పద్ధతుల్లో పండించడం ఎలా? అందుకు ట్రాక్టర్లు కావాలన్నా సైంటిఫి క్ మెదడ్స్ పై సలహాలు కావాలన్నా.. తనవంతుగా సాయం చేయనున్నానని ఏపీలో కూడా ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకునేందుకు పర్యటనలో ఉన్నానని చెప్పాడు ప్రకాష్ రాజ్ వివరించాడు. మొత్తానికి మన నటులు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలని నిరూపించుకుంటున్నారు. వీరిని ఆదర్శంగా ఇంకా కొంతమంది హీరోలు ముందుకువస్తే బావుంటుంది.

ఏపీ రాజధానిలో ఫ్లాట్ల హడావుడి

ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులో ఇప్పుడు ఫ్లాట్ల హడావుడి ఎక్కువైంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలు విజయవాడకు తరలివచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సాధ్యమైనంత వరకూ ఇక్కడే ఉండి పాలనా కార్యక్రమాలు చూసుకుంటున్నారు. దీంతో మరిన్ని శాఖలు ఇక్కడికే తరలివస్తున్నాయి. అయితే మొత్తం పాలన వ్యవస్థ ఇక్కడికే వస్తే దాదాపు పాతిక వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నగరంలో 400 అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.. దాదాపు 12 వేల ఫ్లాట్ల వరకు అందుబాటులోకి రానున్నాయి.. వీటితో పాటు మరో 10 వేల ఫ్లాట్ల వరకు ఉంటాయని అంచనా. అంతేకాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రైవేటు ఉద్యోగులు.. సాఫ్ట్ వేర్లు తదితరులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అంచనాల ప్రకారం బిల్డర్లు భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు హైదరాబాద్, బెంగుళూరులో స్థిరపడిన బిల్డర్లు కూడా ఇక్కడికి వచ్చి భవన నిర్మణాలు చేపడుతున్నారు.

అధికారులకు వైకాపా నేత చెవిరెడ్డి వార్నింగ్

  సాధారణంగా అధికారులు అందరూ ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. వారి వ్యక్తిగత రాజకీయ ఇష్టాఇష్టాలను పక్కనబెట్టి అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ దాని ఆదేశాలను విధిగా అమలుచేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. అందుకు వారిని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. కానీ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వాధికారులను తప్పు పడుతున్నారు. త్వరలోనే తెదేపా ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, త మ పార్టీ అధికారంలోకి రాగానే, తెదేపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు అందరిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అంతేకాదు వారిపై కక్ష తీర్చుకొంటామని హెచ్చరించారు.   ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను ఈవిధంగా బెదించడం చాలా తప్పు. నేరం కూడా. వైకాపా అధికారంలోకి వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. కానీ అధికారంలో లేనప్పుడే ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే ఏవిధంగా వ్యవహరిస్తుందో చెవిరెడ్డి ముందే చాటి చెప్పుకొన్నట్లయింది.

వైసీపీకి గాలి కౌంటర్

  టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చంద్రబాబు నివాసంపై వైఎస్సార్ పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.   ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం విజయవాడలోని తన నివాసంలో కాలుపెట్ట్టిన సంగతి తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అతిథి గృహంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ చంద్రబాబు ఉంటున్న అతిధి గృహం అక్రమంగా నిర్మించారని.. దానిలో చంద్రబాబు ఏలా ఉంటారని రాద్దాంతం చేస్తున్నారు. దీనికి గాలి చంద్రబాబు నాయుడు నివాసం కోసం తీసుకున్న భవనాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టారని కౌంటర్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆక్రమం అంటూ వైసీపీ నేతలు రాద్దాంతం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవ చేశారు. ప్రతి విషయాన్నీ విమర్శించడం సరి కాదని హితవు పలికారు. ఎపికి రాజధాని నిర్మించాలా వద్దా, పట్టిసీమ కావాలా వద్దా అనే విషయాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

జయలలిత రూట్లో చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూట్లోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో జయలలిత పేరు మీదిగా అమ్మ క్యాంటీన్లు ఉన్నట్టే ఏపీలో కూడా అన్న సంజీవినీ ఫుడ్ క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. ఈరోజు గ్రామీణాభివృద్ధిశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే అన్న సంజీవని ఫుడ్ క్యాంటిన్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే డ్వాక్రా మహిళల గురించి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు నైపుణ్యాన్ని పెంచుకోవాలని.. 2019 నాటికి డ్వాక్రా మహిళలు వంద శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో అక్షర వెలుగు లేదా అక్షర సంక్రాంతి పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

టీ సర్కార్ కు హైకోర్టు మొట్టికాయ

  తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేతిలో మొట్టికాయలు తినడం కొత్తేమి కాదు. ఇప్పటి వరకూ చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పుడు హెల్మెట్ ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది.   ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్‌ కొనుగోలు చేయాలన్న నిబంధనపై తెలంగాణ రవాణాశాఖ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్‌ కొనుగోలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.   ముందు హెల్మెట్ల వినియోగంపై ప్రజలలో చైతన్యం కలిగించాలని.. ఓ పదిహేను రోజుల పాటు హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆ తరువాత హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు తెలంగాణ రవాణాశాఖ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా హైకోర్టు ఖండించింది. ఎవరైనా కొత్త వాహనం తీసుకున్న వెంటనే హెల్మెట్ కూడా తీసుకోవాలన్న నిబంధనలో ఎలాంటి అర్థం లేదని తోసిపుచ్చింది. మరి ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిస్తుందో లేక ఇదే ధోరణి కొనసాగిస్తుందో చూడాలి.

కాలుపెట్టిన చంద్రబాబు.. భారీ వర్షం

ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోని తన నివాసంలోకి సతీసమేతంగా అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథి గృహాన్ని సీఎం నివాసంగా అధికారులు సర్వహంగులతో తీర్చిదిద్దారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సతీసమేతంగా ఇంట్లో కాలు పెట్టారు. ఇదిలా ఉండగా ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులూ ఆయన ఈ ఇంట్లోనే ఉండటంతో ఇంటి వద్ద, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఇంటిపనులు ఇంకా పూర్తి కాకుండానే ఆగష్టు 29న మంచిరోజు అని సీఎం సతీమణి భువనేశ్వరి ఇంట్లో పాలు పొంగించిన విషయం తెలిసిందే.

దావూద్ పని ముగించేస్తాం.. రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ను పట్టుకునేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా కేంద్రం ఇప్పటికే రాబట్టింది. దీనిలో భాగంగానే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని.. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతామని ఆయన పేర్కొన్నారు. ‘‘సామ, దాన, భేద, దండోపాయాల సంగతి తెలుసు కదా... ఇప్పటికే దావూద్ పై వీటిలో కొన్నింటిని ప్రయోగించామని తెలిపారు. పాకిస్థాన్ లో దావుద్ స్వేచ్చగా తిరుగుతున్నప్పటికీ అతడి ప్రతి కదలికపై మాకు పూర్తి సమాచారం ఉందని... ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. ఎప్పుడో అప్పుడు దావూద్ పని ముగించేస్తాం'' అని రాథోడ్ సంచలనం వ్యాఖ్యానించారు.

ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. దానం వార్నింగ్

  కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ నేతలకు.. కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని చెంప దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతల వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ‘‘టీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. లేకపోతే అధికారం పోయాక వారికీ ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని.. వారి ఆగడాలను ఇకపై సహించేది లేదని దానం ధ్వజమెత్తారు. కాగా బాలరాజు చర్యలపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.  

చంద్రబాబు ఫైర్.. ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా?

ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరుపై ఎప్పటికప్పుడు వారికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ అధికారులు సరిగ్గా విధులు నిర్వహించకపోతే చర్యలు తీసకోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. దీనిలో భాగంగానే విశాఖపట్నంలోని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు విశాఖపట్నం పర్యటన చేశారు. సుమారు 6 గంటల పాటు నగరాన్ని పర్యటించిన ఆయన అక్కడ మనోరమ థియేటర్‌ వద్ద కల్వర్ట్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంపై జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ను ‘‘ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా!?’’ అని అతనిపై మండిపడ్డారు. పారిశుద్ధ్య వ్యవస్థ, పోర్టు కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడేలా పోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయని, వీటికి తెరదించాలని స్పష్టం చేశారు. విధులు సరిగ్గా నిర్వహించకపోతే పాత చంద్రబాబుని చూస్తారు అని హెచ్చరించినట్టే చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మోడీ కి కొత్త అర్ధం చెప్పిన వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు మోడీ  మేకర్ ఆఫ్ డివలప్డ్ ఇండియా అంటూ కొత్త అర్ధాన్ని చెప్పారు. బదల్‌పూర్ - ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు హాజరయ్యారు. ఈసందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతు పైవిధంగా మోడీని ప్రశంసించారు. అంతేకాదు తాజాగా విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో ఫరీదాబాద్ ను చేర్చామని తెలిపారు.      అలాగే ప్రధాని మోడీ కూడా వెంకయ్య పైన ప్రశంసలు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు ప్రయోజనం కల్పించేందుకు ఆయన పలు ప్రధాన చర్యలు చేపడుతున్నారన్నారు. వెంకయ్య నాయకత్వంలో పలు మెట్రో ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. దేశంలో స్మార్ట్ సిటీల పధకానికి రూపకల్పన వెంకయ్య నాయుడేనని అన్నారు. అంతేకాదు వెంకయ్య నేతృత్వంలో వచ్చిన గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన వంటి పథకాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వెంకయ్య కృషి విజయవంతం కావాలని మోడీ ఆకాంక్షించారు.

నేను భౌతిక దాడులకు వ్యతిరేకం.. స్పందించిన పవన్

  భీమవరంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల గొడవ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య రగడగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన వివాదం ఆఖరికి కుల వివాదంలా తయారైంది. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు కొంతమంది పవన్ అభిమానులను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనతో దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి భీమవరంలో తమ అభిమానులు చేసిన చర్యలను పవన్ జీర్ణించుకోలేకపోతున్నానని.. తాను భౌతిక దాడులకు వ్యతిరేకమని చెప్పారు. అంతేకాదు, ఇలాంటి ఘటనలు మళ్లీ ఎప్పుడూ జరగకూడదని అభిమానులను కోరారు. ఇరువర్గాలకు చెందిన వారు పెద్దలతో చర్చించాలని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులుతోను, నరసారావుపేట ఎంపీ గోకరాజు గంగరాజుతోను ఈ సంఘటన గురించి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి పరిష్కరించాలని కోరారని తెలుస్తోంది.

ఓ.ఆర్.ఓ.పి. పై ప్రధాని మోడీ వివరణ

  ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు ఫరీదాబాద్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానంలో స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన సైనికులకి కూడా ఈ పధకం వర్తిస్తుందని స్పష్టం చేసారు. “గత 42సం.లుగా ఈ సమస్యని పరిష్కరించలేనివారు కూడా దీనిపై ప్రజలలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశం కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్న మన వీరజవాన్ల పట్ల మా ప్రభుత్వానికి చాలా గౌరవం ఉంది. అందుకే మేము అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేసి, ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానం అమలు చేస్తున్నాము,” అని తెలిపారు.   గత 84 రోజులుగా దీని కోసం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు తమ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారి ప్రతినిధి మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.   రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ, “మాజీ సైనికులు చిరకాల కోరిక అయిన ‘ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానం’ అమలుచేస్తున్నాము. ఏ విషయంలోనయినా నూటికి నూరు శాతం సమస్యలన్నీ ఒకేసారి తీరిపోవు. మాజీ సైనికులకు మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నామనే విషయాన్ని వారికీ తెలుసు. కనుక వారు ప్రభుత్వంతో సహకరించినట్లయితే మిగిలిన అన్ని సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చును,” అని అన్నారు.

మంత్రుల పనితీరుపై సర్వే..

  ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన వారికి అప్పుడప్పుడు చురకలు వేస్తునే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇక రాష్ట్ర మంత్రుల పనితీరుపై దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే *ప్రతినెలా మంత్రుల పనితీరుపై సర్వే *ప్రభుత్వ పథకాల తీరుపై కూడా సర్వే *సెప్టెంబర్ 9 నుంచి రైతు కోసం యాత్రలు *వ్యవసాయానికి పగటిపూట 7 గంటలపాటు నిరంతర విద్యుత్ *నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు వేగవంతం *భూసేకరణ పద్ధతుల్లో మచిలీపట్నం పోర్టుకు భూములు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. *1300 కోట్ల రూపాయలతో ఈ ప్రగతి ప్రాజెక్టును పీపీపీ మోడల్‌లో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.