ప్రస్తుతానికి కేటీఆర్ హరీశ్ లే సీఎంలు

  తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ ప్రస్తుతం చైనా టూర్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్దికి.. అక్కడ పెట్టబోయే పరిశ్రమలు.. వాటి అనుకూలతలు గురించి చైనా పారిశ్రామికవేత్తలకు చెప్పి వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేయడానికి ప్రయత్నించే పనిలో పడ్డారు. అయితే కేసీఆర్ పది రోజుల చైనా పర్యటనలో ఉండే ఇక్కడి పరిపాలనా బాధ్యతలు ఎవరు చూస్తున్నారు? ఈ పశ్నకు సమాధానం.. కేసీఆర్ తనయుడు.. ఐటీ మంత్రి కేటీఆర్.. నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఈ బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు  హరీష్ రావు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుండగా మరోవైపు కేటీఆర్ పరిపాలన కార్యకలాపాల్లో ఫుల్లు బిజీగా తమ పనుల్లో నిమగ్నమైపోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ లేకపోయిన వీరిద్దరూ పరిపాలనా కార్యక్రమాల సవ్యంగా నిర్వహిస్తున్నారని అందుకు ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అనేక అంశాల మీద ఇప్పటికే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో హరీశ్ రావు కూడా వారిపై తిరిగి కౌంటర్లు వేస్తూ టీఆర్ఎస్ పై మాటపడనివ్వకుండా ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతూ విలేకరులతో ఎప్పటికప్పుడూ ముచ్చటిస్తూనే ఉన్నారు. అలాగే కేటీఆర్ కూడా ప్రభుత్వ పరంగా చేయబోయే కార్యాక్రమాలపైన మంత్రి కేటీఆర్ హామీలు ఇస్తుండటం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. అంతేకాదు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు ఉండదని సీఎం కేసీఆర్ చెప్పినా పెంపు విషయంపై ముఖ్యమంత్రి చైనా నుంచి రాగానే మాట్లాడతానని కేటీఆర్ హామీ ఇవ్వడం పై దూరమవుతున్న కార్మికుల్లో అసంతృప్తి నెలకొనకండా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు తెలంగాణలో అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గ్రామాలను అభివృద్ధి పరిచే దిశగా వారిని ప్రముఖలకు దత్తత ఇచ్చే కార్యక్రమంలో కూడా తన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ తమ వంతుగా ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తానికి కేసీఆర్ లేని లోటును ఈ ఇద్దరు మంత్రులు తీరుస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతానికే ఈ ఇద్దరే తెలంగాణకు సీఎంలుగా వ్యవహరిస్తున్నారు.

అన్నదాతల ఆత్మహత్యలు.. ఆపేవారెవరూ?

  ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. వర్షాలు రాక.. పంటలకు సరైన నీరు లేక.. పంటలు వేసిన సరిగా పండక పెట్టిన పెట్టుబడి కూడా రాక కడలోతు కష్టాల్లో కురుకుపోతున్న రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చావు ఒక్కటే మార్గమని తమ ప్రాణాలను బలిగొంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జిల్లాలలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు రాజదాని నడిబొడ్డున రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వాలు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నాయా అంటే అదీలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రాజకీయ నాయకులు చేసిందని ఓ పదివంతు అయితే విద్యార్ధులు రైతులు చేసిన ఆందోళనలు.. వారి త్యాగాలు అనిర్వచనీయం. మరి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరువాత అయినా వారి పరిస్థితులు చక్కబడ్డాయా అంటే అదీ లేదు. ఎంతవరకూ పక్క రాష్ట్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. వారితో వాదనలు.. వితండవాదాలు చేయడం ఇదే సరిపోయింది కాని రైతుల సమస్యలు ఏంటి వారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని ఆలోచించే ధోరణి ఏ ఒక్క నాయకుడికి పట్టడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో హామీలు చేస్తారు కాని గెలిచిన తరువాత మాత్రం వారిని పట్టించుకునే నాదుడే లేడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. బంగారు తెలంగాణని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు కాని.. అసలు రాష్ట్రంలో ఉన్నరైతుల సమస్యలే పట్టించుకోని నాయకులు ఇక బంగారు తెలంగాణ ఎలా తయారు చేస్తారు అని గుసగుసలాడుకునే వారు కూడా ఉన్నారు. ఒక్క రాష్ట్రాన్నే అభివృద్ధి చేస్తే చాలదు.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు. తన ఫామ్ హౌస్ లో పండే పంటలు కూరగాయలు మంచిగా పండితే చాలదు.. రాష్ట్రంలో ఉన్న రైతల పంటలు కూడా అదే విధంగా పండేలా చూడాలి. ఇకనైనా  తమ ఒంటెద్దు పోకడని మాని రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోసి రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

విద్యుత్ ఉద్యోగులపై కమిటీ.. పేర్లు మీరే చెప్పండి.. హైకోర్టు

  తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రీలివింగ్ చేసిన వ్యవహారంపై ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఈ సమస్య పరిష్కారం చూడకుండా ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వాదనలకు చిరాకు పుట్టి హైకోర్టు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమస్యపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరిస్తారా సరే లేదంటే మేమే రంగంలోకి దిగాల్సి వస్తుంది అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు హైకోర్టు మరో మెట్టు ఎక్కి ఈ వ్యవహారంపై ఒక కమిటీని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని చెప్పినా రెండు రాష్ట్రాలు ఈ విషయంలో తిట్టుకుంటూ వ్యవహారాన్ని నాన్చుతున్నాయే తప్ప సమస్యను పరిష్కరించడంలేదని.. అందుకే తామే ఒక కమిటీ వేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఏ.శంకరనారాయణలు తెలిపారు. ఈ కమిటీ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు పేర్లను సూచించాలని.. ఈ కమిటీ ఛైర్మన్ గా ఒక వ్యక్తిని నియమిస్తామని.. అవసరమైతే రెండు రాష్ట్రాలకు సంబంధంలేని వ్యక్తిని కమిటీ ఛైర్మన్ నియమించాలని యోచిస్తున్నామని చెప్పారు. కనీసం ఈ కమీటీ ద్వారా అయినా  ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

చీరాల ఎమ్మెల్యే.. టీడీపీ ఇంఛార్జ్.. కుర్చీలతో దాడి

  ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు ,చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈరోజు వికలాంగుల సదరన్ క్యాంపు కార్యక్రమంలో  టీడీపీ పార్టీ నేతలు.. ఆమంచి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి సునీతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఘర్షణకు దారితీసింది. దీంతో టీడీపీ పార్టీ నేతలు, ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరి మీద ఒకరు కుర్చీలు విసురకొని పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి తెలుసుకొని ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి చక్కబడింది.

జగన్ దీక్ష డేట్ ఖరారు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న దీక్ష చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే 17 వ తేదీన వినాయక చవితి ఉన్న నేపథ్యంలో విరమించుకున్నారు. అయితే ఈరోజు వైయస్ జగన్ అన్ని జిల్లాల పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో దీక్ష తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాతనే వైయస్ జగన్ ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఇప్పటికే ఢిల్లీలో ధర్నా చేశారు. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కూడా ధర్నా చేశారు. ఇప్పుడు గుంటూరులో నిరహారదీక్ష. మరి జగన్ దీక్షలు ఎంతవరకూ పని చేస్తాయో చూద్దాం.

ఆట కాదు వేట మొదలైంది.. రేవంత్ రెడ్డి

  టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లొట్టు అని హైకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి తన సొంత నియోజక వర్గం అయిన కొండంగల్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చేరుకున్న ఆయనకు టీడీపీ పార్టీనేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆట ఇప్పుడే మొదలైంది అంటున్నారు మొదలైంది ఆట కాదు వేట అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు సింగం వచ్చేసరికి కేసీఆర్ టూర్ అంటూ చైనా చెక్కేసారు అని వ్యంగాస్త్రాలు విసిరారు. రైతులు ఆత్మహత్యలు.. విద్యార్ధుల ధర్నాలు ఇవేమి కేసీఆర్ కు పట్టడం లేదని కేసీఆర్ ప్రభుత్వం నేను పోరాటం చేస్తానని.. ప్రజా సమస్యల పైన ప్రభుత్వం అంతు చూస్తానని అన్నారు. వంద ఎకరాల ఫామ్ హౌస్ పై ఉన్న శ్రద్ధ రైతల మీద లేదని ఎద్దేవ చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జారీ

  బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యుల్ ఇవ్వాళా వెలువడింది. సెప్టెంబర్ 12నుండి మొత్తం 5 దశలలో మొత్తం 243స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.   మొదటి దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 16. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 23. నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 24. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: సెప్టెంబర్ 26. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 12. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 49.   2వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 21. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 28. నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 29. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 1. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 16. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 32.   3వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 1. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 8 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 9. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్12. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 20. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 50.   4వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 7 నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్14 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 17 ఎన్నికల నిర్వహణ: నవంబర్ 1. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు:55.   5వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 8. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 15. నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 17 నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 19 ఎన్నికల నిర్వహణ: నవంబర్ 5 ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 57.   ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి: నవంబర్ 8. ఎన్నికల ప్రక్రియ ముగింపు: నవంబర్ 12

నన్ను ఇరికించకండి ప్రభో.. వర్మకి రాజమౌళి ట్వీట్

  ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి పైన విమర్శలు చేస్తే కాని రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. అందుకే ఎప్పుడూ ట్విట్టర్ ద్వారా తన పిచ్చిని అప్పుడప్పుడు బయటపెడుతుంటాడు. ఎప్పుడూ విమర్శిస్తే ఏం బావుటుంది అని అనుకున్నాడేమో తెలియదు కాని బాహుబలి విషయంలో ఎస్ఎస్ రాజమౌళిని మాత్రం పొగిడేశాడు. బాహుబలి సినిమా రిలీజైనప్పుడు కూడా రాంగోపాల్ వర్మ రాజమౌళిని.. హీరోలని ప్రశంసించాడు. కాని ఈసారి పొగిడిన పొగడ్తలకి రాజమౌళి పాపం భయపడినట్టున్నారు. అదేంటంటే ప్రస్తుతానికి ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉన్నాడనే విషయం తెలుసుకున్నానని ట్వీట్ చేశారు. "I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg'' అలా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు రాజమౌళి వెంటనే స్పందించి "జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సార్ ఇపుడు ఇది" అంటూ ట్వీటారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ తిట్టినా కాంట్రవర్సీలా... పొగిడినా కాంట్రవర్సీలా తయారైంది.

ఏపీ రాజధానికి సహకరించండి.. టాటా ఛైర్మన్ తో వెంకయ్య

  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య ఏపీ రాజధాని నిర్మాణానికి.. అభివృద్ధికి సహకరించాలని.. అంతేకాదు ఒక్క రాజధాని నిర్మాణంలోనే కాక హైదరాబాద్ విశాఖ నగరాల్లో కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించాలని సైరస్ మిస్త్రీని కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడే కాదు దేశంలో ఇతర ప్రాంతాల అభివృద్ధికోసం.. వెంకయ్య చేపట్టిన స్మార్ట్ సిటీ పథకం.. స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై కూడా సహకారం అందించాలని కోరారు. దీనికి సైరస్ మిస్త్రీ కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. కాగా మోదీ స్వచ్ఛ భారత్ లో భాగంగా పిలుపు నిచ్చిన మేరకు టాటా సంస్ధ ముందుకొచ్చి విజయవాడలోని 264 గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

చైనా టూర్లో కేసీఆర్ బిజీబిజీ.. 3గంటలు 30 మీటింగులు

  తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా టూర్ లో భాగంగా నిన్న ఆయన ఫుల్ బిజీగా గడిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి అనేక పారిశ్రామిక వేత్తలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి పరిశ్రమల స్థాపనకు తాము చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు. అంతేకాదు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి వసతులు ఉంటాయి వాటితో పాటు పరిశ్రమల అనుమతుల విషయంలోనూ తాము చేపడుతున్న చర్యల గురించి ముచ్చటించారు. ఎలాంటి అవినీత లేకుండా పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 3గంటల్లో 30 మంది పారిశ్రామికవేత్తల్ని కలిసిన కేసీఆర్.. వారికి తెలంగాణలో పరిశ్రమలలు పెట్టేందుకు అవకాశాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ లియో గ్రూపు కంపెనీ రూ.వెయ్యి కోట్లతో తెలంగాణలో హెవీడ్యూటీ పైపుల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి కేసీఆర్ తెలంగాణలో పరిశ్రమలు స్థాపనకు బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.

సుజనా తిట్టారా?... పొగిడారా?

  రాజకీయ నేతలు ఎమన్నా దానికి వేరే అర్ధం వచ్చేలా మాట్లాడుకోవడం పరిపాటైపోయింది ఈమధ్య. ఇప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి విషయంలో కూడా అలాగే జరిగింది. అదేంటంటే కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు పాలకులుగా ఉన్నందువలన.. అభివృద్ధి పథంలో మనం దూసుకెళ్లిపోతామని అన్నరు. దాంతో పాటు మోడీ ప్రధాని అయిన తరువాత విదేశాలలో భారత ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు. అంతే దీంతో సుజనా వ్యాఖ్యాలపై ఒకటే కామెంట్లు పడుతున్నాయి. విదేశంలో ప్రతిష్ట పెరిగిందంటే స్వదేశంలో పలచబడిపోయిందనేనా అని వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటున్నారు. మరోవైపు మోడీ కూడా విదేశీ పర్యటనలతో బిజీగానే ఉన్నారు. ఇప్పటికే మోడీ పర్యటనలపై ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజనా చేసిన వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగానే తీసుకుంటున్నారు. అయితే సుజనా చౌదరి అంటే చాలా విధేయుడైన మంత్రి అనే పేరు ఉంది. మోదీపై ఆయన వెటకారంగా అని మాత్రం అని ఉండరు అని. మనస్ఫూర్తిగానే మోడీని కీర్తించి ఉంటారని పనిలేని వాళ్లు దాని కూడా వెటకారంలాగే అనుకుంటారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు.

వీలుంటే సూర్యుడిపై కేసు పెడతారు.. వెంకయ్య కామెంట్

  ప్రత్యేక హోదాపై ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు స్పందించి వైసీపీ నేతలపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని మామీద కేసులు పెట్టారు.. వీలుంటే రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదు అందుకు సూర్యుడే కారణమంటూ ఆయన మీద కేసులు పెట్టగలరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  పార్టీ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టక పోవడంతో సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే  చేస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మోడీ, వెంకయ్య, చంద్రబాబులపై ఫిర్యాదు చేస్తే దానికి ప్రతిగా బిజెపి నేతలు కూడా కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకోసం అడ్డగోలుగా విభజించారంటూ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డిలపై కడప జిల్లా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

రాజమోళిని పొగిడిన రాంగోపాల్ వర్మ..

  ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ అందరి మీద విమర్శల బాణాలు వేస్తునే ఉంటారు. మొన్న టీచర్స్ డే సందర్భంగా ఆఖరిని వారిని కూడా వదలకుండా విమర్శించేశాడు. ఇప్పుడు ఆయన కన్ను రాజమౌళి మీద పడింది. రాజమౌళిని ఉద్దేశించి ట్విట్టర్లో కొన్నిపోస్ట్ లు చేశాడు. ఏముంది ఏదో విమర్శిస్తూ కామెంట్ చేశాడనుకుంటున్నారు.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే ఇంతకీ రాంగోపాల్ వర్మ ఏమని వ్యాఖ్యానించాడనే కదా డౌట్. "I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg'' అంటే రాజమౌళిలో ప్రస్తుతం స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్నానని కామెంట్ చేశాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ హాలీవుడ్ డైరక్టర్.. ఆయన పోలికలు రాజమౌళిలో ఉన్నాయనే విధంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంపై ఫ్యాన్సందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ రూట్ మార్చినట్టున్నాడు.

డేటింగ్ కింగ్ యువరాజ్ సింగ్.. నయా గర్ల్ ఫ్రెండ్

 భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ మంచి బ్యాట్స్ మాన్ అది అందరికి తెలిసిన విషయమే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు యువరాజ్ సింగ్ అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయడంలో కూడా కింగే అది కూడా స్పెషల్ గా చెప్సాల్సిన అవసరం లేదనుకోండి. గతంలో బాలీవుడ్ బాలీవుడ్ భామలు దీపిక పదుకోన్‌, ప్రీతి జింతా, కిమ్‌ శర్మ, నేహా ధూపియాలతో అఫైర్ నడిపి వార్తల్లో నిలిచాడు. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సింగిల్ గా ఉన్న యూవీ ఇప్పుడు మళ్లీ ఫిట్ ఉండటంతో మళ్లీ డేటింగ్ మొటలేట్టేశాడు. ప్రస్తుతానికి బ్రిటిష్‌ మోడల్‌, యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి తోడు వీరిద్దరూ లండన్‌లో బాగా ఎంజాయ్‌ చేసి మళ్లీ భారత్‌కు రావడంతో ఈ వార్తలు మరీ ఊపందుకున్నాయి. యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌ సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' లో, బిల్లా సినిమాతో పాటు నటించింది.

ఏపీకి పెద్ద బిస్కెట్

  ఏపీ రాజధానిలో అనేక పరిశ్రమలు పెట్టడానికి సింగపూర్ జపాన్ తో పాటు ఇంకా అనేక కంపెనీలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిస్కెట్ వ్యాపార రంగంలోనే అగ్రస్థానంలో ఉన్న బ్రిటానియా సంస్థ కూడా ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు, కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అయితే సదరు బ్రిటానియా కంపెనీ ఎంపీ వరుణ్ బెర్రీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అవసరాల కోసం అనువైన ప్రాంతాన్ని చూస్తుండగా ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును సంప్రదించగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పేరును చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి బ్రిటానియా ఎండీ కూడా ఓకే చెప్పేడంతో రూ.125కోట్లు పెట్టుబడతో వచ్చే ఏడాది చివరి నుంచి తమ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

కారులో రేప్.. చేయాలంటే ఇంట్లోనే చేయొచ్చు.. ఎమ్మెల్యే

  పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అస్సోం ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వివరాల ప్రకారం ఎమ్మెల్యే గోపీనాథ్ ఇంట్లో 14 ఏళ్ల మైనర్ బాలిక పనిమనిషి ఉంది. అయితే ఈ బాలిక గత నెల 29 వ తేదీన ఎమ్మెల్యే గోపీనాథ్ పై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపీనాథ్ కారులో తనను వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఈ కేసును బోకో పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసి అక్కడ అక్కడ ఐపీసీ 343 సెక్షన్‌తో పాటు.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేశారు.   అయితే బాలిక ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాలిక తనపై చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని కుట్రతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు కారులో ‘కారులో తనను లైంగికంగా వేధించానని బాలిక చెబుతోంది. కారులో నాతోపాటు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు అది ఎలా సాధ్యమవుతుంది అని చెబుతున్నారు. ఒకవేళ అలా ఇబ్బంది పెట్టాలనుకుంటే కారులో ఎందుకు తను మాతోనే మా ఇంట్లో ఉంటోంది కదా’ అని తిరిగి ప్రశ్నించారు. అంతేకాదు ఎమ్మెల్యే కూడా తిరిగి బాలికపై తిరిగి ఫిర్యాదు చేశారు. డబ్బులు, బట్టలతో బాలిక పారిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు బాలిక మాత్రం ఎమ్మెల్యే లైంగిక దాడులకు పాల్పడ్డారని గట్టిగా చెబుతోంది అయితే పోలీసులు మాత్రం విచారణలో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.