తరతరాలు గుర్తుండిపోయేలా భోజనాలు

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి పరిటాల సునీత ప్రకటించారు, అతిథులు లోపలికి వచ్చే సమయంలోనే భోజన ప్యాకెట్లను అందిస్తామని, పులిహోరా, చక్రపొంగలి, పెరుగన్నం, తాపేశ్వరం కాజా, అరటి పండు, మజ్జిగ, వాటర్ బాటిల్ ఇవ్వడంతోపాటు ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు, శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు కొన్నిరోజులపాటు గుర్తుండిపోయేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు సునీత తెలిపారు, మంత్రులు కిమిడి మృణాళిని, పీతల సుజాతలతో కలిసి తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో వంటశాలను పరిశీలించిన సునీత... అక్కడ వండిన ఫుడ్ ఐటెమ్స్ శాంపిల్స్ ను రుచిచూసి పరిశీలించారు

హెలికాప్టర్ ద్వారా మట్టి, నీళ్లు చల్లిన చంద్రబాబు

  మన రాజధాని, మన ఊరి మట్టి అంటూ ప్రజల్లో సెంటిమెంట్ నింపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని, జలాలను హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతంలో చల్లారు, శంకుస్థాపన ఏర్పాట్లను హెలికాప్టర్ నుంచి పరిశీలించిన చంద్రబాబు... మట్టి, పుణ్యజలాలను చల్లే కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు, వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాలకు ముందుగా పూజలు నిర్వహించిన చంద్రబాబు... అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతమంతటా చల్లారు, ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు

అమరావతి కోసం ఏసీ బస్సులను పంపిన రజనీ

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అతిరథ మహారథులకు దేశ విదేశీ ప్రముఖులు, వీవీఐపీలను వేదిక వద్దకు తరలించేందుకు ఎయిర్ పోర్ట్స్ నుంచి ఖరీదైన కార్లను ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రధాన వేదిక దగ్గరకు చేరుకునేందుకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా... విమానాశ్రయాల నుంచి ఏసీ బస్సులతోపాటు బెంజ్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ లాంటి అతి ఖరీదైన కార్లను సమకూర్చుతున్నారు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే పలు ఏసీ బస్సులను ఏర్పాటు చేయగా, విజయవాడలోని పలువురు ప్రముఖులు... తమ విలువైన కార్లను వీవీఐపీల రవాణా కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం రెండు ఏసీ బస్సులను పంపించినట్లు తెలిసింది.

వరాల విషయంలో చంద్రబాబు కంటే కేసీఆరే బెస్ట్ అంట..

ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అభివృద్ధిలో ఎంత కృషి చేస్తున్నారో అందరి తెలిసిందే. ఎవరి పాలన వారిది అయినప్పటికీ ఇద్దరి ఆశయం మాత్రం ఒక్కటే రాష్ట్రాభివృద్ది. అలాంటప్పుడు సహజంగానే ఇద్దరి పాలనను పోల్చి చూస్తారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా మిగలగా.. ఆంధ్రా మాత్రం ఆర్ధిక లోటుతో మిగిలింది. దీంతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాల మీద వరాలు కురిపించేవారు. కానీ చంద్రబాబు పరిస్థితి వేరు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు కంటే కేసీఆరే ఎక్కువ వరాలు ఇస్తాడు అన్న ముద్ర పడిపోయింది. ఇది మరోసారి నిజం చేశారు ఈ తెలుగు చంద్రులు. ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోలీసులకు వరాల జల్లు కురిపించారు. పోలీసులకు ప్రోత్సాహాకాలు, ప్రమోషన్లు ఇస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా ఎస్. ఐ ఆపై ఉన్నతాధికారులకు వారు విధులు నిర్వహించే చోట ఇళ్ల స్థలాలను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు వాటి రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయింపు ఇస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు 35 శాతం అలవెన్స్ లను ప్రకటించారు. పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్సును సైతం రూ.3500 నుంచి రూ.7వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు విజయవాలో పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ లాగ వరాలైతే ఏం కురిపించలేదు కాని నాలుగు మాటలు చెప్పి పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఇచ్చిన వరాలను చూసి ఏపీ పోలీసులు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల వరాల మీద ఓ ఏపీ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఎంతైనా కేసీఆర్.. కేసీఆరే... చంద్రబాబు.. చంద్రబాబే అని అన్నారట.

అమరావతి కోసం డబుల్ బెడ్ రూం వాయిదా

  ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవాన్ని సైతం వాయిదా వేసుకున్నారు, హైదరాబాద్ సనత్ నగర్ ఐడీహెచ్ కాలనీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాల్సి ఉన్నా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని డిసైడైన కేసీఆర్... ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు, ప్రధాని మోడీతోపాటు పలువురు దేశ విదేశీ ప్రముఖులు హాజరుకానుండటం, పైగా చంద్రబాబే స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణ సంస్కృతిమంచిదన్న కేసీఆర్... మర్యాద ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళుతున్నానని తెలిపారు, అయితే రోడ్డుమార్గంలో వెళ్లాలని అనుకున్నా... అధికారుల సూచన మేరకు హెలికాప్టర్ లోనే అమరావతికి వెళ్లనున్నారు

రామోజీ, రాధాకృష్ణతో దిగ్విజయ్ మీటింగ్?

  ఈమధ్య పొలిటికల్ లీడర్స్ అంతా మీడియా అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావును వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం సంచలనం సృష్టించగా, తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ .... రామోజీతో సమావేశం కావడంతో ఆసక్తిరేపుతోంది, అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కూడా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు  చెబుతున్నా, మీడియా అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికే కలిసినట్లు టాక్ వినిపిస్తోంది, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే మీడియా అండ ఉండాలని గుర్తించిన డిగ్గీరాజా... ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించినట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక హిందూ సంచలన వార్తను ప్రచురించింది, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓ కాంటాక్టుకు సంబంధించిన విషయంలో ఆయనను ప్రశ్నించినట్లు తెలిపింది, 2006లో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును... నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఏపీ ఫిషరీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇవ్వడంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించినట్లు హిందూ పత్రిక తెలిపింది. నిర్మాణాల్లో నాణ్యత లేదని గుర్తించిన ఈఎస్ఐ కార్పొరేషన్... 2007లో విచారణకు ఆదేశించింది. ఐఐటీ నిపుణుల పరిశీలన మేరకు భవన నిర్మాణాలు ప్రమాణికంగా లేవని, దాదాపు 5కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చింది. ఐఐటీ నిపుణుల రిపోర్ట్ ఆధారంగా 2011లో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోన్న సీబీఐ... కార్మికశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించింది, తాజాగా ఆనాటి కేంద్ర మంత్రి కేసీఆర్ తోపాటు ఆయన వ్యక్తిగత అధికారులను కూడా విచారించినట్లు హిందూ పత్రిక కథనం ప్రచురించింది.

ఏపీ శంకుస్థాపన.. జయలలిత కూడా ఆ లిస్ట్ లో

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ నేతలు చాలా బిజీగా ఉన్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ.. సింగపూర్, జపాన్ ప్రధానులతో పాటు పలువురు ప్రముఖులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆహ్వానించారు. అయితే చంద్రబాబు తాను పిలవడానికి అయితే పిలిచారు కాని కొంతమంది మాత్రం తమ బిజీ షెడ్యూల్ తో రావట్లేదని చెపుతున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని..  బాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అయితే అఖరిలో కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని ట్విస్ట్ ఇచ్చారు.

శంకుస్థాపనకు వద్దన్న కాంగ్రెస్ పార్టీ.. రాజీనామా చేసి మరీ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అందరికి ఆహ్వాన్వాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు అందరికి ఆహ్వానాలు అందించినా కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉండాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రతిపక్షనేత అయిన జగన్ తనకు ఆహ్వానం అందించవద్దని, తనని ఆహ్వానించినా రానని ముందే చెప్పారు. దాంతో అసలు పార్టీ అధినేతే వెళ్లనప్పుడు పార్టీ నేతలు మాత్రం ఎందుకు వెళతారు వాళ్లు కూడా వెళ్లరు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్లాలా వద్దా అన్న సంగ్ధిగ్ధంలో పడింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళదామని ఏపీ కాంగ్రెస్ నేత అయిన రఘువీరా రెడ్డిని అడగగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీని కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే వెళదామని.. లేకపోతే వద్దని చెప్పగా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే అందరూ నేతలు బానే ఉన్నా ఒక్క కాంగ్రెస్ నేత మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళొద్దన్నారని రాజీనామానే చేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ నాయకుడు చేసింది నిజమే. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లొద్దని పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక రాజీనామా చేశారు. తన నియోజక వర్గం తరుపున తను వెళ్లాలని నిశ్చయించుకుని పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతకీ తను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక రాజీనామా చేశారా లేక పార్టీ మారే యోచనలో రాజీనామా చేశారా అన్నది సందేహం.

రామోజీ సపోర్టు కోసం పరితపిస్తున్న పార్టీలు

ప్రసుతం రాజకీయాల్లో రామోజీరావు పాత్ర హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పార్టీలు ఈయన సపోర్టు కోసం పరితపించడం అందరికి ఆశ్చర్యకరంగా మారింది. నిన్న మొన్నటి వరకూ ఈనాడు అంటేనే అంత ఎత్తున ఎగిరిపడే జగన్ కూడా రామోజీరావును కలిసి రాజకీయాల్లో వేడి పుట్టించారు. అసలు వారిద్దరూ ఎందుకు కలిశారు.. ఏం మాట్లాడుకున్నారు.. అని బుర్రలు బద్దలుకొట్టికొని ఆలోచించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే జగన్ రామోజీరావును కలిసిన ఫలితం.. ఆతరువాత ఈనాడులో జగన్ మీద మొయిన్ ఎడిషన్ లో ఒక ఆర్టికల్. దీంతో రామోజీరావును కలవడం వల్ల జగన్ కు బాగానే వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు జగన్ పంథాలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రామోజీ మద్దతు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగన్, కేసీఆర్లు రామోజీరావుతో సయోధ్య కుదుర్చుకున్నారని.. ప్రస్తుత పరిస్థితిలో మన పార్టీకి కూడా తన మద్దతు అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని సూచించడం జరిగిందట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ సింగ్.. టీ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి రామోజీరావును కలిసినట్టు తెలుస్తోంది. దాదాపు గంటపాటు జరిగిన చర్చలో ప్రతిపక్షంలో తమ పోరాటాలకు మద్దతివ్వాలని దిగ్విజయ్ సింగ్ రామోజీరావును కోరారట.  మొత్తానికి కాలం మనుషులను మార్చేస్తుంది అన్న నానుడి ప్రకారం.. అసలు ఈనాడు అంటేనే పడని జగన్ కాని.. కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు సపోర్టు కోరడం ఆశ్చర్యం. దీనిబట్టి రామోజీరావు రేంజ్ ఏంటో అందరికి అర్ధమవుఉంటుంది.

కేసీఆర్ ను అందుకే పిలిచా.. చంద్రబాబు

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అలా కేసీఆర్ ను స్వయంగా ఎందుకు పిలిచారు.. కేసీఆర్ కూడా మారు మాట్లాడకుండా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పడంతో చాలా మందికి చాలా సందేహాలే తలెత్తుతున్నాయి. అయితే స్వయంగా తానే ఎందుకు ఆహ్వానించాననే దానికి సమాధానం చెబుతూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయినా.. రాష్ట్రం కలిసున్నా తెలుగు జాతి అంతా ఒకటే అని.. సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి అంత మాత్రన వాటినే పట్టుకొని కూర్చోకూడదు కదా అని అన్నారు. అంతేకాదు ఇరు రాష్ట్రాలు సామరస్యంగా ముందుకు వెళ్లాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. ఎలాగూ రాష్ట్రం విడిపోయింది.. ఇప్పుడు గొడవలు పడుకుంటూ కూర్చుంటే రెండు రాష్ట్రాలకు వచ్చేది ఏం లేదు.. అందువల్ల అందరిని కలుపుకుంటూ పోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఆహ్వానించడానికి వెళ్లాలని.. ఇద్దరం రాష్ట్రాల అభివృధ్ది గురించి చర్చించామని వెల్లడించారు.

అమ్మ కేసీఆర్.. శంకుస్థాపనకు రావడానికి అసలు కారణం అదా..!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమానికి నేనే స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానిస్తాని చెప్పడం.. ఆ తరువాత ఆయనే స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించడం.. ఇంటికి వెళ్లిన చంద్రబాబును కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి తాను శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పడం ఇవన్నీ చూస్తుండగానే జరిగిపోయాయి. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత ఇద్దరు చంద్రులు ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడమే సరిపోయింది. అయితే చంద్రబాబు కేసీఆర్ ను పిలవడం వెనుక ఏముందో తెలియదు కాని.. కేసీఆర్ రావడం వెనుక మాత్రం ఓ కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే.. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే కేసీఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి రావడానికి కారణమంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో సీమాంధ్రులు ఎక్కువగా ఉండటం వల్ల.. వారి ఓట్లు కావాలంటే సీమాంధ్రుల మద్దతు కావాలి. మరోవైపు ప్రసుత్తం కేసీఆర్ ప్రభుత్వంపై రైతు ఆత్మహత్యల విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులు ప్రజల దృష్టి మరల్చడానికి వెళుతున్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీదే హవా. ఆ తరువాత దానికి ధీటుగా పార్టీ ఉన్నది మాత్రం టీడీపీకే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వైకాపా పార్టీ.. కాంగ్రెస్ పార్టీల పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఉన్న టీడీపీని ఇరుకున పెట్టి.. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి ఇక్కడ చక్రం తిప్పాలంటే మాత్రం వారి ఓట్లు ఖచ్చితంగా కావాలి. అయితే తెలంగాణ వాదులు, ఎలాగూ కేసీఆర్ కు ఓట్లు దండిగా వేస్తారు. మరి సీమాంధ్రుల పరిస్థితి ఏంటి. అందుకే ఈ రకంగా అయినా వారికి దగ్గర అవుదామనే కారణంతోనే శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్నారని వాదన వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కొంత మంది మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. రాష్ట్రం విడిపోయింది.. మొదట్లో ఇద్దరు గొడవలు పడినా అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. ఏవరి రాష్ట్రం వారిది.. ఎవరి సమస్యలు వారివి. ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఈ పరిస్థితిలో అనవసరమైన గొడవలు ఎందుకులే అని.. లేనిపోని వివాదాల వల్ల వచ్చే ఫలితం ఏముండదని ఆలోచించినట్టు ఉన్నారు అని అనుకుంటున్నారు. మరి అసలు కారణం ఏంటో వారికే తెలియాలి.

అమరావతిపై సీడి విడుదల చేసిన పరకాల ప్రభాకర్

సీఐఐ అనుబంధ విభాగమైన యంగ్ ఇండియన్స్ సంస్ధ, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, కలిసి తయారు చేసిన అమరావతిపై రెండు సీడీలను ప్రభుత్వ సమాచార సలహాదారు డా.. పరకాల ప్రభాకర్ సోమవారం, మధుమాలక్ష్మీ ఛాంబర్స్ లో విడుదల చేశారు. అమరావతి శంఖుస్థాపన మహోత్సవానికి అందిస్తున్న అన్ని ఆహ్వాన పత్రికలకూ ఈ వీడియోలను చూడటానికి వీలున్న QR కోడ్ ను ముద్రించటమైందనీ, తద్వారా "మన అమరావతి -  మన రాజధాని" అని కొట్టి యూ ట్యూబ్ ద్వారా కానీ లేక గూగుల్ సెర్చ్ లో "మన అమరావతి - మన రాజధాని" వీడియోలను సందర్శించవచ్చని యంగ్ ఇండియా ప్రతినిధి సందీప్ మండవ తెలిపారు.  

అలా అయితే వ్యతిరేకించినట్టా.. పవన్ తప్పకుండా వస్తారు.. చంద్రబాబు

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంత్రులు అయన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ లు ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తాను శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఉన్నా షూటింగ్ కారణంగా చెప్పలేకపోతున్నానని, తను వచ్చేది రానిది షూటింగ్ పై ఆధారపడి ఉందని చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ వచ్చేది.. రానిది.. ఇప్పటికీ డౌటే. అయితే తను హాజరయ్యేది.. లేనిది పవన్ కళ్యాణే డౌట్ గా చెపుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గం మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ కు తాను ఫోన్ చేశానని.. పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు. అయితే రాజధాని భూసేకరణ విషయంలో కొంత విభేధాలు తలెత్తిన నేపథ్యంలో దాని గురించి ప్రస్తావిస్తూ.. కొన్ని విషయాల్లో విభేధాలు ఉన్నప్పటికీ దానికి దీనికి పోలిక పెట్టి చూడకూడదని.. విభేధాలు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించినట్టు కాదని తను తప్పకుండా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు రామోజీరావును స్వయంగా పిలిచిన నేపథ్యంలో ఇప్పటికే తమ నాయకుడికి అవమానం జరిగిందని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో.. ఆయన ఇవేమి పట్టించుకోకుండా కార్యక్రమానికి వెళతారో లేదో చూడలంటే రేపు ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది.

రోడ్డు మార్గంలో వస్తా.. వద్దు వద్దు హెలికాఫ్టర్లో రా.. చంద్రబాబు

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ కూడా తెలుసుకున్నారట. దీనిలో భాగంగానే తాను సూర్యాపేట నుండి రోడ్డు మార్గంలో అమరావతికి వస్తానని చంద్రబాబుకు చెబితే.. దీనికి చంద్రబాబు రోడ్డు మార్గంలో వద్దు.. హెలికాప్టర్ లో వస్తే బావుంటుందని సూచించే సరికి కేసీఆర్ కూడా అందుకు అంగీకరించారట. కాగా కేసీఆర్ రేపు సాయంత్రం సూర్యాపేట వెళ్లి అక్కడే ఉండి ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్ లో శంకుస్థాపన కార్యక్రమానికి వెళతారు. అనంతరం  2.30 గంటలకు తిరిగి మళ్లీ సూర్యపేట చేరుకొని అక్కడి అభివృద్ది కార్యక్రమాలు చూసుకొని ఆ తరువాత హైదరాబాద్ కు వస్తారు.

ప్రతిపక్షాలపై కడియం ఫైర్.. అప్పుడు తేలిపోతుంది

తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అధికార పార్టీపై చేస్తున్న విమర్శలకు.. రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించింది.. అప్పుడు రైతులకు ఏం చేసింది.. అసలు వారి వల్లే ఇప్పుడు రైతులు ఇన్ని సమస్యలు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి, దోపిడీని చూసి ప్రజలు ఆపార్టీని కనుమరుగు చేశారని అన్నారు. అంతేకాదు వరంగల్ ఎన్ కౌంటర్ పై అనవసర రాద్దాంతం చేస్తున్నారు.. కాంగ్రెస్ హయాంలో ఎంతమందిని ఎన్ కౌంటర్ చేయలేదు అని ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ పై కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందని.. ఈ ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. ప్రజాదరణ ఏ పార్టీకి ఉందో వరంగల్ ఉప ఎన్నికలో తేలిపోతుందని మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

శంకుస్థాపనకు వెళుతున్నారుగా ప్రకటన చేయండి.. మోడీకి రాహుల్ లేఖ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ప్రత్యేక హోదా గురించి లేఖ రాశారు.  ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22న జరగబోయే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్నసంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మోడీకి లేఖ రాశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్న ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయాలని.. ఏపీ  ఆర్ధికంగా చాలా వెనుకబడి ఉందని.. ఈ పరిస్థితిలో ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని.. అలాగే ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు సమ్మిళిత ప్యాకేజీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.. ఆమేరకు రాజ్యసభలో ప్రకటన చేశారు.. దీనికి కేంద్ర కేబినేట్ కూడా అంగీకరించింది అని అన్నారు. అంతేకాదు నాడు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  కాని ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఏడాది అవుతున్న ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈవిషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని పేర్కోన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేయాలని, వాటి అమలుకు కాలవ్యవధి కూడా ప్రకటించాలని కోరారు.

బీఫ్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే.. రంగు పడింది

ఇప్పటికే గోమాంసంపై పలురకాల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలోనే దాడి చేశారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యేపై రంగుపడింది. వివరాలప్రకారం.. జమ్మూకాశ్మీర్ శాసనసభ స్వతంత్ర ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్‌ ఆవు మాంసంతో తన అనుచరులకు విందు పార్టీ ఇచ్చారు. దీంతో ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ వద్ద హిందూసేన అనే సంస్థకు చెందిన కార్యకర్తలు హిందువులను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాడంటూ ఆయనపై ఇంకు చల్లి దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం రషీద్ మీడియాతో మాట్లాడుతూ ముంబైలో సుధీంద్ర కులకర్ణికి ఏం జరిగిందో నాకూ అదే జరిగింది. ఈరోజు భారత్ పరిస్థితి ఏమిటో ప్రపంచంచూడాల్నారు. పాకిస్థాన్‌లో తాలిబాన్ రాజ్యం వస్తున్నదని అంటున్నారు.. కానీ ఇండియాలో జరుగుతున్నదేమిటి అని రషీద్ ప్రశ్నించారు. గాంధీ పుట్టిన దేశం అని మనం అనుకుంటున్నాం కానీ ప్రస్తుతం ఇది గాంధీ పుట్టిన దేశం కాదని.. మోడీ పుట్టిన దేశంలా మారిందని విమర్శించారు.