రెడీగా ఉండు జానారెడ్డి.. నేను మర్చిపోలేదు కేసీఆర్

రాజకీయాల్లో గెలపు, ఓటములు సహజమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. గెలిచామని విర్రవీగిపోవడం.. ఓడిపోయామని కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు అని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మలేదని తమ పార్టీ తీరునే విమర్శించుకున్నారు. త్వరలో తమ సత్తా చూపుతామని అన్నారు. ఈ సందర్బంగా ఆయన గతంలో చేసిన వాగ్ధానం గురించి కూడా ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారు. రానున్న మూడు సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు రెండో పంటకు నీరు అందిస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని జానా గతంలో సవాల్ విసిరారు. అదే సవాల్ ను కేసీఆర్ వరంగల్ ఉపఎన్నిక గెలిచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా గుర్తుచేశారు.. గులాబీ కండువా కప్పుకోవడానికి జానా సిద్దంగా ఉండాలని అన్నారు. దీనికి జానా స్పందించి తను చేసిన వాగ్ధానాన్ని మరిచిపోలేదని.. తన ఇచ్చిన హామీని కనుక నెరవేర్చినట్టయితే తాను తన పార్టీ ప్రచార సారథిగా ఉంటానని మళ్లీ వాగ్ధానం చేశారు. మరి మూడేళ్లలో ఏం జరుగుతుందో చూడాలి.

చంద్రబాబును ఆహ్వానిస్తా.. విమర్శించడం తగదు.. కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ నెల చివరి వారాంతంలో చండీయాగం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈకార్యక్రమానికి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పిలుస్తారా? లేదా అన్న పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించారు కాబట్టి కేసీఆర్ కూడా చంద్రబాబును ఆహ్వానిస్తారని కొందరు అనుకుంటుంటే.. అది వ్యక్తిగత హోమం కాబట్టి పిలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని మరికొందరూ అనుకున్నారు. అయితే ఈ సందేహాలన్నింటికి కేసీఆర్ బ్రేక్ వేశారు. తను డిసెంబర్ నెలలో నిర్వహించే చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానిస్తానని చెప్పారు. తన సొంత ఖర్చుతోనే యాగం నిర్వహిస్తున్నానని.. యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందంటూ విమర్శలు చేయడం తగదని అన్నారు. మొత్తానికి ఇప్పటి వరకూ కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానిస్తారా? లేదా? అంటూ చర్చించుకున్నారు.. ఇప్పుడు ఎలా పిలుస్తారు అనే దానిపై చర్చించుకుంటారేమో?

ఓడిపోయింది అభ్యర్ధి.. పార్టీ కాదు.. శంకర్రావు

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పార్టీ.. తమ గెలుపుకు సంబంధించి ప్రెస్ మీట్ లు పెట్టి పార్టీని పొగుడుకుంటుంటే.. మిగిలిన పార్టీలు తమ పరాభవాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. పనిలో పనిగా అటు టీఆర్ఎస్ పై కూడా రెండు విమర్శలు పడేస్తున్నారు. అయితే తమ పార్టీని కవర్ చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేత శంకర్రావు తన స్టైల్ ను చూపించారు. మామూలుగానే శంకర్రావు చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి పార్టీ నేతలు సైతం విస్తుపోయేలా చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది అభ్యర్ధి సర్వే నారాయణ అంతేకానీ పార్టీ కాదు అని వ్యాఖ్యానించారు. సర్వే లోకల్ క్యాండిడేట్ కానందువల్లే ఓడిపోయారని అన్నారు. మొత్తానికి శంకర్రావు ఓటమికి కొత్త అర్ధాన్ని చెప్పారు. కాగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు గుడి కడతానని హడావుడి చేసిన శంకర్రావు ఇప్పుడు ఆ సంగతి మర్చిపోయినట్టు ఉన్నారు.

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడుకు మృతి..

వరంగల్ జిల్లా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేంద్రరెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మరణించాడు. వరంగల్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మోటారు బైక్ మీద వెళుతున్న విశాల్ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఒకటి బలంగా ఢీ కొట్టింది. దీంతో విశాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. కాగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగి మాజీ డీజీపీ.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పేర్వారం రాములు మనవలు అవిత్ పవార్, వరుణ్ పవార్ లు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మిల్క్ ట్యాంకర్ ను వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

అనురాధ మేనల్లుడు చింటూనే హంతకుడు.. ఎస్పీ

చిత్తూర్ మేయర్ అనురాధ, మోహన్ దంపతులు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అనురాధ మేనల్లుడు చింటూనే హంతకుడని పోలీసులు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య పదకొండని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా మరో నిందితుడు మురుగ కూడా టూ టౌన్ పీఎస్ లో లొంగిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు. మురుగ మరెవరో కాదుని.. 47 వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి భర్త అని.. అనురాధను చంపడానికి స్కెచ్ వేయడంలో మురగదే కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది చింటూ, వెంకటా చలపతి అని.. ప్రధాన నిందితుడు చింటూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని..హత్యల వెనుక రాజకీయ కోణంపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

అమీర్ అసహనం.. ఉన్నపళంగా యాప్‌ అన్ ఇన్‌స్టాల్..

  దేశంలో అసహనం పెరుగిపోతుందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు పుడుతున్న వేడి అంతా ఇంతా కాదు. ఇప్పుడప్పుడే ఆ వేడి కూడా చల్లారేలా కనిపించడంలేదు. దీనిపై అటు రాజకీయ నాయకులు.. సినీ నటులే విమర్శిస్తున్నారంటే ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మాటల్లోనే కాదు చేతల్లో వారి వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే స్నాప్ డీల్ యాప్‌ను ఉన్నపళంగా లక్ష మంది అన్ ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆ పని చేసినట్లు ఓ ట్వీట్ దర్శనమిస్తోంది. అధికారికంగా ఈ సంఖ్య ఎంత అనేది తెలియదు కానీ ఇప్పటికే చాలా మంది యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేశారు. అంతేకాదు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు నేను స్నాప్ డీల్ యాప్ అన్ఇన్‌స్టాల్ చేస్తున్నా అంటు ట్వీట్ చేస్తూ మరీ అన్ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఒక్క దీనికే కాదు.. ఇంకా అమీర్ ఖాన్ ప్రచార కర్తగా ఉన్న ప్రొడెక్టులను కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారు. మొత్తానికి అమీర్ ఖాన్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఆవ్యాఖ్యల ప్రభావానికి మాత్రం బలైపోతున్నారు.

అఖిలపక్ష సమావేశం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. వెంకయ్య

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ములాయం, కేకే, తోట నర్సింహతో పాటు అన్నీ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు, పెండింగ్ బిల్లులపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు కరువు, వరద పరిస్థితులు, నిత్యవసర వస్తువులు ధరలపై సమగ్ర చర్చ జరిపారు. అంబేద్కర్ 125 జయంతి పురస్కరించుకొని రెండు రోజుల పాటు ఉభయ సభల సమావేశాలు జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు 28 రోజులు జరుగుతాయని.. మొత్తం 38 బిల్లులు చర్చుకు రానున్నాయని.. 7 కొత్త బిల్లులు.. 24 ప్రాధాన్యత బిల్లులపై చర్చ జరగనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బిల్లులపై కొన్ని సవరణలు సూచించిందని.. బిల్లుల సవరణపై అరుణ్ జైట్లీ దృష్టి సారించారని..అన్ని బిల్లులు పాస్ అయేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.

జగన్ ఇప్పుడు ఎందుకు ఉలకట్లేదు.. పలకట్లేదు..

వరంగల్ ఉపఎన్నిక పోరు ఎట్టకేలకు ముగిసింది. అన్ని పార్టీలను పక్కకు నెట్టి టీఆర్ఎస్ ఇంతకు ముందు మెజార్టీ కంటే ఎక్కువ సంపాదించి లోక్ సభ సీటు దక్కించుకుంది. ఎన్నికల బరిలో దిగిన దయాకర్ దాదాపు నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడి వరకూ బానే ఉంది. ఇప్పుడు గెలుపు కోసం విమర్శలు చేసిన పార్టీ నేతలు గెలిచిన తరువాత కూడా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఒకరంటే.. గ్రేటర్ ఎన్నికలు నుండి టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందని ఇంకొకరు అంటారు. అయితే ఇది రాజకీయాల్లో ఎలాగూ కామన్ థింగ్.. కానీ అందరూ ఎవరి ధోరణిలో వారు విమర్శిస్తుంటే ఒక్కరి గళం మాత్రం ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వరంగల్ ఉపఎన్నికల్లో మొత్తం వైసీపీకి లక్ష ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ వైసీపీ దక్కించుకున్న ఓట్లు మొత్తం.. 23,352 మాత్రమే. ఇంత‌కూ జ‌గ‌న్ లెక్క ఎక్క‌డ త‌ప్పింది. జ‌గ‌న్ చెప్పినా ఆయ‌న గారి సామాజిక‌వ‌ర్గం.. ఆయ‌న గారి మ‌తం.. ఆయ‌న గారి కులం ఓట్లేయ‌లేదా?.. మరి ఇంత పరాభవం పొందిన జగన్ మాత్రం ఎందుకు మౌనంగా.. ఏం ఉలకకండా.. పలకకుండా ఉన్నారు. కేసీఆర్, జగన్ కొంచెం సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏం అనట్లేదా.. అదే వేరే పార్టీ కనుకు గెలిస్తే విమర్శించేవాళ్ల? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. లేకపోతే ఏదైనా మాట్లాడితే ప‌రాభ‌వం అంగీక‌రించిన‌ట్లౌతుంద‌ని సైలెంట్ గా ఉన్నారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు అసలు ప్రచారానికి షర్మిళను తీసుకొచ్చి వుంటే ఇంకొన్ని ఓట్లన్న వచ్చేవి అని అనుకునే వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా టీఆర్ఎస్ మాత్రం అన్ని పార్టీలను తుంగలో తొక్కి అత్యధిక మెజార్జీతో గెలుపొందింది. దీనికి ఏదైనా కారణం కావచ్చు.. కేసీఆర్ పాలన వరంగల్ ప్రజలకు నచ్చిఉండొచ్చు.. టీఆర్ఎస్ పై ఇంకా ప్రజల్లో వ్యతిరేక భావన రాకపోవచ్చు.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడచ్చు.. ప్రచారంలో కేసీఆర్ మాటలకు ప్రజలు ఫిదా అయి ఉండొచ్చు. ఏదైనా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు రుజువైంది.

రాహుల్ పౌరసత్వం.. అంత అర్జంటుగా విచారించలేం.. సుప్రీంకోర్టు

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాహుల్ పౌరసత్వంపై విమర్శలు చేయడం.. దానికి రాహుల్ కూడా నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అంటూ సవాల్ విసరడం జరిగాయి. అంతేకాదు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రముఖ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సుప్రీంకోర్టు రాహుల్ పౌరసత్వంపై వేసిన పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని.. రాహుల్ గాంధీ పౌరసత్వంపై వెంటనే కేసు నమోదు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని.. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఎన్నికల్లో పోటీ చేశారని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు మాత్రం తక్షణమే విచారించడానికి నిరాకరించింది. ఇప్పుడు అత్యంత అవసరంగా విచారించలేమని చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం.. మాజీ డీజీపీ మనవడు మృతి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట చౌరస్తా దగ్గర స్కోడా కారులో వరుణ్ పవార్ తో పాటు మరో నలుగురు  గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. ఇంతలో కారు అదుపు తప్పి వెనుక నుండి మిల్క్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అవిత్ పవార్, వరుణ్ పవార్, జ్ఞాన్ దేవ్, పవన్ లు అక్కడికక్కడే మరణించారు. కాగా చనిపోయిన వారిలో వరుణ్ పవార్ మాజీ డీజీపీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పేర్వారం రాములు మనవడుగా తెలుస్తోంది.

అమీర్ అసహనంపై పలువురి విమర్శలు..

  అసహంపై అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దీంతో తను అందోళనకు.. అభద్రతాభావానికి గురైనట్టు.. తన భార్య కిరణ్ రావు కూడా దేశం విడిచి వెళ్లిపోదామనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు రామ్ నాథ్ గోయంకా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ వ్యాఖ్యానించారు. దీంతో అమీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. రాంగోపాల్ వర్మ   ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఇప్పుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు.  అసలు దేశంలో అసహనం ఎక్కడుందో తనకు కనిపించటం లేదని, తనకు అలాంటిదేమీ అర్థం కావటంలేదని వర్మ అన్నారు. ‘‘హిందూ దేశంలో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లింలు.. సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో నిజంగా అసహనం ఉంటే వాళ్లు ముగ్గురూ స్టార్లు అయ్యేవారా? అసలు అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు’’ అని వర్మ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ   ఆమిర్‌ ఖాన్‌ దేశం వదిలిపోవాలని తాము ఎప్పుడూ చెప్పలేదని.. ఆయన భారత్‌లో క్షేమంగా ఉన్నారని కేంద్ర మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావితం చూపిస్తాయని అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ    అమీర్ ఖాన్ భారతదేశాన్ని వీడుతానని చెప్పడం.. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనని పేర్కొన్నారు. భూమండలం ఉన్నంత వరకు భారతదేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరని ఓవైసీ స్పష్టం చేశారు. తాము భారత్‌ను వీడి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు.   బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్   గతంలో ఎన్నడూ లేనిది ఈ ఎనిమిది నెలల్లో అసహనం పెరిగిందా.. మీ భార్య దేశం విడిచి వెళ్దామని చెప్పిందనన్నావు.. ఏ దేశం వెళ్లాలనుకుంటుదో కనుక్కున్నావా అంటూ మండిపడ్డారా. అంతేకాదు గతంలో సత్యమేవ జయతి కార్యక్రమంలో చెడును తుంచే దిశగా మాట్లాడి ప్రజల్లో ఆశలు నింపావు ఇప్పుడు అసహంపై మాట్లాడి దేశంలోని ప్రజల్లో భయాన్ని నింపుతున్నావని అన్నారు. అంతేకాదు అసహనం పై మాట్లాడిని అమీర్ ఖాన్ పై అనుపమ్ ఖేర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అవి * ‘నన్ను స్టార్ హీరోను చేసిన ఇండియాను వదిలి వెళ్లాలనుకుంటున్నావా’ అని మీ భార్యను అడిగారా? * గతంలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇండియా వదిలి వెళ్లాలనిపించలేదా అని కిరణ్ ను ప్రశ్నించారా? * ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ కాస్తా 7-8 నెలల కాలంలో మీకు ‘ఇన్ టోలరెంట్ ఇండియా’గా ఎలా మారిందో చెప్పగలరా? * దేశంలో మత అసహనం పెరిగిందని అంటున్నారు. దీని ద్వారా ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి. ఇండియా వదిలి వెళ్లమంటారా? లేదా పరిస్థితులు చక్కబడేవరకు ఆగమంటారా? మొత్తానికి అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ నాయకుల దగ్గర నుండి సనీ ప్రముఖులు కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంకా ఆ అసహనం పై.. అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

మా బాధ్యత మరింత పెరిగింది.. అసత్య ప్రచారం తగదు..కేసీఆర్

వరంగల్ ఉపఎన్నిక విజయం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో దయాకర్ గెలుపొందిన నేపథ్యంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం అందించిన వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని.. ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది.. నీటి ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయపై విమర్శలు చేశారు.. ఆఖరికి బతుకమ్మ పండుగకి కేటాయించిన నిధులపై కూడా విమర్శలు చేశారు..ఏ పథకం చేపట్టినా అసత్య ప్రచారం తగదని..  ప్రతిపక్షాలు వ్యక్తిగత నిందారోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. అంతేకాదు రూ. 33 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్ పలు అంశాలను నేరవేరుస్తామని హామి ఇచ్చారు అవి * తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం. * అశా వర్కర్ల సమస్యల విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తాం. * వచ్చే రెండు నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. * అర్హులైన బీసీలకు త్వరలో కల్యాణ లక్ష్మీ పథకం అమలు అయ్యేలా చూస్తాం. * కాలేజ్, యూనివర్శిటీ హాస్టళ్లకు సన్న బియ్య అందిస్తాం. * త్వరలో డీఎస్సీ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.

తమిళనాడు తెలుగు విద్యార్ధులకు మద్రాసు హైకోర్టు ఊరట..

నిర్భంధ తమిళం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలుగు ప్రజలకు ఊరట లభించింది. తమిళ ప్రభుత్వం నిర్బంధ తమిళం పేరుతో జీవో జారిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్ని విద్యార్ధులు తమిళంలోనే రాయాల్సి ఉంది. ఒక్క తెలుగు విద్యార్ధులు మాత్రమే కాదు.. కన్నడ, మళయాళ ఉర్ధూ పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిఉంది. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు పలు ఆందోళనలు చేపట్టినా ఫలితం శూన్యం. దీంతో అఖిల భారత తెలుగు సమాఖ్య నేతృత్వంలోని మైనారిటీ భాషా సంఘాలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్ని విద్యార్థులు వారి మాతృభాషలోనే రాయవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ చట్టంపై తెమిళనాడు ప్రభుత్వంపై మొట్టికాయలు కూడా వేసినట్టు తెలుస్తోంది. నిర్బంధ తమిళంపై చేసిన చట్టం సదుద్దేశంతో రూపొందించినది కాదని, ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. అసలు 2006లో చట్టం రూపొందగా, ఆరేళ్ల తర్వాత 2012లో ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం తెలుగు భాషపై వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టంపై ఆ రాష్ట్ర హైకోర్టు అండగా ఉంటడం శుభపరిణామామే.

చిత్తూరు మేయర్ పదవి ఎవరికి దక్కెనో?

చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ గురించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు అనురాధ హత్య నేపథ్యంలో ఇప్పుడు చిత్తూరు మేయర్ గా ఎవరికి అవకాశం దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మేయర్ పదవి బీసీ కోటాలో రిజర్వ్ అయి ఉంది. కానీ అనురాధ భర్త మోహన్ ఓసీ వర్గానికి చెందిన వాడు.. ఈ నేపథ్యంలో అనురాధ తండ్రి బీసీ వర్గానికి చెందిన వాడు కావడంతో అది పరిగణలోకి తీసుకొని అనురాధకి మేయర్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అనురాధ మరణానంతరం.. తన కోడలకి లేదా తన కూతురికో మేయర్ పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అనురాధ కోడలు కూడా ఓసీ వర్గానికి చెందినదే.. దీంతో ఈమెకు మేయర్ పదవి వస్తుందో రాదో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మేయర్ పదవికి పలు బీసి మహిళా కార్పొరేటర్లు కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 8 మంది టీడీపీ మహిళా కార్పొరేటర్లు ఉండగా వారు కూడా మేయర్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టు.. దీనిలోభాగంగానే అనురాధ కుటుంబం తరుపున ఎవరి పేరును ఖరారు చేయని నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఎలాగూ నిర్ణయం చంద్రబాబుదే కాబట్టి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.