అమర్‌నాథ్ యాత్రలో విషాదం.. నిరవధికంగా వాయిదా పడిన యాత్ర

అమర్‌నాథ్ యాత్ర భారీ వర్షాల కారణంగా రద్దైంది. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై క్లారిటీ రాలేదు . యాత్ర సాగుతున్న దారిలో మహిళ ప్రమాదానికి గురైన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతుండటంతో అమర్‌నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి ఓ నిండు ప్రాణం బలైంది. కొండచరియలు విరిగిన ఘటనలో ఓ భక్తురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భారీ వర్షాల కారణంగా గందర్ బాల్ జిల్లా, బల్తల్ ఏరియాలోని అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే దార్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బల్తల్ దారిలో కొండపైకి వెళుతున్న కొంతమంది భక్తులు బురదలో కొట్టుకుపోయారు. ఓ మహిళ చనిపోయింది. మరికొంతమంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. కొండపై చిక్కుకుపోయిన వారిని అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి తరలించాయి. ఇక, భారీ వర్షం కారణంగా అమర్‌నాథ్ యాత్ర సైతం రద్దయింది. యాత్ర పున:ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ లేదు. వర్షం కారణంగా యాత్ర సాగే రెండు దారులు బాగా పాడయ్యాయి. దీంతో ది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. యాత్ర సాగే రెండు దార్లను బాగుచేస్తోంది.  వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతోంది. దీంతో భక్తులు మొత్తం కొండ చివర్లలో ఉన్న రెయిలింగ్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇద్దరు జారిపోయి బురదలో పడ్డారు. కిందకు అలాగే కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన ఇద్దరిలో మహిళ చనిపోగా.. పురుషుడ్ని రెస్క్యూ టీమ్ రక్షించినట్లు తెలుస్తోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ఇండియా పైలెట్ల ఫైర్

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమాన ప్రమాదంలో 275 మంది మృతి చెందిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) కొద్దిరోజుల క్రితం విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అందులో విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవటమే ప్రమాదానికి కారణమని తేల్చింది. ఏఏఐబీ ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో విమానం ముందుకు వెళ్లలేకపోయింది. విమానాశ్రయానికి కొద్ది దూరంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలిపోయింది. పైలట్, ఫస్ట్ ఆఫీసర్‌తో సహా 241 మంది చనిపోయారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా 34 మంది చనిపోయారు. 275 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం రాసింది. తాజాగా.. విమానం కుప్పకూలడానికి ముందు పైలట్ల మధ్య జరిగిన సంభాషణనను బయటపెట్టింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. బోయిగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని నడుపుతున్న ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందర్.. ‘మీరెందుకు ఫ్యూయల్ స్విచ్‌లు ఆపేశారు’ అని క్యాప్టెన్ సుమీత్ సబర్వాల్‌ను అడిగాడు. ప్రమాదం జరగబోతోందని తెలిసి కుందర్ ఎంతో భయపడ్డాడు. అయితే, క్యాప్టెన్ సుమీత్ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ ప్రెసిడెంట్ సీఎస్ రంద్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ సరైన ఆధారాలు లేకుండా కథనం రాసిందంటూ మండిపడ్డారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌పై న్యాయ పరమైన చర్యలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. గురువారం (జులై 17)ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పైలట్లు ఫ్యూయల్ స్విచ్‌లు ఆపేశారని ఏఐఐబీ తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని... ఫైనల్ రిపోర్టు వచ్చే వరకు ప్రజలు తుది నిర్ణయానికి రావద్దని అభ్యర్ధించారు.

హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

  హంద్రీనీవా కాలువలకు నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్‌లో రెండు మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరును అందుబాటులోకి వచ్చింది జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్మనను ముఖ్యమంత్రి తిలకించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ-నీవా కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. తొలుత మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు.  శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల-స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించారు. మల్యాల పంప్ స్టేషన్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. హంద్రీ-నీవా ఫేజ్-1 విస్తరణ పనులు, కాల్వల ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరీ, అధికారులు పాల్గోన్నారు.   

హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ ఊరట

తెలంగాణ హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ముఖ్యమంత్రిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపణలతో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో 2016 లో సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడు కొండల్ రెడ్డి, లక్షయ్యలపై గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలని 2020లో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసును కొట్టివేయాలని 2020లో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసిన కోర్టు..  తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్‌రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని న్యాయస్థానం తెలిపింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.

కన్నడ నటికి ఏడాది జైలు శిక్ష

  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు  బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే  హక్కును నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ లేదు. మార్చి 1న బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె పట్టుబడ్డారు. ఈ కేసులో తరుణ్ కొండూరు, సాహిల్‌జైన్‌లు సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది.  కాగా, బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌ఫోర్ట్‌లో దుబాయ్ నుంచి 14.3 కిలోల బంగారం (రూ. 12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. నటి రన్యారావు, ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌లు ఈ స్మగ్లింగ్ రాకెట్‌‌లో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బెంగ‌ళూరు కోర్టు వెల్ల‌డించిన తీర్పు ప్ర‌కారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిఉంది. ఈ కేసులో ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి విచార‌ణ‌లు జ‌రుగుతాయ‌ని కోర్టు పేర్కొంది. ఇలా ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపింది.   

మీ పర్యటనలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి?

జగన్ పై పోలీసుల ఆగ్రహం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో గురువారం (జులై 17)  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. డీజీపీ స్థాయి అధికారులను మాఫియాడాన్ లతో పోల్చడం దారుణమన్నారు. వైసీపీ హయాంలోనూ ఇదే పోలీసులు పని చేసిన విషయాన్ని ఆయన మరిచిపోయారా అని నిలదీశారు.  ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు పూర్తిగా అవాస్తవమన్నారు.   పోలీసుల్ని బెదిరించ‌డం సరికాదనీ, పోలీసులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తారన్న శ్రీనివాసరావు. పోలీసుల తీరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలే గానీ ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం సమజసం కాదన్నారు. జగన్ పర్యటనలలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయని, దీని వెనుక ఉన్న కారణమేంటో జగనే జప్పాలన్నారు. పోలీసులు, పోలీసు వ్యవస్థ ఏ రాజకీయపార్టీకీ తొత్తుగా వ్యవహరించదన్న శ్రీనివాసరావు.. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 

అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరి మృతి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ లో ఓ వ్యక్తి మరణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు స్నేహితులను, మరణానికి కారణమైన మరో నలుగురు నిందితులను పోలీసులు  అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి నిందితులను  ముందు హాజరు పరిచారు. ఆయన కథనం ప్రకారం ఈనెల 12  రాత్రి సుమారు 10 గంటలకు గండికోట సాంబయ్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి గోపాల్ పూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వైపు పావురాల వేటకు వేళ్లారు. అప్పటికే అక్కడ అడవి పందుల కోసం గ్రామానికి చెందిన చందర్ రావు ప్రోద్బలంతో మరో ముగ్గురు వ్యక్తులు అమర్చిన విద్యుత్ వైర్ కాలికి తగిలి సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో భయంతో మృతుడు సాంబయ్య   స్నేహితులిద్దరూ అక్కడినుండి పారిపోయారు. అక్కడ విద్యుత్ వైర్లు అమర్చిన నిందితులు నేరం తమపై రాకుండా ఉంటుందని సాంబయ్య మృతదేహాన్ని పక్కనే   ఉన్న మరొక వ్యక్తి బావిలో పడేశారు.  మృతుడు సాంబయ్య స్నేహితులు విషయాన్ని మరుసటి రోజు ఉదయం   గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కు తెలియజేశారు. వా వారి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ సాంబయ్య మృత దేహం కనిపించలేదు. గాలించగా పక్కనే ఓ వ్యవసాయ బావిలో సాంబయ్య మృతదేహం కనిపించింది.  దీంతో అడవి పందుల కోసం విద్యుత్ వైర్లు అమర్చిన నలుగురు నిందితులతో పాటు మృతుడు సాంబయ్య ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుకున్నారు. 

వల్లభనేని వంశీ బ్యాడ్ టైమ్.. సుప్రీంలో చుక్కెదురు

పలు కేసుల్లో జైలు పాలై నానా కష్టాలు పడి బెయిల్‌పై బయటకు వచ్చిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. తాజాగా వంశీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వంశీకి ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణకు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం అనుమతిచ్చింది. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి,  పీటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (జులై 16) మధ్యాహ్నం 12:37 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భూకంపం వల్ల అలస్కా ప్రాంతంలో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలస్కాకు 20 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.  అలస్కా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.కాగా, తరచుగా భూకంపాలు వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ అలస్కా రాష్ట్రం ఉంది. ఇక్కడ తరచుగా భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. అయితే భారీ భూకంపం మాత్రం 1964లో వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 9.2 తీవ్రతో భూకంపం సంభవించింది ఆ విపత్తులో ఏకంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందే అంటున్న కవిత

ఎప్పటికైనా ఇంటి పార్టీ తన దారిలోకి రావాల్సిందేనని.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అలాగే తనపై మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను‌‌ సమర్ధించి  కవిత.. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు.. అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని పేర్కొన్నారు. ఇందుకోసం వారు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ ను తాను సమర్ధించానని కవిత చెప్పారు.  తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెం ట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తాజాగా గురువారం ( జెలై 17) హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 

భ‌ళా శిష్యా భ‌ళా.. అంతా నీ చ‌ల‌వే గురువా!

((ఫోటో చెప్పిన క‌థ‌) స‌మ‌ర్ధుడి చెమ‌ట బిందువు కూడా పిల్ల‌ల్ని పుట్టించ‌గ‌లిగే సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటుంద‌ని అంటారు పెద్ద‌లు. అలాంటి స‌మ‌ర్ధుడిగా చంద్ర‌బాబు నాయుడ్ని అభివ‌ర్ణించ‌కుండా ఉండ‌లేమంటారు కొంద‌రు. ఈ ఫోటో చూస్తుంటే అలాగే అనాల‌నిపిస్తోందనీ చెబుతారు. అప్ప‌ట్లో బాబు  తీసుకున్న ఒకానొక   నిర్ణ‌యం త‌ర్వాతి రోజుల్లో తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదినా.. త‌ర్వాత రాష్ట్రం రెండుగా చీలినా.. ఆయ‌న‌కేం ఫ‌ర‌క్ ప‌డ‌లేదు. ఆయ‌న న‌వ్యాంధ్ర‌కూ తొలి ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను త‌యారు చేసిన పేరు కూడా సాధించ‌గ‌లిగారు. మొద‌ట త‌న మంత్రి మండ‌లిలోకి కొత్త‌గా పీజేఆర్ పై గెలిచిన విజ‌య‌రామారావుకి మంత్రి ప‌ద‌వి ఇద్దామని భావించిన ఆయ‌న అదే సామాజిక వ‌ర్గానికి సంబంధించిన కేసీఆర్ ని ప‌క్క‌న పెట్టారు చంద్ర‌బాబు. దీంతో అలిగిన కేసీఆర్.. త‌ర్వాతి కాలంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కెళ్లి కొత్త పార్టీ  పెట్టి ఆపై తెలంగాణ ఏర్పాటుకు కార‌ణం కావ‌డం మాత్ర‌మే కాదు.. సీఎం కూడా అయ్యారు. ప‌దేళ్లు కొత్త రాష్ట్రాన్ని పాలించారు. దాంతో మ‌రో దారి లేక తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ ఎంపీ కావ‌డం, ఆపై టీపీసీసీ చీఫ్ కావ‌డం.. త‌ర్వాతి కాలంలో తెలంగాణకు  సీఎం కాగ‌లిగారు.   ఇప్పుడు చూస్తే త‌న గురువుతో స‌మానంగా తాను కూడా ఒక ముఖ్య‌మంత్రిగా స‌త్స మాన‌మైన హోదాలో ఆయ‌న్ను క‌లిసి అభివాదం చేశారు. చంద్ర‌బాబు కూడా త‌న శిష్యుడ్ని అభినందించారు. ఎన్నో ర‌కాల బ‌హుమ‌తులిచ్చారు. ఇది క‌దా అస‌లు రాజ‌కీయ‌మంటే.. ఒక నాయ‌కుడంటే కేసీఆర్ ప‌రిభాష‌లో చెబితే.. తాను మాత్ర‌మే నాయ‌కుడిగా ఉండి.. ఇత‌రుల‌ను ప‌నికిమాలిన చ‌వ‌ట- ద‌ద్ద‌మ్మ- స‌న్నాసుల‌ను చేయ‌డం కాదు. త‌నతో స‌మాన‌మైన నాయ‌క‌త్వాన్ని పుణికిపుచ్చుకోవ‌డం. అదే బాబు చేసి చూపించార‌ని అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

బనకచర్లపై జగన్ విషం!

వైసీపీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సొంత ప్రాంతమైన రాయలసీమపై విషం చిమ్ముతున్నారు. సీమ సాగు, తాగు నీటి కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గోదావరిపై నిర్మింత తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని బయటపెడుతున్నాయి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఇసుమంతైనా మేలు, ప్రయోజనం కలగకూడదన్న ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించేందుకు తాను ఇసుమంతైనా వెనుకాడనని బనకచర్లపై చేసిన వ్యాఖ్యల ద్వారా జగన్ మరో సారి రుజువు చేశారు.  సరిగ్గా హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్  అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలో  జగన్ తన కపటత్వాన్ని బయటపెట్టుకుంటూ బనకచర్లకు వ్యతిరేకంగా విష వ్యాఖ్యలు చేశారు. బుధవారం జులై (16) జాతీయ మీడియాతో  మాట్లాడిన జగన్  బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కరెక్టు కాదన్నారు. మిగులు జలాలు లేకుండా లింక్ ప్రాజెక్టును నిర్మించడం తగదని చెప్పారు. తెలంగాణ వాదనను బలపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమ ప్రయోజనాలకు పోలవరం - బనకచర్ల అవసరమని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. జగన్ సీమ ప్రయోజనాలు కాదు.. తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని బనకచర్చకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ద్వారా మరో సారి రుజువు చేసుకున్నారు.  గతంలో  కూడా హంద్రీ - నీవాను నిర్లక్ష్యం చేసి జగన్ సీమకు తీరని అన్యాయం చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. జగన కు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, సీమ అభివృద్ధి ముఖ్యం కాదని తేలిపోయిందని అంటున్నారు.   ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కడం కూడా అందుకేనని అంటున్నారు.   మిగుల జలాలే లేనప్పుడు బనకచర్ల నిర్మాణం వృధా అని ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేయడమే అవుతుందన్న జగన్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కాళేశ్వ‌రం కాద‌ది కాసులు రాల్చేశ్వ‌రం!

కాళేశ్వ‌రం కాదు అది కూలేశ్వ‌రం అంటారు సీఎం  రేవంత్. కానీ ఇక్క‌డ సీన్ చూస్తే అది కొంద‌రు ఉన్న‌తాధికారుల పాలిట కాసుల క‌ల్ప‌వృక్షం అన్న‌ది తెలుస్తోంది. మొన్న హ‌రిరాం అనే ఈఎన్సీ ప‌ట్టుబ‌డితే అత‌డి అక్ర‌మాస్తుల విలువ వంద కోట్లు. అదే ఓపెన్ మార్కెట్లో రెండు వంద‌ల యాభై కోట్లు. త‌ర్వాత నూనె శ్రీధ‌ర్ అనే మ‌రో ఈఈ ప‌ట్టుబ‌డితే ఇత‌డి ఆస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు ఏసీబీ అధికారులు. అయితే దీని మార్కెట్ వాల్యూ 450 కోట్ల వ‌ర‌కూ ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ రావు అనే ఈ పెద్ద‌మ‌నిషి అక్ర‌మాస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు. దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా 450 నుంచి ఐదు వంద‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుందని స‌మాచారం. ఈ ముగ్గురి అక్ర‌మాస్తుల విలువే వెయ్యికోట్ల పై మాట‌. ఈ ముగ్గురి అక్ర‌మార్జ‌న క‌థ ఒక్కొక్కొరిదీ ఒక్కో ప్ర‌త్యేక అవినీతి అధ్యాయంగా చెబుతారు. శ్రీధ‌ర్ త‌న అక్ర‌మార్జ‌న ద్వారా వ‌చ్చిన డ‌బ్బు ఏం చేయాలో అర్ధం కాక కొడుకు పెళ్లి థాయ్ ల్యాండ్ లో చేశార‌ట‌. ఇక ముర‌ళీధ‌ర్ రావు త‌న కొడుకును ఒక కంపెనీలో బ‌ల‌వంతానా డైరెక్ట‌ర్ గా చేసి.. ఈ కంపెనీకి కాళేశ్వ‌రం స‌బ్ కాంట్రాక్టులు వ‌చ్చేలా చేసి.. త‌ద్వారా త‌న అవినీతి సొమ్ము ఏరులై పారించార‌ట‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ప‌ద‌వీకాలం పూర్త‌యిన ఈ ఈఎన్సీని అదే ప‌నిగా.. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ముర‌ళీధ‌ర‌రావు అనే ఈ ఈఎన్సీ అవినీతి స‌ర‌ళి ఎలా సాగిందంటే.. ప్ర‌తి సంత‌కానికి విలువ క‌ట్ట‌డం. బిల్లులు ఆపేస్తానంటూ  బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై త‌న బంధు మిత్రుల‌కు స‌బ్ కాంట్రాక్టులు ఇప్పించ‌డం.. ఇదీ ఈయ‌న‌గారి నిర్వాకం. దీంతో కుప్ప‌లు తెప్ప‌లుగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన  ఘ‌న‌త ఈయ‌న సొంతంగా చెబుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. పై స్థాయి అధికారులే ఒక్క కాళేశ్వ‌రం పేరు చెప్పి వెయ్యి కోట్ల పైగా కూడేస్తే.. కింది స్థాయి అధికారుల మాటేంటి? ఆపై ఈ మొత్తం ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న చేసిన ఆ పై స్థాయి వారి మాటేంటి? అన్న‌దిప్పుడు ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేద‌ట‌.  ఈ ప్రాజుక్టును 80 వేల 500 కోట్ల‌తో మొద‌లు పెట్ట‌గా.. దాని అంచ‌నా వ్య‌యాల‌ను అంచ‌లంచ‌లుగా పెంచీ పెంచీ ల‌క్షా ముప్పై వేల కోట్ల‌కు చేర్చార‌ట‌. ఒక్క మేడిగ‌డ్డ ప్రాజెక్టునే వంద సార్ల‌కు పైగా.. రివైజ్ అంచ‌నాల‌ను పెంచి ప్రాజెక్టు కాస్ట్ పైపైకి ఎగ‌బాకేలా చేశార‌ట‌. దీన్నిబ‌ట్టీ ఈ ప్రాజెక్టు కూలేశ్వ‌ర‌మా.. లేక కాసులు రాల్చేశ్వ‌ర‌మా? అర్ధం చేసుకోవాలంటారు ఇరిగేష‌న్ నిపుణులు.

తిరుపతిలో చిరుత కలకలం!

తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అలిపిరి జూపార్క్ రోడుపై  బుధవారం (జులై 16)చిరుత పులి కనిపించింది. అలిపిరి జూపార్క్ రోడ్డుపై  అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో డివైడర్ పక్కన సేద తీరుతున్న చిరుతపులిని చూసిన యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ అయ్యింది. తిరపతి ప్రజలు చిరుత సంచారంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా  ఎస్వీ యూనివర్సిటీ, జూపార్క్ రోడులలో చిరుత కదలికలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.  చిరుతను బంధించేందుకు ఎస్వీ వర్సిటీ ప్రాంగణంలో బోను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జూపార్క్ రోడ్డులో చిరుత కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  

ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్లపై చర్చ.. బాబు పంతం నెగ్గినట్లేగా?

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.   ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల‌తో ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలపై కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ చ‌ర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. అయితే తెలంగాణ మాత్రం గోదావ‌రి బోర్డు స‌హా.. నీటి కేటాయింపులు.. త‌మ రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించే ప్రాజెక్టుల విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. బ‌న‌క‌చర్ల అంశంపై చ‌ర్చించేది లేద‌ని తేల్చేసింది. అయితే.. ఏపీ సీఎం పట్టుబట్టడంతో   బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.  రెండు మూడు నిమిషాల పాటు  మాత్ర‌మే బనకచర్ల విషయం ప్రస్తావనకు వచ్చినా చంద్రబాబుదే పై చేయి అయ్యిందని చెప్పక తప్పదు. ఇక బనకచర్లపై తెలంగాణ సీఎం తన అభ్యంతరాలు తెలియజేశారనుకోండి అది వేరే విషయం. అస‌లు గోదావ‌రిలో మిగులు జ‌లాలు.. రెండు రాష్ట్రాల‌కూ వ‌ర్తిస్తాయ‌ని.. అలాంట‌ప్పుడు ఏక‌ప‌క్షంగా ఏపీ బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవ‌డం ఎందుకని తెలంగాణ ప్ర‌శ్నించింది. ఇది క‌డితే.. త‌మ ప్రాంతంలోని చాలా జిల్లాలు.. ఎడారి అవుతాయ‌ని ఆందోళన  వ్యక్తం చేసింది.   దీనిపై  ఏపీ సీఎం అవ‌స‌ర‌మైతే.. రెండు తెలుగు రాష్ట్రాలూ కూడా నీటిని పంచుకునేందుకు   స‌హ‌క‌రిస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో బనకచర్ల వివాదంపై చ‌ర్చించేందుకు  ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు వీలుగా  క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి పాటిల్ ప్ర‌క‌టించారు. ఇంత వరకూ చూస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకునే బనకచర్లపై ముందుకు సాగాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చేసినట్లే భావించాల్సి ఉంటుంది. బనకచర్ల తరువాత  రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాల‌కు సంబంధించిన ఉమ్మ‌డి ప్రాజెక్టులు స‌హా.. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్రాజెక్టుల‌పై టెలీ మెట్రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా ఎవ‌రు ఎంత నీటిని వాడుతున్నార‌న్న‌ లెక్కలు కచ్చితంగా తేలనున్నాయి.   గ‌తంలో కేసీఆర్ దీనిని వ్య‌తిరేకించ‌గా.. ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. తద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఫుల్ స్టాప్ పడే దిశగా ఒక అడుగు పడిందని చెప్పవచ్చు.  అలాగే   కీల‌క‌మైన శ్రీశైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తులు, నీటి విడుద‌ల‌, స్టోరేజీ అంశాల‌పై కూడా చర్చ జరిగింది. నాగార్జున సాగ‌ర్ వివాదంపై కూడా ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.  

బెజవాడలో హైదరాబాద్ తరహా పబ్ కల్చర్.. రోడ్లపై యువత వీరంగం

విజయవాడలో  పబ్ కల్చర్ రాను రాను పెరిగిపోతోంది. పబ్‌లలో తాగి తందనాలు ఆడటమే కాకుండా హైదరాబాద్‌ తరహాలో రోడ్ల‌పైకి వస్తున్న యువత ఘర్షణలకు దిగుతున్నారు. ఇటీవల కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందరు రోడ్‌లో అర్ధరాత్రి యువకులు ఘర్షణ పడ్డారు. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బందర్ రోడ్డులో యువకులు  బాహాబాహీకి దిగారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా ఆరా తీయగా... అర్ధరాత్రి రెండు గంటల వరకూ పబ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో అర్ధరాత్రి పబ్‌లో తనిఖీలు చేసిన పోలీసులు. లాఠీలతో యువతీ, యువకులను చెదరగొట్టి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో పబ్‌లోని మందు బాబులు బిల్లు కట్టకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీపీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. అర్ధరాత్రి వరకు పబ్‌లు నిర్వహిస్తుండటంతో యువత మత్తుకు బానిసలుగా మారుతున్న పరిస్థితి. మత్తు పదార్థాలతో పాటు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహాలో అర్ధరాత్రి వరకు పబ్‌ లు నిర్వహిస్తుండే వారు. కానీ విజయవాడలో మాత్రం రాత్రి 10 లేదా 11 గంటల వరకు పబ్‌లు క్లోజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వరకు పబ్‌లను నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.  పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అర్ధరాత్రి వరకు పబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో సిటీలోని పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. రెండు రోజుల కిందట అర్ధరాత్రి 2 అయినా పబ్‌లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.

కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. హస్తినలో చంద్రబాబు బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు.  వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు క‌ృషి చేస్తున్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఢిల్లీలో బుధవారం (జులై 16) రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు  కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఏపీలో స్టేడియంల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 341 కోట్లు కేటాయింపుల అంశంపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణాహబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు సీఎం వెల్లడించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని మన్సుఖ్ మాండవీయను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

పంత్, బుమ్రా ఫిట్‌నెస్‌పై అనుమానాలు.. క్రికెట్ అభిమానుల్లో టెన్షన్

రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్‌కు దూరమవుతారన్న ప్రచారం భారత్ క్రికెట్ అభిమానులను కలకవరపరుస్తోంది. ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు మధ్యలో దాదాపు పది రోజుల విరామం వచ్చింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మంఛెస్టర్‌లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేస్‌లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండటంతో నాలుగో మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేసులో నిలుస్తుంది. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఆడతారా అనేది అనుమానంగా మారింది. వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ బుమ్రా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోయేది లేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కచ్చితంగా ఆడాలని, లేకపోతే ఆ మ్యాచ్‌లో పరిస్థితి టీమిండియాకు అనుకూలంగా ఉండదని చెబుతున్నారు. దీంతో బుమ్రాను ఆడించే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇక, మూడో టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన రిషభ్ పంత్ కూడా నాలుగో మ్యాచ్‌కు డౌట్‌గానే కనిపిస్తున్నాడు. పంత్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ కీపింగ్ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. అయితే పంత్ వేలికి పెద్ద గాయం కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సమాచారం. ఒకవేళ వీరిద్దరూ దూరమైతే మాత్రం జట్టుకు మాత్రం తీరని లోటే. కాగా, వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టి నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌ను తీసుకునే అవకాశం ఉందంటున్నారు.