ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు.. వ్యూహాత్మకమేనా?

ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు వేశారా? ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంటులో   ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు  అంగీకరించడాన్ని వెనకడుగుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా మోడీ విపక్షల డిమాండ్ కు అంగీకరించడం ఇదే తొలి సారి అని అంటున్నారు.  పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట ప్రధాని మోడీ ఇలా వెనకడుగు వేయడానికి సభలో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులు ఉండటమే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం (జులై 21) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఆదివారం (జులై  20) నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ అర్థంతరంగా నిలిపివేయడం, ప‌హ‌ల్గాం దాడికి ఒక రోజు ముందు ప్ర‌ధాని మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను అర్థంతరంగా  నిలుపుద‌ల, ఆప‌రేష‌న్ సిందూర్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌లపై చర్చించాలని డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకూ ఇవే డిమాండ్లను విపక్షాలు పలుమార్లు చేసినా పెదవి విప్పని మోడీ పార్లమెంటు వేదికగా వీటిపై చర్చించేందుకు అంగీకరించారు.   ఇందుకు ప్రధానంగా ఈ శీతాకాల సమావేశాలలో ఎలాగైన ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న 12 బిల్లుల కోసమే మోడీ ఒక అడుగు వెనక్కు వేసి విపక్షాల డిమాండ్  మేరకు ఆ మూడు అంశాలపైనా చర్చించేందుకు ఓకే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్ కు ముద్రగడ ఎయిర్ లిఫ్ట్

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆయనను హైదరాబాద్ లోని యశోదా అస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ముద్రగడ ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (జులై 19) ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అప్పుడే భావించినప్పటికీ, సామర్లకోటలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు డయాలసిస్ చేసిన తరువాత కొంత కోలుకున్నారు. ఇదే విషయాన్ని ఆదివారం (జులై 20) ఆయన కుమారుడు శశి తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ ఆయన పేర్కొన్నారు. అయితే ఆదివారం రాత్రికి ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయనను తొలుత రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరంకు తీసుకువచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ కుఎయిర్‌ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుస్తున్నారు.  ఇలా ఉండగా ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి ఆరోగ్యం విషయం తెలిసిన వెంటనే  ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చారు. తండ్రిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే క్రాంతి రావడంపై ముద్రగడ శశి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రాంతిని ముద్రగడ వద్దకు పంపించడంపై శశి ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ తన తండ్రివద్దకు పంపవద్దని ఆదేశించినా వారు వినకపోవడంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు.  గత కొంత కాలంగా ముద్రగడ కుటుంబంలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తన సోదరుడు శశి తండ్రి ముద్రగడకు సరైన వైద్య చికిత్స అందించడం లేదంటూ క్రాంతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రాంతి ముద్రగడను పరామర్శించడంపై శశి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 

హోమం టికెట్లతో తిరుమల దేవుడి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆ దర్శనం సులువుగా అయ్యేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో వెసులుబాటు కూడా కల్పించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల దేవుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. కాగా భక్తులు ఎక్కువగా శ్రీవారి దర్శనం కోసం  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపైనే  ఆధారపడతారు. ఆ టికెట్లు దొరకకపోతే తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటుంటారు. అన్ని కుదిరి తిరుమల పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్న భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు దొరకక ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే.. మళ్లీ ఎప్పుడు కుదురుతుంది? సెలవలు దొరుకుతాయా అన్న సందిగ్ధంలో  ఉంటారు. భక్తులకు ఈ బాధ తప్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హోమం టికెట్లతో కూడా శ్రీవారి దర్శనం  చేసుకోవచ్చన్న వెసులుబాటును కల్పించింది.  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కు ప్రత్యామ్నాయంగా ఈ నెల   25న  శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం' పేరిట ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్ ధర ఒక్క 1600 రూపాయలు. ఒక టికెట్ పై   ఇద్దరు హాజరు కావడచ్చు.  ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు, దర్శనానికి ముందే అలిపిరిలోని సప్తగృహ వద్ద రిపోర్ట్ చేయాలి. అనంతరం అక్కడ నిర్వహించే హోమం పూర్తి అయిన తరువాత.. అదే రోజు మధ్యాహ్నం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.   

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 45 నిముషాల పాటు త్రిశంకు స్వర్గంలో ప్రయాణీకుల ప్రాణాలు

ఇండిగో విమానంలో ఏర్పడన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణీకులు దాదాపు 45 నిముషాల సేపు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయాందోళనలతో నరకం అనుభవించారు. తిరుపతి నుంచ హైదరాబాద్ వెడుతున్న విమానం టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం దాదాపు 45 నిముషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అంత సేపూ విమానంలోని ప్రయాణీకులు ప్రాణాలు గిప్పిట పట్టుకుని నరకం అనుభవించారు.  అయితే ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు.   

తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న రెండు రోజులూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు దక్షిణ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంద్ర వరకు ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావవాతావరణ శాఖ  సోమ, మంగళ, బుధవారాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోచ్చరించింది.   రాష్ట్రంలోని 12 జిల్లాలకు వాతావరణ  ల్లో అలర్ట్  జారీ చేసింది.  ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో  రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా : లోకేశ్

  ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు  కన్నీళ్లు పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు.  జైల్లో నాన్నను చూసి గుండె తరుక్కుపోయిందని ఆయన తెలిపారు. జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ రెండు చోట్లు చంద్రబాబు అని పేరు చూశాను. ఆ కారాగారాన్ని అభివృద్ధి చేసింది. ఆయన ఉన్న భవనాన్ని కట్టించింది నాన్నే. అలాంటి వ్యక్తిని అక్కడ చూసి చాలా బాధవేసిందని లోకేశ్ తెలిపారు.  ఇంట్లో, ఆఫీస్‌లో తన తండ్రి చంద్రబాబును ఎలా పిలుస్తారనే విషయంపై స్పందించారు. "కింద ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా బాస్. పై ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా నాన్న. రాజకీయాలు ఇంట్లోకి రావు, ఆఫీస్‌లోకి పర్సనల్ మేటర్స్ రావు. అవి మేము గీసుకున్న కచ్చితమైన హద్దులు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను నాన్నా అని పిలుస్తాను. తన కెరీర్ లో తల్లి నారా భువనేశ్వరి పాత్రను కూడా ప్రస్తావించారు. "మా అమ్మ నా పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది.  నా ఎదుగుదల కోసం అన్ని రకాలుగా త్యాగం చేసింది. నా చదువు, కెరీర్ మరియు ఇతర అంశాల్లో నాకు మార్గదర్శనం చేసింది" అని వివరించారు. ఇక తమ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. అప్పటినుంచి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని తెలిపారు. 

ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి

  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్లతో​ దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దాడిలో 13 మంది అటవీ అధికారులు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి  విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆయను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పన, కుంభకోణంలో ఆయన కీలకమని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లి పలు ఆధారాలు సమర్పించింది. మిథున్‌ను విచారించాల్సి ఉందని రిమాండ్ కోరగా కోర్టు అంగీకరించింది. ఈ కేసులో మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.  అంతకు ముందు వాదనల సందర్భంగా తనను నెల్లూరు జైలు కు పంపించాలని  మిథున్‌రెడ్డి కోర్టుకు అభ్యర్థించారు. తనకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఉందని తనకు బ్లడ్ క్లాట్స్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ, అవసరాన్ని బట్టి హాస్పిటల్ లో చికిత్స సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. 409 సెక్షన్ వర్తించదని మిథున్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు.  హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందనీ కోర్టు కు తెలిపిన సిట్ తరపు లాయర్.   మిథున్ రెడ్డి అరెస్ట్ అవసరానికి సంబంధించి 29 కారణాలను కోర్టుకు చూపించిన సిట్ తరపు న్యాయవాదులు. చివరికి సిట్ న్యాయవాదుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సెక్షన్ 409, 420, 120 (B), రెడ్‌విత్ 34,37, ప్రివెన్షన్ ఆప్ కరరెప్షన్ యాక్టు 7,7ఏ, 8, 13(1)(B), 13(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.కాసేపట్లో మిథున్‌రెడ్డిని రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించనున్నారు.

మిథున్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

  వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో రింగ్ మాస్టర్‌లా వ్యవహరించి అరెస్ట్ అయ్యారు.  తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్‌ ఫర్‌ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్‌ అధికారులు. లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా మిథున్‌రెడ్డిని పేర్కొన్నారు.  మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారని సిట్‌  అధికారులు అభియోగం మోపారు. యావత్తు లిక్కర్ కుట్ర అమలుకు సత్యప్రసాద్‌ను ఉపయోగించారని తెలిపారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని, లిక్కర్‌ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు వివరించారు.  ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్‌ వ్యక్తులు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అరెస్టయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్‌ అధికారులు.మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో.. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని  సిట్‌ అధికారులు తెలిపారు.  మరింత దర్యాప్తు కోసం మిథున్‌రెడ్డికి రిమాండ్‌ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్‌రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సిట్‌ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్‌రెడ్డి సహకరించలేదని గుర్తుచేశారు. నిందితుడు మిథున్‌రెడ్డి కస్టోడియల్‌ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమీషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్‌ అధికారులు పేర్కొన్నారు.

టీడీపీ నేత మృతి పట్ల.. లోకేశ్ దిగ్భ్రాంతి

  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరి రావు  గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల మంత్రి నారా లోకేశ్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ లోని ఓ బూత్ లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు. శేషగిరి రావు పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటని లోకేశ్ పేర్కొన్నారు. శేషగిరి రావు కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుంది. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని ఎక్స్ వేదిక నారా లోకేశ్ తెలిపారు

అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం

  లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతోపాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా క్రైమ్ పార్టీలు ఆ ప్రాంతాల్లో మోహరించాయి. బోనాల్లో పోకిరిల ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీ టీమ్స్ తిరుగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాప్‌లని ప్రభుత్వం మూసివేసింది. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు..  

లిక్కర్ స్కామ్‌లో మాస్టర్ మైండ్ జగన్, భారతి : మాణికం ఠాగూర్

  వైసీపీ అధినేత జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ ఆరోపించారు. నాసిరకం మద్యంతో రూ. 32,00 కోట్ల కోల్లగొట్టారు. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు ఈ స్కామ్ మాస్టర్ మైండ్ జగన్,భారతి అని మాణికం ఠాగూర్ అన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బుతోనే ఎన్నికల్లో ఓట్లు కొన్నారు.  ఇది జగన్ మొదటి స్కామ్ కాదు గతంలో 43 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అని మాణికం ఎక్స్ వేదికగా తెలిపారు. వైఎస్ జగన్ 2012లో అరెస్టై 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారని మాణికం ఠాగూర్ అన్నారు. మాజీ సీఎం జగన్ ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మరియు భూ కేటాయింపు కుంభకోణాలు, అమరావతి చుట్టూ ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఇప్పుడు, ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి మద్యం దోపిడీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

  సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  పాతబస్తీ కుర్రోడు  రాహుల్ సిప్లిగంజ్  ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డు ను అందుకున్నారు.  సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.  ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.  ఆమేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.స్వయం కృషితో హైదరాబాద్‌ నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్‌ను గౌరవిస్తామని రేవంత్ గతంలో తెలిపారు. ఇటీవల గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలోనూ సింగర్‌కు ఏదైనా కానుక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టిని ముఖ్యమంత్రి కోరారు. 

మిథున్ రెడ్డి అరెస్టు దాని వెన‌క క‌థ కేంద్రం, క‌మామిషు!

  నిజానికి మిథున్ రెడ్డి అరెస్టు కార‌నే అనుకున్నారంతా. కార‌ణం ఇంత‌క‌న్నా మించిన కేసైన వివేకా కేసులోనే అవినాష్ ఇంత వ‌ర‌కూ అరెస్టు కాలేదు.. జ‌గ‌న్ అరెస్టు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఆ మాట‌కొస్తే.. మ‌ద్యం వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ అరెస్టే ముందు అవుతుంద‌నుకున్నారు. కానీ  కాలేదు. దానికి తోడు ఛ‌త్తీస్ గ‌డ్ మ‌ద్యం కేసు కేవ‌లం 2వేల కోట్లు. దాన్ని టేక‌ప్ చేసి ఈడీ, సీబీఐ.. 3వేల కోట్ల‌కు పైగా ఉన్న ఏపీ లిక్క‌ర్ కేసును టేక‌ప్ చేయ‌లేదు. ఢిల్లీ కేసు కూడా ఏమంత ఎక్కువ లేదు ఐదారు వంద‌ల కోట్ల‌కు మించ‌దు. కానీ కేంద్ర నాయ‌క‌త్వం ఈ విష‌యంలో చూపిన అత్యుత్సాహం అంద‌రికీ తెలిసిందే. దీంతో చేసేది లేక ఏపీ స్పెష‌ల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్- సిట్ ర్యాప్తు చేప‌ట్టింది. క‌ట్ చేస్తే ఇప్పుడు ఏ 4 మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. ఇందులో ప్ర‌ధానంగా వినిపిస్తోన్న ప్ర‌శ్న‌ ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీ మ‌ద్యం కేసును ఈడీ, సీబీఐ ఎందుకు అటెంప్ట్ చేయ‌లేదు?. అంటే వైసీపీ  బీజేపీకి ఉన్న చీక‌టి సంబంధ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వ‌మే  చొర‌వ  తీసుకుని.. ఈ కేసును డీల్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. బేసిగ్గా చంద్ర‌బాబు విష‌యంలో రెండు కేసులు ప‌డితే వాటిలో ఐటీ కేసు ఒక‌టి కాగా, స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసు మ‌రొక‌టి. ఈ రెండూ కూడా కేంద్ర స్థాయిలోనివే. ఇక్క‌డివి కావు. చంద్ర‌బాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారంటే  ఎక్క‌డో మ‌హారాష్ట్ర పూనేలో ఉన్న జీఎస్టీ అధికారులు దీన్ని క‌దిల్చి.. అక్క‌డి నుంచి ఏపీకి ఈ కేసును మ‌ళ్లించి.. ఆపై బాబును అరెస్టు చేయించారు. అంటే కేంద్ర‌మే దీని వెన‌క ఉంద‌ని మాట్లాడుకున్నారు అప్ప‌ట్లో. ఒక ర‌కంగా  చెబితే జ‌గ‌న్ కి ఈ అరెస్టు మ‌ర‌క అంట‌కుండా జాగ్ర‌త్త వ‌హించార‌న్న‌మాట‌. ఈ మాత్రం కోప‌రేష‌న్ ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వానికి లేద‌న్న‌ది.. కొంద‌రు విశ్లేష‌కుల వాద‌న‌. మ‌ళ్లీ ఇదే కూట‌మిలో ఇక్క‌డ ఏపీలో బీజేపీ కూడా ఉంది. ఆ మాట‌కొస్తే బీజేపీకి టీడీపీతో జ‌త‌క‌ట్టాల‌ని లేదని కూడా మాట్లాడుకున్నారు ఎన్నిక‌ల ముంద‌రి కాలం రోజుల్లో. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామ  క్ర‌మాల‌న్నీ మ‌న‌కు తెలిసిందే.  ఇప్పుడీ మ‌ద్యం కేసు ద్వారా ఏం తెలుస్తోందంటే.. ఇది కేంద్ర స్థాయిలో జ‌ర‌గాల్సిన  కేసు. ఇందులోని నిధులు దుబాయ్ వ‌ర‌కూ వెళ్లిన‌ట్టు చెబుతున్నారు. అంతే కాదు నాలుగైదు మార్గాల ద్వారా మ‌ద్యం మ‌నీ హవాలా రూపంలో మిథున్ రెడ్డికి చేరాయ‌నీ అంటున్నారు. అంటే మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగిన‌ట్టు ఆధారాలున్నాయి. అయినా గానీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు క‌నీసం టేక‌ప్ చేయ‌డం లేదంటే దాన‌ర్ధ‌మేంటి? జ‌గ‌న్ అరెస్టు గానీ ఆయ‌న పార్టీ లీడ‌ర్ల అరెస్టు చేయ‌డానికి గానీ కేంద్రం స‌మ్మ‌తంగా లేక పోవ‌డ‌మే క‌దా? అన్న‌ది కొంద‌రు సంధిస్తోన్న ప్ర‌శ్నాస్త్రం. మొన్న అమిత్ షా వ‌చ్చిన‌పుడు కూడా బాబు, ప‌వ‌న్ ముందు జ‌గ‌న్ రెడ్డి గురించి వాక‌బు చేయ‌డం క‌నిపించింది. నిజానికి కేంద్రం త‌లుచుకుంటే జ‌గ‌న్ మోహ‌న రెడ్డి అరెస్టుకు కేవ‌లం మ‌ద్యం కుంభ‌కోణ‌మే అవ‌స‌రం లేదు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే ఉన్న‌ 33 కేసులు చాలు. వీటిలో ఏదో ఒక‌టి  అరెస్టు చేయ‌డానికి స‌రిపోతుంది. గ‌త కొన్నేళ్ల క్రితం.. ఈడీ, సీబీఐ స్వ‌యంగా వెళ్లి కేంద్రంతో మొర పెట్టుకున్నాయి. ఇన్నాళ్ల పాటు ఆయ‌న బెయిలు పై బ‌య‌ట ఉన్నాడ‌ని. అయితే ఇదే జ‌గ‌న్, చంద్ర‌బాబు మ‌ద్యం కేసులో బెయిలుపై బ‌య‌ట తిరుగుతున్న‌ట్టు చెప్ప‌డం వింత విడ్డూరంగా ఉందంటారు కొంద‌రు నిపుణులు. టోట‌ల్ గా ఈ వ్య‌వ‌హార‌మంతా చూస్తుంటే జ‌గ‌న్ కేంద్రం అండ‌తోనే ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట తిర‌గ‌గ‌లుతున్నార‌నీ. కేంద్ర నాయ‌క‌త్వానికి వైసీపీకి సంబంధ‌ముందా లేదా చెప్ప‌డానికి ఈ ఒక్క ఎవిడెన్సు చాల‌ని అంటారు నిపుణులు. ఒక వేళ నిజంగా జ‌గ‌న్ని అరెస్టు చేయాలంటే వారికి చిటికెలో ప‌ని. గ‌తంలో శ‌శిక‌ళ‌ను ఇలాగే జైలుకు పంపిన ప‌రిస్థితి  ఉంది. అదే జ‌గ‌న్ ప‌ట్ల వారిలాంటి చ‌ర్య చేప‌ట్ట‌డం లేదంటే జ‌గ‌న్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్య‌వ‌హ‌రిస్తుందా? అన్న అనుమానాలున్నాయ‌ని అంటారు కొంద‌రు రాజ‌కీయ‌ విశ్లేష‌కులు.  

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

  రేపటి (జులై 21)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 12నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో 8 కొత్త బిల్లులను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం  నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఉభయసభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయసభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్. ఎన్సీపీ నుంచి సుప్రియాసూలే,  తెలుగుదేశం పార్టీ నుంచి  లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్,గురుమూర్తి, బీఆర్‌ఎస్‌నుంచి సురేష్‌రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.  

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు

  లిక్కర్ స్కామ్, కేసులో అరెస్ట్ అయిన, అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ ఎంపీ మిధున్ రెడ్డిని, వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు సిట్ అధికారులు  తరలించారు. సీఆర్పీఎఫ్ భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరిలించారు. వైద్య పరీక్షల అనంతరం మిధున్ రెడ్డిని, ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి, ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు.. ఈ విషయాన్ని ప్రాథమిక అభియోగ పత్రం (ప్రిలిమినరీ చార్జ్ షీట్)లో సిట్ పేర్కొంది. నిన్న శనివారం కోర్టులో సిట్ ప్రిలిమినరీ చార్జ్ షీటు దాఖలు చేసింది. తాజాగా నిందితులుగా చేర్చిన వారిలో ఎక్కువ మంది లిక్కర్ ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌లో పాత్రధారులు. ముడుపుల సొమ్ము భద్రపరిచిన డెన్లలోని సొత్తు హ్యాండ్లర్లు. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిల ప్రతినిధులుగా వీరు ఈ స్కామ్‌లో కీలకంగా పని చేశారు. వీరిలో కొంత మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. వీరిలో పలువురు దుబాయ్‌లో, ఒకరిద్దరు అమెరికాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో వీరి పాత్ర, ప్రమేయం గురించి చార్జ్ షీటులో సిట్ ప్రస్తావించింది. తాజా నిందితుల్లో రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి సోదరుడు ముప్పిడి అనిరుథ్ రెడ్డి, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, సైమన్ ప్రసన్ బావమరిది మోహన్ కుమార్, ముప్పిడి అనిరుథ్ రెడ్డి బావమరిది అనిల్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు, ఐఐటీ పూర్వ విద్యార్ధి సుజల్ బెహరూన్ లు ఉన్నారు. వీరంతా లిక్కర్ ముడుపుల సొమ్ము వసూళ్లు, తరలింపు, డొల్ల కంపెనీల ద్వారా మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. 

వైభవంగా బోనాలు..అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

  హైదరాబాద్ నగరంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అటు కార్వాన్ క్రాస్‌లోని దర్బార్ మైసమ్మ తల్లిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. ఆలయం వద్ద నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూలైన్‌ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో ఆలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

  వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా జులై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  సత్తెనపల్లి మండలం రెంటపాళల్లో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పోలీసులు పరిమిత వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.అయితే పరిమితి దాటి పోవడంతో కొర్రపాడు వద్ద పోలీసులు బారికేడ్డు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అంబటి, తన సోదరుడు మురళి, కార్యకర్తలు బారికేడ్ల వద్ద ఉన్న పోలీసులను నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను తోసేసి పోలీసులను నెట్టివేశారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటిపై సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.