సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా?

సజ్జలపై కేసు సంగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ ను నిలదీసింది. అమరావతి మహిళలపై సజ్జల చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తున్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సజ్జల దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఆ లోగా సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా తెలపాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.  సజ్జల అమరావతి ప్రాంత ప్రజలు, మహిళలను ఉద్దేశించి సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న భయంతో సజ్జల ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ గురువారం జరిగింది. సజ్జల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు.  ఆయన తన వాదనలో అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సజ్జలపై ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సజ్జల తరఫున వాదించిన పొన్నవోలు అరెస్టు చేస్తారన్న అనుమానం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఆధారంగా సజ్జలపై కేసు నమోదు చేస్తారా? చేయరా? అన్న విషయం తెలపాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశిస్తూ.. సజ్జలపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకూ పొడిగిస్తూ కేసు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.  

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

కల్లోలంగా ఉన్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హింసాకాండ, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి విదితమే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వం వైదొలగడంతో ఆక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.  తాజాగా అక్కడి పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చే వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగించాని కేంద్రం నిర్ణయించింది. దీంతో   కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అందుకు ఆమోదం తెలిపింది. వెంటనే తీర్మానాన్ని రాష్ట్రపది ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో  తీ మణిపుర్ మరో ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2026 వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.  

పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి

రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన ఝలావర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం (జులై 25) ఉదయం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అంతలోనే మృత్యువాత పడటంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది. ఝలావర్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు ఈ ఉదయం పది గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు గాయపడగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులు, పోలీసులు, అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.  

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బెజవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాతో అధికారులు దుర్మమ్మ కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, భక్తులు సహకరించాలనీ అధికారులు కోరారు. వర్షాలు తెరిపి ఇచ్చి వాతావరణం కుదు టపడిన తరువాత మళ్లీ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.  

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. మూమూలు రోజులలోనే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటిది శ్రావణమాసం అంటే ఇక చెప్పనే అవసరం లేదు. శుక్రవారం (జులై 25) నుంచి శ్రావణ మాసం ఆరంభం కావడం, అందులోనూ తొలి రోజే శుక్రవారం కావడం, వారాంతం సమీపిస్తుండటంతో    శుక్రవారం (జులై 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (జులై 24) శ్రీవారిని మొత్తం  68,800 మంది   దర్శించుకున్నారు. వారిలో 22,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  నాలుగు కోట్ల 49 లక్షల రూపాయలు  వచ్చింది.  

గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వరదలో మునిగారు!

గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ముందుకు వెడితే గంగలో మునగక తప్పదని మరో సారి రుజువైంది. ఇటీవలి కాలంలో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెడుతున్న వాహనదారులు దారి తప్పిన సంఘటనలూ, ప్రమాదాల బారిన పడిన ఘటనలూ తరచుగా జరుగుతున్నాయి. ఇటీవలే గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్లి సగం నిర్మించిన బ్రిడ్జిపై నుంచి కారు కిందపడి మరణం సంభవించిన సంఘటన మరిచిపోకముందే దాదాపు అలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది.  కేరళకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొట్టాయం ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో కొట్టాయంలోని కడుతురుత్తి రోడ్డుపై కారులో తన భార్యతో కలిసి వెడుతున్నారు.  వారు గమ్యస్థానం చేరడానికి పూర్తిగా  గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడ్డారు. ఆ మ్యాప్స్ చూపుతున్న మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన జోసెష్ నేరుగా వరద నీటిలోకి వెళ్లారు. తృటిలో ఘోర ప్రమాదం జరిగేదే. అయితే స్థానికులు గమనించి అప్రమత్తం చేయడంతో కారును ఆపారు. అయితే అప్పటికే జోసెఫ్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం వరద నీటిలో మునిగిపోయింది. స్థానికులు తక్షణమే స్పందించి జోసెఫ్ ను, ఆయన భార్యను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  

ఏపీ లిక్కర్ కేసు.. విదేశాల్లో కీలక నిందితులు.. రెడ్ కార్నర్ నోటీసులు?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడును మరింత పెంచింది. ఈ కేసులో నిందితులు అయిన ఎనిమిది మంది విదేశాలలో ఉన్నట్లు గుర్తించిన సిట్ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. విదేశాలలో తలదాచుకున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసుందుకు రంగం సింద్ధం చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎనిమిది మంది నిందితులు దుబాయ్, ధాయ్ ల్యాండ్ లో ఉన్నట్లు గుర్తించింది. వీరిలో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్. సైమన్ ప్రసన్న, ప్రద్యుమ్నలు దుబాయ్ లోనూ, ఇక అవినాష్ , అనిరుధ్ రెడ్డిలు ధాయ్ ల్యాండ్ లోనూ ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ధాయ్ ల్యాండ్ కు పారిపోయిన అవినాష్, అనిరుథ్ రెడ్డిలు వారిపై కేసు నమోదు అయిన తరువాత పరారీ అయ్యారు. ఈ ఎనిమిది మందిని భారత్ కు రప్పించేందుకు సిట్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే  విదేశాంగ శాఖకు సిట్ అధికారులు సమాచారమిచ్చారు.  దుబాయ్, థాయ్ ల్యాండ్ కు పరారైన ఈ నిందితులను భారత్ కు ఆయా దేశాలతో ఉన్న మ్యూచువల్ లీగల్ ట్రీటీస్ ద్వారా భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా విదేశాంగ శాఖకు సిట్ అధికారులు లేఖ రాశారు. 

ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో జరిగిన కులగణన సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదన్నారు. కొన్ని విషయాల్లో ఎన్డీయే సర్కార్ దిగి వచ్చేలా రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రేవంత్ తెలిపారు. కులగణన దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచి పోతుందని అన్నారు. ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, అందరి సంతోషం కోసం పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని వివరించి, ఒప్పించామని సీఎం తెలిపారు.  ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వెల్లడించారు. ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నిర్ణయంతో, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన పకడ్బందీగా నిర్వహించిందని రాహుల్ అన్నారు. కులగణన అంత సులభం కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర నేతలు అంచాలకు మించి రాణించారని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలరాయిగా నిలుస్తుందని తెలిపారు.  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.50 వేల కోట్ల పెట్టుబడుల SIPB ప్రతిపాదనలకు ఆమెదం తెలిపారు. సాగుభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంగా చర్చించారు.  పలు సంస్థలకు భూకేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో సిఫి సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది’’అని మంత్రి పార్థసారథి తెలిపారు.  త్వరలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని.. దీనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.  

ఈ నెల 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

    ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన  ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం...రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళుతున్నారు.  బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించి పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.  మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా... ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు గానూ ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు.

ఖమ్మం ఖిల్లాకు మహర్ధశ..అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు

  చారిత్రాత్మకమైన ఖమ్మం ఖిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇటీవలనే ఖిల్లాలో పాటుపడిన బావిని తిరిగి పునరుద్ధరించారు. ఖమ్మం ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే కొండపల్లి వద్ద బౌద్ధ స్థూపాన్ని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు.  ఖమ్మం జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎంతో చారిత్రక కట్టడం ఖిల్లా ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.29 కోట్లు పర్యాటక శాఖ నుంచి కేటాయించింది. ఖిల్లా పై రోప్ వే కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఖిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. దీన్ని శాసనాలు పురాతన గ్రంథాల్లో కమ్మమెట్టుగా పేర్కొన్నారు. మొట్టమొదటి ఈ కోట యొక్క బీజం ఇక్ష్వాకుల కాలంలో పడింది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది.  ఈ కోటను రేఖపల్లి పరిపాలిస్తున్న సమయంలో ముసునూరి కమ్మనాయక రాజులు బలంగా నిర్మించారు. ఆ తర్వాత సూర్యదేవర కమ్మనాయక రాజులు కమ్మమెట్టును రాజధానిగా పరిపాలించారు. రేఖపల్లి చుట్టుపక్కన ఉన్న శాసనాలు మరియు ఏకశిలామకుటం, నాయకరాజ వైభవం అనే గ్రంధాల ద్వారా ఈ సమాచారం లభ్యమవుతుంది.  తర్వాత కాలంలో బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీ వంశస్థులు ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు కమ్మమెట్టుగా ఆ తర్వాత ఖమ్మంమెట్టుగా, కుతుబ్షాహీల కాలంలో ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు    

లిక్కర్ స్కాంలో జగన్‌ని వదలొద్దంటున్న షర్మిల

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను వదిలిపెట్టొద్దని ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కోరారు.  విజయవాడలో  విలేకర్లతో మాట్లాడిన ఆమె.. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌పై విమర్శలు గుప్పించారు. సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టలరీల వద్ద కమీషన్‌లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్‌కి నెలకు రూ. 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. కేవలం బ్లాక్ మనీ‌ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి‌ ప్రభుత్వం చేసిన ఆర్ధిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. రూ. 3, 500 కోట్లు మద్యం కుంభకోణం ఒక్కటే కాదు.. పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్‌లోనే జరిగాయన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారో తేల్చాలన్నారు. డిజిటల్ పేమెంట్ ఆపడం‌ వెనుకే అవినీతి ఉందన్నారు. వీటన్నింటికీ  జగన్ సమాధానం చెప్పాలన్నారు. రిషి కొండను ఎందుకు తవ్వారో కూడా ఇంత వరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో జగన్ సొంత మీడియా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అంటూ వైఎస్ షర్మిల మరోసారి తన అన్నను తీవ్రస్థాయలో టార్గెట్ చేశారు.

కొడుకు కోసం తమ్మినేని పాట్లు.. జగన్‌కి కొత్త టెన్షన్

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో విజయంపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజార్టీ 20 వేలకు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపధం కూడా చేశారు. తీరా చూస్తే సొంత బంధువు కూన రవికుమార్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత  పొలిటికల్‌గా తమ్మినేని సైలెంట్ అవ్వడంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఆముదాలవలస వైసీపీ నాయకుడు తిరిగి లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  తమ్మినేని సీతారాం తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆముదాలవలస వైసీపీలో  కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారుతోందంట. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తమ్మినేని, తర్వాత 2009లో సామాజికవర్గం లెక్కలతో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయనకు సొంత బంధువు కూన రవికుమార్ టీడీపీ నుంచి రాజకీయ ప్రత్యర్ధిగా మారారు.  2014లో కూన రవి ఆముదాలవలసలో తమ్మినేనికి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తమ్మినేని స్పీకర్‌గా పని చేశారు.  2024లో విజయంపై ధీమా ప్రదర్శించి సవాళ్లు సైతం విసిరిన ఆయనకు కూన రవి మరోసారి షాక్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లోనే తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్‌ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్  దగ్గర కూడా అదే విషయం చెప్పారు. అయితే.. ఈ సారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ స్పష్టం చేయడంతో కాదనలేకపోయారట సీతారాం. ఎన్నికల తర్వాత ఆమదాలవలసలో సీన్ మారిపోయింది. తమ్మినేని సీతారాం యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమైనట్టు కనిపించడంతో చింతాడ రవికుమార్ ని జగన్ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు. దీంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలంట్ అయ్యారు.  తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో అమదాలవలస వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవిగా ఇన్ సైడ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయంట. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా   తమ్మినేని  అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించినా ... సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోని కార్యక్రమాలతో  మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు ఉండేవారు.  అయితే.. సడెన్ గా ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. నియోజవర్గంలో వరుస కార్యక్రమాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన  వారికి ఆమదాలవలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపినా ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ ఆర్ జయంతిని కూడా ఓ రేంజ్‌లో నిర్వహించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్ లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తుంటే.. తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి.  మొత్తానికి కొడుకు భవిష్యత్ కోసమే తమ్మినేని యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.  తమ్మినేని స్వయంగా  యాక్టివ్ అవుతుండటంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. జగన్ ను మాత్రం కొత్త సమస్య వెంటాడుతుందని తెలుస్తోంది. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా చింతాడ రవికుమార్‌ని ప్రకటించినప్పటికీ పేరాడ తిలక్‌ను ఆమదాలవలసలో భవిష్యత్ లీడర్ గా  జగన్  భావిస్తున్నారని వైసీపీలో కీలక నేతల వెర్షన్. ఇప్పుడు తమ్మినేని యాక్టివ్  అవ్వడంతో వర్గపోరు ఎక్కడ పెరుగుతుందోనని వైసీపీ అధిష్టానం తెగ టెన్షన్ పడిపోతుందంట. మరి చూడాలి ఆముదాలవలస వైసీపీ పాలిటిక్స్ చివరికి ఏ టర్న్ తీసుకుంటాయో.

ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి

  ఏపీ మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరుపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A-4గా ఉన్నారు. కాగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కారాగారంలో ఆయనకు పలు అదనపు వసతులు కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  ఈ విచారణపై సస్పెన్స్ నెలకొంది. పిటిషన్‌ను కోర్టు స్వీకరించిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా గత వైసీపీ హయంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అవనీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్‌కు అప్పగించింది. విచారణ చేపట్టడంతో పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. . ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.  కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల(జులై) 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ నెల (జులై) 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

ఖమ్మంలో శ్రీవారి ఆలయం కోసం స్థలాల పరిశీలన తుమ్మలతో టీటీడీఅధికారుల భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై  ఇప్పటికే   టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ఆ చర్చల నేపథ్యంలో   టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, టీటీడీ స్తపతి ఖమ్మంలో అనువైన స్థలాన్ని గురువారం (జులై 24) పరిశీలించారు. అనంతరం  మంత్రి తుమ్మల తో సమావేశమయ్యారు. ఖమ్మం  సమీపంలోని అల్లీపురం వద్ద ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని  శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం వీరు పరిశీలించారు.  అలాగే రఘునాథపాలెం మండలంలోని  స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మాణం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే శ్రీవారి ఆలయం నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని కూడా టీటీడీ అధికారులు పరిశీలించారు. అనం తరం మంత్రి తుమ్మలతో  భేటీ అయిన టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి ఆలయ నమూ నాలను పరిశీలించారు..  ఆగమ పండితులు, టీటీడీ స్థపతి నిర్ణయించిన ప్రాంతంలో త్వరలోనే ఆలయ నిర్మాణ స్థలాన్ని ఖరారు చేసి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తుమ్మల తెలిపారు.

ఉభయ సభలు రేపటికి వాయిదా

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతునే ఉంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), గోవా అసెంబ్లీలో  ఎస్టీలకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. ఎంత చెప్పిన సభ్యులు వినకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొంది.  బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలకు దిగారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ హరివంశ్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో ఇరు సభలు రేపటికి వాయిదా వేశారు. 

మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో గురువారం (జులై 24) భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్,  కొండా సురేఖ, వాకిటి శ్రీహరీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా , ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో  ఆమెదించి  గవర్నర్ ద్వారా  రాష్ట్రపతికి  పంపిన బిల్లు, అలాగే  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం, ఆర్డినెన్స్ తదితర అంశాలపై చర్చించారు.  

ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క ప్రజా ప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ 2021లో సీతక్క ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా సీతక్క గురువారం (జులై 24) నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజాప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు.  కోవిడ్ సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి  సీతక్క చేపట్టిన నిరసనకు సంబంధించిన కేసు విచారణకు హాజరైన సీతక్క కోర్టులో పదివేల రూపాయలతో కూడిన రెండు పూచికత్తులను దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.