కేటీఆర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్ : బండి సంజయ్

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు 2009 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే  టికెట్ ఇప్పించింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదట  సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు. అప్పుడు కేటీఆర్ వెళ్లి సీఎం రమేశ్‌కు చెప్తే ఆయన కేసీఆర్ ఒప్పించి టికెట్ ఇప్పించారు. తర్వాత సీఎం రమేశ్ ఆర్ధిక సాయం చేసి కేటీఆర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించారు అని తెలిపారు.  కేటీఆర్‌పై సీఎం రమేశ్‌ చేసిన ఆరోపణలు వాస్తవమే అని బండి సంజయ్‌ అన్నారు. సీఎం రమేశ్‌ సవాల్‌కు కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌తో చర్చకు సీఎం రమేశ్‌ను నేను తీసుకొస్తా. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్‌ చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీ  అవినీతి పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాం. ఆ పార్టీని భారతీయ జనాత పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు.  ప్రధాని మోదీ నిజామాబాద్‌ సభలో ఇదే చెప్పారు’’ అని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ముకాయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

భారత హైకమిషనర్‌తో చంద్రబాబు బృందం భేటీ

  సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బృందం  భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యింది. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు.  సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. ఇండియాతో ముఖ్యంగా ఏపీతో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు.  సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమై సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యారంగంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఆలోచనలను వివరించిన మంత్రి లోకేశ్ వారికి వివరించారు.

కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం..11 మంది అరెస్ట్

  హైదరాబాద్ కొండాపూర్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్ట్ మెంట్ లో కొంతమంది రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పార్టీ నిర్వాహుకులు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారేనని సమాచారం.  విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సంపన్న యువకులను పిలిపించి వీకెండ్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.  అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించగా.. 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్‌, 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు తెలిపారు.  వారి నుంచి 6 కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారుపేర్లతో బ్యాంక్ అకౌంట్‌, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న సరాబులను తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళ్తుంటారు. ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

  తిరుమల శ్రీవారి సేవలో నేడు ప్రముఖులు పాల్గోన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ,  మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, కింగ్‌డమ్ మూవీ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ ఉదయం శ్రీవారిని దర్శంచుకున్నారు. రంగానాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఈ సందర్బంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక, టీటీడీ పవిత్రతను కాపాడేలా, పూర్వ వైభవం వచ్చిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు.ఈ క్రమంలో దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు, అన్నదానం తో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరుణంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని యువతకు లక్షలాది ఉద్యోగాలు రావాలని, అమరావతి పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.  శ్రీవారి ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్ని నిండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ నింపి, హంద్రీనీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు.  సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు.. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు  నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.  

హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

  యూపీలోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట  చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనల్లో  ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యానట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలు భక్తులు రావడంతో క్యూలైన్ లో తోపులాట చోటుచేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి.  గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి.ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆలయం వద్దకు బయలుదేరానని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు  

మద్యం కుంభకోణం కేసు.. ఇప్పుడిక అవినాష్ రెడ్డి వంతు?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. దూకుడు పెంచింది. వరుస అరెస్టుతో ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని హడలెత్తిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సిట్ 13 మందిని అరెస్టు చేసింది.  అరెస్టైన వారిలో మిథున్ రెడ్డి మినహా మిగిలిన అందరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   అక్కడితో ఆగని సిట్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిని అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఆ జాబితాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండటంతో మిథున్ రెడ్డి తరువాత ఈ కేసులో అరెస్టు కానున్న ప్రముఖ వ్యక్తి అవినాష్ రెడ్డే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి పేరు ఎక్కడా వినిపించలేదు. కనినపించలేదు. అలాగే ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది కూడా లేదు. అలాంటిది హఠాత్తుగా అవినాష్ రెడ్డి అరెస్టునకు అనుమతి కోరుతూ సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనడంతో ఇహనో, ఇప్పుడో అవినాష్ రెడ్డిని సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవినాష్ రెడ్డితో పాటు సిట్ పేర్కొన్న జాబితాలో  పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రెన్ ఉన్నారు.వీరంతా ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించారని, వారిని కూడా అరెస్టు చేసి విచారించాల్సి ఉందని సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. వీరిలో కొందరు విదేశాలలో ఉన్నారనీ,   వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. . ఇప్పటివరకు  ఈ కేసుకు సంబంధించి 13 మందిని సిట్ అరెస్టు చేసింది.  మరో 12 మంది అరెస్టు కోసం   పిటిషన్లు దాఖలు చేసింది. ఈ 12 మందిలో అవినాష్ రెడ్డి పేరు ఉండటంతో ఆయన అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఆ కేసులో బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో అవినాష్ రెడ్డి అరెస్టునకు సిట్ రంగం సిద్ధం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

కన్యాకుమారి ముంబై ఎక్స్ ప్రెస్ లో మంటలు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కన్యాకుమారి నుంచి ముంబై వెళుతున్న రైలు అన్నమయ్య జిల్లా చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. కన్యాకుమారి- ముంబై ఎక్స్ ప్రెస్ లోని ఓ ఏసీ బోగీలు మంటలు చెలరేగడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును నందలూరు స్టేషన్ సమీపంలో నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసిన తరువాత రైలు యథా ప్రకారం ప్రయాణాన్ని సాగించింది. సాంకేతిక లోపంతోనే ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలొ శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల కొండ భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం (జులై 27) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల  క్యూలైన్ ఎన్ జీ షెడ్స్ వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.  అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక శనివారం శ్రీవారిని మొత్తం 68 వేల  229 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో  30,559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది. 

ఏపీ బ్రాండ్ ప్రోత్సహించడానికి.. సింగపూర్ వెళుతున్నాం : సీఎం చంద్రబాబు

  సింగపూర్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి పెట్టుబడుల రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నామని ఎక్స్ వేదికగా సీఎం తెలిపారు. అభివృద్ధిలో తమకు అత్యంత విలువైన భాగస్వామి, శక్తిమంతమైన తెలుగు సమాజానికి నెలవుగా ఉన్న దేశం సింగపూర్ అని కొనియాడారు. "రేపు సింగపూర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పొరా సభ్యులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో సింగపూర్ ఒక కీలక భాగస్వామిగా ఉంది.  ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, దార్శనిక దేశంగా సింగపూర్ వర్థిల్లుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లోతైన సహకారం దిశగా విలువైన అవకాశాలను అందిస్తుంది. మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి, నూతన ప్రగతిశీల విధానాలను చాటిచెప్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, సమ్మిళిత వృద్ధి దిశగా శాశ్వత సహకారాలను నెలకొల్పేందుకు ఇదొక అవకాశం" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  చంద్రబాబు బృందం సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి  సింగపూర్‌కు ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, ఉన్నతాధికారులు  వెళుతున్నారు. 

వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్‌.. బయటపెట్టిన డీఎన్‌ఏ టెస్టు

  సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన  మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్‌ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో కఫుల్స్ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు.  ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది.  ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరుచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్ట్‌లు చేయించడంతో కాన్యర్స్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ కాన్యర్స్ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది.  పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి కూడా సరిపోలలేదు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

మావోయిస్టు అగ్ర దంపతులు అరెస్ట్

  ఏపీలో మావోయిస్టు అగ్ర దంపతులు  సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు.  మావోయిస్టు పార్టీ వైఫల్యాలు మరియు కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు చెప్పారు. చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారు. కమలేష్ పై ఆంధ్రా ప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు మరియు అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశాంఅల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుంది.  వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి - 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు,  ఇతర పరికరాలు ఉన్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌లు చేస్తున్నారని డీజీపీ  తెలిపారు. మావోయిస్టు లుగా ఉన్న వారు పునరాలోచన చేయండి హింసాత్మక ఘటనలు తో సాధించేదేమీ లేదు. మన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు  గురించి అయినా ఆలోచనలు చేయండి. మీరు జన జీవన స్రవంతి లోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ తెలిపారు.  

లిక్కర్ కేసు నిందితుల నివాసాల్లో సోదాలు

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆఫీస్, భారతి సిమెంట్స్ కార్యాలయం, నానక్‌రామ్ గూడలోని చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.  మద్యం కుంభ కోణ నిందితులు ఎక్కడ సమావేశమయ్యారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే స్కామ్‌కు ముందు వీరు ఎన్ని సార్లు భేటీ అయ్యారనే అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది.  పలు సాంకేతిక ఆధారాలతో ఈ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు రికార్డులను కూడా పరిశీలించారు. తదుపరి చర్యలపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారుల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం జైలుకు పంపారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పటికే పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చేసిన ఈ రైట్స్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది

ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు : ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణ  జాగృతి సంస్థను రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆగస్టు 6న ప్రొ.జయశంకర్  జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు.  ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే నాయకుడు లక్షణమని తెలిపారు.‘‘ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప.. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడని ఆమె అన్నారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది.  తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ లాంటిది.  తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది. నాడు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుపడ్డాం, నేడు బనకచర్ల లింక్ ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని కచ్చితంగా ఆపి తీరుతామన్నారు. తెలంగాణ వనరులు, సాంస్కృతి పరిరక్షించడమే ఆలోచనగా జాగృతి పనిచేస్తుందని కవిత వెల్లడించారు.

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

  బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులువీచే అవకాశం వుంది...వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బాంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. అలాగే ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు..ఈరోజు,రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. చినుకులు రోజంతా పడతాయి. ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం పడే అవకాశముంది. మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. హైదరాబాద్‌లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం చాలా చోట్ల పడుతుంది. అయితే.. ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడొచ్చు. గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విజయవాడలో వరదలు వస్తున్నాయన్న వదంతులను నమ్మవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.

అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

  అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు. పారిశుద్ధ్య సిబ్బందికి చెందిన ఫీఎఫ్ చెల్లింపుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌కు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌ ఏజెన్సీ.. కార్మికుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో నగదు జమ చేయకుండానే చేసినట్లుగా నకిలీ చలాన్లను సృష్టించి ఆలయ అధికారులకు చూపించింది.  అయితే ఆ రికార్డులు పరిశీలించకుండానే ఆలయ అధికారులు ఏజెన్సీకి బిల్లులు  పంపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ నేపథ్యంలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆలయ పారిశుద్ధ్య పర్యవేక్షకుడు వెంకటేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణలపై ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్‌కు ఛార్జిమెమో ఇచ్చారు. టోల్ రుసుం వసూలు చేసే గుత్తేదారు నుంచి రూ. 41 లక్షలు జీఎస్టీ వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సీ-సెక్షన్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు.

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ

  తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అతి భారీ వర్ష సూచన చేసింది. ఇక, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉన్న‌ట్టు  తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

పార్టీల దయ ... బీసీల ప్రాప్తం!

ఈసారికి రిజర్వేషన్లు హుళుక్కేనా? ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్దత కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు  ఆదేశించిన విధంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహించడం సాధ్యమవుతుందా  లేదా అనేది ఒకటైతే.. ఈలోగా  42 శాతం రిజర్వేషన్ వివాదం అటో ఇటో తేలుతుందా లేదా అనేది మరో చిక్కుముడి. నిజానికి..  హై కోర్టు విధించిన గడవులోగా ఎన్నికలు నిర్వహించం ఒక్కటే సమస్య అనుకుంటే అదసలు సమస్యే కాదు. అంతకంటే ముందుగా అయినా నిర్వహించడం కూడా పెద్ద విషయం కాదు. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయడం విషయంలోనే అనేక చిక్కుముళ్లు ఎదురుతున్నాయి. అందుకే.. బీసీలకు చట్టబద్దంగా 42 శాతం రిజర్వేషన్  కల్పించి..  హై కోర్ట్ విధించిన గడువు లోగా ఎన్నికలు నిర్వహించడం ఇంచుమించుగా అయ్యే పని కాదని  రాజకీయ పార్టీలు ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుందని  పరిశీలకులు భావిస్తున్నారు.   నిజానికి రాష్ట్రంలోగ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలని ఆదేశించిన రాష్ట హై కోర్టు మొదటి 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారుకు హై కోర్టు విధించిన గడువు శనివారం (జులై 26) ముగుస్తోంది.  అందుకే.. రాజకీయ పార్టీల స్వరం మెల్ల మెల్లగా మారుతోంది.  ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ.. అటు 42 శాతం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్దత సాధించేందుకు  కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర హై కోర్టు  ఆదేశాలను గౌరవిస్తూ.. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన మాట మేరకు,పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్’ కలిపించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అధికారికంగా, అలాంటి ప్రతిపాదన ఏదీ రాకున్నా’, ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ముఖ్యనాయకులు అందరూ  కేంద్రం మెడలు వచుతాం, చట్టం తెస్తామని చెపుతున్నా.. అది సాద్యం కాదని కాంగ్రెస్ నాయకులకు అర్థమైందని అంటున్నారు. అందుకే..  కేంద్ర ప్రభుతం అడ్డుకున్నా, కాంగ్రెస్ పార్టీ  పరంగా బీసీలకు 42 శాతం అమలుచేస్తామని, మీడియా చర్చల్లో కాంగ్రెస్ నాయకులు కొత్త రాగం అందుకున్నారు.  మరోవంక..  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయక పోయినా తాము మాత్రం పార్టీలో బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. మరో వంక బీఆర్ఎస్  మౌనంగా పరిస్థితిని గమనిస్తోందని, బీసీలకు ఇచ్చిన 42 రిజర్వేషన్ పక్కన పెట్టి ఎన్నికలకు పోతే..  ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బీజేపీని ప్రజాకోర్టులో దోహిగా నిలబెట్టవచ్చన్న ఆలోచనతో  బీఆర్ఎస్’ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఈసారికి 42 శాతం రిజర్వేషన్ మాత్రం హుళక్కే అంటున్నారు.

ప్రపంచంలో అత్యం విశ్వసనీయ నేతగా నరేంద్రమోడీ మరోసారి

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ  మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విశ్వసనీయత ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ గ్లోబల్‌ లీడర్‌ సర్వేలో  మోడీ మరోసారి తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. సర్వేలో ప్రధాని మోడీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75 శాతానికి చేరాయి. ఈ ఏడాది జులై 4 నుంచి 10 తేదీల మధ్య సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధాని నంబర్1గా నిలవడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న నేతగా ప్రధాని నిలిచారని అన్నారు. అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగిన నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేత సారథ్యంలో భారత్ భద్రంగా ఉందని కామెంట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేల్లో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70 శాతానికి పైగానే ఉంటోంది. 2022 సర్వేలో కూడా 13 ప్రపంచం నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్‌లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76 శాతానికి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్ఠంగా 78 శాతాన్ని తాకాయి. తాజా సర్వేలో ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యూంగ్ ఉన్నారు. 59 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో  ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అర్జెంటీనా నేత జేవియర్ మైలీ (57 శాతం), కెనడా అధినేత మార్క్ కార్నీ (56 శాతం) ఉన్నారు. ఇక ఈ జాబితాలో 44 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.