మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వాహ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులూ ఏపీకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని పేర్కొంది. వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.     ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 170 కి.మీ., పుదుచ్చేరికి 570 కి.మీ., చెన్నైకి 670 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై  ఉన్న దిత్వాహ్ తుపాను  గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఆదివారం తెల్లవారు జామున తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో శుక్రవారం (నవంబర్ 28) సాయంత్రం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఇక శనివారం (నవంబర్ 29) అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, ఆదివారం (నవంబర్ 30) ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో నూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

గ్రామ సేవ కోసం అమెరికాలో ఉన్నతోద్యోగం వదిలేశాడు!

కన్నతల్లి, పుట్టిన ఊరు సమానం అంటారు. అలాంటి సొంత ఊరికి సేవ చేయడం కోసం అమెరికాలో లక్షల్లో వేతనం వచ్చే ఉన్నతోద్యోగాన్ని తృణ ప్రాయంగా త్యజించి వచ్చేశారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్. గ్రామానికి సేవ చేసి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేయాలన్న తలంపుతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చిన్నశంకరం పేటకు వచ్చిన శంకర్ కు అప్పట్లో గ్రామ యువత ఘనస్వాగతం పలికారు. అప్పటి నుంచీ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తున్న కంజర్ల శంకర్ ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా పోటీకి దిగుతున్నారు. గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేసి వచ్చిన కంజర్ల శంకర్..  గ్రామ సర్పంచ్ గా గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యం తోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన తాత శంకరప్ప నాలుగ దశాబ్దాల పాటు సర్పంచ్ గా గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారనీ, ఆయన వారసత్వాన్ని కొనసాగించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఈ నెల 30న తాను సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 

నకిలీ అధికారి అరెస్టు.. అతడి ఇంట్లో సోదాలలో పోలీసుల చోరీ

ఐపీఎస్, ఐఏఎస్ అధికారినంటూ హల్ చల్ చేసి పలువురు బిల్డర్లను మోసం చేసి భారీగా సొమ్మలు దండుకున్న శశికాంత్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇద్దరు గన్ మెన్ లను వెంటపెట్టుకుని మరీ తాను స్పెషల్ ఆఫీసర్‌ నంటూ శశికాంత్ బిల్డర్లను బెదరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శశికాంత్‌ షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్‌మెంట్‌లో  ఉంటూ..  తాను ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారిననీ, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్నాననీ, జాతీయ దర్యాప్తు సంస్థలో ఉన్నతపదవిలో ఉన్నాననీ చెప్పుటుంటూ..  పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలను నమ్మించి బెదరించి  భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.  శశికాంత్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఫిల్మ్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరకు అతడిని గుర్తించి   అదుపులోనికి తీసుకున్నారు.   అతను ఉపయోగించిన నకిలీ ఐడీలు,  వసూలు చేసిన డబ్బుల లావాదేవీలను సేకరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో శశికాంత్‌ ఫ్లాట్‌లో  సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో పోలీసులు తమ చేతివాటం చూపిన వైనం బయటపడింది. సాక్షుల సమక్షంలో, వీడియోగ్రఫీ మధ్య  జరుగుతున్న ఈ సోదాల్లో  పోలీసులు చోరీలకు పాల్పడ్డారు. ఆ తరువా శశికాంత్ ప్లాట్ లో చోరీ వస్తువుల పంపకాలలో పోలీసుల మధ్య గొడవ జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి దర్యాప్తునకు ఆదేశించారు.  పోలీసులు శశికాంత్ నివాసం నుంచి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.   ఒక వైపు మోసం చేసిన నకిలీ ఐఏస్‌, ఐపీఎస్‌ అధికారి … మరోవైపు అతడి ఇంట్లోనే  చోరీ చేసిన పోలీసులు.. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. సర్పచ్ పదవులకు వేలంపాటలు!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి రగిలింది. సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల కోసం గ్రామాలలో వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలు, పోలింగ్ అంటూ సొమ్ము వృధా చేయడం కంటే వేలంపాట ద్వారా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసి, ఆ వచ్చిన సొమ్మును గ్రామ అభివృద్ధికి వినియోగిస్తే గ్రామానికి మేలు జరుగుతుందన్న తలంపుతో పలు గ్రామాలలో సర్పంచ్ పదవుల కోసం వేలపాటలు జరుగున్న పరిస్థితి. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ టంకర్ గ్రామ పంచాయితీకి జరిగిన వేలం పాటలో కోటి రూపాయలకు సర్పంచ్ పదవిని ఓ వ్యాపారి దక్కించుకున్నారు.  అలాగే గద్వాల పరిధిలోని కొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి 60లక్షలకు, గొర్లఖాన్ దొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టు 57 లక్షల రూపాయలకు, చింతల కుంట సర్పంచ్ పోస్టు 38 లక్షలకు వేలంపాటలో అమ్ముడు పోయాయి.  అదలా ఉండగా గ్రామానికి సేవ చేయడమే లక్ష్యంగా లక్షల రూపాయల వేతనం వచ్చే ఉన్నతోద్యోగాలను వదిలి మరీ సర్పంచ్ పదవి కోసం పోటీ చేయడానికి ముందుకు వస్తున్న వారూ ఉన్నారు. అలా చిన్న శంకరం పేటకు చెందిన ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ తమ గ్రామానికి సేవలందించాలన్న ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని వదిలి ఆరు నెలల కిందటే గ్రామానికి వచ్చి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ గా గ్రామానికి తన వంతు సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తన తాత శంకరప్ప నాలుగ దశాబ్దాల పాటు గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారనీ, ఆయన వారస్వాన్ని కొనసాగించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఈ నెల 30న తాను సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 

జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేస్తాం.. మావోల ప్రకటన

ఆపరేషన్ కగార్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు ఆయుధాలు విసర్జించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ (మద్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ) జోన్ ప్రతినిథి అనంత్ శుక్రవారం (నవంబర్ 28) ఓ ప్రకటనే విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయుధ విసర్జనకు ఓ తేదీని ప్రకటించారు.  మావోయిస్టు పార్టీ జనవరి 1వ తేదీ నుంచి ఆయుధ విరమణ అమలు చేస్తుందని పేర్కొన్నారు.  పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.  ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని పేర్కొన్న అనంత్  తమకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంతోనే చర్చలు ఉంటాయన్నారు.  హిడ్మా ఎన్ కౌంటర్ తో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడిందని ఆ ప్రకటనలో అనంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మావోలు లొంగిపోవాలన్న కేంద్రం పిలుపునకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాము జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మావోయిస్టు పార్టీ ఏకంగా ఒక తేదీని ఖరారు చేసి ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్!

భార్య బతికి ఉండగానే, ఆమె డెత్ సర్టిఫికెట్ తీసుకుని దానికి ఆమెకే నేరుగా కొరియర్ ద్వారా పంపించిన భర్త ఉదంతమిది. కడప జిల్లా  కలిసపాడు  మండలం  దూలవారిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళకు ఆమె భర్త డెత్ సర్టిఫికెట్ పంపించాడు. భర్త వేధింపులను భరించలేక ఆదిలక్ష్మి ఇటీవల తన స్వగ్రామమైన దూలవారి పల్లెకు వచ్చేసి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముద్దనూరులో ఉండే ఆమె భర్త మారుతీరాజు ఏకంగా ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ పుట్టించి దానిని ఆమెకే కొరియర్ ద్వారా పంపించారు. తన డెత్ సర్టిఫికెట్ చూసి విస్మయానికి గురైన ఆదిలక్ష్మి తాను బతికుండగానే డెత్ సర్ఫిఫికెట్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నది. బతికున్న వ్యక్తిని డెత్ సర్టిఫికెట్  మంజూరు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.   వివరాల్లోకి వెడితే కడప జిల్లా ముద్దనూరుకు చెందిన మారుతిరాజుతో  అదే జిల్లా కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మికి 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహమైన కొన్నేళ్ల తరువాత నుంచీ దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్షగట్టిన మారుతీ రాజు తన భార్య చచ్చిపోయిందంటూ ఆమె డెత్ సర్టిఫికెట్  ను నేరుగా ఆమెకే పంపించాడు. దీంతో తాను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ పంపించడంపై ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసుల విచారణలో మారుతీరాజు తన తల్లి డెత్ సర్టిఫికెట్ లో మార్పు చేసి భార్య పేరు రాసి పంపినట్టు తేలింది.  ఈ విషయాన్ని మారుతీరాజు పోలీసుల ఎదుట అంగీకరించాడు.  బతికుండగానే భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. 

రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం ఎంపీలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అత్యధిక యువ పార్లమెంటేరియన్లు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారన్న ఆయన ఆ  యువశక్తిని ఉపయోగించి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించాలని   పిలుపునిచ్చారు.  తన క్యాంపు కార్యాలయంలో  గురువారం (నవంబర్ 27) జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మార్గదర్శనం చేశారు.   మొంథా తుఫాన్ నష్టపరిహారం, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వంటి అంశాలపై కేంద్రాన్ని ఒప్పించేలా సభలో ఎంపీలు కృషి చేయాలన్నారు. 2027 జూన్‌లో పోలవరాన్ని జాతికి అంకితం చేయడమే లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమన్నారు.  వంశధార-గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ-విజయవాడ మెట్రో రైలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను సభలో లేవనెత్తాలన్నారు.    ఈ సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేశ్‌  పార్లమెంటులో  తెలుగుదేశం ఎంపీలు   ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించాలని సూచించారు.  

ఏపీలో మూడు కొత్త జిల్లాలు

రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. అలాగే రాష్ట్రంలో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లి జిల్లాలోని పీలేరు, నంద్యాలలోని బనగానపల్లి, సత్యసాయి జిల్లాలోని మడకశిరలను రెవెన్యూడివిజన్లుగా కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.  కాగా పోలవరం జిల్లా పరిధిలోకి రంపచోడవరం, చింతూరు డివిజన్లు వస్తాయి. మార్కా పురం, కనిగిరి డివిజన్లను కలిపి మార్కాపురం జిల్లాగా, మదనపల్లె, పీలేరు డివిజన్లను కలిపి మదపల్లి జిల్లాగా ఏర్పాటౌతాయి.   

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (నవంబర్ 26)న సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన ఈ సమీక్షలో   మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే  సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా అన్ని ఏర్పాట్లూ చేయాలని మార్గనిర్దేశం చేశారు.  ఈ సదస్సుకు  ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.   పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనీ, విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతో పాటు వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు.  ఈ సందర్భంగా ఈ గ్లోబల్  సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాళ్ల డిజైన్లను అధికారులు వివరించారు. సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.  

కర్నాటక సీఎం మార్పు.. అందరితోనూ చర్చించే నిర్ణయం.. ఖర్గే

కర్ణాటక కాంగ్రెస్‌లో  సీఎం మార్పు పంచయతీ ఢిల్లీకి చేరింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాల సెగ హైకమాండ్ కు తగిలింది. దీంతో హైకమాండ్ కర్నాటక పార్టీలో విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టింది. కర్నాటక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎం మార్పు తదితర అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ఈ విషయంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.  కర్నాటక పార్టీలో  అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు.  ఇందు కోసం రాష్ట్ర నేతలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు గురువారం (నవంబర్ 27) తెలిపారు. అందరితో చర్చించి, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న తరువాత మాత్రమే సీఎం మార్పుపై ఒక నిర్ణయం తీసుకుంటామని మల్లికార్జున్ ఖర్గే  స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు  త్వరలో ఏర్పాటు చేయనున్న సమావేశంలో తాను, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సహా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పాల్గొంటారని స్పష్టత ఇచ్చారు.  

కొనసాగుతున్న మావోల లొంగుబాటు పర్వం

మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో  ఛత్తీస్ గఢ్ లో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  బీజాపూర్   ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఈ మావోయిస్టులపై 1.19 కోట్ల రివార్డులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.  ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. అలాగే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానం కూడా నక్సల్స్ లొంగుబాటుకు కారణంగా భావిస్తున్నారు. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులలో  12 మంది మహిళలు, బెటాలియన్ నంబర్ 1, వివిధ ఏరియా కమిటీల సభ్యులు, ప్లాటూన్ కంపెనీ, మిలీషియా కమిటీ సభ్యులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.  అలాగే  లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ధమారి, గరియాబంద్, నొవాపాడ డివిజన్ సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు.  

ఏపీకి అతి భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం (నవంబర్ 27) ఉదయానికి వాయుగుండంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం (నవంబర్30) నాటికి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో (నవంబర్ 29, 30) ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా  ముఖ్యంగా  నెల్లూరు, చిత్తూరు, తిరుపతి  ప్రకాశం, అన్నమయ్య,  కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు   70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం

ఇండోనేసియాలో మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప తీవ్రత ఉంది. సమత్రా దీవిలోని   ఏస్ ప్రావిన్స్ సమీపంలో సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఏస్ ప్రావిన్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   పసిఫిక్ మహాసముద్రంలోని  రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం వల్ల ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభ విస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తతం వచ్చిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.  

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు

అయ్యప్ప స్వాములు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫారంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు గురువారం (నవంబర్ 27) డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరికి బీజీవైఎసం కార్యకర్తలు తోడయ్యారు. అయ్యప్పట ముట్టడి కార్యక్రమంతో డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   అయ్యప్ప దీక్షలో ఉన్న కంచన్‌బాగ్  ఎస్సై ఎస్. కృష్ణకాంత్ కు విధుల్లో ఉండగా యూనిఫాం వేసుకోకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్పలు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. విధుల్లో ఉండగా మతపరమైన దీక్షలు అంటూ యూనిఫారం వేసుకోకపోవడం పోలీసు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎస్ ఐ కృష్ణకాంత్ కు అడిషనల్ డీసీసీ మెమో జారీ చేయడం పట్ల అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలగడంతో పోలీసులు అయ్యప్ప స్వాములను అరెస్టు చేశారు. 

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈడీ సోదాలు.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా 15 ప్రాంతాలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నది. మెడికల్ కాలేజీలలో అనుమతుల కోసం ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం పది రాష్ట్రాల్లో   పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో సోదాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్ లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరులో భారీగా అవకతవకలు జరిగిన కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాచరణలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.   ఈ కేసులో డబ్బుల లావాదేవీలు, బ్రోకర్ల నెట్వర్క్, నిధుల మార్గాలు, మనీ లాండరింగ్, ఎన్ఎంసీ అధికారులకు చెల్లింపులకు సంబంధించి కీలక విషయాలు ఈ సోదాలో  వెలుగులోకి  వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అమరావతిలో శ్రీవారి ఆలయం రెండున్నరేళ్లలో పూర్తి.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో  శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ఈ రోజు ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతిలో వేంకటేశ్వ స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణను  260 కోట్ల రూపాయలతో రెండు దశల్లో చేపట్టనున్నారు.  మొదటి దశలో దాదాపు  140 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకార నిర్మాణానికి 92 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.  రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం నిర్మించబోతున్నారు. ఇక  రెండో దశలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లుగా ఆలయ మాడవీధులు నిర్మించనున్నారు.   అమరావతిలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణం, విస్తరణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని అమరావతిలో   చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధిచేస్తామన్నారు.  రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులలో మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రూ.120 కోట్లతో రెండోదశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.  దేవతల రాజధాని అమరావతే.. మనకూ రాజధానిగా ఉంటుంది. కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో 2019లో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిం చామన్న చంద్రబాబు.. కృష్ణానదీ తీరాన ఈ ఆలయ నిర్మాణానికి పాతిక ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు.  రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశామన్నారు.  ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారనీ, రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప ఒక్కమంచి పనీ చేయలేదు. రైతులు మంచి సంకల్పంతో భూమి ఇస్తే ఐదేళ్లు వారికి నరకం చూపించారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని చెప్పిన చంద్రబాబు, తమ ఇంటి దైవం ఆ స్వామే అని చెప్పారు. మా ఇంటి నుంచి చూస్తే శేషాచల పర్వతం కనిపిస్తుందనీ, చిన్నతనం నుంచీ స్వామివారి ఆలయం చూస్తూ పెరిగాననీ అన్నారు.  స్వామికి అప్రతిష్ట కలిగించే ఏ పనీ  తాను చేయననీ, ఎవరినీ చేయని వ్వననీ స్ఫష్టం చేశారు.  తప్పులు చేస్తే వేంకటేశ్వర స్వామివారు చూస్తూ ఊరుకోడన్నారు.  తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే తాన్ స్విమ్స్‌లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించానని గుర్తు చేశారు. నాడు వేంకటేశ్వరుని సేవలో పాల్గొనేందుకు వెళ్తుంటే  నక్సలైట్లు 23 క్లైమోర్ మైన్స్‌ను   పేల్చారు. ఆ సమయంలో స్వామి వారే తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు, పాల్గొన్నారు.  

పాలనా వ్యవస్థ లోపాలపై శర సంధానం.. వాస్తవ వేదిక

ఇల్లు అలకగానే పండగ కాదు. రాష్ట్రాలు విభజించగానే సమస్యలు తీరిపోవు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కోటి సమస్యలు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని విడగొట్టిన నాటి పరిస్థితులకూ, నేటికీ పెద్ద తేడా లేదు. ఆనాడు కర్నూలు రాజధానిగా పాలించడానికి నానా కష్టాలూ పడ్డారు పాలకులు. నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ అదే.  ప్రణాళికలు బ్రహ్మాండంగా ఉన్నా, ఆచరణలో వాటి అమలుకు అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఒక వైపు నిధుల కొరత, మరో వైపు రుణాలపై వడ్డీల భారం, ఇంకో వైపు అడుగడుగునా అవినీతి సర్పాలు బుసలు కొడుతున్నాయి. అమరావతి రాజధానిగా త్వరగా ఎదగాలనుకునే వారి కన్నా, ఎందులో సొమ్ములు దొరుకుతాయోనని వెతుక్కునే నేతలు, దళారులూ ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి  ‘‘మూరెడు ముందుకి, బారెడు వెనక్కి’’ అన్నట్లు సాగుతోంది.  రాష్ట్ర విభజన జరిగాక, తొలి ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కార్యాలయ విభాగాల తరలింపు జరిగినా, తదుపరి ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం దీని నిర్మాణం జోలికి పోలేదు. పైగా విధ్వంసకర నిర్ణయాలు, రాజకీయ విద్వేషాలతోనే అభివృద్ధిని సర్వనాశనం చేసింది. కూటమి ప్రభుత్వం పేరుతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు తిరిగి దానిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ 15 నెలలు గడిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎలా జరగాలి అనే అంశాలతో పాటు, తెలుగువారి రాష్ట్ర చరిత్రను టచ్ చేస్తూ, 95 ఏళ్ల చరిత్ర కలిగిన స్వాతంత్ర కాలం నాటి వార పత్రిక జమీన్ రైతు, అమరావతి రైతుల గుండె ఘోషతో పాటు 25 ఏళ్లుగా అనేక సమస్యలతో రాజీలేని పోరాటం చేస్తున్న ‘‘తెలుగువన్’’ డిజిటల్ ఛానల్ తో కలిసి పోరాటం ప్రారంభిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఎలుగెత్తి, పరిష్కారమే లక్ష్యంగా, నిర్మొహమాటంగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు నేటి నుంచి తెలుగువన్ డిజిటల్ లో  ‘‘వాస్తవ వేదిక’’పై చర్చా కార్యక్రమం ప్రారంభమౌతోంది. జమీన్ రైతు ఎడిటర్,  నెల్లూరు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ లు ఈ వేదిక ద్వారా ప్రభుత్వం, పాలకుల అవినీతి, అక్రమాలు, అసమర్థ విధానాలపై శర సంధానం చేయనున్నారు.  ప్లీజ్ వాచ్ ఇట్ నవంబర్ 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి..

మూడు రంగుల చీర కట్టి.. కవిత అడుగులెటు?

బీఆర్ఎస్ బహిష్కృత నేత, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు ఎటుపడుతున్నాయన్న విషయంలో రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తన గులాబి రంగును కాషాయంగా మార్చుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన కల్వకుంట్ల కవిత.. తాను స్వయంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ కూడా ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు టార్గెట్ గా ఉంటున్నాయి. అదే సమయంలో  తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చేవిగానే ఆమె వ్యాఖ్యలు విమర్శలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారా అన్న అనుమానాలూ కలిగించేలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె ధరించిన చీర ఆమె కాంగ్రెస్ బాట పట్టారా అన్న అనుమానాలకు బలం చేకూర్చాయి.  డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక‌ బుధవారం (నవంబర్ 26)  జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి హాజరైన కవిత  కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్న చీరను కవిత కట్టుకట్టుకోవడమే తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చకు తావిచ్చింది. కవిత సాధారణంగా పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యే సందర్భాలలో సింపుల్ రంగులు ఉండే చీరలనే ధరిస్తారు. అయితే  మల్లు భట్టివిక్రమార్క కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు మాత్రం కవిత  ఎరుపు, ఆకుపచ్చ అంచులున్న తెల్లటి చీర ధరించి రావడం అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా పెద్ద రాజకీయ చర్చకు తెరలేపింది. ఆమె అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయన్న అభిప్రాయం కలిగేందుకు తావిచ్చింది.  బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి, ఆ పార్టీ గద్దెలు కూల్చండి అంటూ పిలుపునిచ్చిన కవిత గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉపముఖ్యమంత్రి అయిన భట్టి ఇంట్లో ఓ వేడుకకు కాంగ్రెస్ రంగులున్న చీర ధరించి మరీ హాజరు కావడంపై నెటిజనులు ఓ లెవల్ లో కామెంట్లు చేస్తున్నారు.  

ప్రతికూల వాతావరణం.. వెనక్కు మళ్లిన జగన్ హెలికాప్టర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం తప్పింది. పులివెందుల పర్యటనను ముగించుకుని గురువారం (నవంబర్ 27) ఆయన హెలికాప్టర్ లో బేంగ ళూరుకు బయలుదేరారు. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా టేకాఫ్ తీసుకున్న పావుగంటకే పైలట్ హెలికాప్టర్ ను వెనక్కు తీసుకువచ్చి పులివెందులలో ల్యాండ్ చేశారు. విపరీతమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ను వెనక్కు మళ్లించినట్లు తెలిసింది. ఎటువంటి ప్రమాదం లేకుండా హెలికాప్టర్ సురక్షితంగా పులివెందులలో ల్యాండ్ కావడంతో వైసీపీ నేతలు, శ్రేణులూ ఊపిరి పీల్చుకున్నారు.  జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 25న పులివెందులకు వచ్చిన  సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అలాగే అరటి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మూడు రోజుల పర్యటనను ముగించుకుని పులివెందుల నుంచి హెలికాప్టర్ లో  గురువారం (నవంబర్ 27) ఉదయం బెంగళూరుకు బయలుదేరారు. అయితే అలా బయలుదేరిన పావుగంటలోనే వాతావరణ ప్రతికూలత కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పైలట్ వెనక్కు మళ్లించి పులివెందులలో ల్యాండ్ చేశారు.