పవన్ కి 2+2 సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

గత కొన్ని రోజులుగా వేగం పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ని దుమ్మెత్తిపోస్తూ, బీజేపీ ని వెనకేసుకు వస్తున్నారు. మొన్నామధ్య జరిగిన గుంటూరు సభలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిందించాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం పై పడటం ఏంటి అని విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, గుంటూరు సభ సమయం‌లో సెక్యూరిటీ కావాలని ఏపి డీజిపిని పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థనని గౌరవించిన ఏపీ ప్రభుత్వం 2+2 భద్రతను ఏర్పాటు చేసింది. దీంతో నలుగురు గన్‌మెన్లను రెండు షిఫ్ట్‌ల్లో ప్రభుత్వం కేటాయించింది. తమపై తీవ్ర మైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, అవేవి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ విషయంలో తగిన శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గవర్నర్ గా నరసింహన్ కి రామ్ రామ్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ కి ఉద్వాసన పలికే అవకాశం ఉందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ లో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో, తమకి అనుకూలంగా ఉండేవాళ్ళని అక్కడ గవర్నర్ గా పెట్టడం ద్వారా తమపై విరుచుకుపడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెక్ పెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట ఢిల్లీ పెద్దలు. ఇక, తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా మెదలడం కూడా బీజేపీ పెద్దలకి మింగుడుపడని వ్యవహారం గా తయారయ్యింది. తెలంగాణ గవర్నర్ గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కె శర్మ పేరు వినిపిస్తుండగా, ఏపీ కి కిరణ్ బేడీ పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న కిరణ్ బేడీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయి. ఆమె ప్రభుత్వం విషయాల్లో జోక్యం చేసుకోవడం వివాదాంశం గా మారింది. అలాంటి వ్యక్తి ని ఏపీ కి తీసుకు వస్తే, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడెయ్యొచ్చు అనేది వారి ఆలోచనగా కనిపిస్తుంది.

తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటాడు

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 29 ఏళ్ల పోలీసు హెడ్ కానిస్టేబుల్ మోదుకూరి తులసి చైతన్య నాన్ స్టాఫ్ గా ఎనిమిదిన్నర గంటల పాటు ఈది తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటాడు. భారత్, శ్రీలంకను వేరు చేసే పాక్ జలసంధిని అత్యంత వేగంగా అంటే కేవలం 8.25 గంటల్లో ఈది రికార్డు సృష్టించాడు. దీంతో, ఇంతకు మునుపు చెన్నై యువకుడు రాజేశ్వరప్రభుత్ నెలకొల్పిన జాతీయ రికార్డును మనోడు బ్రేక్ చేసినట్లైంది. ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది స్ఫూర్తితో తానీ సాహసం చేసినట్లు చైతన్య చెప్పాడు. ఇందుకు గానూ, ఆరు నెలలుగా ప్రత్యేకంగా సాధన చేసినట్లు చెప్పాడు. శ్రీలంకలోని తలైమన్నార్ హార్బర్ వద్ద ఆదివారం ఉదయం ఈత మొదలెట్టిన తులసి చైతన్య, 32 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.25 గంటల వ్యవధిలో ఈది ఉదయం 9.25 గంటలకు తమిళనాడులోని ధనుష్కోటి వద్దకు చేరుకున్నాడు. స్పోర్ట్స్ అంటే విపరీతమయిన ఆసక్తి ఉన్న చైతన్య, స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగాన్ని పొందాడు. ఒక తెలుగు వాడు చేసిన ఈ సాహసం, మనందరికీ స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

టీడీపీ పై పవన్ తిరుగుబాటు కి అసలు కారణం ఇదేనా?

తెలుగు దేశం పార్టీ కి మొదటి నుండి స్నేహ హస్తం ఇస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆ పార్టీ పై పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జన సేన అధినేత, ప్రతిసారి, రాష్ట్రంలో టీడీపీ ని కేంద్రంలో బీజేపీ ని వెనకేసుకుంటూ వచ్చారు. కానీ, ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. అసలు, పవన్ తిరుగుబాటుకు అసలు కారణం ఏమై ఉండోచ్చబ్బా అని ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే, పవన్ కి బాబు మీద కన్నా ఆయన పుత్రుడు లోకేష్ మీదే కోపం ఎక్కువ ఉందట. దీనికి కారణం ఏంటంటే, లోకేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని చిన్న చూపు చూస్తున్నాడట. పార్టీ మీటింగ్స్ లో గానీ, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే, ఆయన వల్ల ఒరిగేదేమి లేదు, లైట్ తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చేవాడట. జన సేన తో పొత్తు కావాలంటే, తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తే, లోకేష్ ససేమీరా అన్నాడట. ఆ మధ్య పవన్ ని చంద్రబాబు ఎక్కువగా పట్టించుకోకపోవడానికి కారణం కూడా లోకేషే నట. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఇక టీడీపీ కి దూరం గా ఉందామని డిసైడ్ అయ్యాడట. తన స్పీచ్ ద్వారా మొత్తానికి బాబు, లోకేష్ పై కక్ష తీసుకున్నాడని అంటున్నారు.

బీజేపీ భేటీలో పీకే, అసలేం జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్  బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది. బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయిన ప్రశాంత్ కిషోర్ ఈ భేటీకి హాజరై... రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై వివరించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే, పీకే కి చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఓ టీవీ ఛానల్ క్లిప్ను జతచేస్తూ మరీ...`పూర్తిగా అవాస్తవ కథనం. అసత్యకథనాలను ప్రచారం చేసేందుకు దురుద్దేశపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారం గురించి వదిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది. అంతేకాకుండా  బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా  ప్రశాంత్ కిషోర్ను నియమించడం కూడా పూర్తిగా అబద్దమని పేర్కొంది. ఇదిలా ఉంటె, రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ కి, వైకాపా కి పోతుకుదుర్చే పనిలో ఉన్నారని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

శశికళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్‌కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తన భర్తని చూసేందుకు తనకు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 72 ఏళ్ల నటరాజన్‌కు లివర్ చెడిపోవడంతో 2017 అక్టోబర్‌లో కిడ్నీ మరియు లివర్ మార్పిడి ఆపరేషన్ జరిపారు. అయితే రెండు వారాల క్రితం ఆయన అస్వస్థతతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి హృద్రోగ సమస్య తలెత్తడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంతకు మునుపు నటరాజన్ కి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చినప్పుడు, శశికళ పెరోల్ పై వచ్చి భర్తని పరామర్శించి వెళ్లిన సంగతి తెలిసిందే.

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా

అనుకున్నదంతా అయ్యింది..ఏదైతే జరక్కూడదని కేంద్రప్రభుత్వం భయపడిందో అదే జరిగింది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసిరారు. నిన్న రాత్రి అనంతనాగ్ జిల్లాలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఎస్కార్ట్ వ్యాన్‌పై నిన్న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు దాడి చేశారు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే మీదకు వస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ముష్కరుల తూటాలు తగిలడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా..11 మంది గాయపడ్డారు..వీరంతా అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నారు..అయితే రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీదకు తిరగకూడదని కానీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు..ఇలాంటి పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.