అమరావతి పై ఏపీ బీజేపీ ఫుల్ క్లారిటీ

పార్టీ నేతలకు ఫుల్ క్లారిటీ ఇస్తున్న కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు   ఒక పక్క అమరావతికి తమ పార్టీ అనుకూలం అంటూనే, మరోపక్క ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అమరావతికి అనుకూలంగా బీజేపీ లో ఏ నాయకుడు మాట్లాడినా రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వస్తోంది. మొన్న మూడు రాజధానుల విషయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ పార్టీ నాయకుడు రమణ ఒక ప్రముఖ పత్రికలో వ్యాసం రాశారని పార్టీ నుండి సస్పెండ్ చేయగా, తాజాగా అదే పార్టీకి చెందిన వెలగపూడి గోపాలకృష్ణ ని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది.   తాజాగా రాజధాని ఏర్పాటుతో సంబంధం లేదని కేంద్రం అఫిడవిట్ లో తెలపడం భావ్యం కాదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేనప్పుడు అని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఇచ్చారు అని వెలగపూడి గోపాలకృష్ణ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ వైఖరికి నిరసనగా తన చెప్పుతో తనే కొట్టుకున్నారు. దీంతో వెంటనే రాష్ట్ర బీజేపీ అధిష్టానం వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.   దీంతో అమరావతి పై బీజేపీ వైఖరి స్పష్టం అయిందని.. అది పైపైకి అమరావతి కి అనుకూలంగా అంటూనే.. లోపల మాత్రం వ్యతిరేకంగా పని చేస్తోందని ప్రస్తుత పరిణామాలను బట్టి క్లియర్ గా అర్ధమవుతోంది అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

'న్యూ' హిస్టరీ సాధించిన న్యూజీలాండ్

కరోనా మహ్మమారిని కట్టడి చేసిన దేశం గత వంద రోజులుగా ఒక పాజిటివ్ రాలేదు   ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న కరోనా కట్టడి పెద్ద సవాల్ గా మారింది. భూగోళంపై ప్రతిదేశంలోనూ వ్యాపించింది. అయితే కట్టడి చేయడంలో మాత్రం కొన్ని దేశాలు విజయం సాధిస్తే మరికొన్ని దేశాలు ఏం చేయాలో అర్థం కాక నివారణ చర్యలను ప్రజలపైనే వదిలేశారు. అయితే  50లక్షల జనాభానే ఉండే చిన్న దేశమైన న్యూజీలాండ్ మాత్రం కరోనా కట్టడిలో విజయం సాధించింది. గత వందరోజులుగా అక్కడ ఒక కొత్త కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ పలువురి నుంచి అభినందనలు అందుకుంటుంది. న్యూజీలాండ్ దేశం కోవిద్ వైరస్ కట్టడికి తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇతర దేశాలకు పాఠాలు అవుతున్నాయి.   ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే న్యూజీలాండ్ లో చాలా తక్కువ కేసులు నమోదు అయ్యాయి. మరణాలు సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. 50ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న న్యూజిల్యాండ్ లో మొదటి కరోనా పాజిటివ్ కేసును ఫిబ్రవరి 26న గుర్తించారు. దాంతో అప్రతమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.   అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహిస్తూ లక్షణాలు ఉన్నవారందరినీ క్వారంటైన్ చేశారు. దాంతో  ఫిబ్ర‌వ‌రిలోనే 1,219కేసులు  బయటపడ్డాయి. వీరిలో 22మంది మరణించారు. వ్యాప్తిని అరికట్టడానికి ఆ దేశం అనేక కఠిన చర్యలను తీసుకుంది. మార్చి 19 నుంచే  విదేశాల నుంచి వచ్చేవారిని ఆపేసింది. తప్పనిసరై వచ్చిన వారిని కచ్ఛితంగా క్వారంటైన్ చేశారు. దీంతో అక్కడ కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గింది. చివరి కేసు మే 1న బయటపడింది. అప్పటి నుంచి మళ్లీ పాజిటివ్ కేసులేవి న్యూజీలాండ్ లో నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను నివారించడానికి  దాదాపు 65రోజుల పాటు కఠిన చర్యలు తీసుకుంటున్న‌ట్లు ఆయన తెలిపారు.  కరోనా వైరస్ నుండి బయటపడటానికి న్యూజిలాండ్ మూడు రకాల చర్యలను తీసుకుంది.   - కొత్తగా వ్యక్తులు ఎవరూ దేశంలోకి రాకుండా సరిహద్దులను మూసేశారు. కమ్యూనిటీ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. - ప్రజల్లో వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు. తప్పనిసరై బయటకు వచ్చే ప్రజలు మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. -  వ్యాధి సోకిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్ చేశారు.   కొత్తగా కేసులు నమోదు కాకపోయినా లక్షణాలు కనిపించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం మాత్రం న్యూజీలాండ్ ప్రభుత్వం ఆపలేదు. తాజాగా 4,249 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. ఒక్క కేసు కూడా నమోదు కాక‌పోవడంతో గత వందరోజులుగా ఈ దేశంలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.  ప్ర‌స్తుతం 23 మంది చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజలందరూ కరోనా కట్టడిని ఒక ఉద్యమంగా తీసుకోవ‌డం, కచ్ఛితమైన నిబంధనలు పాటించడంతోనే ఇది సాధ్య‌మైంద‌ని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.    ఫిజీ దేశం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టిందని ఆ దేశ ప్రధాని ఫ్రాంక్ బైనీమారామ ట్విట్టర్ ద్వారా తెలిపారు. న్యూజీలాండ్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ  'ఈ భూమి మీద కరోనా వైరస్ ను కట్టడి చేసి గత వందరోజుల్లో ఒక కేసు కూడా రాకుండా నియంత్రించిన దేశాలు ఫిజీ, న్యూజీలాండ్ మాత్రమే' అన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా, కరోనా పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని, అలాగే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.   ఇక భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 62,064 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,007 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కి చేరగా, మృతుల సంఖ్య 44386కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,34,945 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రోజా, మధుసూదన్ రెడ్డి రోడ్ల మీద పడి ఉరేగింపులు చేసినా కేసులు లేవు

వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తోందని టీడీపీ నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ మీద విడుదలైన జేసి ప్రభాకర్ రెడ్డిని పోలీసులతో వాగ్వివాదానికి దిగారని మళ్లీ  రిమాండ్‌కు తరలించడం దారుణమని అన్నారు.   ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా, మధుసూదన్ రెడ్డి రోడ్ల మీద పడి ఉరేగింపులు చేసినా కేసులు లేవని మండిపడ్డారు. ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తూ.. తప్పు చేయక పోయినా కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.    గుంటూరులో ఒక మైనార్టీ వ్యక్తి మీద సీఐ దుర్భాషలాడిన ఘటనపై ఎటువంటి చర్యలు లేవని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక తరలింపును అడ్డుకున్న యువకుడికి పోలీసులే శిరోముండనం చేయిస్తే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

వైసీపీలోకి చలమలశెట్టి సునీల్‌.. అధికారం దూరమవుతుందన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులు!

టీడీపీకి మరో నాయకుడు గుడ్‌బై చెప్పబోతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీని వీడగా.. తాజాగా ఆ లిస్టులో మరో నాయకుడు చేరారు. టీడీపీ నేత చలమలశెట్టి సునీల్‌ సోమవారం సీఎం వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.   ఇదివరకు వైసీపీలో చాలాకాలం పాటు కొనసాగిన చలమలశెట్టి సునీల్.. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి తోట నర్సింహం చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.   సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్దిగా టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన.. వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో ఓటమి చవి చూశారు. ఓటమి తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా మళ్లీ ఆయన సొంతగూటిలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్‌ కు అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.   అయితే సునీల్ వైసీపీ గూటికి చేరుతున్నారన్న వార్తతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దానికి సునీల్ ఎన్నికల ట్రాక్ రికార్డే కారణం. ఇప్పటి వరకూ కాకినాడ లోకసభ స్థానం నుంచి సునీల్ మూడుసార్లు పోటీచేయగా.. ముడుసార్లూ ఆయనకు పరాజయం ఎదురయ్యింది. అంతేకాదు ఆయన ఏ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసినా, ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది.    తొలిసారి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన సునీల్‌.. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ప్రజారాజ్యం.. తర్వాత కాంగ్రెస్ లో విలీనమైంది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయగా.. ఆయనకు ఓటమి ఎదురైంది, వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. ముచ్చటగా మూడోసారి ఆయన ఓడిపోవడమే కాకుండా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఘోర పరాజయంపాలై ప్రతిపక్షానికి వచ్చేసింది.   ఇలా చలమలశెట్టి సునీల్‌ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఓడిపోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రజారాజ్యంలో చేరితే ఆ పార్టీనే కనుమరుగైంది. వైసీపీలో ఉంటే ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. టీడీపీలో చేరితే ఆ పార్టీకి అధికారం దూరమైంది. మళ్ళీ ఇప్పుడు సునీల్.. వైసీపీ గూటికి వస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితమవ్వక తప్పదా అని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

విజయవాడ కరోనా చికిత్స కేంద్రంలో అగ్ని ప్రమాదం పై స్పందించిన రమేష్ హాస్పిటల్స్

నిన్న విజయవాడ నగరంలోని కరోనా చికిత్సా కేంద్రంగా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 10 మంది మృత్యువాత పడిన సంగతి తెల్సిందే. విజయవాడలోని ప్రముఖ రమేష్ హాస్పిటల్స్ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని కరోనా చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా దీనిపై రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ స్వర్ణప్యాలెస్ హోటల్ నిర్వహణతో తమకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది.   రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. ఎక్కువ మంది కరోనా బాధితులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చామని తెలిపింది. అయితే హోటల్ నిర్వహణతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం తాము రోగులకు వైద్య సేవలు అందించామని వివరించింది. కరోనా రోగులను చేర్చుకోవాలని తమకు భారీగా విజ్ఞప్తులు వస్తుండడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలున్న హోటల్లో ప్రభుత్వ అనుమతితో రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అంతే కాకుండా ఇక్కడ చికిత్స తీసుకున్న కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారన్నారని కూడా వివరించింది.

బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో.. అమోనియం నైట్రేట్ చెన్నై నుండి హైదరాబాద్ తరలింపు 

కొద్ది రోజుల క్రితం లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని నౌకాశ్రయంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వ‌లు సృష్టించిన బీభ‌త్సంలో వందకుపైగా మృతి చెందగా.. వేలాది మంది ఆస్ప‌త్రుల పాలు అయ్యారు. తాజాగా ఇండియాలో భద్రతా చర్యల్లో భాగంగా చెన్నైనౌకాశ్రయంలో లో నిల్వ ఉంచిన 697 టన్నుల అమోనియం నైట్రేట్ ను ఈ-వేలం ద్వారా హైదరాబాద్ కు చెందిన వ్యాపారి కొనుగోలు చేయడంతో దాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.   తమిళనాడులోని చెన్నై పోర్టుకు భారీ ఎత్తున దిగుమతి అయిన అమోనియం నైట్రేట్ ను 2015లో కస్టమ్స్ యాక్ట్ 1962 కింద సీజ్ చేయగా అప్పటి నుంచి దాన్ని నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక గోడౌన్ లో నిల్వ ఉంచారు. తమిళనాడుకు చెందిన ఓ దిగుమతిదారు, ఎరువుల తయారీ నిమిత్తం ఇంపోర్ట్ చేసుకుంటున్నాని అనుమతి తీసుకుని, దక్షిణ కొరియా నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నాడు. అయితే, ఇది ఫర్టిలైజర్ గ్రేడ్ కాకుండా ఎక్స్ ప్లోజివ్ గ్రేడ్ రూపంలో ఉందని గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతని దిగుమతి అనుమతులు రద్దు చేశారు.   ఐతే తాజాగా బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిని అధికారులు ఈ వేలం వేశారు. దీన్ని హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేయడంతో దాని తరలింపు ప్రక్రియ చేపట్టారు. భద్రతా సంస్థలు సూచించిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ఈ రసాయనాన్ని హైద‌రాబాద్‌కు ర‌వాణా చేస్తున‌ట్టుగా అధికారులు చెప్తున్నారు.

సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత.. వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.    రెండు సార్లు మంత్రిగా పని చేసిన సాంబశివరాజు.. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి సాంబశివరాజు వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94 లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.    సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు సాంబశివరాజు. మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఈ తరం నాయకులు ఎందరికో ఆయన రాజకీయ గురువు. అయితే, రాజకీయ కురువృద్ధుడిగా, మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందినప్పటికీ.. వైసీపీలో చేరిన తరువాత సాంబశివరాజుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు కరువైందనే చెప్పాలి. 

లేటెస్ట్ హెల్త్ అప్ డేట్.. పిల్లలలో కరోనా తో పాటు కొత్తగా కావసాకి సిండ్రోమ్..

కరోనా తో ప్రపంచం అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా కరోనా వైరస్ సోకిన పిల్లలకు కొత్తగా కావసాకి సిండ్రోమ్ (MIS-C) బయట పడుతోంది. తాజాగా అమెరికాలోని 600 మంది పిల్లలు ఒక అరుదైన అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. ఆ పిల్లలందరికీ జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి వచ్చాయి. దీంతో టెస్ట్ చేసిన డాక్టర్లు వారికీ కరోనా సోకిందని తేల్చారు. ఐతే ఆ పిల్లలలో ఈ కొత్త లక్షణాలకు కారణం కావసాకి సిండ్రోమ్ లేదా మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) అని తేల్చారు. ఈ సిండోమ్ కు కారణం కరోనా వైరస్ అని కూడా డాక్టర్లు తేల్చారు. ఇది సోకిన పిల్లలకు జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి వస్తాయి. కొన్ని సందర్భాలలో అరుదుగా గుండె మంట కూడా వస్తుంది. కరోనా వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల తర్వాత పిల్లలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.   మే నెలలో అమెరికాలో మొదటి MIS-C కేసు బయటపడింది. దీంతో అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ (CDC)అప్రమత్తమై ఇలాంటి కేసులు ఎక్కడొచ్చినా తనకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గత నెల జులై 29 నాటికి దాదాపు 570 (MIS-C) కేసులు నమోదయ్యాయి. ఈ సిండ్రోమ్ బారిన పడిన వాళ్లందరికీ కరోనా వైరస్ సోకింది. అంతే కాకుండా వాళ్లలో 10 మంది చనిపోయారు. తాజాగా ఇటువంటి కేసులు అమెరికాతో పాటూ ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లోకూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఐతే ముందుగానే గుర్తిస్తే ఈ కొత్త సిండ్రోమ్ నుండి పిల్లల్ని కాపాడవచ్చని CDC తెలిపింది. అంతే కాకుండా దీనిపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరింది.   మరో పక్క ఇండియాలో కూడా ఇటువంటి లక్షణాలతో ఉన్న కొంత మంది పిల్లలకు గత నెల జులైలో ట్రీట్ మెంట్ ఇచ్చినట్లుగా ముంబై, ఢిల్లీలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రకటించాయి. కరోనా సోకి, నయమైన పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని, వారికీ మళ్లీ జ్వరం తిరగపెడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జోరుగాలివానతో కేరళ విమాన ప్రమాదం

చాకచక్యంగా వ్యవహరించి వందలాది మంది ప్రాణాలు కాపాడిన పైలట్లు   జరుగుతున్న విచారణ   శుక్రవారం 7ఆగస్టు 2020 ..  అరబ్ దేశాల్లోని దుబాయ్ నుంచి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 1344 (బోయింగ్ 737 విమానం) కోజివీడ్ కాలికట్ కు బయలుదేరింది. ఈ విమానాన్ని వైమానిక దళ మాజీ పైలెట్ దీపక్ వసంత్ సాథే నడుపుతున్నారు. కో పైలట్ గా అఖిలేష్ కుమార్ ఉన్నారు. విమానంలో పది మంది చిన్నారులు, ఏడుగురు సిబ్బందితో కలిపి మొద్దం 191 మంది ప్రమాణికులు ఉన్నారని సమాచారం. ఈ విమానం 13సంవత్సరాల కిందటి  విటి -ఎెక్స్ హెచ్  బోయింగ్ 737 - 8హెచ్ జి విమానం.   భారత కాలమానం ప్రకారం సరిగ్గా రాత్రి ఏడు గంటల 39 నిమిషాలు. ఎయిరిండియా 1344 విమానాన్ని కోజివీడ్ విమానాశ్రయంలోని రన్ వే 28పై ల్యాండింగ్ కావడానికి పైలట్స్  ప్రయత్నం చేశారు. అయితే జోరుగాలి, భారీ వర్షం కారణంగా వారు చేసిన మొదటి ప్రయత్నం విఫలం అయ్యింది.  ఎయిర్ పోర్టు ప్రాంతంలో పలుమార్లు చక్కర్లు కొట్టిన తర్వాత మరోసారి ల్యాండింగ్ కావడానికి ప్రయత్నం చేశారు. రెండోసారి రన్ వే 10పై ల్యాండ్ కావడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో గాలి 12నాట్స్ స్పీడ్ తో వీస్తోంది. విమానాన్ని వెనక్కి నుంచి జోరుగాలి ముందుకు తోయడంతో స్పీడ్ ను అదుపు చేయడానికి ప్రయత్నించారు. స్పాయిలర్స్, త్రస్ట్ రివర్స్, బ్రేక్స్  వేశారు. అయినా స్పీడ్ అదుపులోకి రాకపోవడంతో విమానం రన్ వే దాటి ముందుకు దూసుకు పోయ్యింది. భారీ వర్షం, జోరుగాలి, చీకటి కారణంగా విజుబులిటీ 2000మీటర్ల మేరకే ఉంది. పరిస్థితి పైలట్ల చేయి దాటి పోయింది. దాంతో రన్ వే దాటి ముందుకు వెళ్ళిన విమానం రన్ వే పక్కనే ఉన్న 50 అడుగుల లోతులో పడిపోయింది. భారీశబ్ధంలో విమానం విరిగిపోయింది. పైలట్ , కో పైలట్ తో సహా 17మంది అక్కడికక్కడే మరణించారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఇందులో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.   వాతావరణం సరిగ్గా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విమాన ప్రమాదంలో  వైమానిక దళంలో పైలట్ గా విధులు నిర్వహించి ఎన్నో అవార్డులు అందుకున్న పైలట్ దీపక్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు అంటున్నారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి సకాలంలో ఇంజిన్లను ఆఫ్‌ చేయడం వల్ల విమానంలో మంటలు చెలరేగకుండా నివారించారు. దీంతో పెను ముప్పి తప్పి, వంద మంది ప్రాణాలు కాపాడారు. విమాన ప్రమాదంలో కీలకంగా భావించే ‘బ్లాక్‌ బాక్స్‌’ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుగుతోంది.    ఇదే విధంగా 5ఫిబ్రవరి 2020న ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో భారీవర్షం కారణంగా737 - 800 బోయింగ్ విమానం, పెగసాస్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2193 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోనూ విమానం విరిగిపోయింది. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ బోయింగ్ 737 విమానమే ప్రదామానికి గురుకావడం యాదృచ్ఛికం. ఈ ప్రమాదాలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.

క్యోటో కు బదులుగా నాగసాకీ

రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా అణుబాంబులు వేసి పెను విధ్వంసానికి కారణమైంది. 6 ఆగస్టు 1945న హిరోషిమాపై యురేనియం గన్ రకం బాంబును (లిటిల్ బాయ్) వేసింది. ఆగస్టు 9 న ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేసింది. ఈ బాంబుల దాడిలో మరణించిన వారి సంఖ్య లక్షల్లోనే.. మానవ చరిత్రలోనే మరిచిపోలేని సంఘటనలుగా మిగిలిపోయాయి. అయితే ముందుగా అనుకున్న ప్రకారం క్యోటో నగరంపై దాడి జరగాలి. కానీ, అది నాగసాకి నగరానికి ఎందుకు మారింది..అధ్యక్షుడిని ఒప్పించి ఈ నగరాన్ని లక్ష్యాల జాబితాలో చేర్చింది ఎవరూ..   అణుబాంబుల పై పరిశోధనలు మాత్రం మొదట జర్మనీలో ప్రారంమయ్యాయి. 1938 లో జర్మను కెమిస్టులు ఓట్టో హాన్, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్‌లు అణువిచ్ఛిత్తిని కనిపెట్టడంతోనూ విజయం సాధించారు. లీస్ మీట్నర్, ఓట్టో ఫ్రిష్‌లు దానికి సైద్ధాంతిక వివరణ ఇవ్వడంతోనూ బాంబు తయారీ సాధ్యమైంది. అయితే  జర్మనీ ముందుగా అణుబాంబును తయారు చేస్తుందేమోనన్న భయంతో  1939 చివర్లో అమెరికాలో దీనిపై పరిశోధనలు మొదలయ్యాయి. 1941 లో బ్రిటిషు వారి మాడ్ కమిటీ నివేదిక వచ్చేదాకా పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగాయి. బాంబు తయారీకి కోసం టన్నుల కొద్దీ సహజసిద్ధ యురేనియమ్ బదులు 5-10 కిలోల శుద్ధి చేసిన యురేనియమ్-235 సరిపోతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాత 1943 లో క్విబెక్ ఒప్పందం ప్రకారం యుకె, కెనడాల అణుకార్యక్రమాలు - ట్యూబ్ అల్లాయ్స్, మాంట్రియల్ లాబొరేటరీలు అమెరికా వారి మన్‌హట్టన్ ప్రాజెక్టులో విలీనమయ్యాయి. దాంతో  రాబర్ట్ జె ఓపెన్‌హీమర్ నేతృత్వంలో న్యూ మెక్సికోలోని లాస్ అల్మాస్ లేబొరేటరీ అణు బాంబు రూపకల్పనకు వేదికైంది.  మొదట రెండు రకాల బాంబులను తయారు చేసారు. మొదటిది, లిటిల్ బాయ్ - గన్ రకపు విచ్ఛిత్తి బాంబు (యురేనియమ్-235).] రెండవది, ఫ్యాట్‌మ్యాన్ - మరింత శక్తివంతమైన ఇంప్లోజన్ రకం బాంబు. జపాను వారు కూడా అణు బాంబు తయారీ ప్రారంభించారు. అయితే వారికి తగినన్ని ఆర్థిక, ఖనిజ వనరులు లేకపోవడంతో బాంబు తయారి సాధ్యం కాలేదు.     జపాన్ పై విజయం సాధించాలన్న లక్ష్యంతో అణుబాంబు దాడులకు సిద్ధమైన అమెరికా ముందుగా దాడులు చేయడానికి కొన్ని నగరాలను సూచించమని వైమానికాధికారులు, సైనికాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక కమిటీ వేసింది. బాంబు వేసేందుకు ఎన్నుకునే నగరం వ్యాసం 4.8 కి.మీ. కంటే ఎక్కువ ఉండాలి. బాంబు పేలుడు వలన కలిగే విధ్వంసం భారీగా ఉండాలి అన్న లక్ష్యంతో ఐదు నగరాలను ఎంపిక చేశారు.    కోకురా: జపానులో అతిపెద్ద మందుగుండు సామాను తయారీ కేంద్రం హిరోషిమా: ఓడరేవు కేంద్రం, పారిశ్రామిక కేంద్రం, పెద్ద సైనిక స్థావరం యోకోహామా: విమానాల తయారీ, యంత్ర పరికరాలు, రేవులు, ఎలక్ట్రికల్ వస్తువులు చమురు శుద్ధి కేంద్రం వగైరాల కేంద్రం నీగాటా: ఉక్కు, అల్యూమినియమ్ కర్మాగారాలు, రేవు, చమురు శుద్ధి కర్మాగారం, వగైరాల కేంద్రం క్యోటో: పెద్ద పారిశ్రామిక కేంద్రం   ముందుగా కమిటీ తయారు చేసిన జాబితాలో నాగసాకి పేరు లేదు. అయితే క్యోటో నగరానికి ఉన్న చారిత్రిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా ఈ నగరాన్ని జాబితా లోంచి తీసెయ్యాలని ఆర్మీ అధికారి హెన్రీ లూయిస్  స్టిమ్సన్ ఆర్మీ జనరల్ లూయిస్ ఆర్ గ్రోవ్స్‌కు సూచించాడు. కానీ దానికి ఉన్న సైనిక, పారిశ్రామిక ప్రాముఖ్యం కారణంగా ఆ నగరాన్ని జాబితాలో నుంచి తీసివేయడానికి గ్రోవ్స్ ఒప్పుకోలేదు. దాంతో  స్టిమ్సన్ అధ్యక్షుడు హారీ ట్రూమన్‌తో మాట్లాడి క్యోటోను లక్ష్యాల జాబితా నుండి తీసివేసేందుకు ఒప్పించాడు. క్యోటో స్థానంలో నాగసాకి పేరును సూచించాడు. యుద్ధనౌకా స్థావరం, నౌకా నిర్మాణ కేంద్రం, నౌకా దళానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసే కేంద్రం నాగసాకిలో ఉండటంతో భారీ  విధ్యంసమే జరుగుతుందని గ్రోవ్స్ ను ఒప్పించారు. చివరకు 9 ఆగస్టు 1945  ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేశారు. స్టిమ్సన్ చెప్పినట్టే జపాన్ కు అపారమైన ప్రాణ, ధన, సైనిక నష్టం జరిగింది. ఈ దాడి జరిగిన ఆరు రోజుల తరువాత లొంగిపోతున్నట్లు జపాన్ ప్రకటించడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ విధ్వంసం జరిగి 75 ఏండ్లు. ఆ రెండు నగరాల ప్రజలకే కాదు ప్రపంచం యావత్తు మరచిపోలేని దుర్ఘటనగా మిగిలింది.

విజయవాడ కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

విజయవాడలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్ లో రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం నిర్వహిస్తున్న కోవిడ్‌-19 చికిత్సా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.   రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారం టైన్ నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 50 మంది కరోనా బాధితులు స్వర్ణ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగగా.. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ లో అంటుకున్న మంటలు, తర్వాత పై అంతస్తులకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లలో రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. భయంతో కొందరు భవనం పైనుంచి దూకగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై విరుచుకు పడ్డ వైసిపి ఎంపీ

ఏపీలో జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్రంలోని వాలంటీవర్ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయంటూ మన పార్టీ నేతలు మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని అయన అన్నారు. ఐతే మరి నిజంగా వాలంటీర్లు అంత అద్భుతంగా పని చేస్తే... మరి కరోనా కేసులు ఎందుకు అంతగా పెరుగుతున్నాయని అయన ప్రశ్నించారు. చివరికి స్మశానాల్లో కూడా కరోనా టెస్టులు చేసేంత దారుణమైన పరిస్థితులు ఎందుకు దాపురించాయని అయన ప్రశ్నించారు. కరోనా విషయంలో మొత్తంగా చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అయన విమర్శించారు.   తాడేపల్లిలో ఉన్న కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని రఘురామరాజు తెలిపారు.అంతే కాకుండా కరోనాను అసలు పట్టించుకోకుండా... ఎంత సేపు విశాఖకు వెళ్లే అంశంపైనే ఆలోచిస్తున్నారని అయన మండి పడ్డారు.ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే అసలు ఏపీలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకుండా ఫ్రాంక్లిన్ సంస్థ ఎలా కితాబిచ్చిందో తనకు అర్థం కావడం లేదని అయన అన్నారు. ఇదే ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం మరింత విడ్డూరంగా ఉందని కూడా అయన అన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ఊరు, పేరు లేని లిక్కర్ బ్రాండ్లను ప్రజలలోకి తెచ్చి జనం ప్రాణాలు తీస్తున్నారని అయన మండిపడ్డారు. అంతే కాకుండా మద్యం ధరలను భారీగా పెంచడం వల్ల కొత్తగా ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని అయన అన్నారు. మద్యానికి ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు ఏపీలోనే ఉన్నాయని ఐతే సామాన్యుల పరిస్థితిని అర్ధం చేసుకుని మళ్లీ పాత ధరలే పెట్టాలని అయన డిమాండ్ చేశారు.   ఆ మధ్య సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో సీఎం జగన్ కు చెక్కులు ఇచ్చినట్టు ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారని అయితే ఏ ఎమ్మెల్యే కూడా తన సొంత డబ్బులు ఇవ్వలేదని ఇచ్చిందంతా ప్రజల డబ్బేనని రఘురామరాజు ఆరోపించారు. ఏపీలో జరుగుతూన్న వాస్తవాలు ప్రజలకు తెలుసని చెప్పారు. సీఎం జగన్ ఈ విషయాలపై దృష్టి పెట్టాలని అయన కోరారు.

రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పించాలని చూస్తున్నారు

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని అంశంపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజధాని విషయంలో చంద్రబాబు విశాఖ ప్రజలను ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతుల సెంటిమెంట్ ను విశాఖ ప్రజలపై రుద్ది, తమకు రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశాఖ ప్రజలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనాలని, కర్నూలు వాళ్లు హైకోర్టు వద్దనాలని, అమరావతి ఉంటేనే వికేంద్రీకరణ జరుగుతుందని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదని, కనీసం టీడీపీ నాయకులకైనా అర్థమవుతుందా? అని సజ్జల ఎద్దేవా చేశారు.

పంద్రాగస్టు వేడుకలకు ఐదువేలమందే...

ప్రతి ఏడాది అంతరంగవైభవంగా ఢిల్లీలో నిర్వహించే భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని గతంలో క‌న్నా భిన్నంగా  అతి తక్కువ మందితో ఈ వేడుకలను నిర్వహిస్తారు. వచ్చే శనివారం ఆగ‌స్టు 15న జరగనున్న 74న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ముస్తాబు అవుతోంది. ఈ మేరకు మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఢిల్లీ అధికారులు సన్నాహాలు  చేస్తున్నారు. ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరుగుతుందని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆయా జిల్లాల్లోనూ అదే సమయానికి వేడుకలు నిర్వహించాలని హోం శాఖ పేర్కొంది. ఆరోగ్య భద్రత, దేశ భద్రత కారణాలతో తనిఖీలు ముమ్మరం చేస్తూ అతి తక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తున్నారు.  కరోనా వారియర్స్ గా ముందువరుసలో నిలబడిన  డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులతో పాటు కరోనా నుంచి కోలుకున్నవారిని స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వానాలు పంపించారు. అతిథుల సంఖ్య ఐదువేలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  వేడుకల్లో పాల్గొన్నే సైనిక, పోలీసు బలగాలు మాస్కులు ధరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటారని, రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో జరిగే కవాతుల్లోనూ మాస్కుల వాడకం, ఫిజికల్ డిస్టెన్స్ నియమాలను తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు. ప్రతి సారి వేలాది మంది స్కూల్ విద్యార్థులతో నిర్వహించే పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సారి ఉండవు. ఐదు వందల మంది ఎన్ సీసీ క్యాడెట్లు మాత్రమే హజరవుతారు. మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటించేలా సీటింగ్ అరెంజ్ మెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్నే వారందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చూసే సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు వేడుకలు జరిగే ప్రాంతంలోకి రావద్దని సూచిస్తున్నారు. ఈ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్న సిబ్బంది మాస్కులు ధ‌రించి విధులు నిర్వ‌హిస్తున్నారు.

సీఎం జగన్‌కు బ్రాహ్మణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి లేఖ.. దర్శనాలు నిలిపివేయండి

ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఆలయ అర్చకులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రేయ బాబు లేఖ రాశారు. కరోనా రోజురోజుకీ ఉదృతమవుతోందని.. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం వల్ల అర్చకులు, వేదపండితులు కరోనా బారిన పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.  కరోనాతో తిరుమలలో అర్చకుడు మృతి చెందడం అమంగళకరమని, మునుపెన్నడూ లేని రీతిలో తిరుమల అప్రతిష్ట పాలుకావడం శోచనీయం అన్నారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆలయాల్లో దర్శనాలు నిలిపివేయాలని కోరారు. ఆర్థిక భారం పేరుతో భక్తులను దర్శనానికి అనుమతించడం సమంజసం కాదని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన అర్చకుడికి వెంటనే 10లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి డిమాండ్ చేశారు. అర్చకుడి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దేవాదాయ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో కరోనా బారిన పడిన అర్చకులకు మెరుగైన వైద్యం అందించాలి అని ఆత్రేయ బాబు డిమాండ్ చేశారు.

ఏపీలో శానిటైజర్ మరణాల తీగ లాగితే తెలంగాణలో తేలింది..

కొద్ది రోజుల క్రితం ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై విచారణ జరిపేందుకు ఏర్పాటైన సిట్ దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. అసలు చనిపోయిన వారు తాగిన శానిటైజర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై అధికారులు ఆరాతీయగా తెలంగాణాలో పెద్ద డొంక కదిలింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఉన్న ఒక కంపెనీలో ఈ శానిటైజర్లు తయారు చేసినట్టు తెలిసింది. ఐతే ఆ శానిటైజర్లు తయారు చేసిన కంపెనీకి ఎటువంటి లైసెన్స్ లేదు సరి కదా కనీసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా లేదు.   అంతే కాకుండా అసలు శానిటైజర్ తయారీలో కూడా గోల్ మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇథనాల్ కానీ లేదా ఇథైల్ ఆల్కహాల్ కానీ కలిపి తయారు చేయాల్సిన శానిటైజర్ లో మిథైల్ ఆల్కహాల్ కలిపి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారైన శానిటైజర్లను ఏపీలోని ఒక డిస్ట్రిబ్యూటర్‌కు పంపగా అవి కురిచేడుకు చేరి 16 మంది ప్రాణాలు హరించాయి. ప్రస్తుతం ఈ కేసు ను ఐదు బృందాలు విచారణ జరుపుతున్నాయి. కురిచేడులో శానిటైజర్ తాగిన వారిలో 46 మంది ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

విమాన ప్రమాదంలో మరో విషాదం.. మృతులలో ఒకరి కరోనా

నిన్న రాత్రి కొజికోడ్ లో జరిగిన విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 20 మంది మృతి చెందిన విషాదం నుండి ఇంకా తేరుకోక ముందే తాజాగా మ‌రో ఆందోళ‌న‌క‌ర‌మైన సంగతి తెలిసింది. అదేంటంటే ప్రమాద మృతుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు తాజాగా జరిపిన ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో నిన్న రాత్రి నుండి విమాన ప్ర‌మాద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారిలో తాజాగా ఆందోళ‌న మొద‌లైంది. అంతే కాకుండా విమానంలో వ‌చ్చిన ప్ర‌యాణికులు కూడా టెన్ష‌న్ ప‌డుతున్నారు.   దీంతో నిన్నటి నుండి విమాన ప్ర‌మాద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారంతా టెస్టులు చేయించుకోవాల‌ని అంతే కాకుండా ముందు జాగ్ర‌త్త‌గా క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని వారికి కేర‌ళ ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ విమాన ప్ర‌యాణికులకి క‌రోనా టెస్ట్ లు నిర్వ‌హిస్తున్నామ‌ని కేర‌ళ ఆరోగ్య‌శాఖ‌ ప్ర‌క‌టించింది.   విమాన ప్ర‌మాదం సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకున్నారు. దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది.