పవన్ పెళ్లిళ్లపై విమర్శలు.. జగన్ పరువుతీసుకున్నట్లేనా?

ఒకప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలలో ప్రజా పాలన, ప్రజా రక్షణ పక్కన పెట్టి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి.. దాన్నే విమర్శలగా మలచి దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా నేతలు తిట్టి పోసుకుంటుంటే కార్యకర్తలు దీనికి తలా ఒక చేయి వేసి ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ఒక రకంగా ఇదో రకం డైవర్షన్ పాలిటిక్ లాగా తయారైంది. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో వైసీపీ నేతలు డాక్టరేట్స్ పొందారు. సాక్షాత్తు సీఎం జగన్ నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలామంది నేతలు ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయారు. అలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు ఎంచుకున్న బాష దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. అలాగే  ఆయన పెళ్లిళ్లను   హైలెట్ చేయడం. అలా సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ మాదిరిగా మనం నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేం అంటూ విమర్శలు చేశారు. ఇటీవల పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా జగన్ మరోసారి సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం ఓ దత్తపుత్రుడు లారీ ఎక్కి ఊగిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా మ‌నం రౌడీల్లా తొడ‌లు కొట్ట‌లేం.. బూతులూ తిట్టలేం.. వారిలా న‌లుగురిని పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల‌కోసారి భార్య‌నూ మార్చ‌లేం.. పెళ్లి అనే పవిత్ర వ్య‌వ‌స్థ‌ను రోడ్డు మీదికి తీసుకురాలేం.. అవ‌న్నీ ప‌వ‌న్‌కు మాత్రమే సాధ్యం అంటూ సెటైర్లు వేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న భావితరం, స్కూల్ పిల్లలున్న సభలో ఇలా పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా సీఎం జగన్.. పవన్ మీద   నోరు పారేసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసుకున్నది మూడు పెళ్లిళ్లే. అది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయనే పలుమార్లు కామెడీగా చెప్పారు.. సీరియస్ గా హెచ్చరిస్తూ కూడా చెప్పారు. అయినా ఇంకేం లేవన్నట్లు సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారి ఇలా అదే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఇప్పుడు జన సైనికులు సీఎం జగన్ టార్గెట్ గా వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జగన్ తాతల కాలం నుండి వారి కుటుంబంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారిని ఉదాహరణగా చూపిస్తూ పోస్టులు కుమ్మరిస్తున్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి తాత వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండో భార్య సంతతే వైఎస్ రాజారెడ్డి.. వెంకటరెడ్డి మొదటి భార్యకు మనవడే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి. దీన్నే కోడ్ చేస్తూ సీఎం జగన్ ను విమర్శలతో ఏకి పారేస్తున్నారు. ఇక జగన్ సోదరి షర్మిళ విషయాన్ని కూడా సీన్ లోకి తెస్తూ కొందరు   విమర్శలకు దిగుతున్నారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా రెండో పెళ్లి సంగతి కూడా ఆయన మరణానంతరం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వివేకా రెండో పెళ్లితో పాటు ఆయన హత్యను కూడా కలిపి సోషల్ మీడియా వాల్స్ బద్దలయ్యేలా విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇక, జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో 'జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు. మరి ప్రత్యేక హోదా ఏదీ?.. జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి సీపీఎస్ రద్దు చేశాడా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడా’.. అంటూ జగన్ వైఫల్యాలను కూడా పెళ్ళితోనే ముడిపెట్టి ఎండగట్టారు. ఇక జనసేన సోషల్ మీడియా ఖాతాలలో అయితే.. ప్రశ్న: ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు? జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రశ్న: పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?, జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రశ్న: రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది? జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పట్టేస్తున్నారు. దీంతో జగన్ అడిగి మరీ తిట్టించుకున్నట్లే అయిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

3 నుండి 7 విడతలలో ఏపీలో ఎన్నికలు.. జగన్ స్ట్రాటజీ ఇదేనా?!

ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలి. ఇదే ఇప్పుడు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఆ మాట కొస్తే అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసమే కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈసారి ఎన్నికలలో అధికారం దక్కించుకుంటే ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయొచ్చు. రాజధానిని అమరావతి సహా  రాష్ట్రాన్ని తనకి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టొచ్చు. తొలిసారి సీఎం కనుక తన పాలనకు వచ్చే ఎన్నికలను రెఫరెండంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్ ఈసారి ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలలో దేశవ్యాప్తంగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ను రంగంలోకి దించిన జగన్.. వారి వ్యూహాలకు అనుగుణంగా సోషల్ మీడియాను సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా జగన్ మరో వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తుంది. ఏపీలో ఈసారి ఎన్నికలను ఒకే విడతలో కాకుండా 3 నుండి 7 విడతలలో నిర్వహించాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసమే తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో ఒకే దశలో ఎన్నికలు జరగగా ఇప్పుడు దశల వారీగా ఎన్నికలు జరపాలని జగన్ కోరుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరిగితే ఎంత అధికారంలో ఉన్నా రాష్టవ్యాప్తంగా పోల్ మేనేజ్ మెంట్   చేయడం కష్టమవుతుంది. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కళ్లకు కడుతున్న పరిస్థితుల్లో ఎంతగా అధికారాన్ని అడ్డుపెట్టుకున్నా ప్రజాగ్రహాన్ని బలప్రయోగంతో అణచివేయడం అంత సులువు కాదు. అదే దశల వారీగా జరిగితే ఒక్కో దశలో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండే పార్టీలకు, అందునా రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఇలా దశల వారీ ఎన్నికలతో అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జగన్ ఈ తరహా ప్రతిపాదనను కేంద్రం ముందుంచినట్లు తెలుస్తున్నది.  అయితే, 175 మాత్రమే స్థానాలున్న ఏపీలో ఇలా దశలవారీగా ఎన్నికలు అవసరమా? అసలు ఎన్నికల కమిషన్ ఈ తరహా ఆలోచన చేస్తుందా అంటే ఆ అవకాశం లేకపోలేదు. గత ఏడాది గుజరాత్‌ ఎన్నికలలో రెండు ఫేజ్‌లలో, మణిపుర్‌లో రెండు ఫేజ్‌లలో, యూపీలో 7 ఫేజ్‌లలో ఎన్నికలు జరిగగా.. ఈ మూడు రాష్ట్రాలలో మణిపుర్ ఏపీ కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రం. అంతకు ముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను 8 ఫేజ్‌లలో నిర్వహించారు. కనుక ఏపీలో విడతల వారీగా ఎన్నికలను నిర్వహించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  ఇక ఇప్పుడు ఏపీ  విషయానికి వస్తే 175 సీట్లు ఉండగా మొత్తం  7 విడతలలో పోలింగ్ నిర్వహించాలని వైసీపీ కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిసిన జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు వారి వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్   బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటుందా అంటే ఇండియాలో ఏదైనా సాధ్యమేనంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే..  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల కమిషన్ మధ్య ఆ మాత్రం సంబంధాలు ఉండడం సహజమే. అందుకే ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన ఎన్నికలను చూస్తే దాదాపుగా బీజేపీకి సౌలభ్యంగా ఉన్న రోజులలోనే పోలింగ్ జరిగింది. అయితే, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కోరినట్లుగా 7 విడతలలో అంటే కష్టమైన పనే కాగా అందుకు ఈసీ అంగీకరించకపోవచ్చు. కానీ మూడు నుండి ఐదు విడతలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు.. టీడీపీని కొట్టేందుకా? రాష్ట్రాన్ని గెలిచేందుకా?

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పదవుల ప్రక్షాళన చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్ఠానం మాజీ సీఎం నందమూరి రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకు పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగానే కాకుండా ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కూడా వ్యవహరింారు. ఇప్పుడు ఏపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ అధ్యక్ష మార్పు ఊహాగానాలు రావడంతో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు కూడా అధ్యక్ష రేసులో వినిపించాయి. కానీ అధిష్ఠానం చివరికి పురంధేశ్వరి పేరు ఖరారు చేస్తూ ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది.  సహజంగానే పురంధేశ్వరి సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్రంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ఈ పదవిని తెచ్చిపెట్టినట్లుగా భావించాలి. ఆమె ఏ పార్టీలో ఉన్నారన్నది.. రాజకీయాలను పక్కన పెడితే పురంధేశ్వరి పనితీరును ఆక్షేపించాల్సిన పనిలేదు. పురంధేశ్వరి అనగానే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ కుమార్తె అనే అయినా ఆమె పనితీరుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఆమె ఎంట్రీకి వారసత్వం పనికి వచ్చినా.. మంత్రిగా ఆమె సమర్ధత, ఆమె హుందాతనం, వ్యవహార శైలి ఆమెకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇంకా చెప్పాలంటే సో కాల్డ్ మహిళా నేతలు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది కొండంత. అయితే, ఇప్పటికిప్పుడు బీజేపీ పగ్గాలు పురంధేశ్వరికి అప్పగించడం వెనక బీజేపీ వ్యూహం ఏంటన్నది సహజంగానే చర్చకు తావిస్తున్నది. అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం టీడీపీని దెబ్బతీసేందుకా.. లేక రాష్ట్రాన్ని గెలిచేందుకా అనే చర్చలు సాగుతున్నాయి. నిజానికి ఏపీలో బీజేపీకి అధ్యక్షులుగా ఎవరిని నియమించినా పెద్దగా చర్చ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి అసలు స్టేక్ లేదు. ఈ పార్టీకి ఏపీలో ఒక  శాతం ఓట్లు దక్కడమే గగనం. అయితే ఇలాంటి చోట ఇంతలా చర్చ జరుగుతున్నదంటే దానికి కారణం బీజేపీ వ్యవహారశైలే. ఏమీ లేని చోట కూడా అవకాశాన్ని వెతుక్కోవడం బీజేపీ నైజం. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే తరహా ప్రణాళికతో పని చేసిన బీజేపీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ వ్యూహాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రజల పోలరైజేషన్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చోట నిలబడాలంటే ఏదొక పార్టీ స్థానాన్ని ఆక్రమించాలి. టీడీపీ, వైసీపీని పోలిస్తే బీజేపీ తన వైపుకు తిప్పుకోనేందుకు ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ టీడీపీ. ఈ తరహా ఆలోచనతోనే బీజేపీ ఇన్నాళ్లు కాపు సామజిక వర్గానికి చెందిన వారికి పార్టీని అప్పగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని కూడా జనసేన క్యాప్చర్ చేసుకొనే పనిలో ఉంది. దీంతో బీజేపీ ఇప్పటికే తనతో ఉన్న నేతలలో ఎక్కువ శాతం బలమైన నేతలుగా ఉన్న కమ్మ సామజిక వర్గ నేతలకు పార్టీని అప్పగించినట్లుగా కనిపిస్తుంది. అయితే, స్థానికంగా వేళ్లూనుకుపోయిన టీడీపీ దెబ్బకొట్టడం అంటే   ఆషామాషీ విషయం కాదు. ఇక బీజేపీ మరో ఆలోచనగా చర్చిస్తే ఇది టీడీపీ-జనసేనతో కలిసి రాష్ట్రాన్ని జయించేందుకు వేసిన ప్రణాళికగా కూడా భావించవచ్చు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు సాగుతుండగా.. జనసేన, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ మూడవ ప్రత్యామ్నాయం కావాలని ఆశపడుతున్నాయి. అయితే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కారణంగా ఇరు పార్టీల మధ్య పొత్తున్నా లేనట్లుగానే కనిపించింది. ఇలాంటి సమయంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కమ్మ-కాపు సామజిక వర్గాల కలయికను ప్రజలలోకి పంపినట్లే అవుతుంది. ప్రచారం జరుగుతున్నట్లుగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారైతే పురంధేశ్వరి, చంద్రబాబు కాంబినేషన్ తో ప్రజల మధ్యకి వెళ్లి అధికారాన్ని కొల్లగొట్టడం మరింత సులువు అవుతుందనే ఆలోచన కూడా చర్చకి వస్తున్నది. మరి బీజేపీ వ్యూహం ఏంటో..  

స్పీడ్ న్యూస్ - 5

41.గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలోనూ పరిస్థితులు సజావుగా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు రష్యా అధీనంలోని భూభాగాల్లో కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.  42. సోషల్ మీడియాలో ఓ చేపకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  దీని పేరు హెయిర్ టెయిల్ ఫిష్. ప్రపంచవ్యాప్తంగా ఇది శీతల ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని సముద్ర జలాల్లో కనిపిస్తుంది.  43.చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచారు.  44. ఇన్స్టాగ్రామ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ షేక్ చేస్తున్నారు. సోషల్ మీడియా చరిత్రలోనే పవన్ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను ఓపెన్ చేశారు. 45. కేరళపై నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  46. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 47.తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జన గర్జన సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలన్న సంకల్పంతో ప్రజలు ప్రభుత్వ అడ్డంకులు తొలగించుకొని మరీ సభకు వచ్చారన్నారు.  48. రాహుల్‌గాంధీపై  బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి  తిప్పికొట్టారు. ‘‘పరిపక్వత లేని నేతలు బీఆర్‌ఎస్ వాళ్లే అని ఆయన ఎద్దేవా చేశారు.  49. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది.  50. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను తెలుగు రాష్ట్రాలను అధ్యక్షులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్టు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

పవన్ పెళ్లిళ్లపై జగన్ విమర్శలు.. జోగయ్య చురకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య మంగళవారం(జూన్ 4) బహిరంగ లేఖ రాశారు.  మీ నాన్నగారు వైఎస్ఆర్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. మొదట్లో ఆయన్ని విమర్శించినా.. ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుల పట్ల ఆయన అప్పుడప్పుడు చేస్తుండే విమర్శనాస్త్రాలు ఎంతో హుందాగా ఉండేవని.. ఆ విషయం ప్రజలందరికి తెలిసిందేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రిగా మీ తండ్రిగారి హుందాతనంలో 10వ వంతు కూడా మీకు లేవని.. మీ ప్రవర్తన చూస్తుంటే అనిపిస్తోందంటూ సీఎం వైయస్ జగన్‌కు సుతిమెత్తగా చురకలంటించారు.  ప్రజల ఆరాథ్య నాయకుడు, ప్రతిపక్ష నేత పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్న తర్వాత సినిమాల్లో విలన్ పాత్రధారిగా మిమ్మల్ని వర్ణించ వచ్చనిపిస్తోందన్నారు. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకొంటే ప్రజలకెవ్వరికీ లేని అభ్యంతరం మీకేందుకని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌పై బురదజల్లడానికి మరో కారణం లేక.. ఇటువంటి చవకబారు కారణాలతో లబ్ది పొందాలని మీరు చుస్తున్నట్లుగా ఉందని అన్నారు. మరోసారి చవకబారు విమర్శలు చేయకుండా.. మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదంటూ సీఎం జగన్‌కు హితవు పలికారు. మాట్లాడితే పవన్ కల్యాణ్.. చంద్రబాబుకి దత్త పుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తుంటారని.. మరీ మీరు తెలంగాణ సీఎం కేసీఆర్‌కి దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయిలు ప్యాకేజీ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా? అని ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. మీ తాతా రాజారెడ్డి నుంచి మీ వరకు మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా? కాదని చెప్పగల దమ్ము.. మీకుందా? అంటూ సీఎం జగన్‌కు జోగయ్య సవాల్ విసిరారు. లేకుంటే.. మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు.   ఇకపై ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై అనవసర దుర్బాషలాడటం మానుకొంటే బాగుపడ్తారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు అంటూ ప్రశ్నించారు. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండంటూ సీఎం జగన్‌కి  సూచించారు. మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి వచ్చినందుకు తనకు చాలా బాధాగా ఉందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తప్పనిసరి పరిస్థితి అయిందన్నారు. తనకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటని.. అది అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా తప్పు అంటూ ఉంటే.. ముఖంపైన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడమే తన నైజమని ఈ సందర్బంగా వైయస్ జగన్‌కు హరిరామజోగయ్య స్పష్టం చేస్తూ.. సారీ అంటూ లేఖను ఆయన ముగించారు.

కిషన్ ఇన్.. బండి ఔట్.. బీజేపీలో ప్రక్షాళన ఇదేనా ?

బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్‌ పెను  మార్పులు చేస్తుండటం ఎలాంటి ఫలితాన్నిస్తుందన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.   తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన తథ్యమని గత కొంత కాలంగా గట్టిగా వినిపిస్తోంది. బండి సంజయ్ స్వయంగా తాను మోడీ పర్యటన నాటికి బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉండే అవకాశం లేదని  కార్యకర్తలతో గతంలోనే చెప్పేశారు. ఇప్పటి వరకు తెలంగాణ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను క్యాబినెట్ లోకి తీసుకొని.. ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కిషన్ రెడ్డికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే  సోమవారం ( జూలై 3) కేబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమనే చెప్పాలి. గతంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ బండిని మార్చే ప్రశక్తేలేదని చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద రాష్ట్ర బీజేపీలో సమూల  ప్రక్షాళన  జరిగితేనే పార్టీకి ఉనికి ఉంటుందని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు తాజా నిర్ణయంతో తేటతెల్లమైంది.  కాగా రాష్ట్ర బీజేపీలో  భారీ మార్పుల గురించి ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  ఈటెల రాజేందర్ కు బీజేపీ ప్రచార సారధ్య బాధ్యతలు అప్పగించవచ్చని చెప్తున్నారు.   కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకుని పార్టీ రాష్ట్రఅధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పెద్దగా సుముఖత చూపకుంటే.. ఆయనను  కేవలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు పరిమితం చేయకుండా బీజేపీ తన సంస్కృతిని పక్కనపెట్టేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా తెలంగాణలో అధికారం మాదే అనే స్థాయి నుంచి పార్టీని కాపాడుకుంటే చాలన్న స్థాయికి బీజేపీ దిగజారిందని ఇటీవలి పరిణామాలను బట్టి అర్ధమౌతోంది. మరింత దిగజారకముందే పార్టీలో ధిక్కారాన్ని అణచివేసి మళ్లీ పార్టీని విజయం దిశగా నడిపించేందుకు బీజేపీ హై కమాండ్ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేవలం నాయకత్వ మార్పుతోనే  బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అంటే పరిశీలకులు అనుమానం అనే అంటున్నారు. 

పవన్‌పై పూనమ్ కౌర్ అస్త్రం.. ఇదీ ఫేకే?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత బహిర్గతం అవుతుండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొందరు అధిష్టానంపై రివర్స్ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు దక్కవని అనుమానిస్తున్న నేతలు కొందరు రెబల్స్ గా మారేందుకు చాపకింద నీరులా నియోజకవర్గాలలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు నాలుగేళ్ళలో వైసీపీ తప్పిదాలను, వైసీపీ నేతల దారుణాలను, ప్రభుత్వం కక్షకట్టి చేసిన నష్టాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ కార్యకర్తలలో ఒకడిగా దూసుకెళ్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల బాణాలతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ను నిలువరించేందుకు వైసీపీ రకరకాల ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పవన్ వ్యక్తిగత జీవితాన్ని   టార్గెట్ చేసిన వైసీపీ నేతలు జనసేన నేతలు తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే పవన్ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా వైసీపీకి ఒక లీడ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ పూనమ్ కౌర్ పేరిట ఒక ఫేక్ ఆడియో రికార్డును వైరల్ చేస్తున్నారు. పవన్ క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా.. పవన్ ను స్త్రీ లోలుడిగా చిత్రీకరించేలా వైసీపీ ఈ జిత్తులు మారి  ఎత్తుగడ వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీ పెరిగిన ప్రతిసారీ వైసీపీ ఇలాగే పూనమ్ కౌర్ పేరిట సోషల్ మీడియాలో తెగ ఫేక్ ముచ్చట్లను తెర మీదకి తీస్తుండగా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి పూనమ్ మాట్లాడినట్లుగా ఒక ఫేక్ కాల్ రికార్డును వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసింది.  ఈ ఆడియోలో పవన్ కల్యాణ్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలపై నటి పూనమ్ కౌర్ వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.  ‘పవన్ కల్యాణ్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. వాళ్లందరినీ మోసం చేశాడు. వాళ్లే కోపం వచ్చినప్పుడు వాడిని చంపొచ్చు. అంత కామమైన నీచమైన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని పూనమ్ కౌర్ అన్నట్లుగా ఆడియో సృష్టించారు. ‘నేను నోరు మూసుకున్నా పవన్‌ కళ్యాణ్‌ను చంపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆయన చాలామంది అమ్మాయిలతో తప్పు చేశారు. నా విషయంలో జరిగింది నేను ఫ్రూఫ్‌లు చూపిస్తే పవన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. నేను ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పవన్ వల్ల నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది’ అని పూనమ్ కౌర్ గొంతును పోలిన ఓ వాయిస్ రికార్డ్‌ను వైసీపీ అనుకూల వర్గాలు షేర్ చేస్తున్నాయి. దీనిపై జనసేన కార్యకర్తలు, జనసేన సోషల్ మీడియా టీం సైతం కౌంటర్లు మొదలు పెట్టింది. ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్న జనసేన వర్గాలు.. ఆడియోలో పవన్‌ను చంపడం అనే మాట చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందని.. పవన్‌కు ప్రాణ హాని ఉందని అనుమానిస్తున్నారు. మరికొందరు జనసేన ఫాలోవర్లయితే గతంలో మహిళలతో అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేతలు అంబటి, అవంతి లాంటి వారి ఆడియోలను మళ్ళీ షేర్ చేస్తూ.. ఇదీ మీ సంస్కృతి.. ఫేక్ ఆడియోలు, ఫేక్ వీడియోలను తెచ్చి లోకమంతా అలాగే ఉంటుందని నమ్మించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నదని గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పూనమ్ పేరిట తెచ్చిన ఈ ఆడియో మాత్రం వైసీపీ ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారుతుందని చెప్పకనే చెబుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సోము వీర్రాజుకు ఉద్వాసన

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు పార్టీ హై కమాండ్ ఉద్వాసన పలికింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా వీర్రాజుకు ఫోన్ చేసి తెలియజేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మీ పదవీ కాలం ముగిసిందని  సోము వీర్రాజుకు గుర్తు చేసిన నడ్డా.. ఆయనను తొలగిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పదవికి రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. దీంతో చాలా కాలంగా సోము వీర్రాజు తొలగింపుపై వస్తున్న వార్తలు వాస్తవమయ్యాయి. ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని తొలగించిన బీజేపీ ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తుందన్నది చూడాల్సి ఉంది.   అసలు చాలా కాలం నుంచీ సోము వీర్రాజు వ్యవహారశైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వ్యవహార శైలి కారణంగానే ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దూరమయ్యారు. మిగిలిన నేతలలో కూడా అత్యధికులు సోము వీర్రాజు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్షులను మారుస్తూ  తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతే కాకుండా మిత్రపక్షమైన  జనసేన పట్ల సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల కూడా పార్టీ లో అసంతృప్తి వ్యక్తమౌతున్నది.  రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు   సన్నిహితంగా మెలగడం ద్వారా  అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు వ్యవహారశైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక   స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే వీర్రాజును తొలగించడం ఖాయమని గత కొంత కాలంగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం సోము వీర్రాజును పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

యువతకు దిశా నిర్దేశం స్వామి వివేకానంద బోధనలు

చిన్న కష్టానికే హడలిపోతున్నారు. అర్ధం లేని కారణాలకు ఆత్మ త్యాగాలను చేస్తున్నది ఈ జనరేషన్. కారణం ఇంట్లో సరి అయిన మార్గనిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాలలో పడి పిల్లలతో సరిగా మాట్లాడలేకపోవడం. ఎవరి పరుగు వాళ్లది. అయితే ఈ తరం వాళ్లలో స్ఫూర్తి నిండాలంటే స్వామి వివేకానందను చదవాలి. స్వామి వివేకానంద కొత్త తరాలను జాగృతం చేసే గొప్ప మాటలను గ్రంథస్తం చేశారు. యువతే భావిభారత నిర్మాణానికి పునాదులని, వారి చైతన్యమే దేశ భవిష్యత్ కు కరదీపమని భావించి  గొప్ప సూక్తులను ఉపదేశించారు. ఆ క్రమంలో ఎన్నో సందేశాలను ప్రవచించారు. ప్రతి పౌరుడు హృదయంలో చెరగని సంతకంగా నిలిచిపోయారు. కాలం మారింది, సామాజిక పరిస్థితులు మారాయి పాశ్చాత్య పోకడలు నవీన నాగరికతను నిర్వచిస్తున్నాయి. ఈ సమయంలోనే మనం తరం జాగృతం కావాలి " బలమే జీవనం - బలహీనతే మరణం" (strength is life - weakness is death) అంటారు వివేకానంద. ప్రకృతి ఉపద్రవాలు వైపరీత్యాలు, మనిషి ఉనికినే ప్రశ్నిస్తున్న కరోనా లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని నిలబడాలంటే   మానిసికంగా ఎంతో బలపడాల్సి ఉంది. బలహీనతల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సి ఉంది. ఇంకా ఆర్ధిక అసమానతలతో నిరుద్యోగ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి అదే బలహీనతగా దారి తీసి చీకటి అగాధంలోకి జారిపోయి ఆత్మ త్యాగాలను చేసే ఎంతోమంది అమాయక యువతను మానసికంగా శారీరకంగా బలమే జీవనం అని నమ్మి నవ ఉత్తేజంతో ముందుకు సాగాలంటే వివేకానంద పుస్తకాలను చదవడమే మార్గం. ఎవరైతే తనని తాను విశ్వసించడో వాడే పెద్ద నాస్తికుడు" అంటారు స్వామి వివేకానంద. ప్రస్తుతం యువత ఆస్థికతకు నాస్తికతకు మధ్య ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు.  దేవుడు- నమ్మకం గురించి అనవసర చర్చలు జరిపి దేశ యువతిని భారతీయతకు దూరం చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కల్పిక నాస్తికతపై ఎక్కువ చర్చ జరిగి యువ సమాజం అయోమయంలో పడిపోతున్నది. ఇలాంటి యువతకు వెలుగు మార్గం చూపే సందేశాలను స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. దేవుడి కంటే ముందు నిన్ను నువ్వు నమ్ము అంటాడు వివేకానంద. ఇలా ప్రతి సంక్షోభానికి వివేకానందను చదివితే పరిష్కారం దొరుకుతుంది. ఇలా తన జ్ఞాన తేజస్సుతో స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటల్ని మూటకట్టి విజ్ఞాన బాండాగారాన్ని మనకోసం వదిలేసి వెళ్లిపోయారు. అందుకే ఆయన చెప్పిన మాటలు నిత్యం మనం స్మరణం చేసుకుంటే చాలు. నిరాశ నిస్తేజం కి చోటు ఉండదు. (స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా)

స్పీడ్ న్యూస్- 3

21.పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనడం తప్పనిసరయ్యేలా ఉందని, దానిని తప్పించుకోవాలని కొత్త ఎత్తు ఎత్తారు. ఎలక్షన్ డ్యూటీని తప్పించుకునేందుకు అదే ఎన్నికల్లో నిలబడ్డారు.  22.దేశ వ్యాప్తంగా టమోటా ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా ధర సెంచరీ నుంచి డబుల్ సెంచరీ వరకూ వెళ్లింది. 23.టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు రూరల్ లో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ... యాత్రలో రద్దీ ఎక్కువ కావడం వల్లే తాను తిరిగి వచ్చానని చెప్పారు. 24.ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని... అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 25.ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో 43 ఏళ్ల వయసులో 24వ సారి బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కు చుక్కెదురైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో అతి పెద్ద వయస్కురాలైన వీనస్ తొలి రౌండ్ లోనే ఓడిపోయి నిరాశ పరిచింది. 26.టమాటా ధరలు దేశవ్యాప్తంగా ఆకాశానికి ఎగబాకాయి. వాటిని కొనడం కాదు.. ఆ పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. 27.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని... ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నారు. 28.దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దత్తతకు మునుపే ఆస్తి పంపకాలు పూర్తయితేనే పుట్టింట కుటుంబంలో ఆస్తి హక్కు దక్కుతుందని పేర్కొంది.  29. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరి మధ్య చెక్ బౌన్స్ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. మాజీ మంత్రి వినోద్ కుమార్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 30.పూనమ్‌ పోస్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ డైరెక్టర్‌‌ను గురూజీ అని పిలుస్తారు. ఆయన్నే టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రంగా చుట్టూ ఏపీ రాజకీయం

వంగవీటి మోహన్ రంగా.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా పేరొందిన బెజవాడ ( విజయవాడ)కు ఎంత పేరుందో, బెజవాడ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన, దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగాకు అంత పేరుంది. అప్పుడే కాదు, ఆయన కన్నుమూసి మూడు దశాబ్దాలకు పైగా అయిన ఈనాటికీ, రంగా పేరు ఏపీలో  పొలిటికల్  వైబ్రేషన్స్ సృష్టిస్తున్నాయి. నిజానికి,  రంగాను కాపులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలందరూ తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. రాజకీయ పండితులు బడుగు బలహీన వర్గాలు పొలిటికల్ లెజెండ్’గా రంగాను అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయిలో ఉన్న బలమైన నాయకుడు కాపులకు లభించలేదు. అయితే మోహన్ రంగా భౌతికంగా లేకున్నా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రంగా పేరు మార్మోగుతుంది. ఇప్పడు అదే జరుగుతోంది. అందరివాడుగా పేదల గుండెల్లో నిలిచిన రంగా, మావాడంటే మావాడు అని తమ సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రంగా బొమ్మపెట్టుకుని  కాపులు, బడుగు బలహీనవర్గాల వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రంగా కన్నుమూసిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికలోనూ, రంగా పేరు గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్’గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. నిజానికి రాష్ట్రంలో ఇప్పడు ఎన్నికలు లేవు, కానీ, ఎన్నిక వాతావరణం వుంది. అందుకే రంగా జయంతి (జూలై4) సందర్భంగా రాజకీయ చలిమంటలు భగ్గుమంటున్నాయి. అందుకే, పార్టీలు, పార్టీలకు అతీతంగానూ నాయకులు  పోటీపడి మరీ రంగాకు జై కొడుతున్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా, విజయవాడలో రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదలా ఉంటే, గతంలో రంగా పేరు చెప్పుకుని ఓట్లు దండుకున్న వైసీపీ, ఆ తర్వాత రంగా వారసుడు, ఆయన కుమారడు వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా   గుర్తు చేస్తున్నారు. రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం‌ చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్ లు చెబుతున్నారని రంగా, రాధా అభిమానులు ఆక్షేపిస్తున్నారు. రాధా సేవలను తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మొండి చేయి చూపించారని, అయిఆ ఆనాడు నోరు విప్పని వైసీపీ నానీలు  ఈ రోజు ఏముఖం పెట్టుకుని, రంగా జయంతికి హడావుడి చేస్తున్నారని  వంగవీటి అభిమానులు వైసీపీ  నేతలను ప్రశ్నిస్తున్నారు.  అందుకే  రాధా, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ది చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని‌ కోరినా.. జగన్ స్పందించ లేదని,  వైఎస్సార్‌సీపీ నాయకులపై  ఫైర్ అవుతున్నారు. మరోవంక  గతంలో వంగవీటి రాధ హత్యకు ‘రిక్కి’ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించడమే కాకుండా.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  నిజానికి రాధా తెలుగు దేశం పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే, రంగా అభిమానులు మరో మారు, తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తామని రాంగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.

భారత స్వాతంత్య్ర చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధం పట్టి తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం పోరాడిన యోధుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి  ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు. పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీ కొన్న అల్లూరి సీతారామరాజు ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని నిరూపించాడు. తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలు అర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలాడు. ఆయన జయంతి  సందర్భంగా మరో సారి అల్లూరి పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ అక్షర నివాళులు.. తూర్పు గోదావరి జిల్లాలోపాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకట రామరాజు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం సీతారామరాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సాహిత్యం బాగా చదివేవాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. 1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద కొంత కాలం ఉన్నాడు.  లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలు చూసి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. దేశంలో మారుతున్న పరిస్థితులు ఆయనను స్థిరంగా ఉండనియ్యలేదు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి ఇంటికి చేరాడు. ఆరోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేసాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కోసం అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. క్రమంగా సీతారామరాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్ర రూపం దాల్చింది. సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామ మునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ వచ్చాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. రాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలకు గురి చేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని తన ప్రాణాలను 1924 మే 7న భారతమాత విముక్తి కోసం అర్పించాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్వతంత్య్ర భారతావని చరిత్ర పుటల్లో  ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. కృష్ణదేవిపేట(కే.డి పేట)లో ఆయన సమాధి యువతలో ధైర్యానికి నాంది పలుకుతోంది.

స్పీడ్ న్యూస్- 2

11.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. 12. ఆమ్ ఆద్మీ పార్టీ  ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు సోమవారం వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం దాటకూడదని ఆదేశించింది.  13.బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు కోర్టు 3.3 మిలియన్ డాలర్ల  జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డి జెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ విధించింది.  14.విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి టీనా అంబానీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్ అంబానీ వాంగ్మూలం ఇచ్చారు. 15.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 16.దేశ రాజకీయాల్లో కురు వృద్ధుడుగా పేరుగాంచిన ఎన్సీపీ అధినేతకు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీపీని నిట్ట నిలువునా చీల్చిన అజిత్ తన వర్గంతో కలసి షిండే ప్రభుత్వంలో చేరిపోయారు. 17.చైనాలో పర్యటించాలనుకునే అమెరికన్లు పునరాలోచించుకోవాలని బైడెన్ సర్కారు కోరింది. డ్రాగన్ కంట్రీలో ఉన్నపుడు తప్పుడు ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. 18.టమాటా ధరలు దేశవ్యాప్తంగా ఆకాశానికి ఎగబాకాయి. వాటిని కొనడం కాదు.. ఆ పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఏ కూరలోనైనా ఇట్టే కలిసిపోయే టమాటా ధరలు కొండెక్కడంతో కూరల నుంచి అవి దూరమయ్యాయి.  19. ప్రయాణికుల మధ్య వివాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో మారిపోయింది. దాదాపు రోజు మెట్రో ప్రయాణికులు తగవు పడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.  20.త్రిదిప్ కే మండ‌ల్ అనే వ్యక్తి నోయిడాలోని ఓ మల్టీప్లెక్స్ లో చీజ్ పాప్‌కార్న్‌, పెప్సీ కొన్నాడు. ట్యాక్సులతో కలిపి 55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్‌ కు రూ. 460 బిల్లు వేయ‌గా,  600 ఎంఎల్ కూల్ డ్రింక్‌కు ఏకంగా రూ. 360 చార్జ్ చేశారు. ఇలా రెండింటికే రూ. 820 బిల్లు చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యారు.

స్పీడ్ న్యూస్- 1

1. ల్యాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో  బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, మాజీ ముఖ్యమంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు  అయ్యింది. ఈ నేపథ్యంలో  తేజస్వీని వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ యాదవ్ డిమాండ్ చేశారు.   2.ఏపీ సీఎం జగన్    ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  ప్రధాని మోదీతో  బుధవారం భేటీ కానున్నారు.  ఈ భేటీలో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చిస్తారు. అలాగే రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 3. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై   దాడి జరిగింది.  ఖలిస్థాన్ మద్దతుదారులు కార్యాలయానికి నిప్పు పెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. మార్చిలో ఒకసారి ఖలిస్థాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 4. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.   5. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ బోగస్ ఓట్లపై తెలుగుదేశం అప్రమత్తమైంది.  అలాగే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపైనా దృష్టి సారించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 6.రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మంగళవారం  మార్నింగ్ వాక్‌కు వెళ్లిన  మహిళలపై‌కి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు  దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఒక చిన్నారి మరణించింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.  ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు.   7. కరీంనగర్ జిల్లాలో నిన్న అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం  రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై   బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 8. ఉత్తరప్రదేశ్  నిన్న రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలోని ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో  ఈ ఘోరం జరిగింది.  అగ్నిప్రమాదానికి కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 9.తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన  చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. స్టాలిన్ జీర్ణకోశ సంబంధిత సమస్యతో  స్టాలిన్ ఇబ్బంది పడుతున్నారు. 10.  రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కేంద్రప్రభుత్వం కట్టడి చేయకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌  హెచ్చరించారు. డీఎంకే  సర్కార్ పట్ల ప్రజాభిమానం సహించలేకే గవర్నర్ అలా చేస్తున్నారన్నారు.

జగన్ పాలనపై జనసేన గరంగరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనపై జనసేన పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. ఈ జగన్ పాలనలో ఏ వర్గం సురక్షితంగా ఉందో చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న.. స్పందన కార్యక్రమానికి స్పందనే లేదని వ్యంగ్యంగా అన్నారు. అలాగే జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని చేపట్టారని.. చెబితే వినేవారు లేరని.. ఇప్పుడు తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని.. పాలకుల్లో స్పందించే గుణం లేనప్పుడు ఏ కార్యక్రమం అయితే ఏముందని ఆయన జగన్ అండ్ కోని సూటిగా ప్రశ్నించారు. అలాగే అర్హత ఉన్న లబ్దిదారులకు సైతం పథకాలు అందడం లేదని ఈ జగన్ ప్రభుత్వమే స్పష్టం చేస్తుందని.. ఇది దేనికి సంకేతమని ఆయన ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. వైయస్ జగన్   ఈ నాలుగేళ్ల పాలన అద్బుతమని అంటారని.. అలాంటప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంలో చోటు చేసుకొంటున్న వ్యవహారాలపై ఈ సందర్భంగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏం చేస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పుకొంటున్నట్లు.. మీ పాలన అద్బుతంగా ఉంటే.. వారాహి యాత్ర చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమస్యలు చెప్పుకొనేందుకు అంత మంది ఎందుకు వచ్చారని నిలదీశారు.  అమ్మఓడి బటన్ నొక్కినా.. నేటికి కొంత మంది ఖాతాల్లో ఆ పథకం తాలుకు నగదు జమ కాలేదని.. దీనికి సమాధానం ఏం చెబుతారంటూ.. జగన్ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. అలాగే మీరు హాజరయ్యే సభలకు కోట్లాది రూపాయిల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారని.. హెలికాప్టర్లు వినియోగిస్తారని.. అంతేకానీ... క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారంటూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో మలికిపురంలో పవన్ కల్యాణ్ హెచ్చరికతోనే రాజోలులోని రహదారి పనులు ప్రాంభించారని ఆయన వివరించారు. 151 మంది ఎమ్మెల్యేలు, ఇంత మంది యంత్రాగాన్ని పెట్టుకొని.. ఎందుకు సరైన పాలన అందించ లేకపోతున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని సూటిగా  ప్రశ్నించారు.  జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ఫించన్లు, రహదారుల సమస్యలపైన ఫిర్యాదులు అధికంగా వచ్చాయని చెప్పారు. అలాగే మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దివ్యాంగుడికి 75 రూపాయిల ఫెన్షన్ వచ్చేదని.. ప్రస్తుతం అతడు విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటాయని పెన్షన్ నిలుపు చేశారని పేర్కొన్నారు. ఇలా పదుల సంఖ్యలో దివ్యాంగులు పవన్ వద్ద తమ సమస్యలు చెప్పుకొన్నారన్నారు.. తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల వరకు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారని.. మరి స్పందించే గుణం లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు అని ప్రశ్నించారు. అయినా ఇప్పటి వరకు ఎన్ని సమస్యలపై స్పందించారంటూ జగన్ ప్రభుత్వానికి నాదేండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు.  వైసీపీ మ్యానిపెస్టోలో 99 శాతం పూర్తి చేశామని చెబుతున్నారని.. మరి స్పందన సరిపోదని జగనన్నకు చెబుదామని వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని.. జగనన్న వినడు, ఎమ్మెల్యేలు వినరు... అధికారులు అంతకంటే వినరన్నారు. మరి ప్రజలు.. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలంటూ సందేహం వ్యక్తం చేశారు. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో   ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పించన్ల ఇచ్చే క్రమంలోనే కాదు.. రైతుల వద్ద సైతం లంచాలు తీసుకొంటున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎవరూ సురక్షితంగా లేరని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.   పవన్ కల్యాణ్.. ఇటీవల చేపట్టిన వారాహీ యాత్ర అద్భుతంగా సాగిందన్నారు. 10 కిలోమీటర్ల మేర.. ఇంత పెద్ద బహిరంగ సభలు ఇంత వరకు ఎవరు పెట్టలేదన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై విమర్శలకు దిగుతున్నారని.. వ్యవస్థలోని లోపాలపై పవన్ కల్యణ్ విమర్శలు చేస్తే.. ఆయనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ విమర్శించే అంశాలపై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇవ్వరని.. ముగ్గురు, నలుగురు మంత్రుల చేత పవన్‌ని తిట్టిస్తారని ఆయన చెప్పారు.  రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్... అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి... ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ఆయన ప్రజలకు గుర్తు చేస్తారన్నారు. ఈ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని.. జనసేన తిరిగి వెలుగులు నింపుతోందన్నారు.  వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం .. అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి నిలబడాలని ప్రజలకు నాదెండ్ల మనోహర్ పిలుపు నిచ్చారు.

తిరుమలలో ఏం జరుగుతోంది? భద్రత కరవు, పవిత్రతకు పంగనామాలు!

జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో, చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో, అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం. వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ  తీసుకుంటున్నతప్పుడు నిర్ణయాల వరకు   అపచారాలకు లెక్కేలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని, భక్తులు హిందూ ధర్మ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆగ్రహిస్తున్నాయి.  అంతేకాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులు  వ్యక్తపరుస్తున్నారు.   ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకు, ‘దొరికినంత దోచుకో’, పద్దతిలో టీటీడీ దోపిడీకి పాల్పడుతోందని, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు, నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి, దప్పికలు తీర్చేందుకు, గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది .. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే, క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది, దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు. సరే తిరుమల భద్రత, హిందూ ధార్మికతకు టీటీడీ తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు పవిత్రతకు కూడా పంగనామాలు పెట్టేస్తున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం.. స్వామి వారి దర్శనం కోసం కర్నాటక నుంచి వచ్చిన భక్తులు కూడా పెంపుడు కుక్కను కూడా తీసుకువస్తే అలిపిరి చెక్ పాయింట్ వద్ద విజిలెన్స్ పట్టించుకోకుండా  వదిలేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కర్నాటక నుంచి సొంత వాహనంలో అలిపిరి చెక్ పోస్టు మీదుగా తిరుమల చేరుకున్నారు. చెక్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వారి వాహనంలో ఉన్న పెంపుడు కుక్కను పట్టించుకోకుండా తిరుమలపైకి అనుమతించేశారు. దీంతో వారు తమ పెంపుడు కుక్కతో  తిరుమలకు వచ్చేశారు. తిరుమలపైకి పెంపుడు జంతువులకు అనుమతి లేకపోయినా విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుమలపై పెంపుడు కుక్కతో తిరుగుతున్న భక్తుల బృందాన్ని గమనించిన మీడియా ఫొటోలు తీసి అధికారులకు సమాచారం అందజేయడంతో  వారు హడావుడిగా రంగ ప్రవేశం చేసి పెంపుడు కుక్కతో తిరుమల చేరుకున్న భక్త బృందాన్ని వారి వాహనం, శునకంతో  సహా కొండ కిందకు పంపేశారు.   

అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చబండ.. రెస్పాన్స్ అదరహో

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వైఫల్యాలను, అరాచకాలను, అక్రమార్కులను రచ్చబండ కార్యక్రమం ద్వారా రోజూ ఉతికి ఆరేసే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన రచ్చబండ నిర్వహించి ఏపీలో జగన్ అరాచకపాలనను కళ్లకు కడుతున్నారు. రఘురామకృష్ణం రాజు  తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. మీడియా,సోషల్‌మీడియాలో  నిత్యం వినిపించే పేరు రఘురామకృష్ణం రాజు.    జగనన్న సర్కారు తీసుకునే నిర్ణయాల వెనుక చీకటి కోణాన్ని అన్వేషించి, దానిపై నిరంతరం కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఆయన నిత్యకృత్యం. ఇందు కోసం ఇక తనపై జగన్ సర్కార్ బనాయించిన కేసులపై   ఢిల్లీ నుంచే న్యాయపోరాట చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులను పదేపదే కలుస్తున్నారు. జగన్  అరాచకత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే   జగనన్న సర్కారును నిత్యం ఉతికి పారేస్తున్నారు.  సొంత పార్టీ అధినేతపైనా, ప్రభుత్వంపైనా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రఘురామకృష్ణం రాజు. పేరుకే ఆర్ఆర్ఆర్ ది ఒంటరి పోరు. ఆయన పోరటానికి అభిమానులుగా మారిన వారు మాత్రం లక్షల్లోనే ఉంటారు.  యూట్యూబ్‌లో.. ఆర్ఆర్ఆర్ కు వచ్చే లైక్స్, షేర్లు కామెంట్లు ఏ తెలుగు నాయకుడికీ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు  అమెరికా పర్యటనలో  రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తోంది.  ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు, తెలుగు సంఘాలు-గోదావరి జిల్లా ఎన్నారైలు రఘురామరాజును ఆహానిస్తున్నారు. అక్కడ కూడా ఆయన రచ్చబండ ద్వారా జగన్ సర్కార్ ను ఉతికి ఆరేస్తున్నారు. జగన్ పై ఆయన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలకు ఎన్ఆర్ఐల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. 

కాంగ్రెస్ + బీఆర్ఎస్.. బీఆర్ఎస్ + బీజేపీ.. ఏంటీ ఈక్వేషన్స్?!

కాంగ్రెస్ + బీఆర్ఎస్.. బీఆర్ఎస్ + బీజేపీ. ఈ ఈక్వేషన్స్ ఏంటి.. అసలు ఈ లెక్కలేంటి అనుకుంటున్నారా?. ఈ లెక్కలన్నీ ఆ పార్టీ నేతలు చెబుతున్నవే. ఎలా అంటే అసలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడిపిస్తున్నది.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చేది కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు చెప్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని.. ఇక్కడ గల్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఢిల్లీలో భాయీ భాయీ అంటూ తిరుగుతారని, అసలు బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి బీ టీమ్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వరకూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో అసలు ఏ పార్టీ ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రువు.. అసలు ఎవరు ఎవరి వెనక ఉన్నారు.. ఎవరు ఎవరిని శత్రువుగా చూస్తున్నారన్నది అర్ధం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది కేసీఆరేనంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కేసీఆర్ టికెట్లు ఖరారు చేసే ఆ ముప్పై మందిలో  ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా గులాబీ బాసే డిసైడ్ చేస్తారన్నారు. ఈ ముప్పై మంది కాంగ్రెస్ నుంచి గెలిచినా.. మళ్లీ బీఆర్ఎస్‌లో చేరుతారంటూ బండి సంజయ్ కలకలం రేపారు. కరీంనగర్ మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘టిఫిన్ బైఠక్’లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర దుమారం రేపాయి. ఇది బీజేపీ మైండ్ గేమ్ గా కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. బీజేపీ బీఆర్ఎస్ మైత్రి ఢిల్లీ వీధుల్లో కనిపిస్తుందని రిటర్న్ విమర్శలు కూడా కాంగ్రెస్ నుండి వినిపించాయి. కాగా, తాజాగా తెలంగాణ పర్యటనకి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా మారిందని.. సీఎం కేసీఆర్  రిమోట్ ఇప్పుడు ప్రధాని మోడీ చేతిలో ఉందని, ఆయన ఏం చెబితే కేసీఆర్ అది చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, వాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దని రాహుల్ తెలంగాణ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ బీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని రాహుల్ అన్నారు. దీనికి బీఆర్ఎస్ నుండి కూడా ఘాటు కౌంటర్లు వచ్చాయి. ‘మాది బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్ కు సీ టీమ్ అంతకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్ అంటూ బీఆర్ఎస్ నేతలు రిటర్న్ కౌంటర్లు విసిరారు. అయితే, ఈ మూడు పార్టీల మధ్య ఈ ఈక్వేషన్స్ చూస్తే కాస్త ఆసక్తి కలగక మానదు. రానున్న ఎన్నికలలో ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. దీంతో ఎవరికి వారు మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ ఈ మైండ్ గేమ్ మొదలు పెట్టగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే గేమ్   ఆడడం మొదలు పెట్టింది. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాబోతుందని భారీ ప్రచారం జరిగినా అది జరగకపోవడం.. ఈ మధ్యనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవడం వంటివి  చూపిస్తూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలను రివర్స్ లో ఆ పార్టీపైకే వదులుతోంది.  అయితే, ఎవరికి వారు ఇలా పక్కవారిపై బురదజల్లేలో పనిలో ఉండగా పాపం ప్రజలు మాత్రం.. ఈ ఈక్వేషన్స్ అర్ధం చేసుకోలేక అయోమయంలో పడిపోతున్నారు.