పొన్నాల బ్యాక్ ఫైరింగ్

  ఇల్లలకగానే పండుగకాదన్నట్లు పీసీసీ అధ్యక్ష పదవి చేప్పట్టగానే మిటాయిలు పంచుకోవడం కూడా అంత మంచిది కాదని పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి చూస్తే భోధపడుతుంది. పీసీసీ అధ్యక్ష కుర్చీలో ఆయన ఇంకా సరిగ్గా కూర్చోక ముందే టీ-కాంగ్రెస్ నేతలు దాని క్రింద మంటలు బెట్టడంతో ఆయన లబోదిబో మంటూ డిల్లీ పరిగెత్తారు. తీరా చేసి అంతదూరం వెళితే అక్కడ కూడా ఆయనకి అధిష్టానం చేత అక్షింతలు వేయించుకోక తప్పలేదు. కాంగ్రెస్ అధిష్టానం తెరాస కాళ్ళు పట్టుకొనయినా దానితో పొత్తులు పెట్టుకొందామని ఆలోచిస్తుంటే ఆయన ఆ పార్టీతో అసలు పొత్తులవసరమే లేదన్నట్లు మాట్లాడటమే అధిష్టానం ఆగ్రహానికి కారణం. ఒకవైపు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తనను ఎంతగా చ్చీదరించుకొంటున్నా దానిని తుడిచేసుకొని పొన్నాల నేటికీ తాను పొత్తుల విషయంలో తెరాస స్పందన కోసం ఎదురు చూస్తున్నాని, ఈరోజు వచ్చినా చర్చలకు సిద్దమేనని ప్రకటించవలసి రావడం చూస్తే పొన్నాల పరిస్థతికి జాలి కలుగుతుంది.   కానీ, తెరాస నేతలు తాము కాంగ్రెస్ పార్టీని వదిలించుకొందామని ఎంతగా ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ తమ వెంటపడటం చూసి చిర్రెత్తిపోతున్నారు. అందుకే తెరాస నేత హరీష్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కధ ఎప్పుడో ముగిసిపోయింది. ఇక దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము తనతో చర్చిస్తున్నట్లు చెప్పుకొంటూ మాతో మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తోంది. కానీ మేము దాని కుయుక్తులకు లొంగే వాళ్లము కాము.” అని దీటుగా జవాబిచ్చారు.   దానితో మళ్ళీ సహనం కోల్పోయిన పొన్నాల, “అసలు తెరాస ఏమిచేసిందని మమ్మల్ని ఆక్షేపిస్తోంది? బాధ్యతగల మంత్రి పదవులలో ఉండి కూడా మేము రెండు నెలల పాటు విధులకు దూరంగా ఉండి మా అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తెలంగాణా సాధిస్తే, ఫాం హౌస్ లో పడుకొనే కేసీఆర్ అదంతా తన ఘనతేనని చెప్పుకోవడం చాల వింతగా ఉంది. తెలంగాణా ఏర్పాటులో మా కాంగ్రెస్ నేతలందరి కృషి, పోరాటాలు ఉన్నాయి. అనేక లక్షలమంది చేసిన పోరాటాలు, ఉద్యమాలు, వందలాది యువకుల బలిదానాల కారణంగా తెలంగాణా ఏర్పడింది తప్ప కేసీఆర్ వల్ల మాత్రం కాదు. అయినా మా కాంగ్రెస్ యంపీలందరూ పార్లమెంటులో తెలంగాణా కోసం పోరాడుతుంటే అప్పుడు కేసీఆర్ ఎక్కడ పడుకొన్నారు?ఎప్పుడూ ఫాం హౌస్ లో పడుకొనే ఆయనకు బయట లోకంలో ఏమి జరుగుతున్నాయో తెలుసా అసలు? తెలంగాణా మా వల్ల, మా పార్టీ వల్ల, ప్రజా ఉద్యమాల వల్లనే వచ్చింది తప్ప ఆయనొక్కరి వల్లే రాలేదని ప్రజలందరికీ కూడా తెలుసు.” అని కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు పొన్నాల.   తెరాసతో పొత్తులకు సిద్దమే అంటూ ఈవిధంగా మాట్లాడవలసి రావడం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎవరికయినా. తెరాస నేతలు మూకుమ్మడిగా తమ పీసీసీ అధ్యక్షుడిపై దాడి చేస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా ఆయనకు అండగా వచ్చి నిలబడట్లేదు. ఎందుకంటే ఆయన వల్లనే తమకు ఆ పదవి దక్కకుండా పోయిందనే అక్కసు. ఒకవైపు స్వంతపార్టీ నేతలతో, మరోవైపు తెరాసతో ఒంటరిగా పోరాడుతూనే ఎన్నికల పొత్తుల గురించి కూడా మాట్లాడటానికి గొప్పనేర్పు సహనమే కావలి మరి. పీసీసీ పీటమా మజాకా...

కిరణ్ కుమార్ రెడ్డి కనబడుటలేదు

  రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి, తన పదవి నుండి తప్పుకొనే సమయానికి పూర్తిగా తన ప్రాభవం కోల్పోయారు. అయినప్పటికీ ఆవిషయం గ్రహించకుండా ఆయన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పెట్టుకొని మరోమారు భంగపడ్డారు. అనేక సర్వేలు చేయించుకొని పరిస్థితులు తనకు చాలా అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకొన్న తరువాతనే పార్టీ పెట్టినా కూడా అసలు బొత్తిగా జనాధారణ లేకుండా పోవడంతో, ఇంతవరకు ఆయనను అంటిపెట్టుకొని ఉన్నవారు కూడా మెల్లగా జారుకొంటుండటంతో అసలు ఆయన పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం మారిందిప్పుడు.   ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు కూడా లేని ఈ కీలక సమయంలో కూడా ఆయన తనను ఎవరో హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళవద్దని ఆదేశించినట్లుగా పూర్తిగా హైదరాబాదుకే పరిమితమయిపోయారు. ఆయన రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానానికి అన్ని విధాల సహకరించి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించడమే కాకుండా, తన అనాలోచిత, అహంకార పూరిత నిర్ణయాలతో స్వంత రాజకీయ భవిష్యత్తుని, తనను నమ్ముకొన్నవారి భవిష్యత్తుని కూడా సర్వ నాశనం చేసారు.   ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తన జైసపా జెండా పట్టుకొని ఒంటరిగా ప్రజలలో తిరుగలేరు. అలాగని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళలేరు కూడా. మళ్ళీ ఎన్నికలు పూర్తయ్యి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో మరియు కేంద్రంలో ఓడిపోయినపుడు, అది కూడా ఆయన పరిస్థితిలోనే ఉంటుంది గనుక అప్పుడు తాపీగా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొని ఒకరినొకరు ఓదార్చుకొంటారేమో! కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారంలో అతితెలివి ప్రదర్శించి బోర్లాపడితే, దానికి సహకరించిన ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇది పూర్తిగా వారి స్వయంకృతాపరాధమే గనుక ఆయన, కాంగ్రెస్ పార్టీ వేరెవరినీ నిందించవలసిన పనిలేదు.

బీజేపీలో టీ-ఏపీ చీలిక?

      తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూనే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఏం చేస్తారో, ఎన్ని నిధులిస్తారో స్పష్టం చేయాలని రాజ్యసభలో పట్టుబట్టిన నాయకుడు వెంకయ్య నాయుడు. తన వాగ్ధాటితో, ప్రాసలతో కూడిన ప్రసంగాలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే వెంకయ్యకు.. ఇప్పుడు తెలంగాణా ప్రాంత బీజేపీ నాయకులు దూరం అవుతున్నారు. ఈ విషయం స్పష్టంగా బయటకు కనపడుతోంది. ఆయన ఎప్పుడు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం పెట్టినా ఇరువైపులా తెలంగాణ ప్రాంత నాయకులు బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె. లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు లాంటి నేతలు ఎవరో ఒకరు ఆయన పక్కన కూర్చునేవారు. గురువారం ఈ ప్రాంత నేతలెవరూ లేకుండా వెంకయ్య విలేకరుల సమావేశం జరిగింది.   ఆంధ్ర ప్రాంత నేతలు యడ్లపాటి రఘునాథ్‌బాబు, విష్ణువర్ధన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి తదితరులు వెంకయ్యతో పాటు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధీష్ రాంబొట్ల ఈ సమావేశంలో పాల్గొన్నా,  వెంకయ్య ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు సంబంధిం చిన నేతగా పరిచయం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణా అభినందన సభకు సైతం వెంకయ్యనాయుడు దూరంగానే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే, ఎప్పుడో కాకినాడ సభ నుంచే ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు అంటూ నినాదాలిచ్చిన బీజేపీలో ఇప్పుడు ఇరు ప్రాంతాల నాయకుల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఖర్చు.. తడిసి మోపెడు

      ఎన్నికల్లో డబ్బు కీలకంగా మారింది. అభ్యర్థుల జయాపజ యాలను శాసిస్తోంది. పేరు, పలుకుబడితోపా టు ప్రజాసేవ చేయాలన్న తపన ఉన్నా ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. మునిసిపల్, జిల్లా పరిషత్, సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల వ్యయం భారీగా పెరిగింది. అభ్యర్థుల రోజువారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలంటే, డబ్బులిచ్చి పది మందిని వెంట తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కొక్కరికీ రూ.300 కూలితో పాటు బిర్యానీ ప్యాకెట్, మద్యం అందించాల్సి వస్తోంది. ఒక్కో అభ్యర్థి రోజుకు సగటున రూ.20 వేల ఖర్చు చేయాల్సి వస్తోందట.   ఇదే మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి అయితే రోజుకు రూ.40 వేల దాకా వ్యయం చేయాల్సి వస్తోంది. 2005 మునిసిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి ఖర్చు బాగా పెరిగినట్లు అభ్యర్థులే చెబుతున్నారు. అప్పట్లో కేవలం ఓట్లు కొనేం దుకు మాత్రమే లక్షల్లో వెచ్చించే అభ్యర్థులు నేడు నామినేషన్, ప్రచారం, పోలింగ్ ఖర్చులు కూడా భరించాల్సి వ స్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మునిసిపాలిటీల్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల వార్డు అభ్యర్థులు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వ్యయం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే చైర్మన్ అభ్యర్థి అయితే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా.

అభ్యర్థులకు కొత్త టెన్షన్

      అసంతృప్తులు, అలకలు, బెదిరింపుల పరిస్థితులను అధిగమించి టికెట్లు సంపాదించి ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో ఎన్నికలు జరుపుకోమని చెప్పిన సుప్రీం కోర్టు మే 7వ తేదీ తర్వాతే ఫలితాలు ప్రకటించాలని గురువారం ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలే ఆపుతారా? లేక లెక్కింపు కూడా అప్పటి దాకా నిలుపుదల చేస్తారా? అనే ఆందోళన ప్రారంభమైంది. ఈ గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఏ విధమైన స్పష్టత ఇస్తుందోనని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు. ఈ తీర్పు తమకు అనుకూలమా? ప్రతి కూలమా? అనేది అర్థం కాక పోటీలోని అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కంగారు పడుతున్నారు. కోర్టు తీర్పును అనుసరించి మే 7వ తేదీ దాకా ఓట్ల లెక్కింపు ఆపేస్తే తమ నెత్తిన పాలు పోసినట్లు అవుతుందని ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఆశపడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం ఎన్నికలు జరిగాక కూడా నెల రోజులు ఓట్ల లెక్కింపు జరపకపోతే తమ టెన్షన్ మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నిలిపి వేయాలని హైకోర్టులో దాఖలైన కేసులపైన కూడా శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందా? ఉండదా? అనే టెన్షన్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

ఉగాది నాటికి దోస్తీ?

      ఇరు పార్టీల మధ్య రెండు మూడు రోజులపాటు మాటల తూటాలు పేలినా మళ్లీ వాతావరణం చల్లబడింది. పొత్తు చర్చల బాధ్యత తీసుకొన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ గురువారం హైదరాబాద్‌లోనే గడిపారు. ముందు తమ పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన తర్వాత టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి పొత్తుల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని జవదేకర్ చూస్తున్నారు. వీలైతే ఈ నెల 31వ తేదీ ఉగాది రోజున పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడేలా చూడాలన్నది యోచన అంటున్నారు.   పంచుకోవాల్సిన సీట్లపై ఇరు పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం బీజేపీ.. తెలంగాణాలో తొమ్మిది ఎంపీ సీట్లు, 45 అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 6 ఎంపీ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు కోరింది. అయితే తెలంగాణలో 6 ఎంపీ సీట్లు, 25అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 3 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడింది. స్థానికంగా సీట్ల వ్యవహారం తేలకపోతే అంతిమంగా బీజేపీ జాతీయ నేత అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి దీనికి ముగింపు పలికే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక పక్క పొత్తు చర్చలు జరుగుతుండగానే.. బీజేపీ నేతలు భిన్న స్వర్వం వినిపిస్తున్నారు. పొత్తులున్నా, లేకపోయినా తమ పార్టీ మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పగా, తాము పొత్తులకు సిద్ధంగా లేమని, కేవలం సర్దుబాట్లకే సిద్ధంగా ఉన్నామని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

చిరు అబ్బ దబ్బ జబ్బ ..

  పుట్టు మూగ.. 40 ఏళ్ళ వయస్సులో వైద్యంతో మాట వస్తుంది. ఇక చూడాలి. చిన్నప్పటి నుంచి మాట్లాదలనుకున్నవన్నీ ఒక్కసారిగా మాట్లాడేస్తుంది. అప్పటివరకూ అబ్బ దబ్బ జబ్బ పదాలు విన్న భర్త భార్యామణి మాటల వరదతో చెవులు చేటంత అవుతాయి. ఇదో ఓ తెలుగు సినిమాలో కామెడీ సీను. సేమ్ టు సేమ్ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఇలాగే మారిపోయారు.   విభజన ప్రకటన సంప్రదింపుల సమయంలో యూటీ కోసం ప్రయత్నిస్తా.. రాజీనామా చేస్తా.. సమైక్యం కోసం కృషి చేస్తా.. వంటి మూడో, నాలుగో మాటలు మాట్లాడేవారు..ఇప్పుడు అంతా అయిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ కు సినిమా కనిపిస్తోంది. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ భాద్యతలు భుజాన వేసుకుని బస్సు యాత్రకు బయలుదేరారు చిరంజీవి అండ్ కో.   ఈ యాత్రల్లో చిరు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నవి, అప్పుడే చెప్పాల్సినవి.. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని మరీ బస్సు ఆగిన ప్రతి చోటా చెబుతున్నారు. బొత్స ఆస్తులపై దాడుల వెనుక అప్పటి సీఎం కిరణ్ ఉన్నారని విజయనగరం సభలో, కిరణ్ నమ్మకద్రోహం చేశాడని రాజమండ్రిలో, కేంద్ర మంత్రులమైన తమనీ మోసం చేశాడని ఏలూరులో , పదవులు అనుభవించి కొందరు వెళ్లిపోయారని విజయవాడలో అయిపోయిన సంగతులు చెబుతున్నాడు లేటెస్ట్ గా అనంతపురంలో విభజన చేయాలనే ఆలోచన కాంగ్రెస్ కు లేదని, టీడీపీ.. వైసీపీ లు పట్టుపట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఇచ్చిన లేఖలను కూడా తీసుకొచ్చారు.   ఈ సంఘటనలు అన్నీ జరిగినప్పుడు మాట్లాడా లనుకుని ఎవరైనా ఫీలవుతారని మౌనంగా ఉండిపోయి ఉంటాడని, అవన్నీ ఇప్పుడు గట్టు తెగిన గోదావరిలా ఉబికి వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటుంటే .. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం మన చిరు కూడా అబ్బ దబ్బ జబ్బే అని ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

రాయపాటి ఫ్యామిలీ ప్యాకేజి

  గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, కుటుంబ సభ్యులంతా కలిసి టీడీపీలో చేరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయన వెంట వెళ్తారని భావించిన రాయపాటి, ఆ తర్వాతి కాలంలో మనసు మార్చుకుని టీడీపీ వైపు మొగ్గు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజకీయ శిష్యుడు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాత్రం ఇంకా ఏ విషయమూ నిర్ణయించుకోలేదు. ఆయన కూడా వస్తారేమోనని ఇన్నాళ్లూ వేచి చూసిన రాయపాటి, ఇక ఆలస్యం చేయడం అవనసరమని, ఎన్నికలు దగ్గర పడుతున్నందున అధికారికంగా చేరిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తన సోదరుడితో ప్రకటన చేయించేశారు. తమ కుటుంబమంగా టీడీపీలో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వెల్లడించారు.   ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్గీయులుగానే ముద్రపడి, ఆ పార్టీకి ఎనలేని సేవచేసిన తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు సైతం తమ కుటుంబం పార్టీకోసం ఎంతో పాటుపడిందనీ, కానీ తమ సోదరుడు సాంబశివరావుకు సరైన ప్రాధాన్యమివ్వలేదు సరికదా సమైక్యవాదం వినిపించినందుకు సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందని చెప్పారు. తొలుత రాజకీయాల నుంచే తప్పుకుందామనుకున్నామనీ, అభిమానుల కోరిక మేరకు ఈనెల 31నగానీ, వచ్చేనెల 4వ తేదీన గానీ టీడీపీలో చేరనున్నామని వివరించారు. తమతోపాటు రాయపాటి మోహనకృష్ణ కూడా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

కిరణ్ వర్గంలో అంతర్మథనం

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరవర్గంలో అంతర్మథనం మెదలైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన సొంత నియోజకవర్గం వైపు ఇప్పటివరకు క న్నెత్తి చూడలేదు. ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టే సమయంలో కూడా ఆయన రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించారు తప్ప, సొంత జిల్లా అయిన చిత్తూరును పట్టించుకోలేదు. తిరుపతిలో సభ పెట్టి భారీగా పార్టీ ప్రకటించిన చిరంజీవి, చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు కాబట్టి సెంటిమెంటు పరంగా ఇక్కడ పెడితే తననూజనం అలాగే అనుకుంటారనో, ఏమో రాజమండ్రిని వేదికగా కిరణ్ ఎంచుకున్నారు. అయితే, ఆయన వెంట ఉన్న ముఖ్యనేతలంతా పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో సొంత నియోజకవర్గంలో కిరణ్ అనుచరులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇంకా కిరణ్‌ను నమ్ముకుంటే తాము కూడా మునిగిపోతామనే అభద్రత వారిలో చోటుచేసుకుంది. దాంతో నెమ్మదిగా వాళ్లు కూడా వేరే దారులు చూసుకుంటున్నారు.   కొంతమంది టీడీపీవైపు, మరికొంతమంది వైఎస్ఆర్ సీపీ వైపు వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పీలేరు మండలం వేపులబైలు, జాండ్ల, రేగల్లు సర్పంచ్‌లు మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. వీరిలో జాండ్ల సర్పంచ్ శ్రీనివాసులు కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పత్తేగడలో పార్టీ మారుతున్న వారిని మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన ద్వితీయశ్రేణి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, వాళ్లు పట్టించుకోలేదు. ఇప్పటివరకు పీలేరులో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి పెత్తనం చేస్తూ వచ్చారు. అన్న తరఫున పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఏ పని కావాలన్నా మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డిపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కిరణ్ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.   కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కిషోర్ కుమార్‌రెడ్డి అంతగా పట్టించుకోవడం లేదు. ఆయన కేవలం హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. ఇదే కొనసాగితే నియోజకవర్గంలో మనుగడ కష్టమనే అభిప్రాయం కిరణ్ వర్గీయులను వెంటాడుతోంది.

చిరు మీటింగుకెళ్తే అంతేనా?

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ వుంది. మాజీ మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాకైనా క్లాప్ కొట్టాడంటే ఆ సినిమా ఫ్లాప్ డిసైడైపోతుంది. అందుకే సినిమా ప్రారంభోత్సవాల్లో ఆయన చేత క్లాప్ కొట్టించే సాహసం ఎవరూ చేయరు. అదేంటోగానీ, అడపాదడపా ఆ సాహసానికి ఒడికట్టినవారు భారీ మూల్యాన్ని చెల్లించిన దాఖలాలు అనేకం వున్నాయని సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ వుంటాయి.   అలాగే చిరంజీవి విషయంలో ఒక విషాదకర వాస్తవం వుంది. చిరంజీవి హీరోగా వుండగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, ఆడియో ఫంక్షన్లు, శతదినోత్సవాలకు ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చినవారు క్షేమంగా తిరిగి వెళ్తారన్న గ్యారంటీ వుండదంటారు. ఎందుకంటే చిరంజీవి ప్రోగ్రాములకు హాజరై తిరిగి ఇళ్ళకు వెళ్తున్న ఎంతోమంది అభిమానులు యాక్సిడెంట్లకి గురై తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అందుకే ఓసారి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా చిరంజీవికి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ జరుగుతూ వుంటే, దానికి అభిమానులు తరలి వస్తుంటే తనకి ఎంతో భయం వేస్తూ వుంటుందని చెప్పారు.   చిరు ఫంక్షన్స్‌ కి వచ్చే అభిమానులు జాగ్రత్తగా ఇళ్ళకు తిరిగి వెళ్ళాలని కోరుకున్నారు. చిరు హీరోగా వున్నప్పటి పరిస్థితి ఇలా వుండగా, అయ్యగారు ప్రజారాజ్యం పార్టీని వెలగబెట్టినప్పుడు రాష్ట్రమంతా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంతోమంది ఆయన అభిమానులు కరెంటు షాక్‌లు తగిలో, ఆయన మీటింగ్‌లకి వచ్చేటప్పుడో, వెళ్ళేటప్పుడో యాక్సిడెంట్లు జరిగి మరణించిన సందర్భాలు చాలా వున్నాయి. ఇలా అభిమానులు చనిపోవడం, వాళ్ళ ఇళ్ళకు నాగబాబు వెళ్ళి సానుభూతి ప్రకటించడం అప్పట్లో ఆనవాయితీగా వుండేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, నెల్లూరులో చిరంజీవి మీటింగ్‌లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. చిరంజీవి ప్రసంగం వినడానికి వచ్చిన ఓ అభిమాని గుండెపోటుతో మీటింగ్ మధ్యలోనే మరణించాడు. ఇలాంటి దుర్ఘటనలు మరికొన్ని జరిగితే జనం చిరంజీవి మీటింగ్‌లకి వెళ్ళాలంటే భయపడిపోవడం ఖాయం.

ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ బీజేపీ

  తెలుగు సినిమా మొత్తం నమో జపం చేస్తోంది. బీజేపీ పిలుస్తోంది రా కదలి రా.. అని ఒకరి వెంట ఒకరు కమలనాధుల చెంతకు చేరుతున్నారు. సర్వేలన్నీ ఇంచుమించు ఎన్డీయే వైపు మొగ్గు చూపుతుండటంతో టాలీవుడ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. తెలుగు సినీ ప్రముఖులు ఫిలింనగర్ టు గాంధీనగర్ టికెట్లు బుక్ చేసుకుంటారు. నమో ఆశీస్సులు తీసుకుని వస్తున్నారు. మరికొందరు నటులు రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి కాషాయ కండువాలు కప్పుకుని వస్తున్నారు.   ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నటులు కీలకంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం కమలనాధులకు మద్దతు ప్రకటిస్తున్నారు. కృష్ణంరాజు, జీవిత రాజశేఖర్, సురేష్ వంటి నటులు పార్టీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ , నాగార్జున, మంచు లక్ష్మి నరెంద్రమోడీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య మాటల ప్రకారం మరికొంతమంది సినీ ప్రముఖులు భారతీయ జనత పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒకే ఒక్కామె..

  ఎవరూ సాధించలేని ఘనతను సాధించిన వ్యక్తిని ఒకే ఒక్కడు అని అంటాం. అదే ఘనతను ఒక మహిళా సాధిస్తే ఒకే ఒక్కామే అని అనాలి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నుంచి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింతు శకుంతల సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్టంలో 1096 జెడ్పీటీసీ స్థానాలలో ఏకగ్రీవంగా ఎన్నికైనది ఇదొక్కటే. శకుంతల టీడీపీ బీ ఫారంతో నామినేషన్ వేసింది.   గతంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా, నరసన్నపేట ఎంపీపీగా పని చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిమ్మ ఉషారాణి వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసింది. ఉషారాణి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసేందుకు అభ్యర్ధి కూడా దొరకని పరిస్తితుల్లో టీడీపీ అభ్యర్ధి శకుంతల ఏకగ్రీవంగా ఎన్నికైంది. సిమ్మ ఉషారాణి మామా, భర్త ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతురాలు, రాజకీయవేత్త అయిన ఉషారాణి నామినేషన్ చెల్లలేదంటే శకుంతల లక్ కాకపొతే మరేంటి అని నరసన్నపేట జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ ఎన్నికలలో 'జనసేన' పోటీ చేయదు: పవన్

      సమాజం కోసం పనిచేసే నిస్వార్ధమైన యువ నాయకుల కోసం వెతుకున్నానని, అలాంటి నాయకులు దొరికే వరకు పోటీ చేయబోనని, అలాంటి నాయకులు దొరికితే సమాంధ్రతో పాటు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓట్లు చీల్చిచడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఆర్ధిక రాజధాని నిర్మించగల సమర్ధవంతమైన నాయకుడినే ఎన్నుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో పోటీ చేయకపోయిన ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టి, అవినీతి, నీచ రాజకీయాలు చేసే నాయకులను జనసేన పార్టీ తగిన బుద్ది చెబుతుందని హెచ్చరించాడు.

మోడీ ప్రధాని అవడం ఖాయం: పవన్

      నరేంద్ర మోడీని తాను కలవడంపై ఇతర రాజకీయ పార్టీల నేతలు హేళన చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. తమ అవసరాలకు రాజకీయ పార్టీ నేతలు బిజెపి నేతలను కలిస్తే తప్పులేనప్పుడు..తాను నరేంద్ర మోడీని కలిస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీకో సిద్ధాంతం నాకో సిద్ధాంతమా అని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత విభజనపై ఆయన స్పందించిన తీరు నాకు నచ్చిందని అన్నారు. దేశానికి కావాల్సిన సమర్ధవంతమైన నాయకుడు నరేంద్ర మోడీ అని ప్రశంసించారు. ఈ సారి మోడీ దేశానికి ప్రధాని అవుతారని, తన మద్దతు ఆయనకేనని పవన్ సభలో ప్రకటించారు. యువత కూడా మోడీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బిజెపి నాయకులు కాకినాడలో ప్రత్యేక తెలంగాణ అని చెప్పారని, ఆ రోజుల్లో సీమాంధ్ర నాయకులు ఎవరూ మాట్లాడలేదని, అందువల్ల బిజెపి గురించి మాట్లాడలేకపోతున్నామని అన్నారు.

వేర్పాటువాదాన్నిఅడ్డుకొనేందుకే జనసేన: పవన్

  కాంగ్రెస్ అనుసరించిన ఈ విభజన వాదం వలన దేశంలో వేర్పాటువాదం పెరిగిపోతోంది. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల ఉన్న గ్రామంలో ఉన్న 14ఏళ్ల పిల్లాడికి కేసీఆర్ మీద కోపం ఎందుకు కలుగుతోంది? ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్న పిల్లాడికి, శ్రీకాకుళంలో ఉన్న పిల్లాడికి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్న విభాజించి పాలించు అనే పాలసీ వల్లనే. అదే విధంగా మొన్న పార్లమెంటులో కొందరు యంపీలు మేము అసలు భారత దేశంలోనే ఉన్నామా? అని ప్రశ్నించినప్పుడు నాకు చాల భయం కలిగింది. దీనిని ఇలాగే వదిలిపెడితే దేశం మరో శ్రీలంకలా తయారవుతుందని భయపపడ్డాను.ఇటువంటి విభజనవాదులు అందరూ ఏకమయితే దేశం ఏమవుతుందనే భయంతోనే నేను ఈ రోజు రాజకీయాలలోకి వచ్చేను.

రాజు నీతి తప్పితే... నేల సారం తప్పుతుంది: పవన్

      ప్రజలకు మంచి చేస్తారని రాజకీయ నాయకులను ఎన్నుకొంటె వాళ్ళు అవీనీతి, లంచగొండితనానికి అలవాటు పడి రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రోమన్ చక్రవర్తులు ఎంగిలి మెతుకులు విసిరినట్లు తెలుగు ప్రజలకు ప్యాకేజీలు విసిరారని ఆయన అన్నారు. కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. భారత జాతికి తూట్లు పొడిచారని ఆయన అన్నారు. 120 ఏళ్ల చరిత్ర అంటారు, ఇది కాంగ్రెసు చేసిన నిర్వాకమని అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లు దానికి తూట్లు పొడిస్తే మనకు ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అన్నారు. చట్టం అందరికీ సమానంగా పనిచేయడం లేదని అన్నారు.

ప్రజారాజ్యం విలీనంపై ఎందుకు మౌనం: పవన్

  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేను భావించాను. ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వ్యవహారాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని భావించే నేను ఆరోజు మౌనం వహించేను. నా కంటే ఎంతో అనుభవజ్ఞులయిన రాజకీయనేతలు ఈ విషయంపై సరయిన నిర్ణయమే తీసుకొని ఉండవచ్చని భావించబట్టే నేను ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగినా నేను మౌనం వహించాను. ఈ ఐదేళ్ళలో నేను ఈ వ్యవహారంపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుని చూసిన తరువాత నేను ఇక సహించలేకనే నేను రాజకీయాలలోకి రావలసి వచ్చింది.

అందరికీ సమన చట్టమే జనసేన పార్టీ సిద్ధాంతం

  ప్రతీ ఐదు సం.లకి కండువాలు మార్చుకొనే పార్టీ కాదు జనసేన. పార్టీకి మ్యానిఫెస్టో లేదని చాలా మంది విమర్శించారు. నిజమే..మా పార్టీకి ప్రత్యేకమయిన మ్యానిఫెస్టో లేదు. కానీ ఈ అవినీతిని కూలద్రోయడమే మా మ్యానిఫెస్టో. చట్టం కొందరికి అధిక సమానం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి చట్టాలు వర్తించవు. వారికి బెయిలిచ్చి సాగనంపుతారు. కానీ ప్రభుత్వాదేశాలను పాటిస్తూ వారిపై చర్యలు తీసుకొన్న నిజాయితీ గల అధికారులను మాత్రం పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టి శిక్షించబడతారు. వారెవరూ మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అందరికీ ఒకే చట్టం, అందరికీ సమానమయిన చట్టం వర్తింపజేస్తుంది. చివరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టమే జనసేన కోరుకొంటోంది.