గ‌ద‌ర్ ఏక్ ఆస్కార్ క‌థ‌!

గ‌ద్ద‌ర్ కి ఆస్కార్ కీ సంబంధ‌మేంట‌న్న దానిక‌న్నా.. గ‌ద్ద‌ర్ కి సినిమాల‌కూ ఉన్న సంబంధం కూడా చాలా చాలా త‌క్కువ‌. గ‌ద్ద‌ర్ ఎప్పుడో మా భూమిలో బండెన‌క బండి క‌ట్టి అనే పాట.. అది కూడా బండి యాద‌గిరి అన్న  మ‌రో ర‌చ‌యిత  రాసిన పాట పాడారు. ఆ తరువాత రంగుల కల సినిమాలో  జమ్ జమ్మల మర్రి అనే పాట పాడారు. అది కూడా గూడ అంజయ్య అనే రచయత రాసిన పాట. త‌ర్వాత ఆయ‌న సినిమా తెర‌పై క‌నిపించింది  జై బోలో తెలంగాణ‌లో పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ద్వారా మాత్ర‌మే. ఆయ‌న‌కూ సినిమాల‌కూ ఉన్న సంబంధం   చాలా చాలా బ‌ల‌హీన‌మైన‌ది. అయితే ఇక్క‌డ ఆస్కార్ కి గ‌ద్ద‌ర్ కీ ఉన్న పోలిక ఏంటంటే.. ఈ రెండు అవార్డులూ.. వ్య‌క్తుల పేర్ల‌కు సంబంధించిన‌వి. ఇక్క‌డ గ‌ద్ద‌ర్ అవార్డే ఆస్కార్ క‌న్నా ఒకందుకు గొప్ప‌. అదెలాగంటే అస‌లు ఆస్కార్ కీ  సినిమాల‌కూ సంబంధమే లేదు.  కార‌ణం..  1939లో హాలీవుడ్ సినిమాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్త‌మ సినిమాల‌కి అకాడ‌మీ అవార్డులు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. అయితే ఈ స‌మ‌యంలో ఒక అవార్డు రూపు త‌యారు చేయాల‌ని ట్రై చేశారు. శిల్పి జార్జి స్టాన్లీ 13 అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్న‌ర పౌండ్ల బ‌రువుతో దీన్ని త‌యారు చేశారు. ఈ ఆస్కార్ రూపానికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడ‌మీ అవార్డులు అందించే ఐదు ప్ర‌ధాన విభాగాల‌ను సూచిస్తుందిది. ఇదిలా ఉంటే ఈ సంస్థ‌లో ప‌ని చేసే మార్గ‌రెట్ హెరిక్ అనే మ‌హిళ‌.. విజేత‌ల‌కు అందించే ఈ బొమ్మ‌ను చూసి.. ఇది అచ్చం మా అంకుల్ ఆస్కార్ లా  ఉంద‌ని అన‌డంతో.. ఈ అకాడ‌మీ అవార్డుల‌కు ఇచ్చే రూపానికి   ఆస్కార్ అవార్డ్ గా పేరొచ్చింద‌ని అంటారు. దీంతో పోలిస్తే గ‌ద్ద‌ర్ పేరు పెట్ట‌డంలో ఏమంత త‌ప్పు లేద‌న్న‌ది కొంద‌రి వాద‌న‌. ఇదిలా ఉంటే.. మ‌రికొంద‌రు అవార్డు రూపంలో ఒక ఆస్కార్ లా.. గ‌ద్ద‌ర్ రూపం లేకుండా ఆయ‌న చేతిలోని డ‌ప్పును మాత్ర‌మే పెట్ట‌డమేంట‌న్న మాట వినిపిస్తోంది. గ‌ద్ద‌ర్ కి ఇటీవ‌ల క‌ట్టిన విగ్ర‌హం న‌మూనాలో.. ఈ అవార్డు రూపం కూడా ఉంటే బాగుండేద‌న్న మాట వినిపిస్తోంది.

తదుపరి సినిమా ఎపీలో…!

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలవనున్నారు. సరిగ్గా అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగుల కోసం విదేశాలకు వెళ్ళనున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని గంటల్లో.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించబోతోంది ప్రభుత్వం. అవార్డులకు సంబంధించి.. తెలంగాణ ఫిల్మ్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకు.. 4 అవార్డులు ఇవ్వనున్నారు. బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైన చిత్రానికి సంబం ధించిన.. హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు  గద్దర్ ఫిల్మ్ పురస్కారాలు అందజేయనున్నారు. ఇలా  ఒక సినిమాకి నాలుగు చొప్పున అవార్డులు ప్రదానం చేయడం ఇదే తొలిసారి. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తోంది.  అందుకే గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై అంతటా ఆసక్తి నెలకొంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు  ఈ పురస్కారాలు అందించనున్నారు. ప్రతి ఏడాది.. 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి..  ఆ సినిమాల హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.  మొత్తానికి.. తెలంగాణలో 14 ఏళ్ల తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి నంది అవార్డులు ఇస్తారనే చర్చ మొదలైంది. ఈ ఆదివారం (జూన్ 15న) ఏపీ సీఎం చంద్రబాబుతో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నంది అవార్డులపై ఓ క్లారిటీ వస్తుందనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబుతో సమావేశానికి.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు 60 మంది హాజరవుతారని తెలుస్తోంది.  వీరిలో.. పెద్ద నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఉండనున్నారు. తొలిసారి..  24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వాళ్లందరినీ పిలిచారు. అయితే.. ఎవరెవరు హాజరవుతారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ ఆహ్వానాలన్నీ.. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలోనే అందినట్లు తెలుస్తోంది.  ఇక.. సీఎంతో మీటింగ్‌కు ఆహ్వానం అందకపోవడంపై.. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాల నటీనటులు, డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  మరోవైపు.. మీటింగ్ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు సెపరేట్ గ్రూపులుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. థియేటర్ ఎగ్జిబిటర్ల వివాదంలో.. ఏ నలుగురి పేర్లయితే ప్రముఖంగా వినిపించాయో.. ఆ నలుగురు.. అంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, ఏషియన్ సునీల్ కూడా మీటింగ్‌కు వెళ్లనున్నారు. ఏపీలో థియేటర్లు తమ కంట్రోల్‌లో లేవని, తాము కంట్రోల్ చేయడం లేదని ఇప్పటికే స్పష్టతనిచ్చారు.  ఇప్పుడు.. సీఎం చంద్రబాబు ముందు కూడా అదే చెప్పి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. ప్రధానంగా సింగిల్ స్క్రీన్లని కాపాడుకోవడం, ఆడియెన్స్‌ని మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. ఎగ్జిబిటర్ల పర్సంటేజీల విధానం, క్యాంటీన్ రేట్లపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. థియేటర్ ఓనర్లు కరెంట్ బిల్లుల్లో సబ్సిడీ అడగాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానం తీసుకురావాలని కోరనున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న చిత్ర నిర్మాతల సమస్యలకు పరిష్కారం చూపాలని అడగనున్నట్లు తెలుస్తోంది.  గతంలో వైసీపీ ప్రభుత్వం.. 175 స్క్రీన్ల లోపు విడుదలయ్యే చిన్న సినిమాలకు.. ఐదో షో ఇస్తాననే హామీ ఇచ్చింది. కానీ..  అమలు చేయలేదు. దాంతో మరోసారి చిన్న సినిమాలకు ఐదు షోలు ఇవ్వాలనే డిమాండ్‌ని.. సీఎం ముందు ఉంచనున్నారు.  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 68 శాతం ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. అందువల్ల.. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, స్టూడియోల నిర్మాణానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని.. సినీ పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. పెద్ద సినిమాల రిలీజ్‌ల సమయంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఏం చర్చిస్తారనేది  ఆసక్తిగా మారింది. తెలంగాణలో అయితే.. తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచేది లేదని దిల్ రాజు చెప్పేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్లు పెంచే ఆలోచనతో లేదు. మరి.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? పెద్ద సినిమాల రిలీజ్‌ల సమయంలోనే.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. సీఎంతో మీటింగ్ తర్వాత.. కుబేర, కన్నప్ప, తమ్ముడు లాంటి సినిమాలు.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటికి.. రేట్లు పెంచుతారా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

అధికార పార్టీలో ఆయనది అతిథి పాత్రేనా?

ఖమ్మం జిల్లాలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అధికార పార్టీలో అతిథి పాత్రకే పరిమితం అవుతున్నారు.  గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల, ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఆ తరువాత మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఎన్నికల సమయంలోనే పాత కాంగ్రెస్ నాయకులు కొందరు ఆశించిన రీతిలో తుమ్మలకు సహకరించలేదు. అయితే ఎన్నికల సమయంలో ఆ విషయంలో తుమ్మల ఆచితూచి వ్యవహరించారు.  ఎన్నికల తర్వాత కూడా   అదే వైఖరిని కొనసాగించారు. కొనసాగిస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల విషయంలో తుమ్మల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వమని మాత్రమే అధిష్ఠానానికి సూచించారు. జిల్లాలో మిగిలిన ఇద్దరు మంత్రులు మాత్రం తమ వర్గానికి పదవులు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు పార్టీలో చేరినా కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలివిడిగా ఉంటూ తన అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం  ఇతర నియోజకవర్గాల్లో ఉన్న తన వర్గీయులకు పదవు లు ఇప్పించడంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పొంగులేటి చురుగ్గా పాల్గొంటున్నారు. తుమ్మల, భట్టి మాత్రం పరిమితంగానే హాజరవుతున్నారు. రాష్ట్ర స్థాయి పార్టీ వ్యవహారాల్లో తుమ్మల ఎక్కడా కనిపించడం లేదు.. అధిష్ఠానం పెద్దలు వచ్చిన సమయంలో టీపీసీసీ ఆహ్వానం మేరకే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో అధికార పార్టీలో తుమ్మల కేవలం అతిథి పాత్ర పోషిస్తున్నారన్నఅ భిప్రాయం వ్యక్తం అవుతోంది. స్వతహాగా కూడా తుమ్మల తన పరిధిలోని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు. ఇతర విషయాలపై ఆయన పెద్దగా దృష్టి సారించరనే పేరుంది. ఇది తన రాజకీయ జీవితంలో ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా ఆహ్వానిస్తేనే ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలకు వెళతారు.  ఒకవేళ తాను ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినా సంబంధిత ఎమ్మెల్యేలకు ముందుగానే సమాచారం ఇచ్చి వెళతారు. దీంతో ఆయన పట్ల ఎమ్మెల్యేలు గౌరవంగా ఉంటారు.

ఏది భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కొమ్మినేనిగారూ!

కృష్ణుడిలా ఛాన్స్ మిస్ చేసుకుని చ‌రిత్ర‌లో దుర్యోధ‌నుడిలా మిగిలారుగా!  చాలా మంది తెచ్చే పోలిక ఏంటంటే భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ విష‌యంలో ఆనాడు ర‌ఘురామ‌కృష్ణం రాజు,  నేడు కొమ్మినేని అవ‌లీల‌గా బెయిల్ తెచ్చుకోవ‌డం. ఆయ‌న‌కూ ఈయ‌న‌కూ తేడా ఇదేనంటారు.  ఆనాడు ర‌ఘురామ‌ వైసీపీలోనే ఒక రెబ‌ల్ ఎంపీ గా ఉంటూ, అధినేత జ‌గ‌న్ పై త‌ర‌చూ విరుచుకుప‌డేవారు. ఇద్ద‌రి మ‌ధ్య ఎక్క‌డ ఏ ఇగో క్లాష్ వ‌చ్చిందో తెలీదుగానీ మొత్తానికి ఆనాడు ర‌ఘురామ భారీ ఎత్తున వైసీపీ నావ మునిగిపోయేలా చేశారు. త‌ర్వాత ఆయ‌న తెలివిగా  ఆ చిల్లుప‌డ్డ‌ నావ నుంచి బ‌య‌ట‌కొచ్చారు. కూట‌మిలో చేరారు. ఇవాళ ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ హోదాలో పొలిటిక‌ల్ కెరీర్ సెట్ చేసుకున్నారు. ఇదంతా ఇలా ఉంచితే కొమ్మినేనికీ ట్రిపుల్ ఆర్ కి ఉన్న పోలిక విష‌యానికి వ‌స్తే.. ఇద్ద‌రూ ఈ స్వేచ్చ ద్వారా బ‌య‌ట ప‌డ్డ‌వారే. అయితే అక్క‌డ ర‌ఘురామ వ్య‌క్తిపై చేసిన దాడికీ, ఇక్క‌డ కొమ్మినేని  వ్య‌వ‌స్థ‌పై జ‌రిగిన దాడికి కార‌కులు. అలాగంటే ఆ మాట‌లు కూడా తాను అన‌లేదంటారు కొమ్మినేని. ఈ విష‌యంలో ఆయ‌న్ను కొట్టిప‌డేయ‌లేం. నిజానికి ఆయ‌నేమీ ఈ మాట అన‌లేదు. కానీ త‌న డిబేట్ లో ఒక ఎన‌లిస్టు ఈ కామెంట్లు చేస్తుంటే.. దాన్ని ఆయ‌న ర‌క్ష‌ణార్ధం ఆప‌మ‌ని అన్నారేగానీ.. అమ‌రావ‌తి మ‌హిళ‌ల మాన ర‌క్ష‌ణార్ధం అన‌లేదు. ఇక్క‌డే ఆయ‌న కృష్ణుడు కాద‌గిన అవ‌కాశం మిస్ చేసుకున్నార‌ని అంటారు.  ఇదే మ‌హా భార‌త యుద్ధానికి లీడ్ పాయింట్ అయిన‌.. ద్రౌప‌దీ వ‌స్త్రాప‌హ‌ర‌ణంలో దుశ్శాస‌నుడి పాత్ర‌.. కృష్ణంరాజు తీసుకున్నారు. అమ‌రావ‌తి మ‌హిళలంతా  క‌ల‌సి ద్రౌప‌ది రూపంలోకి మారిపోగా.. ఇక్క‌డ ఒక దుర్యోధ‌నుడిలా కొమ్మినేని వ్య‌వ‌హ‌రించిన‌ట్టు క‌నిపించింది. ఇక్క‌డ  దుశ్శాస‌నుడ్ని కాపాడ్డ‌మెలా అన్న కోణంలో దుర్యోధ‌న‌డిలా కొమ్మినేని థింక్ చేశారేగానీ.. శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ‌లా వ్య‌వ‌హ‌రించ‌లేక పోయారని అంచ‌నా వేస్తారు. బేసిగ్గా ఇలా చేయ‌డం ఆయ‌న‌కు కూడా చేటు తెచ్చేదే. ఎందుకంటే ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార్తా సంస్థ కావ‌చ్చు. దాని వెన‌కున్న పార్టీ కావ‌చ్చు.. అమ‌రావ‌తికి పూర్తి వ్యతిరేకం. ఒక వేళ కొమ్మినేని ఆ స‌మ‌యంలో అమ‌రావ‌తి వైపున ఉంటే ఆయ‌న‌కున్న ఉద్యోగం స‌ద్యోగం మొత్తం ఊడిపోయి ఉండేవి. దీంతో ఆయ‌నెంతో తెలివిగా దుశ్శాసుడి (ఎన‌లిస్టు కృష్ణంరాజు) వైపే నిలిచారు. దీంతో ఆయ‌న అమ‌రావ‌తి మ‌హిళాలోకం దృష్టిలో దుర్యోధ‌నుడిగా  పేరు సాధించారే గానీ త‌న‌కు అందివ‌చ్చిన కృష్ణావ‌తారం దాల్చ‌డానికి ఛాన్స్ తీస్కోలేక పోయారు కొమ్మినేని. అంటే త‌న స్వార్ధం  కోసం అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ఇక్క‌డ కొమ్మినేని ఫణంగా పెట్టిన‌ట్టే లెక్క‌. అందుకే ఆయ‌న‌కు సుప్రీం   బెయిల్ ఇచ్చినా.. అమ‌రావ‌తి మ‌హిళ‌ల దృష్టిలో ఆయ‌న జీవిత‌కాలం దోషిగా నిల‌వ‌క త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లు అందుతున్నాయ్. ఏమంటారు?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎన్ఐఏ దర్యాప్తు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. విమానం కుప్పకూలిపోవడం వెనుక కుట్ర కోణం ఉందా అన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందం విమానం కూలిన ప్రాంతానికి చేరుకుని ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా ఒక మృత దేహం బయటపడిందని తెలుస్తోంది. ఇలా ఉండగా విమాన ప్రమాద ఘటనా స్థలానికి డీజీసీఏ అధికారులు కూడా చేరుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ విమాన శకలాలను తొలగించవద్దని ఇప్పటికే డీజీసీఏ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం తరువాత కేంద్ర విమానయాన శాఖ తొలిసారిగా సమావేశమైంది.  పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో విమానయాన భద్రతపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి  డీజీసీఏ డీజీ, ఏఏఐ ఉన్నతాధికారులు, పౌర విమానయాన కార్యదర్శి, మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొన్నారు.  

ఎయిర్ఇండియా విమాన ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. ఇందులో తొలుత 24 మంది మృతిచెందినట్లు సమాచారం రాగా.. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. స్థానిక బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలను తెలుసుకోనున్నారు.

కొమ్మినేనికి బెయిలొచ్చింది.. కృష్ణంరాజుకు అంత వీజీ కాదు!

రాజధాని అమరావతిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో అరెస్టయిన మరో జర్నలిస్టు కృష్ణంరాజుకు బెయిలు అంత వీజీ కాదని అంటున్నారు న్యాయనిపుణులు. కొమ్మినేనికి బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను, ఆయనకు బెయిలు ఇవ్వడానికి సుప్రీం చెప్పిన కారణాలను బట్టి చూస్తే కృష్ణంరాజుకు బెయిలు మంజూరు కావడం అంత వీజీ కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. అమరావతిపై, అమరావతి మహిళలపై అసహ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను కొమ్మినేని చేయలేదు అన్న ఒకే ఒక్క కారణంపై సుప్రీం కోర్టులో  ఆయనకు బెయిలు ఇచ్చింది.  ఒక మీడియా చానెల్ లో ప్రసారమైన డిబేట్ లో యాంకర్ పాత్ర పోషించిన కొమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేయ లేదనీ, ఎనలిస్టుగా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు.. నవ్వారు అంతే..నవ్వినంత మాత్రాన అరెస్టు చేయడం సబబు కాదని సుప్రీం అభిప్రాయపడింది. అదే సమయంలో ఇక ముందు ఇటువంటి షోలు నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కొమ్మినేనిని హెచ్చరించింది కూడా.  అయితే ఇదే కేసులో  అరెస్టైన కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరా వులాగే బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా బెయిలు దక్కే అవకాశాలు మృగ్య మేనని అంటున్నారు.   భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా.. దానిపై ఒకింత నియంత్రణ ఉండాలన్నది కూడా రాజ్యాంగంలో ఉందని అంటున్నారు.  ఈ  కారణంగానే డిబేట్ లో  జర్నలిస్టు అమరావతిపై చేసిన వ్యాఖ్యల తీవ్రత, ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత మహిళలను అవమానించేలా, కించపరిచేలా ఉన్న ఆయన మాటలు కచ్చితంగా అభ్యంతరకరమేనని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కొమ్మినేనికి బెయిలు ఇస్తూ పరోక్షంగా పేర్కొందనీ అంటున్నారు. అనలిస్టు చేసిన తప్పుకు యాంకర్ ను శిక్షిస్తారా? అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యల సారాంశం కృష్ణంరాజు చేసినవి కచ్చితంగా అనుచిత వ్యాఖ్యలేనని పరోక్షంగా చెప్పడమే అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కృష్ణంరాజుకు బెయిలు మంజూరు కావడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.  

కవిత రూటేంటి? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ సంకేతమేంటి?

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ, సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తెలంగాణ జాగృతినే నమ్ముకుని రాజకీయంగా ఎదగడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకూ బీఆర్ఎస్ కు తాను దూరం అన్నట్లుగా వ్యవహరించిన కవిత ఇప్పుడు మాత్రం తాను బీఆర్ఎస్ నేతనే అని చెప్పుకునేందుకు నానా యాతనా పడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లో కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించనని విస్పష్టంగా ప్రకటించిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె7సిడెంట్ కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ అయిపోతున్నారు. కేసీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆమె ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కవిత.. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.  కేటీఆర్ కు ఏపీసబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తే.. కేటీఆర్ కు మద్దతుగా కవిత ఈ పోస్టు పెట్టారు. గతంలో కూడా కవిత కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించినా.. ఈ సారి ఖండన మాత్రం భిన్నంగా ఉంది. గతంలో కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కవిత.. దాదాపుగా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా వ్యవహరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిన సమయంలో కానీ, తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభ సమయంలో  కానీ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇటీవల మీడియాతో చిట్ చాట్ అంటూ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కు పార్టీని నడపడం చాతకావడం లేదంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు.   కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నట్లుగా మాట్లాడారు. ఇంత మాట్లాడిన ఆమె తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నారు. అయితే తాజాగా అంటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కేసీఆర్ ఆమెతో కనీసం మట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో తత్వం బోధపడిన కవిత.. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడానికే ఇప్పుడు రూటు మార్చి అన్న కేటీఆర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం లేదనీ చాటేందుకే  కేటీఆర్ ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించారని అంటున్నారు. 

రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ పై మరో కేసు!

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసింది.  ఈ కేసుకు సంబంధించి ఆయన సోమవారం (జూన్ 16) సోమవారం  విచారణకు హాజరు కానున్నారు.   అదలా ఉంటే తాజాగా కేటీఆర్ పై మరో  కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారనీ బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో కేటీఆర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ  పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా ఆయన పోలీసులకు అంద చేశారు. దీంతో కేటీఆర్ పై పైబర్ క్రైం పోలీసులుఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో కేటీర్ కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

కూటమి ఏడాది పాలన భేష్.. కొందరు ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి!?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది.  అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సర్కార్ పని తీరు పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని కూటమి వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పని తీరు పట్ల ఇటీవల సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొందరి పని తీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్న సంగతి తెలిసిందే.   అలాగే కొందరు మంత్రులు కూడా ప్రజలలో మమేకం అవ్వడం లేదనీ, పూర్తిగా కార్యాలయాలకే పరిమితమౌతున్నారనీ చంద్రబాబు పేర్కొన్నారు. జనాభిప్రాయం కూడా ఇలాగే ఉంది.  కొందరు జనాలకు దూరంగా ఉంటున్నారనీ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరైతే ఇసుక, మైనింగ్ వ్యవహారాలలో పూర్తిగా తలమునకలై ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.   జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  వందలాది లారీల ఇసుక తరలి పోతోందని ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పిఠాపురం వర్మ ఇటీవల ఒకింత అసహనం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.  గత వైసీపీ హయాంలో ఎవరైతే ఈ దందాలో కీలకంగా ఉన్నారో.. వారే ఇప్పుడు యథేచ్ఛగా ఈ దందాను నడిపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకువెడతానని చెప్పారు.  అయితే మొత్తం మీద ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో సానుకూలత ఉన్నా కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పట్ల మాత్రం ప్రజలలో అసంతృప్తి వ్యక్తమౌతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు. తాన సేకరించిన సమాచారం మేరకు కొందరి తీరు బాగా లేదనీ, వారిలో మార్పు రాని పక్షంలో చర్యలు తప్పవనీ కుండబద్దలు కొట్టారు.  చంద్రబాబు వ్యాఖ్యలు, హెచ్చరికల తరువాత రాష్ట్రంలో కూటమి పార్టీలో ఎమ్మెల్యేల పనితీరు పై చర్చ మొదలైంది.  ఏడాది కాలంలోనే కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి పీక్స్ కు చేరిందన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇలా ఆరోపనలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తొలి సారి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వీరిపై ప్రధాన ఆరోపణ   ప్రజలకు అందుబాటులో  ఉండటం లేదు అన్నది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి వారిని పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు చెబు తున్నారు.   

కడప అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ దాడులు

కడప జిల్లా పాలకొండలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో  టాస్క్ ఫోర్స్ పోలీసులు  జరిపిన దాడులలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  అలాగే రెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు.   కడప జిల్లా ఫారెస్ట్  రేంజి అన్నా సముద్రం ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్ లో భాగంగా   మామిళ్లపల్లి బీట్ పరిధిలోని పాలకొండలు అటవీ ప్రాంతంలో  శుక్రవారం (జూన్ 13) ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు.  వారిని కడప, అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. దుంగలు సహా పట్టుకున్న స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు విలువ రూ. 40లక్షలు ఉంటుందని అంచనా వేశారు.  

కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు

   బాపట్లా జిల్లా  చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జులై నెల 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.  చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి  న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది.   

ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం : సీఎం రేవంత్

  తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో  విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.  రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లున్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపున‌కు వీలుగా విద్యా వ్య‌వ‌స్థ‌ను మార్పు చేయాల‌ని రేవంత్‌ సూచించారు.  హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి క‌ల్పిస్తే భ‌విష్య‌త్‌లో వారు త‌మ‌కు ఇష్ట‌మైన రంగంలో రాణించే అవ‌కాశం ఉంటుంద‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా సాగుతున్న నేప‌థ్యంలో విద్యా శాఖ పుర‌పాల‌క శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ లేఅవుట్ల‌లో సామాజిక వ‌స‌తుల కోసం గుర్తించిన స్థ‌లాల్లో పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. క్వాలిటీ ఫుడ్, యూనిఫాంలు, పాఠ్య పుస్త‌కాలు అందిస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని.. డే స్కాల‌ర్స్‌కూ ఆ పాఠ‌శాల‌ల్లోనే అవ‌న్నీ అందించే విష‌యంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు ముఖ్యమంత్రి  సూచించారు

తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారంపై న్యాయపోరాటం : లోకేష్

  తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనంలో రూ. 13 వేలు ఇచ్చి రూ. 2 వేలు నా ఖాతాలో పడ్డాయన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలని  గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు'. అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అటు, ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 16 కల్లా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువుతాం. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి.  తల్లికి వందనం అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు పథకాన్ని వర్తింప చేస్తున్నాం. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తాం'. అని లోకేష్ తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.

జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు

  తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కానుందని తెలిపింది.  ఈ ఎన్నికల్లో అన్ని పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, అందుకోసం పార్టీలో కొత్త, పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.  మరోవైపు సర్పంచ్ ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత వారం నుంచి రాష్ట్ర మంత్రులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఫోకస్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు

ఏఐజీ ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

  బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగా గులాబీ బాస్  ఏఐజీ  ఆసుపత్రికి వెళ్లారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాధారణ గ్యాస్ట్రిక్ టెస్టులు చేసినట్లు వెల్లడించారు.  కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే.  

ఏసీబీ నోటీసులతో రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్‌ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.  తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు విచారణకు సహకరిస్తానంటూనే సీఎం  రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు. బాధ్యత గ‌ల పౌరుడిగా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతానన్న కేటీఆర్,  పాల‌న చేత‌గాక ప్రజ‌ల దృష్టి మ‌ళ్లించే య‌త్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.  ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి స‌వాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచార‌ణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ ప‌రీక్షల‌కు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? జ‌డ్జి స‌మ‌క్షంలో ఇద్దరం లై డిటెక్టర్ ప‌రీక్షలు చేయించుకుందాం. ఈ ప‌రీక్షల‌ను టీవీల్లో లైవ్‌గా చూపిద్దాం. లై డిటెక్ట‌ర్ ప‌రీక్షలు చూసి ఎవ‌రు నేర‌స్థులో ప్రజ‌లే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్ట‌ర్ ప‌రీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా..? రాష్ట్రం దివాళా తీసిందంటూనే ప‌దేప‌దే విచార‌ణ‌ల‌తో ప్రజాధ‌నం వృథా ఎందుకు..? ప్రజాధ‌నం వృథా ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిల‌దీశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. లై డిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్ధం.. సీఎం సిద్ధమా? ఏసీబీ నోటీసులపై కేటీఆర్‌ స్పందించారు. ఫార్ములా-ఈ కేసులో ఈనెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ‘‘బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతా. పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం ఇది. ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకుందాం. టీవీల్లో లైవ్‌గా చూపిద్దాం. లైడిటెక్టర్‌ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా? పదే పదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  

తుమ్మలను ఇరికించడానికి కుట్ర జరుగుతోందా?

  గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి . కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతోంది. తన మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసమో, కేసీఆర్‌ను ఇరికించడం ఇష్టం లేకో ఈటల రాజేందర్ .. అసలు తప్పే జరగలేని వాంగ్మూలం ఇచ్చారు. అన్నీ మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జరిగాయన్నారు.  మూడు బ్యారేజీలు కట్టాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులు. అందుకే ఆయన రియాక్ట్ అయి కౌంటర్ ఇచ్చారు, ఈటల వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ ఉపసంఘం.. మూడు బ్యారేజీలు నిర్మించాలని ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే.. మూడు ప్యారేజీల నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. అసలు కాళేశ్వరంకు కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదని, కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు ఓ లేఖ రాస్తానని ప్రకటించారు. అవసరమైతే వాంగ్మూలం కూడా ఇస్తానన్నారు.బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన ఇద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.  బీజేపీ ఎంపీగా ఈటల ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల ఉన్నారు. అటు రాజేందర్ ను కేసీఆర్ అవమానకరంగా.. కుట్రలు చేసి మరీ పార్టీ నుంచి బయటకు పంపారు. తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. పంతం పట్టి తన సొంత జిల్లా ఖమ్మంలో బీఆర్ఎస్‌కు స్థానం లేకుండా చేశారు. కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ కేసీఆర్‌ను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తుమ్మలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వక్తమవుతోంది. కాళేశ్వరం విషయంలో కర్త, కర్మ , క్రియ కేసీఆర్ అనేది బహిరంగరహస్యం. ఆయనే ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈటల ఆయన కోసం తుమ్మలకు బురద అంటించాలని చూడటం విమర్శల పాలవుతోంది.