గుజరాత్‌లో కాంగ్రెస్‌‌కు ఉన్న ఆ ఒక్క ఛాన్స్ మిస్..?

ప్రస్తుతం దేశం మొత్తం గుజరాత్ రాజ్యసభ ఎన్నికల గురించే చర్చ. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తోన్న సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఎలాగైనా రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే గుజరాత్ నుంచి ఖాళీగా ఉన్న మూడు సీట్లు తమకే చెందాలని భావిస్తోన్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు తోడుగా మూడో అభ్యర్థిని పోటీకి పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ బల్వంత్ సింహ్ రాజ్‌పుత్‌ను అహ్మద్‌పటేల్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దింపింది. ఆయన గెలుపుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలను ప్రారంభించింది.   ప్రలోభాలకు లోనయ్యారో లేక భయపడ్డారో కానీ ఇప్పటి వరకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా మరికొందరు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలి ఉన్న 44 మంది శాసనసభ్యులను తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు పంపి రక్షించుకునే ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే ఉండటం..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉండటంతో మిత్రపక్షాల వైపు చూస్తోంది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు పెట్టుకోవడం..ఆ ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన ఇద్దరు గెలుపొందడంతో వారి మద్ధతు తనకే లభిస్తుందని ఆశించిన హస్తానికి ఊహించని షాక్ ఇచ్చింది ఎన్సీపీ.   రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇచ్చే అంశంపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత ప్రపుల్ పటేల్ చెప్పడంతో కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కిపడ్డారు. గత యూపీఏ కూటమిలో తమ పార్టీ లేదు..ప్రస్తుతం అలాంటి కూటమి కూడా కొనసాగడం లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీ మద్ధతు కోసం అందరూ రాయబారాలు నడుపుతున్నారని..కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీ అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రపుల్ పటేల్ స్పష్టం చేశారు. అయితే ఎన్సీపీ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వకుండా బీజేపీ ఆ పార్టీని భయభ్రాంతుకు గురి చేసిందని..రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి న్యూట్రల్‌గా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు ఉన్నపళంగా ఇలా మాట్లాడం పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా ఎన్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు మద్ధతు ఇస్తుందని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఆ లిస్ట్‌లో రోజా పేరు లేదా..?

2014 ఎన్నికల్లో చాలా స్వల్ప శాతంతో అధికారానికి దూరమైన వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పవర్ దూరమైనా రాష్ట్ర వ్యాప్తంగా స్థిరమైన ప్రజాదరణను దక్కించుకుంది. అయితే తమ అధికారానికి అడ్డుగోడగా మిగిలిపోయిన ఆ కొద్ది గ్యాప్‌ని పూరిస్తే చాలునని పాత తప్పులు పునరావృతం కాకుండా చూసుకునేందుకు..పార్టీ శ్రేణులని సరైన మార్గంలో నడిపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా రాజకీయ వ్యూహకర్తగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన ప్రశాంత్ కిశోర్‌ను వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు వైసీపీ అధినేత.   జగన్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్ ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాను స్కానింగ్ చేస్తోంది. సర్వేల మీద సర్వేలు చేసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారి లిస్ట్ రెడీ చేసి జగన్‌కు అందజేసింది. దానితో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం నిర్వహించారు ప్రశాంత్. ఈ భేటీకి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా హాజరయ్యారు.   ఆమె మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న పీకే..ఈ మధ్య మీ స్పీడు బాగా ఎక్కువైంది దానిని తగ్గించుకోవాలని హెచ్చరించారట. మనం వ్యవహరించే తీరు రాజకీయంగా మనకు మేలు చేయాలని కానీ..మీరు మాట్లాడే తీరు వ్యక్తిగతంగా మీకు..పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందన్నారట..అంతేకాదు 2019లో ఖచ్చితంగా గెలుస్తారని జగన్‌కిచ్చిన లిస్ట్‌లో మీ పేరు లేదన్నారట. ఊహించని ఈ షాక్‌తో సమావేశ మందిరంలో నిశ్శబ్ధం ఆవరించిందట..రోజా అయితే చెమ్మగిల్లిన కళ్లతో బయటకు వచ్చేశారని లోటస్‌పాండ్ టాక్. ఈ విషయంలో వాస్తవమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతోంది.

జగన్‌ జుట్టు బాగా అందించాడు..!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ నంద్యాల చుట్టూనే తిరుగుతున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో యుద్దానికి రెడీ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు సో..సోగా ఉన్న నంద్యాల రాజకీయం..జగన్ బహిరంగసభతో హిటెక్కింది. అన్ని రకాల సర్వేల్లోనూ ఇరు పక్షాలకు ఫిఫ్టీ..ఫిఫ్టీ ఛాన్సులున్నట్లు తేలింది. నంద్యాల నడిబొడ్డున జగన్ మోగించిన నగారా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని..ఫుల్ జోష్‌లో ఉన్న కార్యకర్తలు విజయం తమదేనని జబ్బలు చరుస్తున్న వేళ జగన్ నోటీదురుసు ఆ ఉత్సాహన్ని నీరు గార్చింది. అంతేనా నంద్యాల ప్రభావం రాష్ట్రం మీద పడకుండా చేయడానికి టీడీపీకి మంచి అవకాశం దొరికింది. ‌   21 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నప్పుడు గానీ, కోర్టు నోటీసులు ఇచ్చినా గానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు వెనుకాడుతున్నాడని జగన్ ఆరోపించారు. అక్కడితో ఆగితే ఏ సమస్యా ఉండేది కాదు కానీ చంద్రబాబుని నడి రోడ్డు మీద కాల్చాలని జనానికి పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసిన అధికారపక్షానికి జగన్ చేసిన వ్యాఖ్యలు అవకాశం కల్పించాయి.   లక్షలాది మంది ప్రజల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం జగన్ అనుభవలేమికి ఉదాహరణగా నిలుస్తుందంటూ టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అదొక్కటే కాకుండా తెలుగు తమ్ముళ్లు రాష్ట్రమంతటా రోడ్డెక్కడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం వంటి చర్యల ద్వారా ప్రజల్లో ఫ్యాన్ పార్టీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను ఒక కంట గమనిస్తున్న వైసీపీ శ్రేణులు...తమ అధినేత వైఖరిని చూసి నవ్వాలో, ఎడవాలో తెలియని పరిస్థితిలో జుట్టు పీక్కొంటున్నారు. చూస్తుంటే చేతి దాకా వచ్చింది నోటి దాకా వస్తుందా అని భయపడుతున్నారు.

రోజాకి ఎర్త్ రెడీనా..?

గత ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం అందుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆచరణ సాధ్యమయ్యే హామీలు, అభ్యర్థులుగా పట్టున్న నేతల ఎంపిక తదితర అంశాలపై ఆయన పెద్ద కసరత్తే చేస్తున్నారని లోటస్ పాండ్ టాక్. అంతేకాదు హద్దులు దాటి ప్రవర్తించే నేతలకు తనదైన శైలిలో స్వీట్ వార్నింగులు ఇస్తున్నారట జగన్. దీనిలో భాగంగా మరీ దూకుడుగా వెళ్తున్నావు..కాస్త స్పీడు తగ్గించుకో అని వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజాను సున్నితంగా మందలించారట జగన్. దీనిపై ఆమె మనస్తాపం చెందారని అందుకే విశాఖలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రోజా పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అదే ఊపులో రోజా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారంటూ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత వాటిని రోజా ఖండించడం..తాను చివరి వరకు జగనన్నతోనే ఉంటానని చెప్పిందనుకోండి అదే వేరే విషయం.   ఇంత జరిగినా రోజా నోరు అదుపులో పెట్టారా..? అంటే లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వస్తున్న రోజా సీఎం మనవడు చిన్నారి నారా దేవాన్ష్‌‌ను సైతం వదలకపోవడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు ఓ పక్క గోదావరి జిల్లాల ప్రజలను ఆకట్టుకునేందుకు జగన్ కిందా మీద పడుతూ పవన్‌ కళ్యాణ్‌ను ఎలా మచ్చిక చేసుకోవాలా అని వ్యూహాలు రచిస్తుంటే..మరో పక్కన రోజా అదే పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది..ఈ వ్యాఖ్యలను పవన్‌ గానీ ఆయన ఫ్యాన్స్ గానీ సీరియస్‌గా తీసుకుంటే జగన్‌ మళ్లీ అధికారం దూరం కావడం ఖాయం.   ఇప్పటికే స్పీకర్‌ను, తోటి శాసనసభ్యులను కామెంట్స్ చేయడంతో ఆమె అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ చర్య ప్రజల్లో వైసీపీకి ఉన్న ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. అందుకే వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా రోజా ప్రాధాన్యతను తగ్గించి మరొకరిని తెరమీదకు తీసుకురావాలని జగన్ భావించారు. ఆ మరొకరే సినీ నటి హేమ. అమ్మ, అక్క, వదిన పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న హేమకు రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉంది. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మా ఎన్నికల్లో హేమ మామూలు హడావిడి చేయలేదు. హేమ ఎంట్రీతో అవి సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. తదనంతర కాలంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. కాపు సామాజిక వర్గంతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి కావడంతో జగన్‌ ఆమె రాకకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని అతి త్వరలో హేమ వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

భారత్-చైనా యుద్ధం ఆయుధాలతో కాదు అమ్మాయిలతో..?

  భారత్, చైనా, భూటాన్ సరిహద్దులోని డోకా-లా ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకోవడం ద్వారా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి తోడు 1962 నాటి భారత్ కాదని రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించడం..ఆ వెంటనే మాది కూడా 1962 నాటి చైనా కాదని బీజింగ్ హెచ్చరించడంతో ఆసియాలో అలజడి రేగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరుదేశాల బలబలాలపై ఇంటర్నేషనల్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది. యుద్ధం అంటే మామూలు విషయం కాదు కదా..? అందుకే సామధానభేద దండోపాయాలను ఉపయోగించి విజయం సాధించడానికి చైనా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎంతటివాడైనా కాంతాదాసుడే అన్నట్లు అందమైన అమ్మాయిలతో వల విసురుతోంది. ఈ మేరకు భారత నిఘా సంస్థలు జారీ చేసిన హెచ్చరికలు రక్షణ శాఖను ఉలిక్కిపడేలా చేశాయి. లాహోర్ వేదికగా అందమైన పాక్, చైనా యువతులు అనర్ఘళంగా హిందీ, ఉర్ధూ, ఇంగ్లీష్ మాట్లాడుతూ, వల విసురుతారని త్రివిధ దళాల అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ఆధారంగా వారు తమ పని కానిచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలిపాయి. వారి వలకు ఏమాత్రం చిక్కినా..? ఇక వారి పని అయిపోయినట్లేనని ఇంటెలిజెన్స్ తెలిపింది. సీక్రెట్ వీడియోలు తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తారని..ప్రధానంగా ఆర్మీ స్థావరాలు, ఆయుధాల వివరాలు, సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు ఆ అమ్మాయిలు ప్రయత్నిస్తారని తెలిపాయి. ముందు నుంచి కొట్టే దెబ్బ కంటే వెనుక నుంచి కొట్టే దెబ్బకు ఎంతటి వాడైనా నామరూపాల్లేకుండా పోవాల్సిందే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే ఎంతైనా మంచిది.

శిల్పా రెండింటికి చెడతారా..?

రెండింటికి చెడ్డ రెవడి అని పెద్దలు ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డికి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ టికెట్ ఆశించిన ఆయన తమ్ముడు శిల్పా మోహన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో ఆయన తెలుగుదేశానికి రాజీనామా చేసి జగన్ గూటికి చేరి నంద్యాల టికెట్ సంపాదించారు. ఇదంతా బాగానే ఉంది కానీ శిల్పా బ్రదర్స్ ఎప్పుడూ ఒకే పార్టీలో ఉంటారు. అన్న ఒక పార్టీలో..తమ్ముడు ఒక పార్టీలో ఉండరు. ఈ నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది.   అయితే టీడీపీని వీడటంపై స్పందించిన చక్రపాణి తనకు జగన్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు..అలాగే టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపించి పార్టీ మారడంపై కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఇలా చెప్పిన రెండు రోజులకే చక్రపాణి సైకిల్‌ దిగి ఫ్యాన్‌ దగ్గరకు వెళ్లారు. అయితే ఇక్కడే ఆయనకు ఊహించని షాక్ తగిలింది.   పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లే, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్‌ షరతు పెట్టారట. దీంతో చక్రపాణిరెడ్డి డైలమాలో పడ్డారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అంశంలో పునరాలోచించాలని ఆయన భావిస్తున్నట్లు నంద్యాలలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలనే విషయాన్ని జగన్ తనకు ముందుగా చెప్పలేదని..అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని ఆయన వాపోతున్నారు. మరి, చక్రపాణి వైసీపీలో చేరుతారా..? లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది తేలిపోనుంది.

జీవోలతో కేసుల నుంచి విముక్తి... ఏపీ సర్కార్‌పై కోర్టుకెళ్లిన వైసీపీ

ఏపీలో అధికార పార్టీ నేతలపై నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన జీవోలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమపై నమోదైన కేసుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టి వేయించుకోవటం షరామామూలే. అది ఏ ప్రభుత్వమైనా జరిగే తంతుమాత్రం ఇదే. ఈ కోవలోనే ప్రస్తుత అధికార టీడీపీ నేతలపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. పార్టీలపరంగా వైరమున్న ఘటనల్లో కేసులు నమోదవటం, ఎన్నికల సమయాల్లో మరికొన్ని, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఇంకొన్ని కేసులు నమోదవటంతో సదరు నేతలంతా వాయిదాలకు కోర్టులు, పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా నేతలపై నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం 132 జీవోలిచ్చింది. తద్వారా సుమారు 278 మంది నేతలు కేసుల నుంచి విముక్తులయ్యారు.    ఇలా కేసుల నుంచి జీవోల ద్వారా బయటపడిన వారిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు ఉన్నారు. వీళ్లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇదంతా చట్టవిరుద్ధమంటూ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కోర్టుమెట్లెక్కింది. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై వరుస కేసులతో ముప్పతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే ఆర్కే... ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జీవోల ద్వారా కేసుల్ని ఉపసంహరించటం చట్టవ్యతిరేకమైన చర్యని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేయాలని పిటిషన్‌ వేశారు. దీనిపై వచ్చే మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.   అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోన్న ఏపీ ప్రభుత్వం, చట్టాన్ని కూడా తనకు అవసరమైనట్లు మార్చుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ నేతలకు వెసులుబాటు కలిగేలా జీవోల ద్వారా కేసుల్ని ఉపసంహరించుకోవటం సరైంది కాదంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ఇచ్చిన జీవోలపై హైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.   అయితే అధికార పార్టీ నేతలు మాత్రం వైసీపీ వాదనను కొట్టిపారేస్తున్నారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో నాటి కాంగ్రెస్ నేతలు ఉద్ధేశ్యపూర్వకంగా పెట్టిన కేసుల్ని మాత్రమే ఉపసంహరించినట్లు నేతలు చెబుతున్నారు. రాజకీయంగా వేధింపులకు గురిచేసేందుకు తమపై పెట్టిన కేసుల్ని చాలా వరకూ కోర్టులు కూడా కొట్టివేశాయనీ, మిగతా వాటిలో ఆధారాలు లేని కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవటంలో తప్పులేదని అంటున్నారు. అయితే కేసుల్ని కొట్టివేస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోలపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకెళ్లడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.

శిల్పా బ్రదర్‌ అటో-ఇటో... నంద్యాల రాజకీయంలో కొత్త ట్విస్ట్‌...?

నంద్యాల ఉపఎన్నికలవేళ కర్నూలు జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయమంతా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి చుట్టూ తిరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ మారడంపై అనుచరుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి టైమ్‌ చూసి టీడీపీ అధిష్టానానికి టెన్షన్ తెప్పిస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని తన డిమాండ్ల చిట్టా తీసి హైకమాండ్ ని చికాకు పెడుతున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోన్న టీడీపీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.   తనను శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటిస్తేనే పార్టీలో ఉంటానంటూ చక్రపాణిరెడ్డి షరతు పెట్టారు. మంత్రి అఖిలప్రియ తనను గౌరవించడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. తన సోదరుడు ఇదే కారణంతో పార్టీని వీడారని.. పద్ధతి మారకపోతే తను కూడా వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ సీఎం రమేష్‌... శిల్పా చక్రపాణిరెడ్డితో చర్చలు జరిపినా ఫలితం లేనట్టు చెబుతున్నారు. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి చక్రపాణికి సర్దిచెప్పారు. దీంతో శిల్పా బ్రదర్ పార్టీ వీడాలన్న నిర్ణయాన్ని వాయిదా వేశారు.    అయితే చక్రపాణిరెడ్డి అసంతృప్తిని పసిగట్టిన వైసీపీ నాయకత్వం... ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలతోపాటు ఆయన సోదరుడు మోహన్ రెడ్డిని కూడా పంపి చర్చలు జరిపింది. అన్నదమ్ముల సెంటిమెంట్ సహా పలు అంశాలు వర్కౌట్ అయినట్టు సమాచారం. దాంతో హడావిడిగా శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో భేటీ అయి పార్టీ మారడంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజారిటీ కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లిపోదామని చెబుతుండటంతో ఫ్యాన్ పార్టీలోకి వెళ్లడంపై ప్రకటన లాంఛనమేనని తెలుస్తోంది. జగన్‌ నంద్యాల పర్యటనలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

రసవత్తరంగా వైసీపీ బెజవాడ రాజకీయం...

  ఏపీ రాజధాని ప్రాంతంపై వైసీపీ అధినేత జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. రాష్ట్ర రాజకీయాలకు రాజధానిగా ఉన్న విజయవాడలో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించిన జగన్‌.... పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 2014 ఎన్నికల్లో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఒక స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. విజయవాడ వెస్ట్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కూడా అధికార పార్టీలోకి ఫిరాయించడంతో... ఆ ఒక్కటి కూడా వైసీపీ కోల్పోయింది. దాంతో విజయవాడలో వైసీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడుతోన్న జగన్‌... వచ్చే ఎన్నికల నాటికి బెజవాడలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో నమ్మకమైన వారికే పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్‌ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులు ఉన్నారు. జలీల్‌ఖాన్‌ జంప్‌తో విజయవాడ వెస్ట్‌ బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అప్పగించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి గెలిచినా... ముస్లింలు అధికంగా ఉన్న ఈ స్థానంలో ఆయన సీటు ఇస్తారో లేదో చెప్పలేని పరిస్థితి.   ఇక విజయవాడ సెంట్రల్‌‌‌కి వంగవీటి రాధా ఇన్‌ఛార్జ్‌గా ఉండగా.... అదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పార్టీలో చేర్చుకున్నారు జగన్‌. దాంతో సెంట్రల్‌ టికెట్‌ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వంగవీటి రంగా ప్రధాన అనుచరుడైన మల్లాది... 2009లో సెంట్రల్‌ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మల్లాదికి విజయవాడ నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వంగవీటి రాధా నగర అధ్యక్షుడిగా ఉండగా... ఆమధ్య పార్టీలో చేరిన వెల్లంపల్లికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మల్లాది పార్టీలోకి రావడంతో.... ఆ పదవిని విష్ణుకి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని భావిస్తోన్న జగన్‌... మల్లాదికి నగర బాధ్యతలు అప్పగించి... పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారట. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా వంగవీటి రాధా జనసేనలోకి వెళ్తేనే... సెంట్రల్‌ సీటును మల్లాది ఇస్తారని, లేదంటే రాధాకే దక్కతుందని అంటున్నారు.   ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి పెద్దగా పట్టులేదు. గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచే వంగవీటి రాధా ఓటమి పాలయ్యారు. దాంతో ఎన్నికల తర్వాత రాధాను ఈస్ట్‌ నుంచి సెంట్రల్‌కి మార్చారు జగన్‌. ప్రస్తుతం తూర్పు ఇన్‌ఛార్జ్‌గా బొప్పన బవకుమార్ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని పార్టీలో చేర్చుకుని.... తూర్పు ఇన్‌ఛార్జ్‌గా నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది.   మొత్తానికి విజయవాడలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటోన్న జగన్‌.... నాయకత్వ మార్పులపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో విజయవాడకు మకాం మార్చడమే కాకుండా...  పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా బెజవాడకే తరలిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా గత ఎన్నికల్లో జరిగిన తప్పులు... ఈసారి జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్లు... 2019లో జరగకూడదనే నిర్ణయానికి వచ్చారట.

పవన్‌ పరపతి తగ్గిపోతుందా? ముద్రగడ బహిరంగ లేఖ?

  పీఆర్పీకి కాపు పార్టీ అంటూ ముద్రపడటంతోనే ప్రజారాజ్యం పార్టీని అన్నివర్గాలు ఆదరించలేదని గుర్తించిన పవన్‌ కల్యాణ్‌... జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క కులానికో తనను పరిమితం చేయొద్దంటూ పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. తాను అందరివాడినని, తనకు అన్నివర్గాలూ సమానమేనని ప్రజల ముందు ఆవిష్కరించుకుంటూ వచ్చారు. ముద్రగడ పోరాటంతో కాపు ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి... తుని సంఘటన జరిగినా రిజర్వేషన్ల డిమాండ్‌‌కు మద్దతుగా పవన్‌ స్పందించలేదు. కానీ ఫస్ట్‌ టైమ్‌ కాపు రిజర్వేషన్లు, ముద్రగడ పోరాటంపై పాజిటివ్‌గా స్పందించారు. కాపు రిజర్వేషన్లను టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు బీసీ నేతలు వ్యతిరేకించలేదని పవన్‌ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు సున్నితమైన అంశమన్న పవన్‌... బీసీలకు నష్టం జరగకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.   అలాగే ముద్రగడ శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటానంటే... ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పైగా కాపు రిజర్వేషన్లకు మద్దతుగా పవన్‌ పాజిటివ్‌ కామెంట్స్‌ చేయడంతో... ముద్రగడ స్పదించారు. పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుతో ప్రయాణించి మీ పరపతి తగ్గించుకోవద్దంటూ సూచించారు. చంద్రబాబు చెప్పే అబద్దాలు నమ్మొద్దని కోరారు. కాపు ఉద్యమంపై చంద్రబాబు... మీతో ప్రస్తావించినట్లు... టీడీపీ అనుకూల పత్రికలో కథనం వచ్చిందని, గతంలో జీవో 30ని హైకోర్టు కొట్టేసినట్లుగా... ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల జీవో ఇవ్వమని ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారని... చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేసినట్లు రాశారని లేఖలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు మాటలు నమ్మడానికి కాపు జాతి సిద్ధంగా లేదని ముద్రగడ అన్నారు.  ఏడు నెలల్లో బీసీ కమిషన్‌ నివేదిక తెప్పిచి కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ మంజునాథ కమిషన్ వేసి... 18 నెలలు అయినా ఇప్పటివరకూ అతీగతీ లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు... మంజునాథ కమిషన్‌ వేసి 18 నెలలు, పల్స్‌ సర్వే పూర్తయి ఏడాది గడిచిపోయిందని... కానీ ఇంతవరకూ హామీని మాత్రం నెరవేర్చలేదని పవన్‌కి రాసిన లేఖలో ముద్రగడ వివరించారు.   కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని అడుగుతుంటే... ఏడు నెలలు ఆగలేరా అంటూ ఎదురుదాడి చేస్తున్నారన్న ముద్రగడ.... అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నప్రభుత్వాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేమన్నారు. చంద్రబాబు మాటలు వినడానికి కాపు జాతి సిగ్గుపడుతోందన్న ముద్రగడ... ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలుగా మారాయన్న సంగతి తెలుసుకోవాలని పవన్‌ను కోరారు. అందుకే చంద్రబాబు చెప్పే అబద్దాలను నమ్మి... మీ పరపతిని తగ్గించుకోవద్దంటూ పవన్‌కు ముద్రగడ సూచించారు.

ఆర్మీ చేతిలో హతమైన అబు దుజానా ఎవరో మీకు తెలుసా ?

  భారత ఆర్మీ తమపై రాళ్లు విసురుతోన్న అరాచకులకి బుల్లెట్లతో సమాధానం ఇస్తోంది. తాజాగా లష్కర్ కమాండర్ అబు దుజానా పని పట్టింది. ఎన్నో సార్లు తప్పించుకుని తిరిగిన ఈ క్రూరమైన ఉగ్రవాది ఎట్టకేలకు నేలకూలాడు. అయితే, ఆర్మీ దృష్టిలో పెట్టుకున్న పన్నెండు మంది టాప్ టెర్రరిస్టుల్లో దుజానా మూడో వాడు. ఇతడ్ని హతం చేయటం చాలా పెద్ద విజయమేనంటోంది ఆర్మీ. అందుకు కారణం తెలియాలంటే అబు దుజానా ఎవరో తెలుసుకోవాల్సిందే…   1.     అబు దుజానాగా పేరు మోసిన లష్కర్ ఉగ్రవాది అసలు పేరు హఫీజ్. ఇతను అత్యంత ఎక్కువ కాలం కాశ్మీర్లో తిష్ఠవేయగలిగిన విదేశీ జిహాదీ అని చెప్పవచ్చు. అనేక దాడుల్లో, ప్రధానంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ టార్గెట్ గా జరిగిన వాటికి దుజానా కారణం…   2.    27ఏళ్ల దుజానా మోస్ట్ వాంటెడ్. అతడి మీద 15లక్షల నగదు బహుమానం కూడా ప్రకటించింది ఆర్మీ. ఏ++ క్యాటగిరి టెర్రరిస్ట్ గా పేర్కొన్న దుజానా 2016లో పుల్వామాలో జరిగిన దాడికి కారకుడు. అందులో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ అధికారులు చనిపోయారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు…   3.    లష్కరే తోయ్యబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన హపీజ్ సయిద్ కు దుజానా అత్యంత ఆప్తుడు. పాక్ ఆక్రమిత కాశ్మర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన ఇతను వివిధ ఉగ్రవాద సంస్థల్ని ఒక్క చోటకి తెచ్చి భారత్ మీద మరింత సమర్థవంతమైన దాడులు చేయించే పని చేసేవాడు. అయితే, ఎల్ఈటీతో గత కొంతకాలంగా దుజానాకు పడటం లేదు. అందుకే, లష్కరే బోయ్యబా అతడ్ని పదవిలోంచి తొలగించి ఆయుధాలు లాగేసుకుంది…   4.    లష్కర్ నుంచి విడిపోయాక జకీర్ మూసా అనే ఉగ్రవాదితో చేతులు కలిపాడు అబు దుజానా. జకీర్ మూసా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్. అతడు కూడా తన అతివాద జిహాదీ సిద్ధాంతాల కారణంగా తన సంస్థ నుంచి విడిపోయాడు.   5.    పోయిన సంవత్సరం నుంచీ మన ఆర్మీ చేతిలో చచ్చిన అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదుల్లో దుజానా మూడో వాడు. బుర్హాన్ వనీ, సబ్జార్ భట్ల తరువాతి స్థానం దుజానాదే!   6.    బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత తనని తాను కాశ్మీరీ ఉగ్రవాద హీరోగా ప్రమోట్ చేసుకున్నాడు దుజానా. మరీ ముఖ్యంగా, ఇతను సోషల్ మీడియా ఎక్స్ పర్ట్! వాట్సప్ గ్రూపుల్ని అడ్డుపెట్టుకుని రాళ్లు రువ్వు అరాచకవాదుల్ని పోగయేటం దుజానా ప్రత్యేకత!   7.    2014లో మొదటి సారి కెమెరాకు చిక్కిన దుజానా… బుర్హాన్ వనీ అంత్యక్రియల తరువాత నుంచీ ఆర్మీ, నిఘా వర్గాల హిట్ లిస్ట్ లో వున్నాడు.   8.     ఇప్పటికి అయిదు సార్లు ఎన్ కౌంటర్ కాబోయి తప్పించుకున్న అబు దుజానా గత మే నెలలో కూడా తప్పించుకున్నాడు. విపరీతంగా రాళ్లు రువ్విన కాశ్మీరీ యువత దుజానా తప్పించుకోటానికి సహకరించింది. కాని, మేలో పుల్వామాలోని హకీపురాలో ఎక్కడైతే తప్పించుకున్నాడో… అదే చోట మంగళవారం నాడు దుజానాను ఎన్ కౌంటర్ చేసింది మన ఆర్మి!   9.    లష్కరే తొయ్యబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల నుంచీ ఆర్మీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో వున్న మొత్తం పన్నెండు మందిలో అబు దుజానా ఒకడు. బుర్హాన్ వనీ , సబ్జార్ భట్ తరువాత ఇతడి గురించే ఆర్మీ తీవ్రంగా గాలిస్తోంది. ఎన్ కౌంటర్ తో జవాన్లు, నిఘా వర్గాల శ్రమ ఫలించింది!   10.  అబు దుజానా ఎన్ కౌంటర్ తో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 102మంది ఉగ్రవాదులు హతమైనట్టైంది! జనవరి – జూలై మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని చంపటం 2010తరువాత ఇదే మొదటిసారి!

టీజీ, ఏపీ… 2026 దాకా ఆగాల్సిందే అంటోన్న మోదీ సర్కార్!

  రెండు తెలుగు రాష్ట్రాల నెత్తిన కేంద్రం మరో బాంబు వేసింది. రాష్ట్రాలు కాకపోయినా కనీసం ఇరు రాష్ట్రాల అధికార పక్షం నేతలకు మాత్రం నిరాశ మిగిల్చింది! ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ఇద్దరూ కోరుకుంటున్న అసెంబ్లీ సీట్ల పెంపుకు క్లియర్ గా నో చెప్పేసింది! దాదాపు అయిపోయినట్టే అన్నట్లుగా వుండింది కొన్నాళ్ల కింద పరిస్థితి. ప్రధాని కార్యాలయం దాకా వెళ్లింది ఫైలు. అయినా మోదీ సర్కార్ చివరాఖరుకు నో చెప్పేసింది కేసీఆర్, చంద్రబాబు అభ్యర్థనకు!   ఎన్డీఏలో భాగస్వామిగా వున్న టీడీపీ ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలనుకుంటోంది. అందుకే, బాబు అనేక సార్లు దిల్లీలో ప్రస్తావన తెచ్చారు. ఇక ఎన్డీఏలో లేకున్నా మోదీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తోన్న కేసీఆర్ కూడా పదే పదే నియోజకవర్గాల పెంపు గురించి మాట్లాడారు. ఈ మధ్య దిల్లీలో పర్యటించిన కేసీఆర్ అసెంబ్లీ సీట్ల పెంపు వుండదని తేల్చి చెప్పేశారు. అదే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ చెప్పారు! టీడీపీ ఎంపీ మురళీమోహన్ ప్రశ్నకు బదులుగానే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపుకు … 2026దాకా నో ఛాన్స్ అన్నారు!   కేంద్రం ఎమ్మెల్యేల సంఖ్య పెంచకపోవటానికి ప్రధాన కారణం ఆర్టికల్ 170(3) సవరించాల్సి వుండటమే. ఈ పని జరగాలంటే పార్లమెంట్లో చాలా పార్టీల మద్దతు కూడగట్టాలి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినప్పుడు కాక ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల గురించి ఎమ్మెల్యేల సంఖ్య పెంచటం అనేక రాజకీయ గందరగోళాలకి దారి తీసే ఛాన్స్ కూడా వుంది. ఒరిస్సా, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా నియోజకవర్గాలు పెంచమని కోరుతున్నాయి. అవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల డిమాండ్ కు తలొగ్గితే తమ ఒత్తిడి కూడా పెంచవచ్చు. అంతే కాక బీజేపి తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పెంపుపై ఆసక్తి చూపకపోవటానికి రాజకీయ కారణం కూడా వుంది…   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సీట్లు పెంచితే టీఆర్ఎస్, టీడీపీలకు లాభమని వాదన వినిపిస్తోంది. కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల సీట్ల కోసం ఇతర పార్టీల్లోని బలమైన నేతలు అధికార పార్టీల్లోకి జంప్ చేసే ఛాన్సెస్ వున్నాయి. కాని, బీజేపికి ప్రత్యేకంగా లాభమంటూ లేదని గతంలో అమిత్ షా తెలంగాణ టూర్ అప్పుడు కొందరు నేతలు చెప్పారట. టీడీపీతో పొత్తు వున్న ఏపీ కాకపోయినా… తెలంగాణలో టీఆర్ఎస్ కు మేలు చేసే నిర్ణయం తామెందుకు తీసుకోవాలని బీజేపి పెద్దలు భావించి వుంటారు. అదీ కాక ఉభయ సభల్లో చాలా పార్టీల్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయటం… ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక శ్రమగా కేంద్రం భావించి వుండవచ్చు!   మొత్తం మీద… నియోజకవర్గాల పెంపు ఆశలు గల్లంతు కావటంతో… తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ ఆశావహుల కలలు గల్లంతైనట్టే చెప్పుకోవచ్చు!

గాంధీల వీర విధేయుడి శకం… దిగ్విజయంగా ముగిసిపోతోందా?

          కాంగ్రెస్ అనగానే ఇవాళ్ల దేశంలో గుర్తుకు వచ్చే ముఖాల్లో దిగ్విజయ్ ఒకరు! ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. అంతకు మించి లౌకికవాది. ముస్లిమ్ మైనార్టీల కోసం ఎంతకైనా తెగించి మాట్లాడటం ఆయన స్టైల్! కాని, ఎప్పుడో ఏళ్ల కిందట మధ్యప్రదేశ్ వదిలేసి దిల్లీ వెళ్లిన ఆయన మళ్లీ తన స్వంత రాష్ట్రం దిశగా చూపు సారించలేదు. కారణం… వివిధ రాష్ట్రాల్లో పార్టీ కోసం పని చేస్తూ సోనియా, రాహుల్ కు తలలో నాలుకలా మసలుకోవటమే! కాని, ఇప్పుడు అదే డిగ్గీ రాజా మెల్ల మెల్లగా పెవలియన్ దారి పడుతున్నాడా? తాజా పరిణామాలు దిగ్విజయ్ దిగ్విజయ యాత్ర ముగిసినట్టే అనిపించేలా సంకేతాలిస్తున్నాయి…   దిగ్విజయ్ చేతి నుంచి తెలంగాణ చేజారింది. అతడ్ని రాష్ట్ర ఇంఛార్జ్ గా తీసేసి కుంతియాను నియమించింది ఏఐసీసీ. ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద వింతేం కాదు. చాలా సార్లు సీనియర్ నాయకుల్ని అటు ఇటు మారుస్తుంటారు కాంగ్రెస్ పెద్దలు. కాని, దిగ్విజయ్ ప్రజెంట్ కండీషన్ వేరు! ఆయన ప్రాభావం క్రమంగా తగ్గిపోతూ  వస్తోంది. అందుకే, ప్రభావమూ తగ్గించేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్!   ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో దిగ్విజయ్ సింగే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్. అటు రాహుల్, సోనియా, ఇటు కేసీఆర్ అందరికి లింకుగా వుంటూ విభజన జరిపించారు. కాని, తరువాత పరిణామాలు తెలిసినవే. కేసీఆర్ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయటం అటుంచితే… కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదు. ఫలితంగా తెలంగాణ ఇచ్చి కూడా టీ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఇక తరువాత ఈ మూళ్లలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ను ఏమాత్రం దూకించలేకపోయారు దిగ్విజయ్ సింగ్. పైగా అప్పుడప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో రచ్చ మాత్రం చేసుకున్నారు…   ఓ సారి తెలంగాణ పోలీస్ శాఖని అనుమానించినట్టు మాట్లాడి గొడవ కొని తెచ్చుకున్నారు డిగ్గీ. మళ్లీ ఈ మధ్యే డ్రగ్స్ కేసుకి , కేటీఆర్ కి లింక్ పెట్టే ప్రయత్నం చేసి అనవసర రాద్దాంతం చేసుకున్నారు. ఇలా డిగ్గీ వల్ల తెలంగాణ కాంగ్రెస్ కి లాభం లేకపోగా నష్టం ఎదురవుతుండటంతో హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు, తెలంగాణ నేతలు కూడా కొంత మంది దిగ్విజయ్ తీరుపై పార్టీ పెద్దలకి కంప్లైంట్ ఇచ్చారట! కాని, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు… మొన్నా మధ్య గోవా కూడా దిగ్విజయ్ చేజారింది. అక్కడ అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీ చేత గవర్నమెంట్ ఏర్పాటు చేయించలేకపోయారు దిగ్విజయ్. మనోహరి పారికర్, నితిన్ గడ్కరీల ముందు ఈయన పాచికలు పారలేదు. అప్పుడు కూడా ఆగ్రహించిన కాంగ్రెస్ హై కమాండ్ ఆ రాష్ట్రాన్ని డిగ్గీ నుంచీ లాగేసుకుంది!   గాంధీలకి వీర విధేయుడని పేరున్న దిగ్విజయ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్వంత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఏ మాత్రం విలువ లేకుండా పోయారు ఎప్పుడో! ఇక ఇప్పుడు దిల్లీలోనూ ఆయన శకం ముగిసినట్లు కనిపిస్తోంది. మరో వైపు ఆయనని ఇంత కాలం పోషిస్తూ వచ్చిన హస్తం పార్టీకే మోదీ, అమిత్ షా రూపంలో తీవ్రమైన ఒత్తిడి ఎదురువుతోంది! ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దిగ్విజయ్ అసలు వార్తల్లో వుంటారో వుండరో మరి?

ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పట్నుంచి మరో లెక్క... లైట్‌ తీస్కుంటే లైసెన్స్‌ రద్దే...

  రెడ్‌ సిగ్నల్‌ పడినా...రయ్‌‌మంటూ దూసుకుపోతున్నారా? సీసీ కెమెరాల్లేవని పదేపదే రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్నారా? హెల్మె‌ట్‌ పెట్టుకోవడం లేదా? మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారా? రాంగ్‌ రూట్లో వెళ్లిపోతున్నారా? ఎలా వెళ్లినా ఫైన్‌ కడితే చాలు కదా అనే ధీమాతో ఉన్నారా? అయితే ఇకపై మీ ఆటలు చెల్లవు. ఎందుకంటే ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పట్నుంచి మరో లెక్క అంటున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఇకపై ట్రాఫిక్స్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. రూల్స్‌ని లైట్‌ తీసుకుంటే లైసెన్స్‌ రద్దయిపోవడం ఖాయమంటున్నారు.   రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే తాట తీయనున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో పాయింట్ల విధానాన్ని అమలు చేయబోతున్నారు. 12 పాయింట్లు వస్తే.... డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. 12వ పాయింట్ నమోదైన రోజు నుంచే లైసెన్స్ సస్పెన్షన్ అమల్లోకి వస్తుంది. ఉల్లంఘనలకు సంబంధించిన పాయింట్లను ఆర్టీఏ డేటాబేస్ లో పకడ్బందీగా నమోదు చేయనున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే... పాయింట్ల విధానం ద్వారా లెక్కించనున్నారు. హెల్మెట్‌, సీటు బెల్టు పెట్టుకోకపోతే ఒక్క పాయింట్‌... తాగి నడిపితే మూడు పాయింట్లు... ఇలా 12 పాయింట్లు దాటితే లైసెన్స్‌ రద్దు చేయనున్నారు. లెర్నింగ్‌ లైసెన్స్‌దారులకైతే 5 పాయింట్స్‌ దాటితేనే రద్దు చేయనున్నారు. గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకున్నా.... రాంగ్‌ రూట్లో వెళ్లినా... ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్్ లేకపోయినా... ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేసినా... రెండు పాయింట్ల పెనాల్టీ పడనుంది. ఇలా ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన పాయింట్‌ విధానంతో వాహనదారులకు చుక్కలు చూపించనున్నారు. లైసెన్స్‌ రద్దు చేసినా వాహనం నడిపితే జైలుశిక్ష విధించేలా పాయింట్స్‌ విధానాన్ని రూపొందించారు. ఆటోలో ఎక్స్‌ట్రా ప్యాసింజర్‌ను ఎక్కించుకుంటే ఒక పాయింట్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంప్‌, జీబ్రా లైన్స్‌ క్రాసింగ్‌‌కి 2 పాయింట్లు, కండీషన్‌లో లేని వాహనాలు నడిపితే 2 పాయింట్లు, స్పీడ్‌ లిమిట్‌ దాటితే రెండు పాయింట్లు, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో టూవీలర్‌ పట్టుబడితే 3 పాయింట్లు, రేసింగ్‌లకు పాల్పడితే మూడు పాయింట్లు, ఫోర్ వీలర్స్‌‌తో పట్టుబడితే 4 పాయింట్లు.... అదే బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు పట్టుబడితే 5 పాయింట్ల పెనాల్టీ పడనుంది.   ఓవరాల్‌గా పాయింట్ల విధానంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు బ్రేక్‌ వేయనున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పట్నుంచి మరో లెక్క  అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విధానంలో ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదంటున్నారు. సో...ఇప్పట్నుంచైనా ట్రాఫిక్స్‌ రూల్స్‌ పాటిద్దాం... రోడ్డుప్రమాదాలను నివారిద్దాం... మనల్ని మనమే కాపాడుకుందాం.

బీజేపీకి కొత్త అధ‌్యక్షుడు వస్తాడా? అమిత్‌షాపై ఎందుకీ ప్రచారం?

  దేశమంతా కమలం విస్తరించడానికి నూటికి నూరుపాళ్ల కృషి చేసింది అమిత్‌షా. మనోడు కాన్‌స్ట్రేషన్‌ చేశాడంటే... హండ్రెడ్‌ పర్సెంట్‌ వర్కవుట్‌ అవ్వాల్సిందే. అలా ఉంటుంది ప్లాన్‌. అంతేకాదు బాస్‌ ఆదేశిస్తే... తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. ప్రధాని మోడీకి నమ్మినబంటు. ఎందుకంటే మోడీ ప్లాన్‌ వేస్తాడు... షా పాటిస్తాడు. పక్కాగా స్కెచ్‌ వేస్తాడు. అంతా ఎక్కడికక్కడ సెట్‌ చేస్తాడు షా. ప్రత్యర్థుల నోట మాట రాకుండా చేయడంలో దిట్ట. పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో విపక్షాల వెన్ను విరుస్తాడు. షా సెట్‌ చేశాడంటే... ఎలాంటి పరిస్థితులైనా దారికి రావాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే అమిత్‌షా... ఒక రాజకీయ వ్యూహకర్త.   హిందూత్వాన్ని, కశ్మీర్‌ వంటి సున్నితమైన సమస్యను, అయోధ్య వంటి అతి సున్నితమైన ఇష్యూను టేకాఫ్‌ చేసి స్వయంగా మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం అమిత్‌షా వ్యూహానికి ఒక ఉదాహరణ. తెర వెనుక ఉంటూ రాజకీయ తెరపై బొమ్మను ఎలా ఆడించాలో... అలా ఆడించగల సత్తా ఉన్న నాయకుడు అమిత్‌షా. ఇక ఇప్పటివరకూ పార్టీలో చక్రం తిప్పిన షా... ప్రభుత్వంలోనూ తన మార్కు చూపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తోన్న అమిత్‌షా... త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో... మోడీ కేబినెట్‌లో చేరతారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు హోం, రక్షణశాఖల్లో ఏదో ఒకటి అమిత్‌షాకు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.   2014 సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకున్న అమిత్‌షా... ఇక ప్రభుత్వ విధానాల్లో ప్రత్యక్షంగా తనదైన ముద్ర వేసేందుకు మంత్రి పదవిని చేపట్టాలనుకుంటున్నారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది. అయితే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉండదని, ఒకవేళ అమిత్‌షా మంత్రి పదవి చేపడితే పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుందని మరో వర్గం చెబుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అమిత్‌షా ఖండించారు. తాను అధ్యక్ష పదవిలో సంతృప్తిగా ఉన్నానంటూ వదంతులకు తెరదించారు. అయినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. మరి అమిత్‌షా... మోడీ కేబినెట్‌లో చేరతారో లేదో... తెలియాలంటే మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరిగే వరకూ ఆగాల్సిందే.

బ్యాంక్ అకౌంట్‌కి పోర్టబిలిటీ పెట్టుకోవచ్చట..?

మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆప్షన్‌ దేశ టెలికాం రంగాన్ని పెద్ద కుదుపు కుదిపింది. అప్పటి వరకు మొబైల్ నెట్‌వర్కింగ్ కంపెనీలు ఇష్టానుసారం వ్యవహరించేవి..టాక్‌టైం, డేటాలకు సంబంధించిన టారీఫ్ సామాన్యులను బెంబేలెత్తిచ్చేవి. అలా అనీ నెట్‌వర్క్ ఆపివేద్దామంటే.. సన్నిహితులు, బంధువులు, కార్యాలయాలు, ప్రభుత్వ పథకాలు అన్నింటా ఇదే నెంబర్ . ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుడు ఒకే నెంబర్‌తో తమకు నచ్చిన నెట్‌వర్క్‌లోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెట్‌వర్క్ కంపెనీలు దిగివచ్చాయి..వినియోగదారుడు పోర్ట‌బిలిటీకి మారుతున్నాడంటే చాలు వెంటనే అదిరిపోయే ఆఫర్లతో అతణ్ణి సంతృప్తిపరచేందుకు ప్రయత్నించాయి. మొబైల్ నెంబర్ పొర్టబిలిటీ లాగే బ్యాంకు అకౌంట్‌కు కూడా పోర్టబిలిటీ ఉంటే ఎంత బావుండు అని చాలా మందికి చిన్న ఆలోచన వచ్చి ఉంటుంది.   ఇప్పుడు ఇది కూడా సాకారం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు, కార్డు ఛార్జీలు, ఐఎంపీఎస్ ఛార్జీలు..అవి ఇవి అంటూ ఖాతాదారుడి జేబులు గుల్ల చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు..దీంతో అకౌంట్‌ను క్లోజ్ చేసి మరో బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తున్నారు చాలా మంది. అయితే ఆ అవసరం లేకుండా అదే అకౌంట్‌ నెంబర్‌తో వేరే బ్యాంకులో లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. అకౌంట్ నెంబర్ పోర్టబిలిటీ సౌకర్యం కల్పించే విషయమై దృష్టి సారించాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా బ్యాంకులను ఆదేశించారు.   దీని ద్వారా ఒక బ్యాంకు ఇచ్చే సౌకర్యాలతో సంతృప్తి చెందని ఖాతాదారుడు అకౌంట్‌ను రద్దు చేయకుండా.. అదే అకౌంట్ నెంబర్‌తో వేరే బ్యాంకులో వ్యవహారాలు కొనసాగించేందుకు అవకాశం కలుగుతుంది. అంతే కాదు దేశ ఆర్థిక రంగంలో పోటీతత్వం పెరుగుతుంది..వినియోగదారులకు మరింత మేలైన సేవలు అందించవచ్చని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. డీమోనిటైజేషన్, నల్లధనం వెలికితీత వంటి కార్యక్రమాల ద్వారా దేశ ఆర్థిక రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అకౌంట్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్‌ని మరింత బలోపేతం చేస్తుందేమో వేచి చూడాలి.

మకాం మార్చేస్తున్న జగన్‌... రహస్యంగా పూజలు...

  ప్లీనరీలో గేరు మార్చి స్పీడ్‌ పెంచిన వైసీపీ.... వేగంగా అడుగులేస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో దూకుడు పెంచింది. ప్లీనరీ వేదికగా ముందస్తు మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా... అన్న వస్తున్నాడంటూ ప్రచారం ముమ్మరం చేసింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో నిర్వహించిన ప్లీనరీకి భారీ స్పందన రావడంతో... తన మకాం కూడా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చేస్తున్నారు జగన్‌. అదేవిధంగా రాష్ట్ర కార్యాలయానికి సైతం కొబ్బిరికాయ కొట్టేశారు. మరోవైపు ప్రజల పల్స్‌ పట్టేందుకు పీకే టీమ్ సైతం విస్తృతంగా పర్యటిస్తోంది.   ఇప్పటివరకూ అంశాలవారీగా ప్రభుత్వంపై పోరాటం చేసిన జగన్, ఇక నుంచి ముప్పేట దాడికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ఏపీ రాజకీయం నడిపిన జగన్, ఇకపై అమరావతి కేంద్రంగా పార్టీ వ్యవహారాలను చక్కపెట్టనున్నారు. హైదరాబాద్‌లో ఉండటం వల్ల నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు విజయవాడ కనకదుర్గమ్మ వారధి సమీపంలో గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకూ స్టేట్ ఆఫీస్‌ కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ నేతలకు అధునాతన కార్యాలయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం బందరు రోడ్డులో విజయవాడ నడిబొడ్డున సీనియర్ నేత పార్ధసారధి స్థలంలో రహస్యంగా భూమిపూజ కూడా పూర్తిచేశారు.   అధికార-ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా... వైసీపీ ఎన్నికలకు కాస్తంత ముందుగానే సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండేళ్లముందే మేనిఫెస్టోని ప్రకటించిన వైసీపీ, ఇప్పుడు రాజధాని కేంద్రంగా అధికారపార్టీపై పోరాటానికి సిద్ధమవుతోంది.

జానా గిదేం పని... ఇలాగైతే కష్టం...

  కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌, సీఎల్పీ నేత జానారెడ్డిపై మరోసారి సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఊరంతా ఒక దారి అంటే.. ఉలిపిరి కట్టదో దారి అన్న తీరున జానా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు సర్దుకుపోయినా... ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. జానారెడ్డి వ్యవహార శైలి పార్టీకి తరచూ తలనొప్పులు తెచ్చిపెడుతోందని వాపోతున్నారు. పార్టీ నేతలంతా అధికార టీఆర్‌ఎస్‌పై పోరాటం చేస్తుంటే... జానా మాత్రం గులాబీ పార్టీకి అనుకూలంగా కామెంట్స్‌ చేయడం, కేసీఆర్‌‌ను పొగడ్తలతో ముంచెత్తడం లాంటి చర్యలతో... అప్పటివరకూ చేసిన పోరాటాలన్నీ గాల్లో కలిసిపోతున్నాయని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి పనులు ఎన్నోచేసినా ...పెద్దాయన కదా అని సర్దుకుపోయామని, కానీ ఎన్నికల దగ్గర పడుతోన్న సమయంలో ఇలాంటి పనులు పార్టీకి మంచిది కాదని ఫైరవుతున్నారు. ప్రత్యర్ధి పార్టీ నేతలను పొగడటం, మద్దతివ్వడం లాంటి చర్యలేంటని సీరియస్‌ అవుతున్నారు.   తాజాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్యనాయుడును అభినందిస్తూ నిర్వహించిన ఆత్మీయ సన్మాన సమావేశానికి జానారెడ్డి హాజరవడంపై టీకాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. జానా చేసిన పని అస్సలు మింగుడుపడటం లేదంటున్నారు. యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాలకృష‌్ణగాంధీని కాంగ్రెస్‌ బరిలోకి దింపితే... జానా మాత్రం వెంకయ్య మీటింగ్‌కి హాజరవడమేంటని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య సన్మానసభకు హాజరవడం ద్వారా కాంగ్రెస్‌ శ్రేణులకు జానా ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయినా కాంగ్రెస్‌పై ఒంటికాలిపై విరుచుకుపడే వెంకయ్య సభకు జానా వెళ్లడమేంటంటున్నారు. ఇది సొంత పార్టీని కించపర్చడమేనని... అయినా కాంగ్రెస్‌ను విమర్శించే వెంకయ్య... జానాకు ఎలా ఆత్మీయుడు అవుతాడో చెప్పాలంటున్నారు. వెంకయ్యతో అంత సన్నిహిత సంబంధాలు, మిత్రత్వం ఉంటే... ఉపరాష‌్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఇంటికెళ్లి అభినందించాలే తప్ప... ఇలా ఎన్నికల సమయంలో సన్మాస సభలకు హాజరవడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.   మొత్తానికి జానా తీరు మరోసారి పార్టీలో చర్చనీయాంశమైంది. జానా వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతుండటంతో... త్వరలో జరగబోయే కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు జానాపై హైకమాండ్‌కి ఫిర్యాదు చేసి ఉండటంతో... ఈసారి సీన్‌ సీరియస్‌గానే ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ను తొలగించి... కుంతియాకు పూర్తి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలోనే జానాకి గడ్డుపరిస్థితులు ఎదురుకావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.

జగన్‌‌‌ వర్సెస్‌ పవన్‌... జనం ఎవరి పక్షం?

  ఏపీలో అప్పుడే పొలిటికల్‌ వార్‌ మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమున్నా... ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. కూల్ కూల్ గా సాగాల్సిన అక్టోబర్‌లో పొలిటికల్‌ హీట్‌ పుట్టించేందుకు ఒకవైపు జగన్‌.... మరోవైపు పవన్ రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇద్దరూ అక్టోబర్‌ నెలనే ఎంచుకోవడంతో... రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. జగన్‌ పాదయాత్రలకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే... ఇకపై తన టైమ్ లో మూడో వంతు రాజకీయాలకే కేటాయిస్తానంటూ ఢంకా బజాయించి చెప్పారు పవన్.   జగన్ పాదయాత్రకు ముందు 60 రోజుల యాక్షన్ ప్లాన్  సిద్ధం చేసింది ప్రశాంత్ కిషోర్ టీమ్. పాదయాత్ర కోసం మూడు దశల్లో  కార్యక్రమాలను డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకూ మరోసారి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం చేపడతారు. అలాగే 2019 ఎన్నికల కోసం సిద్ధం చేసిన 9 అంశాల మేనిఫెస్టోను నవరత్నాల పేరుతో ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.సెప్టెంబర్ 22 నుంచి 25 వకూ విజయ శంఖారావం ఏర్పాటు చేశారు. జగన్ ఈ రేంజ్ లో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోగా పవన్ కూడా అక్టోబర్ నుంచే జనం మధ్యకు వెళ్లనున్నారు. జగన్‌ మాదిరిగా పాదయాత్ర కాకపోయినా.. దాదాపు అలాంటి వ్యూహంతోనే పవన్ కూడా జనం మధ్య ఉండేందుకు స్కెచ్‌ రెడీ చేసుకుంటున్నారు. అయితే జగన్‌ పాదయాత్రపై పవన్‌ పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావన్న పవన్..  తాను కారులో వెళ్లడానికే కష్టమవుతోందని... ఇక పాదయాత్ర చేస్తే అడుగు కూడా ముందుకు పడదంటూ తనకున్న క్రేజ్‌, స్టామినా ఏంటో చెప్పకనే చెప్పారు.   అయితే పవన్ ఇప్పుటికిప్పుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వెనక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ కల్యాణ్‌ ....చంద్రబాబు వదిలిన బాణమేనని అందుకే బాబుతో మీటింగ్ తర్వాతే తన కార్యాచరణను ప్రకటించారని అంటోంది. అయితే టీడీపీకి రహస్య స్నేహితుడినన్న వైసీపీ ఆరోపణలపైనా పవన్‌ ఘాటుగా స్పందించారు. తానెవరికీ రహస్య స్నేహితుడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జగన్‌, పవన్‌ ప్రకటనలు చూస్తుంటే... ఇఫ్పుడే ఎన్నికలు వచ్చేశాయేమోనన్న అనుమానం కలుగక మానదు. ఇక జగన్‌, పవన్‌ ఒకేసారి జనంలోకి వెళ్లనుండటంతో... ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరూ జనాదరణ కలిగిన నేతలే.. ఒకరిది స్టార్ పవర్... మరొకరిది ఛరిష్మా పవర్... ఈ రెండు పవర్లలో ఏ పపర్ మోస్ట్ పవర్ ఫుల్లో...ఎవరి బలం ఎంతో... జనం ఎవరి పక్షమో ...2019లోనే తేలనుంది.