మంత్రులకు టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు..? ఏ క్షణమైనా..?

నంద్యాల బై పోల్ రిజల్ట్‌‌ ఎలా వచ్చినా సరే అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది నిజమైందని చెప్పవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి పరపతి తదితర అంశాలు నంద్యాలలో స్పష్టంగా కనిపించాయని..అన్ని చోట్లా కాకపోయినా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజానాడి ఇలాగే ఉందని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా నంద్యాల విజయాన్నే ప్రచార అస్త్రంగా మలచుకుని టీడీపీ ముందుకు వెళ్తుందని అంచనా..అదే జరిగితే అధికార పార్టీ దూకుడును వైసీపీ తట్టుకొని నిలబడగలుగుతుందా..? మరి మా రాజకీయ భవిష్యత్తు ఏంటా అని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతల్లో భయం పట్టుకుందట.   దీంతో ఇక్కడ దుకాణం సర్దేసి తెలుగుదేశంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మంత్రిగారు తనకు సన్నిహితులైన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్న వేళ ఆయన ఫోన్ రింగ్ అయ్యిందట. అప్పటి వరకు హుషారుగా కబుర్లు చెప్పిన సదరు మంత్రిగారు ఆ ఫోన్ వచ్చి రావడంతోనే లోపలికి వెళ్లి సుమారు 30 నిమిషాల తర్వాత బయటికి వచ్చారట. ఏంటీ సార్ మేటర్ అని అడిగితే..ఏముందయ్యా..? "వలసలు మళ్లీ స్టార్ట్" అన్నారట..   అంటే దాని అనర్థం వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కేందుకు సైలెంట్‌గా ప్లాన్లు వేసుకుంటున్నట్లేగా..ఈ ఒక్క మంత్రికే కాదు..తమకు బాగా పరిచయమున్న అమాత్యులకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఫోన్లు చేస్తున్నారట. తాము టీడీపీలోకి వస్తే తమను ఎలా ట్రీట్ చేస్తారు..? టికెట్ కన్ఫర్మా కాదా..? ఇలా ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వచ్చేటప్పుడు చర్చించుకోవాల్సిన అన్ని విషయాలు చర్చించుకుంటున్నారట. మరోవైపు తమ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించబోతున్న విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. మరి హైకమాండ్ బుజ్జగింపులకు వారు మెత్తబడతారో లేదో వేచి చూడాలి.?

పవన్ కళ్యాణ్ సమస్యలు పరిష్కరించే స్పెషలిస్టా?

  పార్ట్ టైమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మరోసారి పోరాటం చేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ  కళాశాల డిగ్రీ   విద్యార్థులు తమకు సంబంధించిన సమస్యల చిట్టాని తీసుకుని పవన్ కళ్యాణ్ సార్ అడ్రస్ కనుక్కుని మరీ హైదరాబాద్‌లో వున్న ఆయన దగ్గరకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్‌ని కలిసిన  వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెట్టేశారు. వ్యవసాయ అధికారుల నియామకం అంశం మీద ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 24ని రద్దు చేసి, గతంలో  వున్న జీవో నంబర్ 16ని కొనసాగించాలని కోరారు. దాంతో మన వాగ్దాన కర్ణుడు పవన్ కళ్యాణ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేస్తానని హామీ ఇచ్చేశారు.  వ్యవసాయ విద్యార్థుల సమస్యలని ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసేశారు. వ్యవసాయ విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం మొదలు పెట్టేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు.   అసలు సదరు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? ఆ సమస్యలో సహేతుకత వుందా? గతంలో వున్న 16వ నంబర్ జీవోని పక్కన పెట్టి ప్రభుత్వం 24వ నంబర్ జీవోని ఎందుకు తీసుకొచ్చింది? దాని వెనుక ప్రత్యేక కారణాలు ఏవైనా వున్నాయా? పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళిన విద్యార్థులు కోరినట్టుగా చేస్తే వేరే ఎవరికైనా నష్టం జరిగే అవకాశం వుందా? తన దగ్గరికి ఎవరొచ్చి ఏం మొర పెట్టుకున్నా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయిపోతుందా? ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధికారులు కానీ పవన్ కళ్యాణ్ తరహాలో ఆలోచించలేక కొత్త జీవో తీసుకొచ్చారా? ఈ ఇష్యూలో ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. మరి పది మంది విద్యార్థులు తన దగ్గరకి వచ్చి మొరపెట్టుకోగానే ప్రభుత్వాన్ని హెచ్చరించేసిన పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి సందేహాలు కలిగాయో లేదో మరి!   అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఉద్దానం కిడ్నీ బాధితుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల వరకు పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయించారు. ప్రస్తుతం చాలామంది ఏదైనా సమస్య వుంటే పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళి చెప్పుకోవాలన్న ధోరణిలో వున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో! ఆయన దగ్గరకి వెళ్తే సమస్య పరిష్కారమైపోతుందన్న నమ్మకం కూడా ఎందుకు కలుగుతోందో!   సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్నో, ప్రజా ప్రతినిధులనో, అధికారులనో సంప్రదించడం సాధారణంగా ఎవరైనా చేసే పని. కానీ కొంతమంది అలా ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదా? ప్రభుత్వం పరిష్కరించదనుకుంటే ప్రతిపక్షం సహకారాన్ని తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించడం లేదంటే ఇప్పుడు ఏపీలో వున్న ప్రతిపక్షం చేతగాని ప్రతిపక్షమన్న అభిప్రాయం జనంలో వుందా? అధికార, ప్రతిపక్షాలని కాకుండా  ప్రజాక్షేత్రంలో నిలవని, ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎందుకు కలుస్తున్నారు? ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే స్పెషలిస్టనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందా? సినిమాల్లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించే హీరోగారు రిజల్ లైఫ్‌లో కూడా అలాగే పరిష్కరిస్తారని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయిస్తున్న వారి తీరుగానీ, అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరుగానీ ఇలాంటి ఎన్నో సందేహాలను కలిగిస్తోంది.

జగన్ విషయంలో కళ్ళు తెరిపించిన రోజా...

  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అని ఒక సారి పరిశీలిస్తే- జగన్ తనకి తాను నిజాయితీపరుడు, డబ్బులు లేని వాడు మరియు తదుపరి ముఖ్యమంత్రి గా ఊహించుకుంటున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే, జగన్ ఒక అవినీతిపరుడు, మూర్ఖుడు, రాజకీయ పరిజ్ఞానం లేని వాడు. ఇక సాధారణ జనం ఏమనుకుంటున్నారు అనే విషయం, నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. తాను ఏం చేస్తాడో చెప్పడం పోయి, అధికార పక్షం తప్పులు ఎత్తిచూపడం పోయి, వ్యక్తిగత దూషణకి దిగిన జగన్ అందరి విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాడు.   ఇక జగన్ కి అత్యంత సన్నిహితురాలు, సోదరి సమానురాలు అయిన రోజా తన అన్న గురించి మనకి తెలియని చాలా విషయాలు చెప్పి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు. ఒక రకంగా మనకు కొత్త జగన్ ని పరిచయం చేసే మహత్కార్యానికి నాంది పలికారు.   * జగన్ గురించి మనకు 1 శాతం కూడా తెలియదట. ఆయన రాముడు , కృష్ణుడు క్రీస్తు అల్లా అంతటి గొప్ప వాడట. అయితే, రోజా జగన్ అన్నని ఆ దేవుళ్లతో పోల్చకపోయినా, ఆయన కూడా దాదాపు గొప్పవాడు అనే సందేశం ఇచ్చారు. మీకు తెలుసా, జగన్ ప్రాణం పోతున్నా మడమ తిప్పడట. అందుకే, కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతాం అని తెలిసినా మాట తప్పకూడదు అన్న నియమంతో టికెట్లు మార్చలేదుట. వై.ఎస్.ఆర్ ని అభిమానించేవారి కోసమే సోనియాని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడుట.   * జగన్ నిజయతీపరుడు అని చెబుతూ... ఈ మాట మీకు నవ్వు తెప్పించొచ్చు... అని జనాల స్పందన ఎలా ఉండబోతుందో ముందే ఊహించారు రోజా గారు. జగన్ నీతిమంతుడు కాకపొతే కోట్లు చిమ్మి డబ్బుతో అబద్ద వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యేవాడు అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. అంటే, దీన్ని ఎలా తీసుకోవచ్చు- జనాలు డబ్బులు పంచిన వాళ్ళకే ఓట్లు వేస్తున్నారనా!   * భారతి సిమెంట్ కంపెని ప్రపంచ స్తాయిలో అవార్డ్ గెలుచుకుంది అని వివరించిన రోజా... జగన్ బాగానే సంపాదించాడు, సంపాదిస్తున్నాడు అని మనకి సూచనగా చెప్పింది. అలా అయితే, మరి జగన్ ఏంటి తనకి పంచడానికి డబ్బులు లేవంటాడు...?   * పవన్ కళ్యాణ్, మోడీ లని కూడా ఈ చర్చలోకి లాగిన రోజా, భలే కొసమెరుపు ఇచ్చింది. జగన్ ని పుచ్చలపల్లి సుందరయ్య తో పోల్చే ధైర్యం చేసింది. ప్రభుత్వపు వ్యక్తిగత దూషణలు దాడులను పట్టించుకోకుండా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్పవారిని తలపించే విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక కొత్త సంస్కృతిని ప్రవేశ పెట్టాడు, అని వ్యాఖ్యానించిన రోజాకి నిజంగా ఆ మహానుభావుడి గురించి కొంతయినా తెలుసా అనే సందేహం వస్తుంది.   * ఒక వ్యక్తిని పొగడాలి అంటే మూడు రకాలు. ఒకటి నేరుగా పొగడడం. రెండోది అవతలి వ్యక్తిని దూషించి తద్వారా తాము మెప్పుపొందే వ్యక్తిని పొగడడం. ఇక చివరిది, గొప్ప వ్యక్తితో పోల్చడం. రోజా ఆత్మపరిశీలన చేసుకోవలసిన విషయం ఏంటంటే, జగన్ ఏ విషయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారితో పోలికలున్న లేదా పోల్చదగ్గ వ్యక్తి. పుచ్చలపల్లి ఒక మంచి రెబెల్ అని ఎవర్ని అడిగినా చెబుతారు. రోజా పొరపాటున జగన్ అధికార పార్టీ నేతల్ని దూషించే విధానం చూసి, ఆయన్ని రెబెల్ గా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది కాబోలు!   * ఇక రోజా విషయానికి వస్తే, జగన్ అన్నని ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెబుతుంది. వాస్తవంగా తీసుకుంటే, రోజా కి కనుచూపుమేరలో అంతగా ఆదరించే మరో అన్నయ్య  కనిపించడం లేదనే చెప్పాలి. రోజా గతంలో చేసిన తీవ్ర విమర్శల దృష్ట్యా చంద్రబాబు పొరపాటున కూడా ఆమెను మళ్ళీ పార్టీలోకి తీసుకునే ఆలోచన చేయడు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మరో చెప్పుకోదగ్గ పెద్ద పార్టీ  లేదా అధికారం చేబట్టే సత్తా ఉన్న పార్టీ ప్రస్తుతానికి ఇంకోటి లేదు. ఇవన్నీ పరిశీలిస్తే, మరి రోజాకి కి జగన్ అన్న కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉందా!

ఈ తప్పులే జగన్‌ను ముంచాయా..?

హోరాహోరిగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో సర్వేలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ విజయ దుంధుభి మోగించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 19 రౌండ్లు కౌంటింగ్ జరిగితే కేవలం ఒకే ఒక్క రౌండ్‌లో శిల్పా టీడీపీపై ఆధిక్యత సాధించగా..మిగిలిన రౌండ్లలో తెలుగుదేశం హవా స్పష్టంగా కనిపించింది. ఈ విజయం రాజకీయ విశ్లేషకులను ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఖంగు తినిపించింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి విజయం వైసీపీదేనని చాలా సర్వేలు చెప్పాయి..టీడీపీ గెలిచినా చాలా తక్కువ మెజార్టీ మాత్రమే వస్తుందని నిన్న, మొన్నటి లగడపాటి సర్వే తెలిపింది. అయితే టీడీపీకి ఇంతటి అఖండ విజయం సాధించడానికి ఒకేఒక్కడు కారణం..ఆ ఒక్కడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవును మీరు వింటున్నది నిజమే..ఆయన వ్యూహత్మకంగా చేసిన తప్పిదాలు సైకిల్‌కు రాచబాటను ఏర్పరిచి తెలుగుదేశం విజయానికి కారణమయ్యాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అవేంటో ఒకసారి చూస్తే: * నంద్యాలలో గెలుపే లక్ష్యంగా 11 రోజుల పాటు అక్కడే మకాం వేశారు జగన్..నాయకుడు అన్నవాడు మంది మార్భాలన్నీ జనంలో మోహరించాలి..కానీ వైసీపీ అధినేత మాత్రం తన చుట్టూ తిప్పుకున్నాడు..ఎక్కడికి వెళితే అక్కడికి..తాను ఏం చేస్తే ఆ పని చేయించారు.  * ప్రచారం తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నడిరోడ్డుపై "కాల్చాలి..ఉరి తీయాలంటూ" చేసిన వ్యాఖ్యలు జనాల్లోకి బాగా వెళ్లాయి.. * ఇక మైక్ దొరికితే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయే రోజా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళ, మంత్రి భూమా అఖిలప్రియ వస్త్ర ధారణ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు..వైఎస్ వేసిన రోడ్లపై సీఎం తిరుగుతున్నారనడం, నారా లోకేష్‌ను వాడు-వీడు అనడం ఇలాంటి మాటలు వైసీపీకి చేటు చేశాయి. * ప్రతిపక్షం అంటే విమర్శించడం ఒక్కటే పనిగా పెట్టుకోవాలి. ఈ మూడున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందనో ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబును జనం ముందు దోషిగా నిలబెట్టవచ్చు కానీ ఇదేమీ చేయకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు జగన్. * ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి అక్కడ టికెట్ రాలేదన్న అక్కసుతో వైసీపీలోకి వచ్చిన శిల్పా బ్రదర్స్‌‌ జనానికి నమ్మకం కలిగించలేకపోయారు. శిల్పా చక్రపాణి లక్షలాది మంది సమక్షంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా వారు నమ్మలేదు..బహుశా రేపు వైసీపీ తరపున గెలిచి మళ్లీ గోడ దూకరన్న గ్యారంటీ ఏంటీ అని జనం అనుకోని ఉండవచ్చు. * నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలను దశాబ్ధాల పాటు మకుటం లేని మహారాజు‌లా ఏలారు భూమా నాగిరెడ్డి. మంచి చేశాడో..చేడు చేశాడో ఏమైతే ఏంటీ. ఆ ప్రాంతానికి పెద్ద దిక్కులా ఉన్నారు భూమా. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు సహజంగానే సానుభూతి ఉంటుంది. దానిని టీడీపీకి దక్కకుండా చేయడానికి భూమా ఫ్యామిలీపై లేనిపోని విమర్శలు చేసింది వైసీపీ. ఇంకేముంది పాపం తల్లితండ్రీ లేని ఆడకూతుళ్లు ఎంత కష్టపడుతున్నారో..ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని నంద్యాల ఓటరు భావించి ఉండవచ్చు. * నంద్యాల ఎన్నికలను ఎప్పటి నుంచో ప్రభావితం చేస్తోన్న గోస్పాడు మండలంలో పెద్ద దిక్కుగా ఉన్న గంగుల బ్రదర్స్‌‌కి జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గంగుల ఇంపార్టెన్స్ తెలుసుకున్న సీఎం చివరి నిమిషంలో గంగుల ప్రతాపరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి లాభపడ్డారు. * లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ప్రశాంత్ కిశోర్. 2019 ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తాడన్న నమ్మకంతో బోలెడు ఖర్చుపెట్టి మరీ "పీకే"ని తెచ్చిపెట్టుకున్నాడు జగన్. పాపం రాష్ట్రమంతా సర్వే చేసిన ప్రశాంత్ దేవినేని అవినాష్‌ను కాపు అని...వంగవీటి రాధాను కమ్మ అని నివేదిక ఇచ్చాడట. ఉత్తరాదికి చెందిన ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లోని కుల సమీకరణలు, లెక్కలు గురించి కనీస అవగాహన లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నంద్యాల లెక్క కూడా అలాగే తప్పి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు.

డేరాల హింస..ఖట్టర్‌ మెడపై కత్తి..?

అత్యాచారం, హత్య కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్‌ను సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చడాన్ని ఆయన భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. డేరా బాబాని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో గుర్మీత్ అనుచరులు, భక్తులు పలు విధ్వంసాలకు తెగబడ్డారు..ముఖ్యంగా హర్యానా తగలబడిపోతోంది. ద్విచక్రవాహనాలు, బస్సులు ఆఖరికి రైళ్లు కూడా ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలకు ఆహుతైపోతున్నాయి. ఈ పరిణామాలన్ని ముందే ఊహించినప్పటికీ..రాష్ట్ర పోలీసులకు తోడు ఏకంగా ఆర్మీని రంగంలోకి దించినప్పటికీ అవేవి మూలకు కూడా సరిపోవడం లేదు.   మరోవైపు ఈ అల్లర్లు హర్యానాని దాటి పంజాబ్, రాజస్థాన్‌, ఢిల్లీకు పాకాయి. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినా..కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఇక ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మెడకు చుట్టుకుంది. గుర్మీత్‌ తీర్పు నేపథ్యంలో ఇటువంటి అల్లర్లు జరుగుతాయని ముందే తెలిసినప్పటికీ వాటిని అదుపు చేయలేకపోవడంతో ఖట్టర్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి తోడు హర్యానా హైకోర్టు కూడా మనో‌హర్‌లాల్‌కు చీవాట్లు పెట్టింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పంచకుల తగలబడుతున్నా సీఎం చూస్తూ వుండిపోయారని మందలించింది.   కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖట్టర్‌పై వేటు పడే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ బీజేపీ అధిష్టానం మనోహర్‌ను వెనకేసుకొచ్చింది. డేరా స్వచ్ఛ సౌధాకు ఉన్న మద్దతుతో పోలిస్తే జరిగిన హింస చాలా తక్కువేనని..ముఖ్యమంత్రి చాకచక్యం కారణంగానే పెద్ద విధ్వంసం తప్పిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అన్నట్లు సమాచారం. ఏది ఏమైనా మరో రెండు రోజులు గడిస్తే కానీ ఖట్టర్‌కు పదవీ గండం ఉందో లేదో తెలియదు. ప్రస్తుతానికి మనోహర్‌ సేఫే అని చెప్పవచ్చు.

నంద్యాల టీడీపీదేనా..?

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులును ఒడ్డాయి. ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు..ఆ పర్వం ముగియడంతో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా..ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు..మధ్యాహ్నానికే 60 శాతం పోలింగ్ నమోదు అయ్యిందంటే ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చెప్పవచ్చు.   ఓటు వేసి వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారా అని చర్చించుకోవడం సహజం. అందుకు తగ్గట్టుగానే చిన్నా, పెద్దా ఇలా నలుగురు కలిస్తే చర్చ అంతా నంద్యాలలో ఏ జెండా ఎగురుతుందనే. ప్రజల మాటలను బట్టి చూస్తే టీడీపీ 8 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతుందట. టీడీపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లగా..జగన్ కీలక నేతలను తనతో పాటే ఉంచుకుని కేవలం ఓటర్లను కలవడానికే ప్రాధాన్యతనిచ్చారు.   మరో వైపు ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఏజెంట్‌‌ని నియమించి..బూత్ స్థాయి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఓటుకు రూ.1000 నుంచి 2000 వరకు అధికార పార్టీ ముట్టజెప్పిందని గుసగుసలు వనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా అంతటిది ఒకదారైతే నంద్యాలది మరోదారి..ఎందుకంటే ఇక్కడి ప్రజలు సౌమ్యులు..తిట్టుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం అన్న మాటలు నంద్యాలలో చెల్లవు. ఫ్యాన్ పార్టీ ప్రచారం స్టార్ట్ చేసింది మొదలు ఎండ్ చేసే వరకు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పట్ల ప్రజల్లో కాస్తంత వ్యతిరేకత తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద టీడీపీకి 55 శాతం, వైసీపీకి 35శాతం, కాంగ్రెస్‌కు 6 శాతం ఓట్లు లభించవచ్చని పరిశీలకుల అంచనా.

కల్వకుంట్ల వారి "రెడ్డి" రాగం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ వ్యాఖ్య చేసినా దాని వెనుక ఏదో పరమార్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తరచుగా అనేమాట. ఎవరినైనా మాటలతో ఈజీగా బుట్టలో వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తియ్యటి మాటల మాయాజాలంతో తన దారికి తెచ్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయాలు వెలమలకు, రెడ్డకు మధ్య సంఘర్షణగా మారినట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాన పార్టీల్లో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే అధికం. దీంతో ప్రజల్లో ఆధిపత్యం సంపాదించడానికి ఈ అగ్రకులాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కులం కార్డుతో ఒకరి నొకరు ఓడించుకునేందుకు, ప్రజల్లో బలంగా నాటుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు.   అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా గ్రామాల్లో దొరతనం నెరిపిన రెడ్లు, వెలమలు, కరణాలు నగరాలకు తరలివెళ్లారు..కానీ రాజకీయంగా వారు తమ తమ గ్రామాల్లో పట్టును కోల్పోలేదు. రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాపాడుకుంటూ చట్టసభలకు వారే ఎన్నికవుతూ వస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే 2019 ఎన్నికలకు ప్రణాళిక గీస్తూ ముందుకు సాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..ఆ దిశగా తనకు పోటీ అనుకున్న ప్రతీ ఒక్కరిని నామరూపాల్లేకుండా చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో బలమైన నాయకులుగా ముద్రపడిన వారందరినీ కారు ఎక్కించుకున్నారు.   అయితే యేళ్ల తరబడి నుంచి అధికారం..దశాబ్దాల నుంచి పెత్తనం..రాష్ట్రం నుంచి వార్డు వరకు వారిదే హవా సాగించిన రెడ్లను రాష్ట్ర విభజన అనాథలను చేసింది. ఊహించని విధంగా అధికారానికి దూరమై ఉనికి కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. అధికారం చేతి నుంచి జారిపోవడంతో రెడ్డినాయకులు జావగారిపోయారు.   కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవిస్తున్న కొద్ది తెలంగాణలో రెడ్డి నాయకులు కుచించుకుపోతున్నారు. ఏనాటికైనా తెలంగాణలో తనకు వ్యతిరేకంగా నిలిచేది రెడ్డి వర్గమేనని కేసీఆర్ బలంగా విశ్వసిస్తుండటంతో ఈ వర్గాన్ని చితక్కొట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ఈ విషయం జనాల్లోకి వెళుతుండటంతో రెడ్డి జనాన్ని ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ నగర శివారు బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్‌‌కు శంకుస్థాపన చేశారు.. పనిలో పనిగా రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి నుంచి జీవీకే రెడ్డి వరకు ప్రముఖ స్థానాల్లో నిలిచిన రెడ్లను ఏకబిగిన పొగడటం మొదలెట్టారు. మరి కేసీఆర్ బిస్కెట్లతో రెడ్లు మెత్తబడతారా..లేక తమ పోరాటాన్ని కొనసాగిస్తారో కాలమే చెప్పాలి.

ట్రిపుల్ తలాక్‌కు "సుప్రీం" తలాక్..!

14 వందల సంవత్సరాలుగా మతాచారాల పేరు చెప్పి మహిళల జీవితాలను దుర్భరం చేస్తోన్న ట్రిపుల్ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంచలనం తీర్పు వెలువరించింది. ముమ్మారు తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. మనదేశంలో విడాకులు తీసుకోవాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే. కానీ ముస్లిం మతాచారాల ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలంటే తలాక్..తలాక్..తలాక్ అని మూడు సార్లు చెప్పినట్లయితే వారి వివాహబంధం తెగిపోయినట్లే..అయితే దానిని అమలు చేయడానికి పవిత్ర ఖురాన్ గ్రంథంలో కఠిన నియమాలు, షరతులు ఉన్నాయి. కాని వాటిని పట్టించుకోకుండా..ఫోన్, మేసేజ్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా చాలా మంది తమ భార్యలకు తలాక్ చెప్పేసి భార్యలను నడి సంద్రంలో విడిచిపెడుతుండటంతో అనేకమంది ముస్లిం మహిళలు, వారి పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతోంది.   సౌదీ అరేబియా, కువైట్ ఆఖరికి మన పక్కనే ఉన్న పాకిస్థాన్‌ సైతం ఏనాడో ట్రిపుల్ తలాక్‌ను తమ దేశాల్లో నిషేధించాయి. కానీ భారత్‌లో మాత్రం ట్రిపుల్ తలాక్ అనేది మత విశ్వాసంలా చెలామణీలో ఉంది. ఈ సమస్య నానాటికీ తీవ్రతరం అవుతున్నా..ఎంతోమంది జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నా ముస్లిం మత పెద్దలు కానీ..ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు గానీ సమస్య పరిష్కారానికి పూనుకున్న పాపాన పోలేదు. దీంతో తమ రేపటి తరాల భవిష్యత్‌ కోసం నడుం బిగించింది. ట్రిపుల్ తలాక్ న్యాయబద్ధం కాదని..దాని వల్ల తాము, తమ బిడ్డలు జీవితాలను కోల్పోతున్నామని అత్యున్నత న్యాయస్థానానికి మొరపెట్టుకున్నారు. ఈ పిటిషన్లను అందుకున్న సుప్రీం వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది.   కానీ మార్చి 28న జరిగిన విచారణ సందర్భంగా భారత రాజ్యాంగంలోని సెక్షన్ 25 ప్రకారం భారత ప్రభుత్వానికి గానీ న్యాయస్థానాలకు గానీ ముస్లిం మతాచారాలలో కలగజేసుకునే అధికారం లేదని..ఇది అల్లాను, ఖురాన్‌ను అవమానించినట్లే అవుతుందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అయితే తాము ట్రిపుల్ తలాక్‌ను గానీ..రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను గానీ ఉల్లంఘించడం లేదంటూ తుది తీర్పు సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ వ్యాఖ్యానించారు.   మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా తలాక్ విధానం ఉందని..ఇన్‌స్టంట్‌గా మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని..ఈ విధానాన్ని తొలగించేలా చట్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. పార్లమెంటులో చట్టం చేసేందుకు వీలుగా ఆరు నెలలు గడువు ఇస్తున్నామని..ఈ కాలంలో ట్రిపుల్ తలాక్‌‌పై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లా బోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీం సూచించింది. ఇప్పటికే తాము ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకమని కేంద్రం చెప్పడంతో..ఇప్పుడిక పార్లమెంటులో చట్టం జరగడం ఇక లాంఛనమే. ఎందుకంటే ఇటు లోక్‌సభలో కానీ..అటు రాజ్యసభలో కానీ ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజారిటీ ఉంది గనుక, ట్రిపుల్ తలాక్‌కి చట్టం తీసుకొస్తే..చాలా సులభంగానే ఆమోదం పొందుతుంది. 

వాళ్లిద్దరూ ఒక్కటైతే నేను ఊరుకుంటానా..?

జయ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీతో పాటు తమిళనాడు ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభాలకు తెరదించుతూ పళనిస్వామి, పనీర్ సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాస్తంత చల్లబడుతుందని అందరూ ఊహించారు. ఏఐఏడీఎంకేను, తమిళనాడును శాసించలనుకున్న చిన్నమ్మ శశికళ ఆమె బంధువు దినకరన్‌ల శకం ఇక ముగిసిందని పార్టీ నేతలు భావిస్తోన్న తరుణంలో దినకరన్ జూలు విదిల్చారు.   తమను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించాలని చూస్తోన్న పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంలకు చెక్ పెట్టేందుకు ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు లేఖ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు లేదని..ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారు. ఊహించని ఈ స్ట్రోక్‌తో సీఎం పళనిస్వామి అలర్ట్ అయ్యారు. పార్టీ కీలకనేతలు, మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.   234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలుండగా..డీఎంకేకు 95 మంది, పీఎంకేకు 5మంది సభ్యులున్నారు. ఈ 18 మందితో పాటు మరో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు తన వెంట వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు దినకరన్ చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్, దినకరన్‌లు తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునుందుకు క్యాంపు రాజకీయాలు మొదలెట్టారు. దినకరన్ ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలను చెన్నైలోని ఒక హోటల్‌కు తరలించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ముగిసిపోయిందనుకున్న కథ మళ్లీ మొదటికి రావడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.   

మంత్రంటే లెక్కలేదు..ముఖ్యమంత్రన్న గౌరవం లేదు

నోటికి..బుర్రకి ఏది తోస్తే అది మాట్లాడటం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి మొదటి నుంచి అలవాటు..అవతల పక్క ఎంతటి వారైనా ఉండని..నాకెందుకు నాలుగు మాటలు అన్నామా..? లేదా అన్నదే ఆమె పనిగా పెట్టుకున్నట్లున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పేరెత్తితే చాలు ఆమె అంతెత్తున లేస్తున్నారు. ఆలోచించి మాట్లాడుతున్నారో..అనాలని అంటున్నారో తెలీదు కానీ రోజా కామెంట్స్‌ పలు సందర్భాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.   పాపం ఆ నోటి దురుసుతో టాక్‌ ఆఫ్ ది టౌన్ అవుతున్నా..కొన్నిసార్లు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. అసెంబ్లీ వేదికగా తోటి సభ్యులపై చేసిన కామెంట్స్ రోజాను ఏడాది పాటు చట్టసభకు దూరం చేసింది. ఇప్పటికీ ఆ వ్యవహారం హైకోర్టులో నడుస్తూనే ఉంది. నోరు అదుపులో పెట్టుకోవాలని సాక్షాత్తూ పార్టీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చినా..పార్టీకి ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌తో చీవాట్లు తిన్నా ఆమె బుద్ది మారడం లేదు. అవసరం లేకపోతేనే టీడీపీని..ఆ పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడే రోజా ఎన్నికల వంటి అవసరమైన సమయాల్లో ఇంకెలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా..?   నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రోజమ్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ముఖ్యంగా మంత్రి భూమా అఖిల ప్రియ వస్త్ర ధారణ విషయంలో ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అప్పటి వరకు వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న మంచిపేరుని తగ్గించింది. ఆ తర్వాత ఆయన దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదకు మళ్లీంది..సీఎం టీడీపీకి ఓటేయకపోతే మేము నిర్మించిన రోడ్లపై తిరగొద్దంటున్నారని..అలా అయితే నువ్వు వైఎస్ వేయించిన రోడ్లపై పాదయాత్ర ఎలా చేశావంటూ ఆరోపించింది. ఇక ప్రచారానికి కొద్ది గంటల్లో గడువు ముగుస్తుందనగా..సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని "వాడు వీడు" అంటూ అనేసింది.   వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని కొడుకుని ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రిని చేసుకున్నారు ముఖ్యమంత్రి అంటూ పేలడంతో టీడీపీ అభిమానులు, ప్రజలు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. వయసుకు గౌరవం ఇవ్వకపోయినా కనీసం వారి హోదాకైనా విలువ ఇవ్వాలంటున్నారు విశ్లేషకులు. "అతి సర్వత్రా వర్జయేత్" అన్నట్లు ఏదైనా ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది కానీ ఆ స్థాయి దాటితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇప్పుడు రోజా అన్న మాటలకు ఈలలు, చప్పట్లు వినిపించినా భవిష్యత్తులో ఆమె వ్యాఖ్యలు బోర్ కొట్టించకమానవు..ఈ విషయాన్ని రోజా ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

విభజన సమస్యల్లో ఒక సమస్యగా "భన్వర్‌లాల్‌‌"

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి మూడేళ్లు కావోస్తోంది కానీ ఇంతవరకు ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వుండిపోయాయి. ఏపీ సచివాలయ భవనాల అప్పగింత, హైకోర్టు, ఉద్యోగుల విభజన, నీటి పంపకాలతో పాటు విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్స్‌లో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల అప్పగింతపై నేటి వరకు ఇరు రాష్ట్రాలు పట్టించుకున్న పాపాన లేదు. వీటిని పరిష్కరించాలని గవర్నర్ చొరవ చూపినప్పటికీ..రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగినప్పటికీ విషయం మాత్రం నానుతూనే ఉంది. ఉన్న సమస్యలతోనే సతమతమవుతుంటే మరో సమస్యగా మారారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌.   ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన భన్వర్‌లాల్‌ను విభజన తర్వాత ఏపీకి కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం..మరో శాఖకు సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను ఏ అధికారికైనా అప్పగిస్తే.. ఆయన జీతంలో 20 శాతం సొమ్మును అలవెన్సుగా చెల్లించాలి. భన్వర్‌లాల్ జీతం నెలకు రూ.2.25 లక్షలు..అంటే తెలంగాణ సీఈవోగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గాను నెలకు రూ.45 వేల అలవెన్స్‌ చెల్లించాలి. కానీ నేటి వరకు టీ సర్కార్‌ ఆ సొమ్మును చెల్లించలేదు..మొత్తం రూ.16 లక్షలు భన్వర్‌లాల్‌కు ఇవ్వాల్సి ఉంది. తనకు రావాలసిన బకాయి కోసం భన్వర్‌లాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా..ఆయనకు భారీ షాక్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.   మీరు తెలంగాణా ఉద్యోగి కాదని..అలాంటి వారికి అలవెన్స్ చెల్లించలేమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారట. అంతేకాకుండా తాము సీఈవో పదవిని ఇంకా సృష్టించలేదని..అందువల్ల ఇన్‌ఛార్జ్ సీఈవో అన్న ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా..కేంద్ర ఎన్నికల సంఘమైనా ఈ భత్యాన్ని చెల్లించాలని..తమకు ఎలాంటి సంబంధం లేదని వాదించింది. దీంతో తన కేసును స్పెషల్‌గా పరిగణించి ఈ అలవెన్స్ చెల్లించాలని భన్వర్‌లాల్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా..మళ్లీ అదే సమాధానం వచ్చింది..కానీ ఒక మినహాయింపు ఇచ్చింది. ఆ అలవెన్స్ కాకుండా..కావాలంటే గౌరవ భృతిగా కొంతసొమ్మును చెల్లిస్తామని ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి అన్నారట. ఇప్పటికే చాలా సంయమనంతో ఉన్న భన్వర్‌లాల్‌ అతి త్వరలో ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి గానీ..కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి గానీ తీసుకువెళ్లే అవకాశం ఉంది. లేని పక్షంలో తనకు రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడానికి న్యాయపోరాటానికి దిగవచ్చు. ఆయన ఏం చేస్తారన్నది త్వరలో తేలిపోనుంది.

9ఏళ్లు బెయిల్ రాకుండా ఆపారు! నేరం మాత్రం ఋజువు చేయలేదు!

మన దేశంలో అధికారంలోని ప్రభుత్వాలకు యథేచ్ఛగా ఉపయోగపడే వ్యవస్థలు ఏవైనా వున్నాయంటే… అవి ప్రధానంగా దర్యాప్తు సంస్థలే! ఒక్కసారి అసెంబ్లీలోనో, పార్లమెంట్లోనో మెజార్జీ సంపాదిస్తే ఇక అయిదేళ్లు సదరు ప్రభుత్వానికి సీబీఐ, సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలు బానిసలే! అంతలా దయనీయ స్థితి ఏర్పడింది గత డెబ్బై ఏళ్ల కాలంలో! ఇందుకు కాంగ్రెస్, బీజేపి, ఇతర ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు అన్న తేడా లేదు! ఎవరు అధికార పీఠంపై వున్నా దర్యాప్తు సంస్థలకు చేతి నిండా పనే! అఫ్ కోర్స్, అది ఏ విధంగానూ జనానికి, దేశానికి ఉపయోగపడని కక్ష సాధింపు ఘనకార్యం…   సీబీఐ, సీఐడీ, కొత్తగా ఎన్ఐఏ … ఇలా ప్రతీ సంస్థని మన పాలకులు వాడేసుకుంటున్నారు. ఇందుకు సుప్రీమ్ బెయిల్ మంజూరు చేసిన కల్నల్ పురోహిత్ వ్యవహారమే నిదర్శనం. ఆయనతో పాటూ అభినవ్ భారత్ సంస్థ నడిపిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గారు. వారు నిజంగా మాలేగావ్ పేలుళ్లు జరిపారా? ఇంత వరకూ జాతీయ దర్యాప్తు సంస్థ వద్ద గట్టి సాక్ష్యాధారాలు లేవు. వుంటే త్వరితగతిన ఛార్జీషీట్లు వేసి నిందితులకి శిక్షలు పడేలా చేయవచ్చు కదా? అలా జరగలేదు. ఇప్పటికి 9ఏళ్లుగా సాధ్వీ, కల్నల్ పురోహిత్ కటకటాల వెనక మగ్గారు. దీని వెనుక కారణం ఏంటో ఎవరైనా ఇట్టే చెప్పయగలరు! గత యూపీఏ ప్రభుత్వం హిందూ ఉగ్రవాదం అన్న వాదన , చర్చ కొనసాగుతూ వుండటానికి మాలేగావ్ కేసు వాడుకుంది. అందు కోసం సాధ్వీ, పురోహిత్ ల జీవిత కాలంలో దాదాపు దశాబ్ద కాలం నిర్ధాక్షిణ్యంగా వృథా చేయించింది!   హిందూ ఉగ్రవాదం లేదనీ, సాధ్వీ, కల్నల్ లాంటి వారంతా అమాయకులనీ ఎవరూ వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. నిజంగా అమాయకుల ప్రాణాలు బలికావటానికి వాళ్లు కారణమైతే కఠినమైన శిక్షలు విధించాల్సిందే. కాని, తప్పు చేసిన వార్ని కోర్టులో దోషులుగా నిరూపించి, శిక్షలు పడేలా చేయటానికి ఎలాంటి కాలపరిమితీ లేదు మన దేశంలో! అదే పెద్ద విడ్డూరం! తాజాగా సుప్రీమ్ లో బెయిల్ పొందిన పురోహిత్ కేసులో… ఆయన తరుఫు లాయర్ హరీష్ సాల్వే వాదన వినిపిస్తూ ఓ మాట అన్నారు. పురోహిత్ నిజంగా తప్పు చేసినా… ఆయనకు పడే శిక్ష 7ఏళ్లు. కాని, ఆయన ఇప్పటికే 9ఏళ్లు జైల్లో మగ్గారు. మరి ఆ రెండేళ్లు ఎవరు తిరగిస్తారు? అసలు దోషులే కాదని నిరూపితమైతే మొత్తం తొమ్మిదేళ్లు ఎవరు తెచ్చిస్తారు? వాళ్ల కుటుంబ సభ్యుల మానసిక వేదన సంగతేంటి? ఏ ప్రశ్నకూ సమాధానం లేదు!   కల్నల్ పురోహిత్, సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ల ఉగ్రవాద సంబంధమైన కేసే కాదు. ఆయేషా మీరా కేసులో సత్యం బాబు లాంటి సామాన్య అమాయకుడి పరిస్థితి కూడా అంతే! ఏ తప్పు చేయకున్నా నరకం అనుభవించాడు అతను. కారణం… మళ్లీ మన దర్యాప్తు సంస్థల అమానుషమైన స్థితే! ఇది ఖచ్చితంగా మారాల్సిన అంశం! దేశంలోని ప్రతీ కేసు నిర్ధిష్ట కాలంలో పూర్తై దోషులకు శిక్ష పడాలి. దర్యాప్తు సంస్థల్ని అధికారంలోని ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా రూల్స్ రావాలి!

వేధింపులే సిక్కాను సాగనంపాయా..?

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో విశాల్ సిక్కా తన పదవులకు రాజీనామా చేయడం భారతీయ ఐటీ రంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ ఒక్క ప్రకటనతో స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ఫీ షేర్ విలువ 13 శాతం నష్టపోయింది. షేర్ విలువ పడిపోవటమే కాదు..కంపెనీ మార్కెట్‌ విలువలో అక్షరాల 30 వేల కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయి. కేవలం మూడు గంటల్లోనే రూ.2.40 లక్షల కోట్ల నుంచి రూ.2.04 లక్షల కోట్ల రూపాయలకు మార్కెట్ విలువ పడిపోయిందంటే సిక్కా రాజీనామా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.   అసలు ఇంతకీ విశాల్ ఉన్నపళంగా కంపెనీకి ఈ స్థాయిలో నష్టం చేకూర్చే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే అందుకు రెండు కారణాలు చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తొలి నుంచి పనితీరుపై విమర్శలు మూటగట్టుకంటున్నారు సిక్కా. సీఈవోతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల వేతన ప్యాకేజీలు భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటీవ్‌లకు భారీ మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని నారాయణమూర్తి సహా కొందరు ప్రమోటర్లు బహిరంగంగానే విమర్శించారు.   మరోవైపు విశాల్ సిక్కా రాజీనామా చేసిన కాసేపటి తర్వాత పిడుగులాంటి వార్తను చెప్పారు కంపెనీ బోర్డు సభ్యులు. నారాయణమూర్తి నిరంతర వేధింపులే సిక్కా రాజీనామాకు ప్రధాన కారణమని ఆరోపించారు. కంపెనీలు కార్పోరేట్ పరిపాలనా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని మూర్తి పలుమార్లు బహిరంగ లేఖలు రాశారు. విశాల్ సిక్కా తన ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు వీరి వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ప్రతి విషయానికి నిరాధార ఆరోపణలు చేస్తూ..వ్యక్తిగత దాడులకు దిగుతుంటే..తాను సీఈవో పదవిలో కొనసాగలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై గౌరవం, విశ్వాసం, సాధికారత ఉన్న పదవిలో ఉండాలని చెప్పడం గమనార్హం. 

మోడీ ఆటలో క్లీన్‌బౌల్డ్ అయ్యేది ఎవరు..?

దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుని కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది..ఆ గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు..పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇదంతా జరగడానికి కారణం ఒక్కరే..ఆయనే ప్రధాని నరేంద్రమోడీ. కాంగ్రెస్ కంచుకోటల్లో కూడా కమలం వికసించిందంటే అందుకు ఆయన ఛరిష్మానే కారణం. చూస్తుండగానే మోడీ ప్రధానిగా వచ్చి అప్పుడే మూడున్నరేళ్లు గడిచిపోయింది. ఇంకొక్క ఆర్నెల్లు గడిస్తే సార్వత్రిక ఫీవర్‌తో దేశం ఊగిపోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మోడీ.   కుప్పలు, తెప్పలుగా ఉన్న చట్టాల్లోంచి జనానికి పనికిరాని వాటిని ఏరి పారేయడం, మేకిన్ ఇండియా, జన్‌ధన్ యోజన, సర్జికల్ స్ట్రైక్స్, నోట్లరద్దు ఇలా సగటు భారతీయుడి ఊహాకు కూడా అందని డెసిషన్స్‌తో ఇమేజ్ పెంచుకున్నారు. వీటితో పాటే విమర్శలు మూట గట్టుకున్నారు. జరగబోయే పరిణామాలు ముందే బేరిజు వేసుకున్నారో ఏమో కానీ ముందుస్తు అన్న మాట బీజేపీ శ్రేణుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఏదో ఒక కారణం చేత బీజేపీకి దేశంలో సానుకూలత ఉంటే ఉండొచ్చు. కానీ మోడీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు..ఈ మూడున్నరేళ్లలో చేసి చూపించిన దానికి అవగింజంతైనా పోలిక లేదు.   ఇలాంటి వేళ మార్పు కొరడాను ఝుళిపించేందుకు మోడీ రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. క్యాబినెట్‌లో ఖాళీలతో పాటు..వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో తన మంత్రివర్గంలో పనితీరు సరిగా లేని మంత్రులను సాగనంపేందుకు మోడీ కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే 2019 నాటికి తనతో నడిచే మిత్రులను వెతుక్కుంటున్నారట మోడీ. బీహార్‌లో జేడీయూ..తమిళనాడులో అన్నాడీఎంకేలకు చెందిన సభ్యులకు కేంద్రంలో మంత్రి పదవులు ఖాయమంటున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేస్తూనే ప్రజల్లో తన ఇమేజ్ తగ్గకుండా ఉండేందుకు రానున్న రోజుల్లో మరింత దూకుడును ప్రదర్శించబోతున్నారట ప్రధాని. మరి మోడీ కూడికలు..తీసివేతల్లో ఎవరు మిగులుతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

భారత్ ని, సిక్కుల్ని… జాత్యహంకారంతో అవమానిస్తోన్న చైనా!

  చైనాకి ఇండియా మీద మొదట్లో చులకన భావం వుండేది. తరువాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు ఇక చేసేది ఏం లేక విసుగు, అసహనం మొదలైనట్టు కనిపిస్తున్నాయి! దీనికి కారణం ప్రస్తుతం కొనసాగుతున్న డోక్లామ్ టెన్షనే! ఏదో ఎప్పటిలా బెదిరిస్తే భారత్ భయపడి వెనక్కి తగ్గుతుందని భావించిన డ్రాగన్ ఇప్పుడు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. తాను హెచ్చరించినట్టు యుద్ధం చేసేయలేక, అలాగని తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోలేక సతమతం అవుతోంది! ఆ ఫ్రస్ట్రేషన్ లో తన అధికారిక మీడియాను కూడా ఇష్టానుసారం వాడేసుకుంటోంది! చివరకు , నవ్వుల పాలు అవుతోంది…   జిన్ హువా అనేది కమ్యూనిస్టు చైనా వారి ప్రభుత్వ మీడియా సంస్థ! దాని ఆధ్వర్యంలో ఓ ఇంగ్లీష్ చాట్ షో నడుస్తోంది. అందులో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కామెడీ చేస్తూ కామెంట్లు చేస్తారు. ఇది సీరియస్ ప్రోగ్రామ్ కాదు. కాకపోతే, వివిధ అంశాలపై చైనా అభిప్రాయాన్ని సదరు షో ద్వారా తెలుసుకోవచ్చు. దాని పేరు ది స్పార్క్!   ది స్పార్క్ షోలో తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది చైనీస్ అధికారిక మీడియా. అందులో చైనీస్ యాంకర్ డోక్లామ్ విషయంలో ఇండియా చేసిన ఏడు పాపాలు అంటూ లిస్ట్ చెప్పింది! అవన్నీ పాత ముచ్చట్లే! ఇండియా అక్రమంగా తన భూభాగంలోకి వచ్చిదంటూ దొంగ ఏడుపు కంటిన్యూ చేసింది. అయితే, అక్కడితో ఆగకుండా కామెడీ కోసం ఇండియన్స్ ని జాతి వివక్షతో అవమానించింది! తలపైన పాగాతో వున్న ఓ సిక్కు వేషం వేసుకున్న చైనీస్ యాక్టర్ తో ఛండాలమైన ఇంగ్లీష్ యాస మాట్లాడించింది! అంతే కాదు, భూటాన్ దేశం వ్యక్తిగా చూపిన ఓ వ్యక్తికి సదరు సిక్కు వేషం వేసుకున్న నటుడితో కత్తెర చూపించింది! దీని ద్వారా భూటాన్ని భారత్ బెదిరించి లొంగదీసుకుంటోందని సంకేతాలిచ్చింది…   ఇండియాని, మరీ ముఖ్యంగా, అడ్డదిడ్డంగా అమర్చిన గడ్డంతో, తలపాగాతో మన సిక్కుల్నీ అవమానించిన చైనీస్ షో… ట్విట్టర్ లో, యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ట్విట్టర్, యూట్యూబ్ లాంటివన్నీ చైనాలో బ్యానే! కాబట్టి ఇండియాని జాత్యహంకారంతో అవమానిస్తోన్న ఆ వీడియో టార్గెట్ లోకల్ చైనా ప్రజలు కాదనే చెప్పాలి. అంతర్జాతీయ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్ లో తయారు చేసిన వీడియో నవ్వుకన్నా ఎక్కువ సెటైర్లు పుట్టించింది. చూసిన వారు చైనా మీడియా చేసిన పిచ్చి ప్రయత్నాన్ని కామెంట్లతో, షేరింగ్ లతో వెటకారం చేస్తున్నారు!   వేల మైళ్ల సుదీర్ఘ సరిహధ్దు వెంట చైనా రోజుకో చోట గొడవకి దిగుతోంది. అది చాలదన్నట్టు తన మీడియా ద్వారా జాత్యహంకార దోరణికి తెర తీస్తోంది. పోనీ ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటిద్దామా అంటే అలాంటి దుస్సాహసం బీజింగ్ చేయలేకపోతోంది. డోక్లామ్ విషయంలో వెనక్కి తగ్గినా, ముందు పోయినా చైనా తీవ్ర నష్టం ఎదుర్కొనే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఫ్రస్ట్రేషనే ఇలా అన్ ప్రొఫెషనల్ వీడియోలుగా బయటకు వస్తోందిని చాలా మంది అంటున్నారు. చైనా పాలకులు ఇప్పటికైనా చర్చలకు ముందుకొచ్చి పరువు కాపాడుకుంటే మంచిది! ఆఫ్ట్రాల్… ఆసియాలో చైనా దాదాగిరి ఇక మీద నడవదని ఇప్పటికే భారత్ స్పష్టంగా తేల్చేసింది కాబట్టి!

దేశాన్ని వణికించింది పురుగా..?

  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుర్‌గావ్ ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మహిళలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మగవారు పనులను మానుకొని ఇంటి పట్టునే ఉడిపోతున్నారు. ఇళ్ల ద్వారాలకు, కిటికీలకు నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు కడుతున్నారు. కారణం అంతుచిక్కని రీతిలో మహిళల జుట్టు కత్తిరించబడటమే. మొదట్లో మంత్రగాళ్లు..ఆ తర్వాత భయానక ఆకారంలో ఉన్న వృద్దుడు త్రిశూలంతో వచ్చాడన్నారు..గ్రహాంతరవాసులన్నారు...దెయ్యమన్నారు. ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పుకార్లు షికార్లు చేశాయి. పాపం అనుమానంతో ఓ వృద్ధురాలిని కొట్టి చంపారు కూడా. అయినా జుట్టు కత్తిరించేది ఎవరన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. జనం రక్షణ కోసం మంత్రగాళ్లను ఆశ్రయించడం..పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు దొంగ ఎవరో తేలిపోయింది. అది ఎవరో కాదు ఒక పురుగు. దేశవ్యాప్తంగా ఎంతోమంది మెదళ్లను తొలచివేసి..కొన్ని లక్షల మందికి నిద్ర లేకుండా చేసిన ఈ రహస్యాన్ని ఛేదించారు బీహార్ వాసులు. పాట్నాలోని రామకృష్ణానగర్‌లోని ఒక ప్రాంతంలో సంచరిస్తున్న ఓ వింతపురుగును పట్టుకున్నారు స్థానికులు. మహిళల జుట్టును కత్తిరిస్తోంది ఈ పురుగేనని వారు చెబుతున్నారు. అందుకు సాక్ష్యంగా ఆ పురుగు నోటితో జుట్టును ఎలా కత్తిరిస్తోందో చూపించడమే కాకుండా వీడియో కూడా తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన బాధితులు నోరెళ్లబెడుతున్నారు..ఇంతకాలం తమ కంటికి కునుకు లేకుండా చేసింది ఒక పురుగని తెలిసి నవ్వాలో..ఎడవాలో అర్థం కావడం లేదని కొందరు వాపోతున్నారు. ఇప్పటికి మిస్టరీ వీడిందని సంతోష పడుతున్నా..? అసలు దోషి ఈ పురుగా..లేక మరేదైనానా అన్నది తెలియాల్సి ఉంది.

షేక్ ల కామదాహానికి షేకైపోతోన్న హైద్రాబాదీ అమ్మాయిల జీవితాలు!

  హైద్రాబాద్… ఈ పేరు తెలుగు వారందరికీ గర్వకారణం. చంద్రబాబు నాయుడు దీన్ని సైబర్ సిటీ అంటే… కేసీఆర్ ఏకంగా విశ్వనగరం అంటారు! కాని, ఒకవైపు సైబర్ టవర్స్ కళకళలు ఉట్టిపడే హైద్రాబాద్ కు మరో కోణమూ వుంది! అదే ఓల్డ్ సీటీ మైనార్టీ తీరని మైనార్టీ అమ్మాయిల వ్యథలు!   ప్రపంచంలో అద్బుతమైన బిర్యానీ కావాలి అంటే ఎవరైనా హైద్రాబాద్ కు వస్తారు! కాని, విషాదం ఏంటంటే… సౌదీ, ఒమన్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల సంపన్నులైన ముసలివారు కూడా హైద్రాబాద్ పరుగెత్తుకొస్తుంటారు. వాళ్ల రాకకి కారణం బిర్యానీ కాదు… జవానీ! అవును… ఇంకా మైనార్టీ కూడా నిండని ఓల్డ్ సిటీ అమ్మాయిల్ని గడ్డాలు నెరిసిన, తల మీద వెంట్రుకలు రాలిపోయిన ముసలి కామాంధులు దర్జాగా నిఖా చేసుకుంటారు. తమ దేశాలకు తీసుకెళతారు. అక్కడ నరకం చూపిస్తారు. అదృష్టం బావుంటే సదరు అమ్మాయి జృవచ్ఛవంలా భారతదేశం తిరిగి వస్తుంది. లేదంటే… దేశం కాని దేశంలో ఆ అభాగ్య హైద్రాబాదీ అమ్మాయి బతుకు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు!   దేశంలోనే అద్బుతంగా ఎదుగుతోన్న సైబర్ హబ్ అయిన హైద్రాబాద్ లో కేవలం కొన్ని లక్షలు గుమ్మరిస్తే అమ్మాయిలు దొరుకుతారని చెప్పాల్సి రావటం దురదృష్టకరం. కాని, తాజాగా వెలుగు చూసిన మరో ఉదంతం సాక్షిగా ఇక్కడ ఇదంతా మామూలైపోయిందంటున్నారు నిపుణులు. వివిధ ఇస్లామిక్ దేశాల్లోంచి డబ్బున్న షేక్ లు ఇక్కడకి రావటం. ఇక్కడి నిరుపేద ముస్లిమ్ అమ్మాయిల కుటుంబాల్ని కనిపెట్టి డబ్బు ఎర చూపటం. ఆ తరువాత అభం శుభం ఎరుగని అమ్మాయిల్ని పెళ్లిల్లు చేసుకోటం చకచకా జరిగిపోతోంది. ఓ పదహారేళ్ల అమ్మాయి విషయంలో మరోసారి పాతబస్తీలో అదే జరిగింది. స్వంత తల్లి కూడా అంగీకరించకున్నా ఓ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిని ఒమన్ నుంచి వచ్చిన 65ఏళ్ల ముసలివాడు పెళ్లి చేసుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా 5లక్షలు అమ్మాయి బంధువు ఒకామెకు ఇచ్చాడు. అంతే కాదు, ప్రస్తుతం మైనార్టీ కూడా తీరని ఆ అమ్మాయి ఒమన్ లో నలిగిపోతోంది. ముసలి భర్త ఆమెను తన దేశానికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ్నుంచి ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి రక్షించమంటూ , లేదంటే చచ్చిపోతానని ఫోన్ లో ఏడుస్తోంది!   అరవై దాటిన ముసలివాడికి 16ఏళ్ల విద్యార్థినిని అంటగట్టిన ఉదంతం కొత్తదేం కాదు. ఇలా పోలీస్ స్టేషన్ కు చేరుతోన్న కేసులు హైద్రాబాద్ లో బోలెడు. కొందర్ని అగ్రిమెంట్ ప్రకారం విదేశీ సంపన్న షేక్ లు ఇక్కడే పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేసి వెళుతుంటారు. మరి కొందర్ని తాజా కేసులో లాగా తమ దేశానికి తీసుకెళ్లిపోతుంటారు. ఇంత జరుగుతున్నా ఈ విషాదకరమైన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వాలు, పోలీసులు చేయటం లేదు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి.   ఓ పదహారేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల వృద్దుడు పెళ్లి చేసుకుని తన దేశానికి తరలించుకుపోవటం … ఆ అమ్మాయి వ్యక్తిగత సమస్య కాదు! హైద్రాబాద్ ఇమేజ్ కే కళంకం తెచ్చే దారుణం. ఎందుకంటే, పదే పదే ఇలాంటి ముసలి షేక్ ల కామ దాహం ఓల్డ్ సీటీలో బయటపడుతోంది! దీన్ని ఖచ్చితంగా రూపుమాపాల్సిందే…

లైమ్ లైట్‌లో ఉండటానికి రఘువీరా పాట్లు..!

ఆంధ్రప్రదేశ్ విభజన పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరమైన రాజకీయ తప్పిదం కారణంగా అక్కడి ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేశారు. ఆ దెబ్బతో దశాబ్దాల పాటు ఏపీని ఏకఛత్రాధిపత్యం కింద ఏలిన పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటుగానీ, లోక్‌సభ సీటు గానీ దక్కలేదు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీని పట్టించుకునేవారు లేరు. మిగిలిన చిన్నా, పెద్ద నేతలంతా టీడీపీ, వైసీపీలో చేరిపోగా..అక్కడక్కడ అంటిపెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు రావడంతో హస్తం మనుగడ కష్టంగా మారింది. మీడియా అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు కవరేజీ ఇవ్వడం కూడా తగ్గించేసింది. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరని అడిగినా..ఇంకా ఆ పార్టీలో లీడర్లు ఉన్నారా అని జనం అడిగే పరిస్థితి.   రాహుల్ వచ్చినా..భవిష్యత్తులో సోనియమ్మ వచ్చినా ఆ సభల్లో కుర్చీలు ఖాళీగా ఉంటాయి తప్ప అక్కడ జనం మాత్రం ఉండరన్నది వాస్తవం. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ పోటీ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్యేనని అందరికీ తెలుసు. అయినా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. అబ్దుల్ ఖాదర్ ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. గెలుస్తామన్న ఆశతో కాదు..కనీసం అలా అయినా జనానికి గుర్తు ఉంటామన్న తపనతో. ఇక ఆ పార్టీకి ఉన్న ఏకైక స్టార్ క్యాంపెయినర్ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒక్కరే. అడపా, దడపా ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అవాకులు, చవాకులు పేలుతూ ఉంటారు రఘువీరా.   ఉప ఎన్నిక ప్రచారంలో నేతల స్పీడు చూశారో లేక తాను వారిలా మాట్లాడాలని అనుకున్నారో ఏమో కానీ ఏకంగా నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారాయన. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని..ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేయడంతో పాలన పడక వేసిందని.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కుల దూషణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నా సీఎం స్పందించడం లేదన్నారు. ఈసీ గనుక సక్రమంగా విధులు నిర్వర్తిస్తే నంద్యాలలో ఏం జరుగుతుందో తెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. బహుశా తన వ్యాఖ్యలకు ఎవరో ఒకరు స్పందిస్తారని..అలా అయినా జనం దృష్టిలో పడొచ్చని రఘువీరా ఆశ కాబోలు.

ప్రాణాలు తీస్తున్న బ్లూవేల్.. గేమ్ రూల్స్ ఇవే...

  ఏదో సరదాకి ఆడుకునేది ఆట కానీ.. ఏకంగా ప్రాణాలు పణంగా పెట్టేదాన్ని ఆటని ఆట అనరు. ఈమధ్య ఆటలు అలానే తయారయ్యాయి. మొన్నటి వరకూ పొకోమెన్ గో అంటూ ప్రాణాలు తీసుకోగా.. ఇప్పుడు బ్లూ వేల్ అనే మాయదారి గేమ్ వల్ల ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో కూడా రోజు రోజుకి చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువవుతుంది తప్పా తగ్గట్లేదు. దీంతో ఈ గేమ్ పై చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. గేమ్ కు సంబంధించిన లింక్స్ ను వెంటనే తొలగించాలంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లకు నోటిసులు అందజేసింది. అసలు ఇంతకీ ఆ బ్లూవేల్ గేమ్ ఏంటీ.. గేమ్ చనిపోవడం ఏంటీ.. ఓసారి చూద్దాం..   బ్లూవేల్‌ చాలెంజ్ అంటే..?   బ్లూవేల్‌ చాలెంజ్‌ రష్యాలో 2013 లో ప్రారంభమైంది. ఫిలిప్‌ బుడెకిన్‌ అనే సైకాలజీ విద్యార్థి దీనిని సృష్టించాడు. ఈ గేమ్ వల్ల 2015లో మొదటి ఆత్మహత్య వెలుగుచూసింది.  ఆ తరువాత ఆత్మహత్యలు ఎక్కువవడంతో బ్లూవేల్‌ గేమ్‌ను సృష్టించినందుకు ఫిలిప్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. సైబీరియా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మొదట రష్యాలో తర్వాత దుబాయ్‌లో అరాచకాన్ని కొనసాగించిన బ్లూవేల్‌ చాలెంజ్‌... తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ ఆఖరికి మన దేశంలోకి కూడా ప్రవేశించింది.   ఇక గేమ్ విషయానికి వస్తే 50 రోజులపాటు రోజుకో టాస్క్‌ (ఏదైనా పని) ఇచ్చి చేయమంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆడడం ప్రారంభించాక మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేసినట్లు రుజువుగా సంబంధిత టాస్క్‌ల ఫొటోలను గేమ్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక గేమ్‌ స్థానంలో మెంటార్‌ (అడ్మినిస్ట్రేటర్‌) ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది! ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలని.. భయం గొలిపే హర్రర్‌ సినిమాలను చూడాలని.. చేతిపై బ్లేడుతో గానీ, కత్తితో గానీ ఏమైనా బొమ్మల ఆకారాలను గీయాలని.. అర్ధరాత్రి లేచి బిల్డింగ్‌పైకి వెళ్లాలని.. అక్కడే ఒంటరిగా కూర్చోవాలని.. ఇలా రకరకాల టాస్క్‌లు ఇస్తాడు. శరీరంపై సిరంజీలతో గుచ్చుకోమంటాడు. ఏదైన బ్రిడ్జిపై అంచున నిలబడి, సెల్ఫీ తీసి అప్‌లోడ్‌ చేయమంటాడు. సరదాగా నగ్నంగా ఫొటోలు తీసుకుని, షేర్‌ చేయాలని చెప్తాడు. ఇలా విచిత్రమైన టాస్క్ లతో ఈ గేమ్‌ పూర్తిగా హిప్నటైజ్‌ చేస్తుంది. ఇలా 49 రోజుల పాటు టాస్క్‌లు ఇచ్చి.. చివరి రోజున ఏదైనా బిల్డింగ్‌ పైనుంచి దూకాలని, వంతెనపై నుంచి నది నీటిలో దూకాలని ఆదేశిస్తాడు. అలాగైతేనే గేమ్‌ పూర్తయినట్లని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. ఇలా గేమ్ పూర్తవుతుంది.   మొత్తానికి అర్ధంలేని గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవడం.. కనీస జ్ఞానం కూడా లేకుండా గేమ్ రూల్స్ ను పాటించడం.. గేమ్ లో చెప్పాడని చనిపోవడం ఎంత వరకూ కరెక్టో ఆలోచించుకోవాలి.