ఉపాధి చూపుతున్న ఉద్యమాలు
posted on Jan 31, 2013 @ 12:54PM
తెలంగాణా కోసం నెల రోజుల సకల జనుల సమ్మెతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తెలంగాణా ఉద్యోగీ సంఘాల నాయకుడు స్వామీ గౌడ్, ఆ నెలరోజుల సమయంలోనే తన రాజకీయ జీవితానికి బలమయిన పునాది కూడా వేసుకోగలిగారు. పదునయిన వ్యాఖ్యలతో చక్కటి ప్రసంగాలు చేస్తూ, ఉద్యోగీ సంఘాలనన్నిటినీ నెలరోజులపాటు ఏకతాటిపై నడిపించి మంచి నాయకత్వపటిమను కూడా ప్రదర్శించుకోవడంతో సహజంగానే ఆయన తెరాస దృష్టిని ఆకర్షించారు.
ఆ నెల రోజుల సమయంలో ఆయన ఒక్క తెరాస పార్టీతోనే కాక, తెలంగాణా రాజకీయ జేయేసీ అధ్యక్షుడు ప్రొఫసర్ కోదండరాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వంటి అందరితో మంచి పరిచయాలు పెంచుకొన్నారు. ఆ తరువాత క్రమంగా తన ఉద్యోగం, ఉద్యోగ సంఘాలకు దూరం జరుగుతూ, మొదట తెరసాలోకి ఆ తరువాత తెలంగాణా రాజకీయ జేయేసీలోకి ప్రవేశించి అంచలంచలుగా పైకి ఎదిగి ఇప్పుడు ప్రముఖనాయకుడిగా గుర్తింపు పొందారు.
మళ్ళీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలో మరో మెట్టుపైకి ఎక్కుతూ అయన మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. అయితే, బీజేపీతో రాష్ట్ర నాయకత్వంతో అయన ఏర్పరుచుకొన్న సత్సంబందాలు ఇప్పుడు ఆయనకి అక్కర కొచ్చాయి. పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్ రావులు ఆయనపై పోటీగా తమ అభ్యర్ధీ నిలబెట్టకూదదని నిర్ణయించడంతో స్వామీ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం ఇక లాంచన ప్రాయమే.
అయితే, తెలంగాణా ఉద్యమం, సాధన సంగతి ఎలాఉన్నపటికీ ముందు పదవులు మాత్రం ఆయాచితంగా వచ్చి ఆయన ఒళ్లోవాలుతున్నాయి. బహుశః ఇదే కారణంతో నేడు అనేక ఉద్యోగ సంఘ నేతలు, గల్లీ స్థాయి నాయకులు, విద్యార్దీ నాయకులూ కూడా, అందుబాటులో ఉన్న కొంత మందిని పోగేసుకొని ఏదో ఒక జేయేసీ అంటూ ఉద్యమాలంటూ మీడియా ముందు హంగామా చేయడం పరిపాటి అయిపోయింది.
ఇందుకు స్వామీ గౌడ్ ని తప్పు పట్టవలసిన పనిలేదు. గానీ, అయన రాజాకీయ ఎదుగల మాత్రం పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న జేయేసీలకు, వాటి నాయకులకు చక్కటి ప్రేరణ కల్గిస్తోందని చెప్పకతప్పదు. ఉద్యమాలు అవి ఏ ప్రాంతానివయినా ఇప్పుడు కాస్త చొరవ, వాగ్దాటి ఉన్న ప్రతీ ఒక్కరికీ మంచి ఉపాధి కల్పించడమే గాకుండా, అతి తక్కువ సమయంలో జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగే మార్గాన్ని కూడా చూపిస్తున్నాయి.
అందుకే ఉద్యమాలు కలకాలం సాగాలని కోరుకొందాము. ఉన్నవి సమసిపోతే అనకాపల్లి, ఆముదాలవలస, అన్నవరం కూడా ప్రత్యేక రాష్ట్రాలు చేయాలనీ కొత్త ఉద్యమాలు మొదలుపెడదాము. ఉద్యమం జిందాబాద్..