వైకాపా రాజీనామాలు..జగన్ కుట్ర
posted on Sep 26, 2013 @ 2:37PM
ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతుండటంలో కుట్ర దాగి ఉందని మంత్రి శైలజానాథ్ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ తీర్మానం శాసనసభలో ఆమోదం పొందేందుకే ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభ్యులు రాజీనామాలు చేయాలనే వాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేయవద్దని ఆయన సీమాంధ్ర శాసనసభ్యులకు విజ్జప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే రాజీనామాలు చేయకుండా తెలంగాణ తీర్మానం శాసనసభకు వచ్చినప్పుడు మాట్లాడాలని, తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెసు అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.