డిశంబర్ 2న జగన్ విశాఖ ఏజన్సీ పర్యటన
posted on Nov 13, 2015 8:24AM
ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంత అకస్మాత్తుగా పోరాటాలు మొదలుపెట్టిందో అంతే అకస్మాత్తుగా వాటిని నిలిపివేసింది. కారణాలు అందరికీ తెలిసినవే. ప్రత్యేక హోదాపై పోరాటాలు నిలిపివేసిన తరువాత చంద్రబాబు నాయుడిపై పోరాడేందుకు జగన్మోహన్ రెడ్డి మరో ‘సమస్య’ కోసం వెతుకుతుంటే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో కొత్త ‘సమస్య’ దొరికేవరకు దానిపై పోరాడవచ్చని భావించిన ఆయన అందుకు సిద్దమవుతున్నట్లుంది.
ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడ పర్యటించి ఆయనకీ ‘గ్రౌండ్ రిపోర్ట్’ అందజేసారు. పనిలోపనిగా ఆమె ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో తను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అంతేకాదు తను మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో పోటీ చేయాలని సవాలు కూడా విసిరారు. ఆవిధంగా ఆమె ప్రభుత్వంపై యుద్ధభేరీ మ్రోగించేసారు కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలు జరుగబోయే విశాఖ ఏజన్సీలో డిశంబర్ 2న పర్యటించడానికి బయలుదేరబోతున్నట్లు ప్రకటించారు. అక్కడి గిరిజనులకు తమ పార్టీ అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇవ్వాలనుకొంటున్నారుట! ఇంతకు ముందు రాజధాని ప్రాంతంలో రైతులకు కూడా అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చేరు. కానీ ఆ తరువాత వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు గిరిజనులకు భరోసా ఇచ్చేందుకు బయలుదేరుతున్నారు. అప్పుడు రైతులు ఇప్పుడు గిరిజనులు రేపు మరెవరో?