32సార్లు విచారించిన నో రెస్పాన్స్ :సిబిఐ
posted on Jan 30, 2012 @ 1:34PM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని 32 సార్లు విచారించామని, అయినా ఏ విధమైన విషయాలూ చెప్పలేదని సిబిఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది.నార్కో టెస్టుల్లోనే అసలు నిజాలు బయటపడతాయని విజయ సాయి రెడ్డిని నార్కో అనాలిసిస్ టెస్టులకు అనుమతించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి.అయితే విజయసాయి రెడ్డిని నార్కో టెస్టులకు అనుమతించాలనే వాదనను ఆయన తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. విజయ సాయి రెడ్డి సిబిఐకి అన్ని విషయాలూ చెప్పారని ఆయన అన్నారు. నార్కో టెస్టులు చట్టవిరుద్ధమని, వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమని ఆయన వాదించారు.
కాగా నార్కో టెస్టులక కన్నా బలమైన టెస్టులకు విజయ సాయి రెడ్డి అర్హుడేనని సిబిఐ వాదించింది. విజయ సాయిరెడ్డిని 300 గంటల పాటు విచారించినా ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని చెప్పింది.కానీ నిందితుని అనుమతితోనే నార్కో టెస్టులు నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలిపిందని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. నార్కో టెస్టుల్లో చెప్పిన విషయాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపిందని ఆయన అన్నారు. సిబిఐ వేసిన పిటిషన్‌పై వాదనలు పుర్తయ్యాయి. తీర్పును కోర్టు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.