వైఎస్ వివేకా కుమార్తెకు క్యాపిటల్ ఫౌండేషన్ పురస్కారం
posted on Nov 7, 2022 8:27AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం దక్కింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డాక్టర్ సునీతకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ అందజేశారు. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్.. జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి ఈ అవార్డులను అందజేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత అందిస్తున్న డాక్టర్ సునీత ఈ పురస్కారం అందుకున్నారు. పురస్కారం అందుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన సునీత అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో అంటువ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రపంచ వ్యాప్తంగా శ్రద్ధ తగ్గిందన్నారు.
కాగా డాక్టర్ సునీత తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసు విచారణ ఏపీలో అయితే సరిగా జరగదని, నిందితులకు ప్రభుత్వం కాపాడే యత్నం చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రం బయట విచారణ జరగాలని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించిన సంగతి విదితమే.
సుప్రీం కోర్టు కూడా ఏపీ బయట విచారణకు అంగీకారం తెలిపింది. ఒక వైపు తన తండ్రి హంతకులకు శిక్ష పడాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తూనే.. మరో వైపు అంటువ్యాధుల నియంత్రణపై వృత్తి పరంగా సేవలు కొనసాగిస్తున్న సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం లభించడం ముదావహం.