సీఎం పర్యటనకు ముందు ప్రమాదం.. ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
posted on Oct 21, 2020 @ 4:16PM
విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలకు బాగా నానిపోవడంతో మట్టి కరిగిపోయి పెద్ద బండరాళ్లు, మట్టి కిందికి పడ్డాయి. సీఎం జగన్ ఈ సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, దానికి కొన్ని గంటల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్టు సమాచారం.
కాగా, ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కనపడుతోంది. కొండచరియలు విరిగిపడటంపై మీడియా ప్రతినిధులు హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం రాక కోసం మీడియా ప్రతినిధులు ఎదురు చూస్తున్న సమయంలో.. మీడియా పాయింట్ కు సమీపంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. అంతకుముందే, కొండ సగానికి సగం బీటలు వేసింది, ప్రమాదానికి ఆస్కారముందని దుర్గ గుడి అధికారులను మీడియా ప్రతినిధులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం దసరా తర్వాత చూస్తామని నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు సమాచారం.