చెప్పడానికి మనసుకు కష్టంగా ఉంది, అయినా చెప్తున్నా: జగన్మోహన్ రెడ్డి
posted on Apr 20, 2020 @ 1:07PM
కరోనా కారణంగా, ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవలసిందిగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. " ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా", అని ఆయన చెప్పారు.
ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలేననీ, కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనీ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి -ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. " ఇప్పుడు రంజాన్ కూడా వచ్చింది. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నా. ఈ విషయాన్ని అందరికీ చెప్పండం," టూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం చెప్పారు.