విందు కోసం కింగ్ కోబ్రాతో పండగ చేసుకున్నారట!
posted on Apr 20, 2020 @ 12:59PM
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా నోరు చప్పబడిందంటూ కొందరు వేటగాళ్లు ఆహారం కోసం అడవిలో వేటకు వెళ్లారు. కింగ్ కోబ్రాను వేటాడారు.
ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ అడువుల్లో జరిగింది. విందు కోసం 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను వేటగాళ్ల బృందం చంపేసింది. అనంతరం కింగ్ కోబ్రా మాంసాన్ని ముక్కలుగా చేసి విందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కోబ్రా మాంసాన్ని శుభ్రపరించేందుకు అరటి ఆకులను వేశారు. కింగ్ కోబ్రాను చంపిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది.
కింగ్ కోబ్రాను చంపిన వేటగాళ్ల బృందం విషపూరితమైన కింగ్ కోబ్రాను తమ భుజాలపై వేసుకుని ఫోటో స్టిల్స్ ఇచ్చారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తినడానికి ఏమీలేక పోవడంతోనే తాము ఆహారం కోసం వేటాడామని వారు చెబుతున్నారు. ఆహారం కోసం వెతుకుతూ అడవికి వెళ్లామని, అక్కడే తమకు కింగ్ కోబ్రా దొరికిందని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఈ ముగ్గురు వేటగాళ్లపై కేసు నమోదైందని, ముగ్గురిలో ఒకరు పరారీలో ఉన్నారు. కింగ్ కోబ్రా చట్టం ప్రకారం రక్షిత సరీసృపాలు, వాటిని చంపడం బెయిల్ మంజూరు చేయలేని నేరంగా పరిగణిస్తారు.