మొన్న అఖిలప్రియ... ఇఫ్పుడు జేసీ... సీమలో జగన్ సైలెంట్ ఆపరేషన్
posted on Oct 24, 2019 @ 11:48AM
రాయలసీమలో కేవలం మూడే మూడు స్థానాలు మినహా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన జగన్మోహన్ రెడ్డి... తనను విమర్శిస్తున్నవాళ్లను, తన ప్రత్యర్ధులను సైలెంట్ టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శ చేయకుండా... ఆరోపణలకు కౌంటర్ ఇవ్వకుండానే... కేసులు, దాడులతో కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర మొదలుకొని కోస్తాంధ్ర వరకు పలువురు టీడీపీ ముఖ్యనేతలపై కేసుల మీద కేసులు పెట్టడమే కాకుండా కోడెల ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు రాయలసీమపై ఫోకస్ పెట్టారని అంటున్నారు.
ముఖ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనను, తన కుటుంబాన్ని దూషించిన జేసీ బ్రదర్స్ టార్గెట్ గా ఆపరేషన్ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా జేసీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారని చెబుతున్నారు. అయితే, దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ పై ఘాటు రియాక్టయిన జేసీ దివాకర్ రెడ్డి... జగన్ పై సెటైర్లు వేశారు. ఎన్నో ట్రావెల్స్ ఉండగా జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయా అంటూ జేసీ ప్రశ్నించారు. ఎందుకు నా బస్సులనే భూతద్దంలో చూస్తున్నారని అన్నారు. కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్న జేసీ దివాకర్ రెడ్డి.... బస్సుల సీజ్ పై కోర్టును ఆశ్రయిస్తానన్నారు. 70ఏళ్లుగా వాహనరంగంలో ఉన్నామన్న జేసీ.... చిన్నచిన్న లోటుపాట్లు ఉండటం సహజమని, కేవలం ఫైన్‌లతో సరిపోయే తప్పిదాలకు సీజ్‌లు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ఇక, ఇదే తరహా ఆరోపణలను మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యురేనియంపై పోరాడుతున్నందుకే తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిది, కర్నూలు ఎస్పీదే బాధ్యతంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్న పరిటాల సునీత కూడా జగన్ ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భద్రతను వన్ ప్లస్ వన్ కి కుదించారని, గతంలో మాదిరిగా 2 ప్లస్ 2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, రాయలసీమలో ఇలా ఒకరి తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి... రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.