పార్టీ నేతల టెంపర్ తో జగన్ కు చిక్కులు..
posted on Dec 5, 2015 @ 2:29PM
వైఎస్ జగన్ కు పార్టీ నేతల దూకుడు వల్ల లేనిపోని తలనొప్పులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క పార్టీలోని రోజుకో నేత ఇతర పార్టీలోకి వెళుతుంటే మరోపక్క నేతల అతి దూకుడితో అరెస్ట్లులు.. ఇవన్నీ జగన్ కు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఇంతకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి.. ఓ పోలీసుతో వాగ్వాదానికి దిగి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అది అయిపోయింది అనుకుంటే ఆతరువాత వెంటనే కొడాలి నాని వ్యవహారం. విజయవాడలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వివాదం. కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు అది టీడీపీ కార్యలయంగా ఉండేది..ఎప్పుడైతే తాను పార్టీ మారి వైకాపా పార్టీలోకి చేరారో టీడీపీ కార్యలయాన్ని జగన్ పార్టీ కార్యలయంగా మార్చి అద్దె చెల్లింపు వ్యవహారంలో ఇంటి యజమానితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం.. రచ్చ రచ్చ అయింది ఈవ్యవహారం. ఇది అయిపోయిందనుకుంటే మళ్లీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహారం. తిరుపతి ఏయిర్‌పోర్ట్‌లో మేనేజర్ రాజశేఖర్‌పై దాడి చేశారన్న అభియోగంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు నమోదయింది. అంతేకాదు చెవిరెడ్డినే స్వయంగా వెళ్లి లొంగిపోయాడు కూడా.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత దూకుడిగా ప్రవర్తించినా నేతలు మాత్రం తమ తప్పేమి లేదన్నటూ.. అధికారపార్టీని విమర్శిస్తున్నారు. ఇక వైకాపా పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఊరుకుంటుందా.. తమ పార్టీ నేతలు చేసిన పనులు కప్పిపుచ్చుకోవడానికి.. అధికార పార్టీని విమర్శిస్తూ రెచ్చిపోయింది. మొత్తానికి పార్టీలో నేతలు దూకుడు తగ్గించుకునేంతవరకూ జగన్ కు కష్టాలు తప్పవు.