చౌదరులు జగన్ వలలో పడతారా?
posted on Dec 5, 2015 @ 8:13PM
ప్రతిపక్షం స్థానంలో వున్న వైసీపీ తాను చేతులారా చేసుకున్న స్వయం కృతాపరాధాల కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏకపక్షంగా, అధికారపక్షంగా సాగిపోతున్నాయి. చంద్రబాబు నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా వుంది. ప్రభుత్వానికి, టీడీపీని ఇబ్బందుల్లో నెట్టడానికి జగన్ అండ్ కో ఎన్ని వ్యూహాలు పన్నినా అవి వర్కవుట్ కావడం లేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తన పార్టీ పరిస్థితి ఔట్ అయిపోతుందేమోనన్న భయం జగన్‌ని వెంటాడుతోంది. అందుకే ఆయన ఎప్పటికప్పుడు టీడీపీని దెబ్బ తీయడానికి కొత్త వ్యూహాలను రచిస్తూ వస్తున్నారు. అలాంటి వ్యూహ రచనలో భాగంగా ఆయన ఇప్పుడు టీడీపీకి పెట్టని కోటలా వున్న కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఆ సామాజికవర్గం నాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు.
కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఎప్పుడూ అండగా నిలిచింది. పార్టీ అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా ఆ సామాజిక వర్గం టీడీపీని అంటిపెట్టుకునే వుంది. ఆ పార్టీ బలాన్ని పెంచడానికి ఆ సామాజిక వర్గం చేసిన కృషి, త్యాగాలు విస్మరించలేనివి. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సామాజికవర్గంలోని నాయకత్వ లక్షణాలున్న అనేకమంది టీడీపీలోనే వున్నారు. అయితే చాలా కొద్దిమంది మాత్రం టీడీపీకి దూరంగా వున్నారు. అలాగే టీడీపీలో వున్నప్పటికీ తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని అలకపాన్పు ఎక్కి కూర్చున్నవాళ్ళు కూడా కొంతమంది వున్నారు. ఇప్పుడు జగన్ దృష్టి అలాంటి వారిమీద పడింది. టీడీపీలో వున్నవారితోపాటు ఇతర పార్టీల్లో వున్న బలమైన కమ్మ నాయకులను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్న చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి దేవినేని నెహ్రూని వైసీపీలోకి తీసుకోవాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తమకు కామన్ శత్రువనే కార్డును ఉపయోగించి దేవినేని నెహ్రూను బుట్టలో వేయాలని భావిస్తున్నారు.
దేవినేని నెహ్రూ వైసీపీలోకి రావడం వంగవీటి రాధాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ విషయంలో చాలా ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. నీ సొంత మనిషి అని పేరున్న టీడీపీ నాయకుడు యలమంచిలి రవిని వైసీపీలోకి తీసుకురా అని వంగవీటి రాధాని ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వంగవీటి రాధాని దేవినేని నెహ్రూ వైసీపీలోకి ఎంటరైతే తనకు చాలా సమస్య అని బాధ వేధిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి యలమంచిలి రవిని వైసీపీలోకి తెచ్చే బృహత్కార్యంలో మునిగి తేలుతున్నారు.
వైసీపీ రాజకీయాలు అలా వుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చాలామందిని టీడీపీలోకి చేర్చుకున్నారు. వారందరూ గతంలో టీడీపీని, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినవారే. అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవద్దు మహాప్రభో అని పార్టీలోని నాయకులు ఎంత మొత్తుకున్నా వినకుండా చంద్రబాబు వాళ్ళని పార్టీలోకి చేర్చుకుని ఉన్నత పదవులు ఇచ్చారు. అయితే చంద్రబాబు ఇదే రాజనీతిని దేవినేని నెహ్రూ విషయంలో మాత్రం ప్రదర్శించడం లేదు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా వున్న దేవినేని నెహ్రూను పార్టీకి తీసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఎంతమాత్రం రావడం లేదు. ఎందుకంటే... దేవినేని నెహ్రూ అంటే చంద్రబాబుకు ఎంతమాత్రం పడదు. పార్టీలోని ఇతర నాయకులకు పడని వారిని ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పార్టీలోకి తీసుకుంటున్న చంద్రబాబు దేవినేని నెహ్రూ విషయంలో మాత్రం తన పట్టుదలను వదులుకోవడం లేదు. ఈ విషయంలో తనకో నీతి, పార్టీలోని నాయకులు, కార్యకర్తలకు ఒక నీతిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న ఆవేదన పార్టీలో వుంది.