వైఎస్ ఫ్యామిలీ.. అక్కడా, ఇక్కడా అరాచకమే!
posted on Apr 26, 2023 @ 10:19AM
తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు వైఎస్ కుటుంబ డ్రామాయే ట్రెండింగ్ లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని ఆధిపత్యం, జనాభిమానం సంపాదించిన రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబ ప్రతిష్ట మసకబారుతోంది.
మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, వైఎస్ కుమార్తె షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వెళ్లి వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర రాజకీయాలలోకి అడుగుపెట్టిన అనంతరం.. మరీ ముఖ్యంగా అన్నా చెళ్లెళ్ళ (జగన్, షర్మిల) మధ్య సయోధ్య కొరవ డిందన్న వార్తలతో వైఎస్ కుటుంబ ప్రతిష్ట మసకబారింది. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ.. కుటుంబ రాజకీయాలు రచ్చకెక్కుతుండటంతో వైఎస్ కుటుంబానికి కంచుకోటలాంటి పులివెందులలో కూడా ఆ కోటకు బీటలు వారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
పాలనలో జగన్ వైస్ కు ఏ మాత్రం సరిపోలని విధంగా వ్యవహరిస్తుండటం, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతుండటంతో వైఎస్ ను అభిమానించే వారు కూడా విమర్శలు గుప్పించే పరిస్థితి ఏర్పడింది. ఇక వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని.. ఆ రాష్ట్ర రాజకీయాలలో తనదైన పాత్ర పోషించడం కోసం వేస్తున్న అడుగులూ వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా తాజాగా ఆమె పోలీసులపై చేయి చేసుకున్న తీరు పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివేకా హత్య కేసులో కుటుంబంలోనే ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడంతో వైఎస్ కుటుంబ ప్రతిష్ట మరింత మసకబారింది. వైఎస్ పిల్లలు (జగన్, షర్మిల) అధికారం కోసం దేనికైనా తెగిస్తారా అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా వివేకా హత్య అనంతర పరిణామాలపై వైఎస్ కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అరాచకంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.