కేసీఆర్ సారూ ఉద్యోగాలేవి.. నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
posted on Mar 26, 2021 @ 5:35PM
నిరుద్యోగ యువకుడు ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన మహబూబా బాద్ జిల్లాలో కలకలం రేపుతోంది.ఆయన తీసుకున్న వీడియో, అందులో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. గూడురు మండలం గుండెంగా గ్రామానికి చెందిన బోడ సునీల్ చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. 2016వ సంవత్సరంలో ఎస్సై పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యాడు. కానిస్టేబుల్ పరీక్షలు కూడా రాసి క్వాలిఫై అయ్యాడు. కానీ తగినంత ఎత్తు లేడన్న కారణంతో అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు దాటినా నిరుద్యోగుల కోసం సర్కారు పనిచేసిన దాఖలాలు లేవని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
సూసైడ్ అటెంప్ట్ కు ముందు వీడియోలో తన బాధంతా చెప్పుకున్నాడు సునీల్. ‘తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతోంది. రాజకీయ నాయకులు మాటలతో కాలం గడిపేస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచడం, వారి పదవీ విరమణ కాలాన్ని కూడా పెంచడం వంటివి చేస్తున్నారు కానీ, నిరుద్యోగుల గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు‘ అంటూ సునీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనతోపాటు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
‘ఏడేళ్లవుతోంది తెలంగాణ వచ్చి. ఇంత వరకు నోటిఫికేషన్లు లేవు. నేనేం చేతకాక చనిపోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వానికి నా డిమాండ్, నిరుద్యోగుల సమస్యలు తెలియాలన్న కారణంతోనే నేను ఆత్మహత్యాయత్నం చేస్తున్నా. కేసీఆర్ సర్కారుపై పోరాడాలి. ఫ్రెండ్స్.. నేను బతికొస్తే నిరుద్యోగుల కోసం మీతో కలిసి ఉద్యమం చేస్తా. నేను తిరిగి రాకుంటే, ఆసుపత్రిలోనే చనిపోతే నా తరపున నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించండి‘ అని సునీల్ తన వీడియోలో కోరాడు.