తిరుపతి బరిలో మాజీలు ...ముందు తరం నేతలు
posted on Mar 26, 2021 @ 5:00PM
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్నఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పోటీకి సిద్దమయ్యారు. చింతామోహన్ పేరును,ఏఐసీసీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వైసీపీ టీడీపీ,బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి స్థానానికి ఏప్రిల్ 17 న పోలింగ్ జరుగుతుంది. కాగా, ఉపఎన్నిక బరి నుంచి ఇద్దరు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తుంటే, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు తమ తమ అదృష్టాన్ని మరో మారు పరిరక్షించుకునేందుకు సిద్దమయ్యారు.
వైసీపీ తరపున పోటీ చేస్తున్న డా.గురుమూర్తి, బీజేపీ తరపున పోటీ చేస్తున్నమాజీ ఐఏఎస్ ఆఫీసర్ రత్న ప్రభ, తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరో వంక టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తరపున మరో మాజీమంత్రి చింతా మోహన్ పోటీ పడుతున్నారు. చింతా మోహన్ గతంలో ఇదే స్థానం నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రి వర్గంలో కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, పనబాక లక్ష్మి 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఒడి పోయారు. ఇప్పుడు ఆమె మరో మారు, టీడీపీ తరపున పోటి చేస్తున్నారు.గతంలోనూ ఆమె నెల్లూరు నుంచి లోక్ సభకు మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రెండుసార్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలకు నిర్వహించారు.
ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అభ్యర్ధి డా.గురుమూర్తికి, అదే విధంగా బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేక పోయినా, పొలిటికల్ కారిడార్స్’తోలో ఇద్దరికీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. బీజేపీ అభ్యర్ధి, కర్ణాటక క్యాడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ విధంగా ఎన్నికలలో పోటీ చేయడం కొత్తయినా రాజకీయాలు పూర్తిగా కొత్త కాదు. అలాగే, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పొడుగునా ఆయనకు ఫిజియో సేవలు అందించిన డా. గురుమూర్తి కూడా రాజకీయ వాతావరణంలోనే పెరిగారు. ఇలా మాజీలు, ముందు తరం నేతలు పోటీ పడుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోరుఅందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.కాగా,ఇంతవరకు టీడీపీ అభ్యర్ధి పనబాక లక్షి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 29తో నామినేషన్ గడువు ముగుస్తుంది.